The Development of Roman Catholic Sacerdotal Soteriology

రోమన్ క్యాథలిక్ సంస్కారపరమైన విమోచనశాస్త్రం యొక్క అభివృద్ధి

09/07/2026
How to Read the Psalms of Ascents

ఆరోహణ కీర్తనలను ఎలా చదవాలి

16/07/2026
The Development of Roman Catholic Sacerdotal Soteriology

రోమన్ క్యాథలిక్ సంస్కారపరమైన విమోచనశాస్త్రం యొక్క అభివృద్ధి

09/07/2026
How to Read the Psalms of Ascents

ఆరోహణ కీర్తనలను ఎలా చదవాలి

16/07/2026

పదహారవ శతాబ్దంలో విమోచన శాస్త్రాన్ని  సంస్కరించుట 

Reforming Soteriology in the Sixteenth Century

పదహారవ శతాబ్దంలో బైబిల్ సంబంధమైన రక్షణ సిద్ధాంతం యొక్క పునరావిష్కరణ ఒక్కసారిగా జరగలేదు. ప్రారంభంలో, తొలి సంస్కర్తలు ‘సమర్థించబడటం (నీతిమంతులుగా తీర్చబడటం)’ అనే పదానికి బైబిల్ సంబంధమైన అర్థాన్ని తిరిగి కనుగొన్నారు. దాని అర్థం “నీతిమంతునిగా చేయడం” అని కాకుండా “నీతిమంతునిగా ప్రకటించడం” అని వారు గ్రహించారు. దీనివల్ల, నీతిమంతులుగా తీర్చబడటానికి సాధన కారణం బాప్తిస్మం కాదని, కేవలం విశ్వాసం మాత్రమేనని వారు గ్రహించారు. మరో మాటలో చెప్పాలంటే, మానవుని గొప్ప సమస్యకు పరిష్కారం గురించి మధ్యయుగపు చివరి కాలపు సంఘానికి వక్రీకరించబడిన అవగాహన ఉందని సంస్కర్తలు కనుగొన్న మొదటి విషయం.

కాలక్రమేణా, వారు లేఖనాలను అధ్యయనం చేస్తూ వాటి బోధనలను రోమన్ క్యాథలిక్ సంఘము బోధనలతో పోల్చి చూసినప్పుడు, ఒక విషయాన్ని గ్రహించగలిగారు: సమస్య విషయంలో రోమ్ (రోమన్ క్యాథలిక్ సంఘము)కు ఉన్న అవగాహన లోపభూయిష్టంగా ఉండటం వల్లే, ఆ సమస్యకు పరిష్కారం విషయంలో కూడా వారి అవగాహన వికృతంగా మారింది. ఆదాము పాపం వల్ల కలిగిన పరిణామాన్ని (అంటే ఆ సమస్యను) రోమ్ అర్థం చేసుకున్న విధానం కారణంగానే, వారి రక్షణ సిద్ధాంతం (అంటే ఆ పరిష్కారం) ఆ విధంగా రూపుదిద్దుకుంది. మునుపటి వ్యాసంలో మనం గమనించినట్లుగా, ఆదాము పతనమైనప్పుడు నీతిమంతులుగా తీర్పునిచ్చే లేదా పవిత్రపరిచే కృప అనే అదనపు వరాన్ని అతను కోల్పోయాడని రోమన్ క్యాథలిక్ సంఘము  బోధించింది. ఈ దృక్పథం ప్రకారం, అతీంద్రియ ఉనికి స్థితికి తిరిగి ఉన్నతపరచబడాలంటే ఆదాము మరియు అతని సంతానం ఆ కృపను తిరిగి పొందాల్సి ఉంది. వారి అభిప్రాయం ప్రకారం, రోమన్ క్యాథలిక్ సంఘము యొక్క సంస్కారాల (sacraments) ద్వారా ఇది నెరవేరుతుంది.

లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, రోమన్ కాథలిక్ సిద్ధాంతంలోని మానవ పతనం లేఖన భాగానికి పూర్తి న్యాయం చేయలేదని సంస్కర్తలు గ్రహించారు. పతనంలో, మానవుడు తన స్వభావానికి పెద్దగా హాని జరగకుండా లేదా అసలు హాని జరగకుండా, కేవలం అదనపు కృప అనే వరాన్ని కోల్పోలేదని వారు అర్థం చేసుకున్నారు. దానికి బదులుగా, వెస్ట్‌మిన్‌స్టర్ విశ్వాస ప్రకటన తరువాత వ్యక్తం చేసినట్లుగా, పతనంలో వారు తమ ఆదిమ నీతి నుండి మరియు దేవునితో సహవాసం నుండి పడిపోయారు, అందువలన పాపంలో మరణించినవారయ్యారు, మరియు ఆత్మ, శరీరంలోని అన్ని భాగాలు మరియు సామర్థ్యాలలో పూర్తిగా అపవిత్రులయ్యారు. (WCF 6.2)

తరువాతి కాలంలో ఈ పతన స్థితిని వివరించడానికి ఉపయోగించబడిన దైవజ్ఞానశాస్త్ర పదం ‘సంపూర్ణ భ్రష్టత’ (total depravity).

