The First Controversy Augustine vs Pelagius

మొదటి వివాదం: అగస్టీన్ వెర్సస్ పెలాజియస్

02/07/2026
The First Controversy Augustine vs Pelagius

మొదటి వివాదం: అగస్టీన్ వెర్సస్ పెలాజియస్

02/07/2026

క్రైస్తవ విమోచనశాస్త్రానికి సమకాలీన సవాళ్లు

Contemporary Challenges to Christian Soteriology

డోర్ట్ సినోడ్ డచ్ సంస్కరణవాద సంఘాలలోని ఆర్మీనియన్ వివాదాన్ని అధికారికంగా పరిష్కరించింది, కానీ ఆర్మీనియనిజం దాని ఉనికిని కోల్పోలేదు, అలాగే అది క్రైస్తవ విమోచనశాస్త్రానికి సవాళ్లను విసరడం కూడా ఆపలేదు. అది ఈ రోజు వరకు అలా చేస్తూనే ఉంది. అయితే, ఆర్మీనియనిజం మాత్రమే ఏకైక ముఖ్యమైన సమకాలీన సవాలు కాదు. ఈ పోస్ట్‌లో, క్రైస్తవ విమోచనశాస్త్రానికి ఎదురవుతున్న మరో ఐదు సమకాలీన సవాళ్లను మనం క్లుప్తంగా పరిశీలిద్దాం.

1. సవరించిన  సమర్థన సిద్ధాంతాలు

క్రైస్తవ విమోచనశాస్త్రానికి ఎదురయ్యే అత్యంత ముఖ్యమైన సవాళ్లలో సమర్థించబడటం గురించిన సవరణ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మొదటి శతాబ్దపు యూదా మతం గురించిన తమ సవరించిన అవగాహన ఆధారంగా, ‘పౌలుపై నూతన దృక్పథం’ ప్రతిపాదకులు (ఆ పేరు సూచించినట్లుగానే) పౌలు యొక్క రక్షణ సిద్ధాంతంపై ఒక కొత్త అవగాహనకు వచ్చారు. ఉదాహరణకు, ఎన్.టి. రైట్, ఒక వ్యక్తి అప్పటికే దేవుని ప్రజలలో ఉన్నాడని దేవుడు ప్రకటించడమే “సమర్థించబడటం” అని అర్థం చేసుకున్నారు. అయితే, సమర్థించబడటం అనేది వర్తమానములో మరియు భవిష్యత్తులో కూడా జరుగుతుంది. మన భవిష్యత్తులో జరిగే సమర్థన నిబంధన పట్ల మనకున్న విశ్వాస్యతపై ఆధారపడి ఉంటుంది.

ఫెడరల్ విజన్ ప్రతిపాదకులు, సమర్థించబడటం అనే సిద్ధాంతాన్ని సవరించడం ద్వారా క్రైస్తవ విమోచనశాస్త్రాన్ని కూడా సవాలు చేశారు. వారి బోధనలో చాలా భాగం వెస్ట్‌మిన్‌స్టర్ థియోలాజికల్ సెమినరీలో దైవజ్ఞానశాస్త్ర ప్రొఫెసర్ అయిన నార్మన్ షెపర్డ్ నుండి వచ్చినట్లు గుర్తించవచ్చు. ఆయన విశ్వాసాన్ని విశ్వసనీయతగా నిర్వచించి, తద్వారా సమర్థించబడటానికి గల ఆధారాలలో మన క్రియలను కూడా  కొంతవరకు చేర్చారు. ఫెడరల్ విజన్ ప్రతిపాదకులు తమ తమ పద్ధతులలో, షెపర్డ్ సిద్ధాంతంలోని అంశాలను న్యూ పర్స్పెక్టివ్‌లోని అంశాలతో కలిపి, ఫలితంగా బిబ్లికల్ సువార్తను బలహీనపరిచారు. కృతజ్ఞతగా, అన్ని ప్రధాన సంస్కరణవాద తెగలు ఈ తప్పుడు సిద్ధాంతాలను అధికారికంగా తిరస్కరించాయి.

