
మార్టిన్ లూథర్ గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
01/02/2025సంస్కరణ ముగించబడిందా?

- నేను “పూర్వపు ఎవాంజెలికల్స్” అని పిలిచే వారు ఈ అంశంపై చేసిన అనేక పరిశీలనలు ఉన్నాయి. వారిలో ఒకరు ఇలా వ్రాసారు, “పదహారవ శతాబ్దంలో లూథర్ చెప్పింది నిజమే, కానీ సమర్థనను (నీతిమంతులుగా తీర్చబదుటను) గూర్చిన ప్రశ్న ఇప్పుడు ఒక సమస్య కాదు”. నేను పాల్గొనిన విలేకరుల సమావేశంలో తనకుతానుగా ఎవాంజిలికల్ గా చెప్పుకొంటున్న రెండవ వ్యక్తి మాట్లాడుతూ “విశ్వాసము వలననే నీతిమంతునిగా తీర్చబడుట అనే పదహారవ శతాబ్దపు సంస్కరణల చర్చ అనేది టీ తాగే పాత్రలో ఒక తుఫాను” వంటిదని వ్యాఖ్యానించాడు. మరొక ప్రముఖ యూరోపియన్ వేదాంతి “విశ్వాసము వలననే సమర్థనను గూర్చిన సిద్ధాంతం” ఇకపై సంఘములో ముఖ్య సమస్యగా వుండబోదని ఒక పుస్తక ముద్రణలో వాదించాడు. వాస్తవాన్ని పూర్తిగా మరచిపొయి నిరసన వెల్లడిచేసే ప్రొటెస్టంట్లుగా చెప్పుకొంటున్న అధిక సంఖ్యాకులను మనం ఎదుర్కొనుచున్నాము.
విశ్వాసము ద్వారానే సమర్థన అనే సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ సమకాలీన అంచనాలలో కొన్నింటికి వ్యతిరేకంగా, పదహారవ శతాబ్దం మెజిస్టీరియల్ సంస్కర్తలు చేసిన విభిన్నమైన దృక్పధాలను జ్ఞాపకం చేసుకుంటాము. సంఘం పడిపోవుట లేక నిలబడుట “కేవలం విశ్వాసము ద్వారానే సమర్థనన” అనే సిద్ధాంతంపై మాత్రమే ఆధారపడి వున్నదని లూధర్ గట్టిగా వ్యాఖ్యానించాడు. సమర్థనను గూర్చి, జాన్ కాల్విన్ రూపకలంకారముగా మాట్లాడుతూ ‘అది ప్రతి మార్పుకు ఒక కీలు’ వంటిదన్నాడు. విశ్వాసము ద్వారానే సమర్థనను గూర్చి, ఇరవయ్యవ శతాబ్దంలో, జె.ఐ. ప్యాకర్ కూడా ‘ఇది ఒక అట్లాస్ అని, ప్రతి సిద్ధాంతము దీని భుజంపై నిలబడుతుందని’ రూపకలంకారముగా మాట్లాడాడు. ఆ తర్వాత ప్యాకర్ ఈ గట్టి రూపకంకారమును సులభ శైలిలోనికి మార్చి “విశ్వాసము ద్వారానే నీతిమంతునిగా తీర్చబడుట” అనునది “సువార్త యొక్క చక్కటి ముద్రణ” అని అన్నాడు.