సమస్య ఏమిటని ఒకరు భావిస్తారో, దానిపైనే ఆ పరిష్కారం (విమోచనశాస్త్రం) గురించిన వారి అవగాహన ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మరోసారి గుర్తించడం ముఖ్యం. పెలాజియస్ యొక్క మోక్ష సిద్ధాంతం ఆ విధంగా ఉండటానికి కారణం, సమస్య పట్ల ఆయనకున్న అవగాహనే; అలాగే రోమ్ యొక్క రక్షణ సిద్ధాంతం అలా ఉండటానికి కారణం, సమస్య పట్ల వారికి ఉన్న అవగాహనే. మరణించిన వ్యక్తికి లభించే రక్షణకు మరియు గాయపడిన వ్యక్తికి లభించే రక్షణకు పూర్తిగా భిన్నమైన మార్గాలు అవసరమవుతాయి.

సంస్కరించబడిన సంఘాలు, దేవుడు తనకు మరియు మానవునికి మధ్య చేసిన నిబంధన పరంగా, మానవుని సమస్యకు దేవుని పరిష్కారాన్ని వివరించాయి. వెస్ట్‌మిన్‌స్టర్ విశ్వాస ప్రకటన, రక్షణకు సంబంధించిన ఈ బైబిల్ సిద్ధాంతం యొక్క అత్యంత స్పష్టమైన ప్రకటనలలో ఒకటిగా నిలుస్తుంది. దీని తరువాత వచ్చేది చాలా వరకు ఈ విశ్వాస ప్రకటన నుండి తీసుకోబడింది. పాఠకులు బైబిల్ ఆధార వచనాలు ఉన్న ప్రతిని కనుగొని, వాటన్నిటిని జాగ్రత్తగా అధ్యయనం చేయాలని ప్రోత్సాహం పొందుకోవాలి.

వెస్ట్‌మిన్‌స్టర్ విశ్వాస ప్రకటన వివరించినట్లుగా, పతనానికి ముందు, దేవుడు ఆదాముతో ఒక నిబంధన చేసాడు, “దానిలో ఆదాముకు, మరియు అతని ద్వారా అతని సంతతికి, సంపూర్ణ మరియు వ్యక్తిగత విధేయత అనే షరతుపై, జీవము వాగ్దానం చేయబడింది” (WCF 7.2). ముఖ్యంగా, మరియు రోమ్ బోధనకు విరుద్ధంగా, పతనానికి ముందు ఆదాముకు ధర్మశాస్త్రాన్ని పాటించే శక్తి మరియు సామర్థ్యం ఉన్నాయి (WCF 4.2; 19.1). అంతేకాకుండా, ఆదిమ నీతి అతని స్వభావంలో ఒక భాగం, అది దేవుని స్వరూపంలో ఉన్నట్లుగా సృష్టించబడింది (WCF 4.2; 6.2). రోమన్ కాథలిక్ సంఘము బోధించినట్లుగా, అది అతని స్వభావానికి అదనంగా జోడించబడిన వరం కాదు.

మానవుడు పతనమైనందున, అతడు ఇకపై ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించలేడు, అందువల్ల మొదటి నిబంధన యొక్క షరతులను నెరవేర్చలేడు. అందువలన, దేవుడు రెండవ నిబంధనను ఏర్పరచడానికి ఇష్టపడ్డాడు; దీనిని సాధారణంగా కృపా నిబంధన అని పిలుస్తారు; దీనిలో ఆయన యేసు క్రీస్తు ద్వారా పాపులకు జీవాన్ని మరియు రక్షణను ఉచితంగా అందిస్తాడు; వారు రక్షింపబడటానికి ఆయనపై విశ్వాసం ఉంచాలని వారిని కోరుతాడు, మరియు నిత్యజీవానికి నియమించబడిన వారందరికి, వారు విశ్వసించడానికి ఇష్టపడేలా మరియు సమర్థులుగా చేయడానికి తన పరిశుద్ధాత్మను ఇస్తానని వాగ్దానం చేస్తాడు. (WCF 7.3)

దేవునికి మరియు మనుష్యునికి మధ్య ఏకైక మధ్యవర్తిగా ఉండటానికి, దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు అనాది నుండే నియమించబడ్డాడు (WCF 8.1). తన ప్రజలను రక్షించడానికి ఆయన నియమించబడ్డాడు; ఈ ప్రజలు ఎవరంటే, దేవుడు తన ఉచిత కృప మరియు ప్రేమతో, “లోకపు పునాది వేయబడకముందే, తన నిత్యమైన మరియు మార్పులేని సంకల్పం ప్రకారం, అలాగే తన చిత్తంలోని రహస్య ఆలోచన మరియు సంతోషకరమైన ఉద్దేశం చొప్పున” క్రీస్తులో ఎన్నుకున్నవారు (WCF 3.5).