2. సవరించిన దేవుని సిద్ధాంతం

దేవుని గురించిన సవరించిన సిద్ధాంతాల ప్రభావాలు, విమోచనశాస్త్రంపై, సమర్థించబడటం గురించిన సవరించిన సిద్ధాంతాల ప్రభావాల వలె వెంటనే స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ అవి అంతే ముఖ్యమైనవి. ప్రతి బైబిల్ సిద్ధాంతం దేవుని సిద్ధాంతంతో సంబంధం కలిగి ఉన్నందున, దేవుని సిద్ధాంతం సవరించబడినప్పుడు, ప్రతి ఇతర సిద్ధాంతం ప్రభావితమవుతుంది. ఇటువంటి సవరణలు ఇప్పుడు కేవలం దైవజ్ఞానశాస్త్ర ఉదారవాదుల మధ్య మాత్రమే జరగడం లేదు. తమను తాము సువార్తికులుగా మరియు సంస్కరణవాద దైవజ్ఞానశాస్త్రలుగా చెప్పుకునేవారు కూడా దేవుని సిద్ధాంతాన్ని సవరించడంలో నిమగ్నమై ఉన్నారు. కొందరు ఇప్పుడు దేవుడిని కాల ప్రవాహంలో పాలుపంచుకునేవాడిగా, సంఘటనలు జరుగుతున్నప్పుడు వాటికి ప్రతిస్పందిస్తూ మరియు అనుగుణంగా మారుతూ—క్షణక్షణానికి తన సంకల్పాన్ని, భావోద్వేగాలను మరియు ఉద్దేశాలను మార్చుకునేవాడిగా వర్ణిస్తున్నారు. ఈ దృక్కోణం ప్రకారం, దేవుడు మన అవగాహన కోసం కేవలం ప్రతిస్పందించేవాడిగానే కాకుండా, వాస్తవానికి ఆయన నిజమైన మార్పుకు లోనయ్యేవాడు అని చిత్రీకరించబడుతున్నాడు.

సంక్షిప్తంగా చెప్పాలంటే, దేవుడు కూడా తన సృష్టి జీవుల వలెనే మార్పు చెందే స్వభావం కలవాడు. ఇటువంటి పునఃసమీక్ష క్రైస్తవ రక్షణ సిద్ధాంతానికి సృష్టించే సవాలు స్పష్టంగా ఉంది. దేవుని చిత్తం మార్పు చెందే స్వభావం కలదైతే, మన రక్షణ విషయంలో ఆయన చిత్తం కూడా మార్పు చెందే స్వభావం కలదే. మన నిరీక్షణను నిలుపుకోవడానికి ఇకపై నిజంగా స్థిరమైన ఆధారం ఏదీ ఉండదు. క్రీస్తును విశ్వసించే వారందరినీ రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, కానీ దేవుడు తన మనసు మార్చుకుంటే, ఈ వాగ్దానం విషయంలో ఆయన తన మనసు మార్చుకోడని మనకు ఎలా తెలుసు? మన పట్ల ఆయనకున్న ప్రేమ మారదని మనకు ఎలా తెలుసు?

3. సవరించిన క్రీస్తు సిద్ధాంతాలు

దేవుని గురించిన సవరణ సిద్ధాంతాల మాదిరిగానే, క్రీస్తు గురించిన సవరణ సిద్ధాంతాలు కూడా క్రైస్తవ విమోచనశాస్త్రానికి ఒక తీవ్రమైన సవాలును విసురుతాయి. అటువంటి సవరణల ప్రభావం స్పష్టంగా కనిపించాలి, ఎందుకంటే సువార్త క్రీస్తు వ్యక్తిత్వం మరియు కార్యంపై కేంద్రీకృతమై ఉంది (1 కొరింథీ. 15:3–8 చూడండి). క్రీస్తు ఎవరనే దానిపై మన అవగాహనను మనం మార్చుకుంటే, ఆయన ఏమి చేశాడనే దానిపై మన అవగాహన కూడా అనివార్యంగా మారుతుంది.

