Does God Really Care?

దేవునికి నిజంగానే మనపై పట్టింపు ఉందా?

16/04/2026
How Can I Deal with Despair?

నిరాశను నేను ఎలా ఎదుర్కోగలను?

23/04/2026
Does God Really Care?

దేవునికి నిజంగానే మనపై పట్టింపు ఉందా?

16/04/2026
How Can I Deal with Despair?

నిరాశను నేను ఎలా ఎదుర్కోగలను?

23/04/2026

తీవ్ర అనారోగ్యం మధ్యలో నిరీక్షణను కనుగొనడం

Finding Hope Amid Severe Illness

నా కుమారుని ఐదవ పుట్టినరోజున, మా ఇంటికి ఆరువందల మైళ్ల దూరంలో ఉన్న ఒక క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో కూర్చుని, ఐవీ (IV) బ్యాగుల నుండి నా శరీరంలోకి కీమోథెరపీ మందులు ప్రవహిస్తుంటే చూస్తూ ఉండిపోయాను. నేను ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాను. ఆ సమయంలో నాకు అవసరమైన క్లినికల్ ట్రయల్ (వైద్య పరిశోధన చికిత్స) నిమిత్తం, నా భర్తను మరియు నా ముగ్గురు చిన్న పిల్లలను విడిచిపెట్టి కొన్ని నెలల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఈ లోక సంబంధమైన నా నిరీక్షణలన్నీ ఒక్కసారిగా సన్నగిల్లాయి. నాకున్న మంచి ఆరోగ్యం నన్ను విడిచిపోవడమే కాకుండా, నా శక్తిని, నా జుట్టును మరియు నా భవిష్యత్తుపై నాకున్న అంచనాలను కూడా తనతో పాటు తీసుకుపోయింది. నా కుటుంబానికి పరిచర్య చేయాల్సిన నా దైనందిన జీవితం, ఇప్పుడు ఆసుపత్రి గదులలో నిరీక్షించడంతో, రక్తమార్పిడి చేయించుకోవడంతో, వైద్య పరీక్షలతో మరియు నీరసంతో వచ్చే నిద్రతో నిండిపోయింది. నా పిల్లల ఎదుగుదలలోని ఎంతో విలువైన ఘట్టాలను నేను కోల్పోయాను; భవిష్యత్తులో వారి జీవితంలోని మరిన్ని ముఖ్యమైన ఘట్టాలను చూసేంత వరకు నేను జీవిస్తానో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.”

క్యాన్సర్ వ్యాధి మరియు దాని నుండి బయటపడే క్రమంలో ఎదురైన అనేక పోరాటాల మధ్య, నా ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చే హెచ్చుతగ్గులను  తట్టుకోగలిగే బలమైన నిరీక్షణ నాకు అవసరమైంది. దేవుని అపారమైన కనికరం మరియు కృపను బట్టి, మనం దృఢంగా అంటిపెట్టుకోగలిగే ఒక శ్రేష్ఠమైన నిరీక్షణ మనకుంది: ఆయనే మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు.  భూసంబంధమైన శ్రమల వల్ల క్రీస్తునందు మనకున్న “సజీవమైన నిరీక్షణ” ఏమాత్రం చలించదని, అది మహిమకరమైన ముగింపు వరకు నిలిచి ఉంటుందని మనలాంటి శ్రమల గుండా వెళ్తున్న క్రైస్తవులకు నిశ్చయతనిచ్చేందుకే అపొస్తలుడైన పేతురు తన మొదటి పత్రికను రాశాడు.

మన జీవముగల నిరీక్షణ

అపొస్తలుడైన పేతురు తన పత్రికను మనకు ఉన్న జీవముగల నిరీక్షణను గురించిన సువార్తతోనే ప్రారంభించాడు:

మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను (1 పేతురు 1:3). 

మనం నమ్ముకున్న రక్షకుడు ఇంకా సమాధిలోనే ఉన్నవాడు కాడు. ఆయన మృతులలో నుండి సజీవంగా తిరిగి లేచి, పాపముపై మరియు మరణముపై తన విజయమును చాటిచెప్పాడు (1 కొరింథీ. 15:54-57). అంతేకాకుండా, ఆయన పునరుత్థానం అనేది రాబోయే పునరుత్థాన చరిత్రకు ఆరంభం మాత్రమే. పునరుత్థానమొందిన వారిలో ఆయన “ప్రథమ ఫలముగా” ఉన్నాడు; ఆయన మనకు “సజీవమైన నిరీక్షణ” అయి ఉన్నందున, ఆయనకు చెందిన వారందరూ నిరంతరము జీవిస్తారు (1 కొరింథీ. 15:20-23).

మనం తీవ్రమైన అనారోగ్య ప్రభావాలతో కృంగిపోతున్నప్పుడు, త్వరగా అలసిపోవడం మరియు నిరుత్సాహానికి లోనవ్వడం సహజం. మన జీవితం మళ్ళీ ఎప్పటికైనా సాధారణ స్థితికి చేరుకుంటుందన్న నిరీక్షణను కూడా మనం కోల్పోవచ్చు. అటువంటి చీకటి క్షణాలలో, సమాధిని జయించిన మన రక్షకుడిని, మనకున్న ఆ సజీవమైన నిరీక్షణను మనం దృఢంగా అంటిపెట్టుకోవాలి. మనకు సజీవ రక్షకుడు ఉన్నాడు గనుకనే, మనకు సజీవమైన నిరీక్షణ ఉంది.