ప్రభువైన యేసు తన పరిపూర్ణ విధేయత ద్వారా మరియు నిత్యుడైన ఆత్మ ద్వారా దేవునికి ఒక్కసారిగా అర్పించుకున్న తన సొంత బలియాగం ద్వారా, తన తండ్రి యొక్క న్యాయాన్ని సంపూర్ణంగా తృప్తిపరిచారు; అలాగే తండ్రి తనకు అనుగ్రహించిన వారందరి కొరకు సమాధానాన్ని మాత్రమే కాకుండా, పరలోక రాజ్యంలో నిత్య స్వాస్థ్యాన్ని కూడా సంపాదించారు. (WCF 8.5)

క్రీస్తు తాను సంపాదించిన విమోచనను చరిత్ర అంతటా ఉన్న ఎన్నుకోబడిన వారందరికీ వర్తింపజేస్తాడు (WCF 8.8).

పతనమైన మానవుడు కేవలం గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న స్థితిలో కాకుండా, పాప మరియు మరణ స్థితిలో ఉన్నాడు కాబట్టి, తనకు లభించిన విమోచనను పొందేందుకు స్వయంగా ఏమీ చేయలేడు. అందువల్ల, క్రీస్తు లాజరును సమాధి నుండి బయటకు పిలిచినట్లే, దేవుడు తాను ఎన్నుకున్న వారిని మరణం నుండి ప్రభావవంతంగా పిలుస్తాడు. ఆయన వారికి ఆత్మీయ జీవాన్ని ప్రసాదించి, వారిని నూతనపరుస్తూ, యేసు క్రీస్తు వైపుకు వారిని ఆకర్షిస్తాడు (WCF 10.1). దేవుడు ఎవరినైతే పిలుస్తాడో, వారిని ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్పు తీరుస్తాడు. వారు తమ సొంత క్రియల ఆధారంగా కాకుండా, కేవలం విశ్వాసం ద్వారా పొందిన క్రీస్తు నీతి ఆధారంగా సమర్థించబడుతారు  లేదా  నీతిమంతులుగా ప్రకటిపబడతారు (WCF 11.1; 14.2). ప్రభావవంతంగా పిలువబడి, నీతిమంతులుగా తీర్పు తీర్చబడిన వారు తమ జీవితకాలమంతా పరిశుద్ధపరచబడతారు కూడా:

పాప స్వభావం యొక్క సమస్త ఆధిపత్యం నశింపజేయబడుతుంది, మరియు దానిలోని వివిధ దురాశలు క్రమంగా బలహీనపడి చంపబడతాయి; అలాగే, నిజమైన పరిశుద్ధతను ఆచరించడానికి అవసరమైన సమస్త రక్షణదాయక కృపలలో వారు మరింతగా సజీవంగా మరియు బలవంతులుగా చేయబడతారు—ఆ పరిశుద్ధత లేనిదే ఎవరూ ప్రభువును చూడలేరు. (WCF 13.1; 16.1–7 కూడా చూడండి)

రోమన్ కాథలిక్ సంఘానికి భిన్నంగా, సంస్కరణవాద సంఘాలు కూడా ఇలా బోధించాయి:

దేవుడు తన ప్రియ కుమారుని యందు ఎవరినైతే అంగీకరించాడో, తన ఆత్మ ద్వారా ప్రభావవంతంగా పిలిచి పరిశుద్ధపరచాడో, వారు కృపా స్థితి నుండి పూర్తిగా గానీ లేదా శాశ్వతంగా గానీ పడిపోరు; పైగా వారు అంతం వరకు ఆ స్థితిలో నిలిచి ఉండి, నిత్య రక్షణను పొందుతారు. (WCF 17.1)

మన తదుపరి వ్యాసంలో, నెదర్లాండ్స్‌లోని కొంతమంది సంస్కరణవాద దైవజ్ఞానశాస్త్రులు  సంస్కరణవాద విశ్వాస దైవజ్ఞానశాస్త్రం పట్ల ఎలా అసంతృప్తి చెంది, ఆ దైవజ్ఞానశాస్త్రాన్ని తిరిగి రోమ్ దిశగా మళ్లించడం ప్రారంభించారో పరిశీలిద్దాం. డోర్ట్ సినోడ్‌లో సంస్కరణవాద చర్చి యొక్క ప్రతిస్పందనను కూడా మనం పరిశీలిద్దాం.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

కీత్ మాథిసన్

కీత్ మాథిసన్

డాక్టర్ కీత్ మాథిసన్ గారు ఫ్లోరిడా రాష్ట్రంలోని శాన్‌ఫోర్డ్‌లో ఉన్న రిఫర్మేషన్ బైబిల్ కాలేజీలో క్రమబద్ధ వేదాంతశాస్త్రం (Systematic Theology) ఆచార్యులుగా సేవలందిస్తున్నారు. ఆయన అనేక పుస్తకాలు రచించారు. వాటిలో, 'ది లార్డ్స్ సప్పర్: ఆన్సర్స్ టు కామన్ క్వశ్చన్స్' (The Lord’s Supper: Answers to Common Questions) అనే పుస్తకం కూడా ఉంది.