ఈ చర్చల నేపథ్యంలో మనం ఎదుర్కోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, పదహారవ శతాబ్దం నుండి కలిగిన మార్పేమిటి? సరే, మంచి వార్తలు మరియు చెడు వార్తలు కూడా ఉన్నాయి. మంచివార్త ఏమిటంటే, ప్రజలు వేదాంత వివాదాలలో మరింత నాగరికంగా మరియు సహనశీలులుగా మారారు. సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా ప్రజలను సజీవ దహనం చేయడం లేదా హింసించడం మనం చూడము. చాలా మంది ప్రొటెస్టంట్ ఉదారవాదులు ఈ ప్రత్యేక సిద్ధాంతాలను విడిచిపెట్టిన సమయములో, క్రైస్తవ సనాతన ధర్మమును గూర్చి అనగా క్రీస్తు దైవత్వం, ఆయన ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తము మరియు బైబిల్ యొక్క ప్రేరేపణ వంటి ముఖ్య సమస్యలపై రోమా సమాజం ఎట్టి చర్యలు వహించిందో గత సంవత్సరాలలో మనము చూసియున్నాము. గర్భస్రావం (భ్రూణ హత్యలు) మరియు నైతిక సాపేక్షవాదం వంటి క్లిష్టమైన నైతిక సమస్యలపై కూడా రోమ్ శ్రద్ధ వహించినట్టు చూస్తాము. పంతొమ్మిదవ శతాబ్దములో వాటికన్ కౌన్సిల్ I లో, రోమీయులు ప్రొటెస్టంట్లను “మత విరోధులు మరియు విభేదకారులు” అని పిలిచేవారు. ఇరవయ్యవ శతాబ్దమందు వాటికన్ II లో ప్రొటెస్టంట్లను “వేరుచేయబడిన సోదరులు” అని పిలుస్తున్నారు. వివిధ రకాల పరిపాలక సంస్థలలో ఇట్టి వైరుధ్యుం మనకు స్పష్టముగా కనబడుతుంది. అయితే చెడ్డ వార్త ఏమిటంటే, శతాబ్దాల క్రితం సనాతన ప్రొటెస్టంట్లు రోమన్ కాథలిక్కుల నుండి విభజించిన అనేక సిద్ధాంతాలు పదహారవ శతాబ్దం నుండి క్రైస్తవ మత విశ్వాసాలుగా ప్రకటించబడుతూ వచ్చాయి. దాదాపు అన్ని ముఖ్యమైన మేరియాలజీ ఉత్తర్వులు గత 150 సంవత్సరాలలో ప్రకటించబడ్డాయి. పేపల్ ఇన్ఫాలాబిలిటీ (పోపుకు సంబంధించినవి తప్పుపట్టలేము అనునది) యొక్క సిద్ధాంతం, దాని అధికారిక నిర్వచనానికి చాలా కాలం ముందు వాస్తవంగా పనిచేసినప్పటికీ, 1870 లో వాటికన్ కౌన్సిల్ I లో అధికారికంగా నిర్వచించబడింది మరియు డి ఫైడే (రక్షణకు అవసరమైన విశ్వాసం) గా ప్రకటించబడింది. ఇటీవల సంవత్సరాలలో రోమన్ సమాజం ఒక కొత్త కాథలిక్ కాటకిజం ప్రచురించిందని కూడా మనము చూసాము. ఇది కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ యొక్క సిద్ధాంతాలను నిస్సందేహంగా పునరుద్ఘాటిస్తుంది, ఇందులో ట్రెంట్ యొక్క సమర్థన సిద్ధాంతపు నిర్వచనంతో సహా (మరియు ఆ విధంగా విశ్వాసం ద్వారా మాత్రమే సమర్థన యొక్క సంస్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కౌన్సిల్ యొక్క అనంగీకారాన్ని ధృవీకరిస్తుంది) ట్రెంట్ యొక్క పునర్నిర్మాణముతో పాటు రోమన్ సిద్ధాంతమైన ప్రక్షాళన, ఆనందం మరియు యోగ్యతా నిధులు స్పష్టముగా పునర్నిర్మించబడ్డాయి.
విశ్వాసము వలననే సమర్థన సిద్ధాంతం యొక్క నిరంతర ఉపయుక్తమైన సమస్యపై ప్రముఖ వేదాంతవేత్తల మధ్య జరిగిన చర్చలో, మైఖేల్ హోర్టన్ ఈ ప్రశ్న అడిగారుః “గత దశాబ్దాలలో మొదటి శతాబ్దపు సువార్తకు ప్రాముఖ్యత లేకుండా చేసిందేమిటి?” సమర్థనను గూర్చిన వివాదం వేదాంతశాస్త్రం యొక్క సాంకేతిక అంశానికి సంబంధించినది కాదు, ఇది బైబిల్ సత్యం యొక్క డిపాజిటరీ యొక్క అంచులకు అప్పగించబడినటు వంటిది. దీనిని కేవలం ఒక టీ తాగే పాత్రలో ఒక తుఫానుగా కూడా చూడలేము. ఈ తుఫాను అతి చిన్న టీ కప్పు పరిమాణానికి మించి విస్తరించింది. దేవుని ఉగ్రతకు గురైన ప్రతి వ్యక్తికి “రక్షింపబడటానికి నేను ఏమి చేయాలి?” అనే ప్రశ్న ఇప్పటికీ ఒక క్లిష్టమైన ప్రశ్నగానే వున్నది.