కదిలించబడని మన నిరీక్షణ

మనం కేవలం జీవముగల నిరీక్షణ కలిగుండుటకే కాకుండా, మరొక అద్భుతమైన స్వాస్థ్యం కోసము కూడా తిరిగి జన్మించాము. అది: 

అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది (1 పేతురు 1:4-5).

క్రీస్తుకు చెందినవారు ఈ లోకపు శ్రమలకు ఆవల ఉన్న భద్రమైన స్వాస్థ్యాన్ని చూడగలరు. మన భౌతిక శరీరాలను నిర్దాక్షిణ్యంగా పీడించే అనారోగ్యాలు ఆ స్వాస్థ్యాన్ని కనీసం తాకలేవు. మనల్ని ముంచెత్తే పరిస్థితులు దాని నిత్యమైన పరిపూర్ణతను మరియు పవిత్రతను ఏమాత్రం తగ్గించలేవు. దేవుడు మన కొరకు పరలోకమందు భద్రపరచిన దానిని ఏదీ కూడా దెబ్బతీయలేదు.

వాడబారని ఈ స్వాస్థ్యాన్ని మనం నిశ్చయముగా పొందుకుంటామని మనకు ఎలా తెలుస్తుంది? మనం “దేవుని శక్తిచేత విశ్వాసము ద్వారా కాపాడబడుతున్నామని” పేతురు చెప్పాడు. ఇది మన స్వశక్తి మీద గానీ, మన విశ్వాసం యొక్క బలం మీద గానీ ఆధారపడి లేదు. దేవుని అపారమైన కనికరాన్ని బట్టి మనం ఈ స్వాస్థ్యాన్ని పొందుకుంటాము, మరియు దేవుని శక్తి ద్వారానే అది మనకోసం భద్రపరచబడి ఉంటుంది. మనపై దేవుని పట్టు అచంచలమైనది గనుకనే, మన నిరీక్షణ కూడా అచంచలమైనదిగా ఉన్నది (యోహాను 10:27-29).

మన మహిమాన్వితమైన నిరీక్షణ

ఈ సజీవమైన, అచంచలమైన నిరీక్షణ గురించి పేతురు రాసినప్పుడు, జీవితంలోని శ్రమలను ఆయనేమీ విస్మరించలేదు. అయినప్పటికీ, మనం శ్రమల చేత దుఃఖింపబడినప్పుడు కూడా సంతోషించాలని పేతురు మనలను ప్రోత్సహించాడు:

ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును (1 పేతురు 1:6-7).

దేవుని వాగ్దానాలు మన దృష్టిని మన తాత్కాలిక శ్రమల నుండి నిత్యము నిలిచే మహిమ వైపుకు మళ్ళిస్తాయి. మనలో దేవుడు జరిగించే కార్యమును బట్టి, శ్రమల ద్వారా కలిగే ఈ పరీక్ష మన విశ్వాసం యథార్థమైనదని నిరూపిస్తుంది. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, ఈ శోధనల ద్వారా దేవుడు మనలో పెంపొందించిన ఆ విశ్వాసము “మెప్పును, మహిమను, ఘనతను” కలిగిస్తుంది (1 పేతురు 1:7). ఈ ‘మహిమ’ అనేది క్రీస్తు యొక్క మహిమను గానీ, ఆయనతో పాటు మనం పొందుకునే మహిమను గానీ, లేదా ఈ రెండింటిని సూచించవచ్చు. ఏదేమైనప్పటికీ, క్రీస్తుతో మన భవిష్యత్తు మహిమాన్వితంగా ఉంటుందని మనకు తెలుసు; నేడు మనం అనుభవిస్తున్న శ్రమల మధ్య కూడా సంతోషించడానికి ఇది ఒక గొప్ప కారణం.

బాధ మనల్ని దహించివేస్తున్నా, భయం మనల్ని ముంచెత్తుతున్నా, మన శరీరాల్లోనూ మరియు మన భవిష్యత్తులోనూ వచ్చే మార్పులు మనల్ని అలసిపోయేలా చేసినా, క్రీస్తునందు మనకున్న నిరీక్షణ ఒక స్థిరమైన ఆశ్రయముగా ఉంటుంది. మనకున్న ఈ సజీవమైన, అచంచలమైన, మహిమాన్వితమైన నిరీక్షణను బట్టి, మనం కూడా అపొస్తలుడైన పేతురుతో కలిసి ఇలా చెప్పగలము: “మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక!” (1 పేతురు 1:3).

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

మరిస్సా హెన్లీ

మరిస్సా హెన్లీ

మరిస్సా హెన్లీ ఒక ప్రసంగీకురాలు మరియు "లవింగ్ యువర్ ఫ్రెండ్ త్రూ క్యాన్సర్" (Loving Your Friend Through Cancer) మరియు "ఆఫ్టర్ క్యాన్సర్" (After Cancer) వంటి పుస్తకాల రచయిత్రి. ఆమె MarissaHenley.com లో తన వ్యాసాలను ప్రచురిస్తుంటారు.