సంస్కరణ ముగించబడిందా?
01/02/2025
నిజమైన సంస్కరణ 
15/02/2025
సంస్కరణ ముగించబడిందా?
01/02/2025
నిజమైన సంస్కరణ 
15/02/2025

సంస్కరణ ఎందుకు అవసరం?

  1. సంఘానికి ఎల్లప్పుడూ సంస్కరణ అవసరం. క్రొత్త నిబంధనలో కూడా, యేసు పేతురును గద్దించడం మనం చూస్తాము, మరియు పౌలు కొరింథీయులను సరిదిద్దడాన్ని మనం చూస్తాము. క్రైస్తవులు ఎల్లప్పుడూ పాపులు గనుక సంఘానికి ఎల్లప్పుడూ సంస్కరణ అవసరం. అయితే, ఆ అవసరం ఎప్పుడు సంపూర్ణ అవసరం అవుతుందనేది మన ముందున్న ప్రశ్న.

    పదహారవ శతాబ్దపు గొప్ప రిఫార్మర్స్(సంస్కర్తలు) తమ కాలంలో సంస్కరణ అత్యవసరమనీ తీర్మానించారు. సంఘానికి సంస్కరణను కొనసాగించడంలో, వారు రెండు విపరీతాలను తిరస్కరించారు. ఒకవైపు, సంఘము ప్రాథమికంగా దృఢంగా ఉందని, ప్రాథమిక మార్పులు అవసరం లేదని పట్టుబట్టిన వారిని వారు తిరస్కరించారు. మరోవైపు, ప్రతి విషయంలోనూ పరిపూర్ణమైన సంఘాన్ని సృష్టించగలమని నమ్మినవారిని కూడా వారు తిరస్కరించారు. సంఘానికి ప్రాథమిక సంస్కరణ అవసరం, కానీ అది ఎల్లప్పుడూ తనను తాను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సంస్కర్తలు బైబిలు అధ్యయన౦ ద్వారా ఈ నిర్ధారణలకు వచ్చారు.

    1543 లో, స్ట్రాస్బోర్గ్ సంస్కరణ కర్త మార్టిన్ బుసెర్, 1544 లో స్పెయర్లో సమావేశం కానున్న ఇంపీరియల్ డైట్లో చక్రవర్తి ఐదవ చార్లెస్ కు ప్రజంటేషన్ కోసం సంస్కరణకు సమర్ధించమని జాన్ కాల్విన్ని కోరాడు. రోమన్ కాథలిక్ చక్రవర్తి చుట్టూ సంఘములో సంస్కరణ ప్రయత్నాలను దెబ్బతీసే కౌన్సిలర్లు ఉన్నారని బుసెర్ కు తెలుసు, మరియు ప్రొటెస్టంట్ లక్ష్యాన్ని రక్షించడానికి కాల్విన్ అత్యంత సమర్థుడైన సేవకుడని అతను విశ్వసించాడు.

    కాల్విన్ ఆ సవాలును స్వీకరించి తన ఉత్తమ రచనలలో ఒకటైన “సంఘాన్ని సంస్కరించాల్సిన ఆవశ్యకత” అని వ్రాశాడు. ఈ గణనీయమైన గ్రంథం చక్రవర్తిని ఒప్పించలేదు, కానీ ఇది ఇప్పటివరకు వ్రాయబడిన సంస్కరణ లక్ష్యం యొక్క ఉత్తమ రచనగా చాలా మంది భావించారు.

    సంఘానికి వ్యాధులు ఉన్నాయి మరియు అవి “అనేకమైనవి మరియు తీవ్రమైనవి” అని అందరూ అంగీకరించారని గమనించడం ద్వారా కాల్విన్ ప్రారంభిస్తాడు. విషయాలు చాలా తీవ్రమైనవని, క్రైస్తవులు సంస్కరణ కోసం “ఎక్కువ ఆలస్యం” చేయలేరని లేదా “నెమ్మదిగా పరిష్కారాల” కోసం వేచి ఉండలేరని కాల్విన్ వాదించాడు. సంస్కర్తలు “తొందరపాటు, అపవిత్ర ఆవిష్కరణలకు” పాల్పడ్డారనే వాదనను ఆయన తోసిపుచ్చారు. దానికి బదులుగా, “మన మత సత్యాన్ని పరిరక్షి౦చడానికి లూథర్ ను, ఇతరులను దేవుడు తీసుకొని వచ్చాడు” అని ఆయన నొక్కి చెబుతున్నాడు. క్రైస్తవ మత పునాదులు ప్రమాదంలో పడ్డాయని, బైబిల్ సత్యం మాత్రమే సంఘాన్ని పునరుద్ధరిస్తుందని కాల్విన్ గమనించాడు.

    సంఘజీవితంలో సంస్కరణ అవసరమైన నాలుగు గొప్ప రంగాలను కాల్విన్ చూస్తాడు. వీటిని ఆత్మ మరియు సంఘం యొక్క శరీరం అని అతను పిలుస్తాడు. సంఘం యొక్క ఆత్మ “దేవుని స్వచ్ఛమైన మరియు చట్టబద్ధమైన ఆరాధన” మరియు “మనుష్యుల రక్షణ”తో కూడి ఉంటుంది. సంఘ శరీరం “సంస్కారాల ఉపయోగం” మరియు ” సంఘ ప్రభుత్వం” తో కూడి ఉంటుంది. కాల్విన్ కు, ఈ విషయాలు సంస్కరణ చర్చలకు కేంద్ర బిందువుగా ఉన్నాయి. అవి సంఘ జీవితానికి ఆవశ్యకమైనవి మరియు లేఖనాల బోధన వెలుగులో మాత్రమే సరిగ్గా అర్థం చేసుకోగలవు.

