
కొలొస్సయుల గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
12/06/2025
నహూము గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు
24/06/20252 పేతురు పత్రిక గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

-
-
- అపొస్తలుడైన పేతురు సంఘాలను అబద్ధ బోధల ప్రమాదాల గురించి మరియు అది కలిగించే భక్తిహీనత గురించి హెచ్చరించాడు.
- పేతురు ఈ అబద్ధ బోధకుల పేర్లు చెప్పలేదు, కానీ 2 పేతురు 2:1–3 లోని అతని వ్యాఖ్యలను బట్టి చూస్తే, వారు ఒకప్పుడు క్రైస్తవులుగా క్రీస్తును అంగీకరించినట్లు ప్రకటించుకుని, ఆ తర్వాత విశ్వాసం నుండి తొలగిపోయారని స్పష్టంగా తెలుస్తుంది. పేతురు వారిని “నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు” అని, “వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించేవారు” అని వర్ణించాడు. పేతురు వారిని వినాశకరమైన దుర్బోధలను ప్రవేశపెట్టేవారుగా, వారు “తమ్మును కొన్నారని” చెప్పుకునే ప్రభువును తిరస్కరించేవారుగా, వారు ప్రభువును దూషించే అనుచరులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తున్నారని వర్ణించాడు. తప్పుడు సిద్ధాంతం తప్పనిసరిగా పాపభరితమైన ప్రవర్తనకు దారితీస్తుంది. వారి విశ్వాస భ్రష్టత్వం (apostasy) కారణంగా, వారిపై దేవుని తీర్పు ఖచ్చితంగా వస్తుంది.
పేతురు మనకు ఇచ్చిన కొన్ని సూచనల ఆధారంగా, ఈ వ్యక్తులు అంటినోమియన్ (నియమరహిత) ప్రవర్తనను సమర్థించుకోవడానికి పౌలు పత్రికలను దుర్వినియోగం చేసి ఉండవచ్చు. 2 పేతురు 2:19లో పేతురు ఇలా వ్రాశాడు: “తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్యము ఇత్తుమని చెప్పుదురు.” అపొస్తలుడు 2 పేతురు 3:15-16లో ఇంకా ఇలా చెబుతాడు: పౌలు పత్రికలలో “కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.” స్పష్టంగా, మన కాలంలో అవి వక్రీకరించబడుతున్నట్లే, అపొస్తలిక యుగంలో పౌలు పత్రికల విషయాలు కూడా వక్రీకరించబడ్డాయి.
- దేవుని ముందు నీతిమంతులుగా నిలబడటం విశ్వాసం ద్వారానే అని పేతురు తన పాఠకులతో మాట్లాడుతాడు
పేతురు ఇలా వ్రాశాడు: “మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి” (2 పేతురు 1:1). అటువంటి స్థానాన్ని ఇచ్చే విశ్వాసం దేవుని నుండి వచ్చిన బహుమతి, యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది, ఆయనే దేవుని నీతికి మూలము, అందుచేత, ఈ విశ్వాసం మనం సంపాదించింది కాదు పొందినది(ఎఫెసీయులకు 2:8-9). అటువంటి విశ్వాసం పొందినవారు అపొస్తలులతో సమానమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారని పేతురు స్పష్టంగా చెబుతున్నాడు. యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం అనే ఈ సాధనం ద్వారా విశ్వాసులు దేవుని ముందు ఈ నీతివంతమైన స్థానాన్ని పొందుతారు, పేతురు యేసుక్రీస్తును దేవుడిగా పేర్కొంటూ ఇది వెల్లడిస్తున్నాడు.