ప్రశ్న కంటే సమాధానం ఎంతో కష్టతరమైనది. ఎందుకంటే సమాధానము, సువార్త సత్యం యొక్క హృదయాన్ని తాకేదిగా వుంటుంది. తుది విశ్లేషణలో, దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడుగా లేదా అనీతిమంతుడుగా ప్రకటించే ఆధారం ఒకరి “స్వాభావిక నీతి” లో ఉందని ట్రెంట్ వద్ద ధృవీకరించి దానిని ఇంకను కొనసాగించేదిగా రోమన్ కాథలిక్ చర్చ్ వున్నది. ఒక వ్యక్తి ఈ లోకములో వున్నప్పుడు నీతి అనేది అతనిలో లేనట్లైతే, ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు మరియు నీతి వుండి (అతని జీవితంలో ఏదైనా మలినాలు మిగిలి ఉంటే) మిలియన్ల సంవత్సరాల వరకు విస్తరించే సమయం కోసం ప్రక్షాళనకు వెళ్తాడు. దీని పరిశీలన కొస్తే, సమర్థనను గూర్చి బైబిల్ మరియు ప్రొటెస్టంట్ దృక్పథం ఏమిటంటే, మనము నీతిమంతులముగా తీర్చబడుటకు ఏకైక ఆధారం క్రీస్తు యొక్క నీతి, అది ఒక వ్యక్తి నిజముగా క్రీస్తు నందు విశ్వాసం వుంచినప్పుడు అతనిని నీతిమంతునిగా ఎంచుతుంది. తద్వారా అతని రక్షణకు అవసరమైనవన్నీ కూడా క్రీస్తు నీతి నందు సమకూర్చబడుతాయి. అయితే ప్రాథమిక సమస్య ఇది: నేను నీతిమంతుడుగా తీర్చబడుటకు నా స్వంత నీతియా? లేక లూథర్ చెప్పినట్లుగా, ఇది “వేరొకరి నీతియా” మనకు అదనంగా ఇవ్వబడిన మరొకరి నీతి అనగా క్రీస్తు నీతియా? పదహారవ శతాబ్దం నుండి ఇప్పటి వరకు, సమర్థన అనునది విశ్వాసముపై, క్రీస్తుపై మరియు కృప పై ఆధారపడి వుందని రోమ్ ఎల్లప్పుడూ బోధిస్తూ వున్నది. మరోప్రక్క, సమర్థన క్రీస్తు మీద మాత్రమే ఆధారపడి ఉందని, విశ్వాసం ద్వారా మాత్రమే స్వీకరించబడిందని మరియు కృప ద్వారా మాత్రమే ఇవ్వబడిందనే విషయాలు రోమ్ ఖండిస్తూ వస్తున్నది. ఈ రెండింటి మధ్యవున్న వ్యత్యాసం, రక్షణ పొందుటకు పొందకపోవుటకు మధ్య విభేదాస్పధముగా వున్నది. నీతిమంతుడైన దేవుని నుండి దూరం చేయబడిన వ్యక్తి ఎదుర్కొనుచున్న పెద్ద సమస్య దీనికంటే మరొకటి లేదు.
రోమన్ కాథలిక్ సంఘం, విశ్వాసం వలననే నీతి కలుగుతుందనే బైబిల్ సిద్ధాంతాన్ని ఖండించేదిగా వున్నది. ఇది సువార్తను త్రోసివేసింది మరియు క్రైస్తవ సనాతనత్వం యొక్క మిగిలిన ధృవీకరణలతో సంబంధం లేకుండా చట్టబద్ధమైన సంఘముగా ఉండటం మానేసింది. ఇది రక్షణను గూర్చిన బైబిల్ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూనే వున్నది గనుక దీనిని ప్రామాణికమైన సంఘంగా చేర్చుకొనుటకు ప్రమాదకరంగా మారింది. రాజకీయపరంగా వేదాంత సంఘర్షణ తప్పుగా పరిగణించబడే కాలంలో మనం జీవిస్తున్నాము. అయితే శాంతి లేనిచోట శాంతి కలదని ప్రకటించుట సువార్త యొక్క మూలాలకు ద్రోహం చేసేదిగా వుంటుంది.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.