    కాల్విన్ దేవుని ఆరాధనను సంస్కరణ సమస్యలలో మొదటిదిగా ఉంచడం మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇది అతని స్థిరమైన ఇతివృత్తం. అంతకు మునుపు మతాధిపతియైన సడోలెటోకు అతడు ఇలా వ్రాశాడు: “దేవుని యొక్క అసంబద్ధమైన, వికృతమైన ఆరాధనను మించిన ప్రమాదకరమైనది మరొకటి లేదు.” ఆరాధన అనేది మనం దేవునితో కలిసే ప్రదేశం, మరియు ఆ సమావేశం దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జరగాలి. మన౦ నిజ౦గా దేవుని వాక్యాన్ని అధికార౦గా అ౦గీకరి౦చి, దానికి లోబడి ఉన్నామా అని మన ఆరాధన చూపిస్తు౦ది. స్వీయ-సృష్టించిన ఆరాధన అనేది కర్మ-నీతి యొక్క ఒక రూపం మరియు విగ్రహారాధన యొక్క వ్యక్తీకరణ.

    తరువాత, కాల్విన్ సంస్కరణ యొక్క అతిపెద్ద సమస్యగా మనం తరచుగా భావించే దాని వైపు మళ్ళాడు, అనగా సమర్ధన (నీతిమంతులుగా తీర్చబడుట) గురించిన సిద్ధాంతం:

    మానవుని క్రియల వర్ణన ఎలా ఉన్నా, కేవలం అపరిమితమైన కరుణ ప్రాతిపదికన అతడు దేవుని ముందు నీతిమంతునిగా పరిగణించబడతాడని మేము వాదిస్తున్నాము; ఎ౦దుక౦టే దేవుడు క్రియలపట్ల ఏ విధమైన గౌరవ౦ లేకుండా, క్రీస్తు నీతిని తనదిగా భావి౦చడ౦ ద్వారా క్రీస్తులో ఆయనను స్వేచ్ఛగా స్వీకరిస్తాడు. దీనిని మనం విశ్వాసం యొక్క నీతి అని పిలుస్తాము, అనగా ఒక వ్యక్తి, అన్ని పనుల యొక్క విశ్వాసం లేకుండా శూన్యంగా అనగా దేవునితో తాను అంగీకరించడానికి ఏకైక ఆధారం క్రీస్తు నుండి  అరువు తెచ్చుకున్న నీతి అని నమ్మినప్పుడు జరుగుతుంది. ప్రపంచం ఎల్లప్పుడూ దారి తప్పే విషయం (ఈ పొరపాటు ఆచరణాత్మకంగా ప్రతి యుగంలో కొనసాగుతున్నందున) ఏదనగా మనిషి, అతను ఎంత లోపభూయిష్టంగా ఉన్నా, తన పనుల ద్వారా ఏదో ఒక విధంగా దేవుని అనుగ్రహానికి అర్హుడు అనే ఆలోచనను కలిగిఉంటాడు

    సంఘ ఆత్మను రూపొందించే ఈ పునాది విషయాలకు సంఘ శరీరం మద్దతు ఇస్తుంది: సంస్కారాలు మరియు సంఘ ప్రభుత్వం. బైబిలులో ఇవ్వబడిన స్వచ్ఛమైన మరియు సరళమైన అర్థానికి మరియు ఉపయోగానికి సంస్కారాలను పునరుద్ధరించాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా క్రైస్తవుల మనస్సాక్షిని బంధించే నిరంకుశత్వాన్ని సంఘ ప్రభుత్వం తిరస్కరించాలి.

    మన కాల౦లోని సంఘాన్ని పరిశీలి౦చినప్పుడు, కాల్విన్ ఎ౦తో శ్రద్ధ చూపి౦చిన అనేక విషయాల్లో సంస్కరణ అవసర౦ అని మన౦ నిర్ధారణకు రావచ్చు. దేవుని వాక్యం మరియు ఆత్మ మాత్రమే అంతిమంగా సంఘాన్ని సంస్కరిస్తాయి. కానీ మన కాలంలో అటువంటి సంస్కరణ రావాలని మనం ప్రార్థించాలి మరియు విశ్వసనీయంగా పనిచేయాలి.

    ఈ పోస్ట్ మొదట టేబల్ టాక్ పత్రికలో  ప్రచురితమైంది.

W. రాబర్ట్ గాడ్ఫ్రే
W. రాబర్ట్ గాడ్ఫ్రే
డాక్టర్ W. రాబర్ట్ గాడ్‌ఫ్రే లిగోనియర్ బోర్డ్‌కు చైర్మన్, అలాగే కాలిఫోర్నియాలోని వెస్ట్‌మిన్‌స్టర్ సెమినరీలో చర్చి చరిత్రకు సంబంధించిన ప్రెసిడెంట్ ఎమెరిటస్ మరియు ప్రొఫెసర్ ఎమెరిటస్. అతను సేవింగ్ ది రిఫార్మేషన్ మరియు లెర్నింగ్ టు లవ్ ది పామ్స్ వంటి అనేక పుస్తకాల రచయిత.