ఈ నీతిమంతమైన స్థితిని 2 పేతురు పత్రికలో అనీతిమంతులతో ముఖ్యంగా అబద్ధ బోధకులు మరియు వారిని అనుసరించేవారితో పోల్చడం జరిగింది. వారు ఒకానొక సమయంలో నీతి మార్గాన్ని తెలుసుకుని, పేతురు మరియు ఇతర అపొస్తలులు బోధించిన సువార్తను నమ్ముతున్నామని చెప్పుకున్నారు, కానీ అనంతరం ఆ సత్య మార్గం నుండి తొలగిపోయారు. ఆ సత్య మార్గం ఎప్పటికీ అనుభవపూర్వకముగా వారికి తెలియక యుండుటయే మేలని పేతురు వ్రాశాడు (2 పేతురు 2:21), అబద్ధ బోధకులను పాత నిబంధనకాలంలో జీవించిన నోవహుతో పోల్చుతూ, పేతురు అతనిని “నీతిని ప్రకటించేవాడు” అని వర్ణించాడు(2 పేతురు 2:5). విశ్వాసం అనే బహుమానాన్ని పొందడం నీతిమంతులను, సత్యం నుండి తొలగిపోయి, దేవుని తీర్పును అనివార్యంగా ఎదుర్కొనే వారి నుండి వేరు చేస్తుంది, తన లేఖలోని రెండవ అధ్యాయమంతటా ఈ తీవ్రమైన అంశం గురించి పేతురు వివరంగా ప్రస్తావించాడు.
- అబద్ధ బోధకులు యేసు తిరిగి వస్తాడనే విషయాన్ని నిరాకరిస్తున్నారని పేతురు మనకు తెలియజేస్తున్నాడు.
రూపాంతర పర్వతంపై ప్రభువుతో ఉండటాన్ని పేతురు ఇప్పటికే వివరించాడు (2 పేతురు 1:16–21), అక్కడ అతను ప్రభువు మహిమను చూశాడు. ఇది ప్రభువు వాగ్దానాలపై పేతురు విశ్వాసానికి ఆధారంగా మారింది.
2 పేతురు 3:3-4లో, పేతురు తన పాఠకులను హెచ్చరిస్తూ ఇలా అంటున్నాడు:
చివరి దినములలో అపహాసకులు అపహాస్యము చేయుచు, తమ స్వంత దురాశలను అనుసరించుచు వచ్చెదరు. వారు “ఆయన రాకడ వాగ్దానమెక్కడ? పితరులు నిద్రించినప్పటి నుండి, సృష్టి ప్రారంభమైనప్పటి నుండి అన్ని విషయాలు ఉన్నట్లే కొనసాగుతున్నాయి” అని చెప్పుదురు.
చాలా కాలం క్రితం (నోవహు దినములలో) ఉన్న లోకము “నీటివరదలో మునిగి నశించెను అని పేతురు హెచ్చరిస్తున్నాడు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.”
మన ప్రభువు తిరిగి రావటం గురించిన గందరగోళం ఆదిమ సంఘములో సర్వసాధారణం (పౌలు రాసిన రెండు థెస్సలొనీక పత్రికలలో అంత్యదినాల గురించి ప్రశ్నలు మరియు సమాధానాలను మనం గుర్తు చేసుకోవచ్చు), మన కాలంలో కూడా అలాగే ఉంది. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి బైబిల్ ప్రవచన పండితులు చాలా క్రూరంగా మరియు బాధ్యతారహితమైన అంచనాలను వేశారు, దీనివల్ల క్రైస్తవేతరులు యేసు మృతులను లేపడానికి, లోకాన్ని తీర్పు తీర్చడానికి మరియు అన్నిటినీ కొత్తదిగా చేయడానికి తిరిగి వస్తాడనే బైబిల్ బోధపై శ్రద్ధ చూపడం లేదు.
తన శ్రోతలను ఓదార్చడానికి, పేతురు వారికి ఇలా గుర్తు చేస్తున్నాడు:
కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును (2 పేతురు 3:9-10).
కాబట్టి, పేతురు చెప్పినట్లుగా, అపహాసకులు హెచ్చరించబడాలి, అయితే దేవుని ప్రజలు రాబోయే మహిమపై ఆశతో ఉండాలి, ఎందుకంటే “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును” (2 పేతురు 3:13).
-
-
- ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.
-
-