క్రీస్తుశాస్త్రానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమకాలీన సవరణలలో ఒకటి, సాధారణంగా “కుమారుని నిత్య అధీనత” అని పిలువబడే సిద్ధాంతంలో కనిపిస్తుంది. ఈ దృక్కోణం ప్రకారం, కుమారుడు తన మానవ రూపంలోనే కాకుండా తన నిత్య దైవ స్వభావంలో కూడా తండ్రికి లోబడి, ఆయన అధికారం క్రింద నిత్యం ఉంటాడు. ఈ బోధన, క్రీస్తు గురించిన సనాతన సిద్ధాంతానికి మరియు త్రిత్వానికి సంబంధించిన బైబిల్ సిద్ధాంతానికి ఒక ప్రత్యక్ష సవాలుగా నిలుస్తుంది. దీని ప్రతిపాదకులు నైసీన్ క్రీడ్ మరియు అథనాసియస్ వంటి వ్యక్తులతో దీనికి కొనసాగింపు ఉందని వాదించినప్పటికీ, నాలుగవ శతాబ్దపు త్రిత్వవాద చర్చలను నిశితంగా పరిశీలిస్తే, అటువంటి ఆలోచనలు నైసీన్ త్రిత్వవాదుల రచనలలో కాకుండా, ఆ క్రీడ్‌ను మరియు అది నిర్వచించిన సనాతన స్థానాన్ని వ్యతిరేకించిన ఏరియన్లు మరియు సెమీ-ఏరియన్ల వాదనలలో కనిపిస్తాయని తెలుస్తుంది.

4. మతపరమైన బహుళత్వం

మత బహుళత్వాన్ని వర్ణనాత్మకంగా లేదా నిర్దేశనాత్మకంగా అర్థం చేసుకోవచ్చు. వర్ణనాత్మక కోణంలో చూస్తే, దేవుడు మరియు రక్షణ గురించి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు కలిగిన అనేక విభిన్న మతాలు ఉన్నాయన్నది వాస్తవం. అయితే, కొందరు వర్ణనాత్మకం నుండి నిర్దేశనాత్మకానికి మారి, అన్ని మతాలు మరియు అన్ని మతపరమైన వాదనలు సమానంగా చెల్లుబాటు అవుతాయని వాదిస్తారు. ఈ నిర్దేశనాత్మక దృక్పథం క్రైస్తవ విమోచనశాస్త్రానికి ఒక సవాలుగా నిలుస్తుంది, ఎందుకంటే యేసే ఏకైక విమోచనమార్గం అనే క్రైస్తవ వాదన యొక్క ప్రత్యేకతకు ఇది ప్రత్యక్ష విరుద్ధం.

పతనము జరిగినప్పటి నుండి అనేక అబద్ధ మతములు వెలువడ్డాయి. క్రైస్తవ్యం ఈ అబద్ధ మతాలను యేసు క్రీస్తు యొక్క ప్రత్యేకమైన వాదనలతో ఎదుర్కొంటుంది. ఈ అబద్ధ మతాలన్నీ ఒకే దేవుని వద్దకు వెళ్ళే వేర్వేరు మార్గాలు మాత్రమే అని చెప్పడం ద్వారా క్రైస్తవులు తమ ప్రభువుకు ద్రోహం చేయకూడదు.

5. విశ్వవ్యాప్తవాదం యొక్క పునరుజ్జీవనం

విశ్వవ్యాప్తవాదం అంటే, చివరికి మానవులందరూ (కొందరు దేవదూతలందని కూడా కలుపుతారు) రక్షింపబడతారనే భావన. సంఘ చరిత్ర అంతటా విశ్వవ్యాప్తవాదం వివిధ రూపాల్లో ఉనికిలో ఉంది మరియు ఇటీవల దాని ప్రజాదరణ మళ్ళీ పెరిగింది. సాంప్రదాయ క్రైస్తవ రక్షణ సిద్ధాంతానికి ఇది విసిరే సవాలు స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే చివరికి అందరూ ఎలాగైనా రక్షింపబడతారన్న విషయం తెలిసి, సువార్తను ప్రకటించడానికి ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంటుంది. ఒక విశ్వవ్యాప్తవాద “సువార్త”ను నమ్మడానికి వీలులేనంతగా, నరకం యొక్క వాస్తవికత గురించి మరియు రక్షణ మార్గంగా క్రీస్తు యొక్క ప్రత్యేకత గురించి లేఖనాల్లో చాలా ఎక్కువగా ఉంది. అది కేవలం వట్టి ఆశ మాత్రమే.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

కీత్ మాథిసన్

కీత్ మాథిసన్

డాక్టర్ కీత్ మాథిసన్ గారు ఫ్లోరిడా రాష్ట్రంలోని శాన్‌ఫోర్డ్‌లో ఉన్న రిఫర్మేషన్ బైబిల్ కాలేజీలో క్రమబద్ధ వేదాంతశాస్త్రం (Systematic Theology) ఆచార్యులుగా సేవలందిస్తున్నారు. ఆయన అనేక పుస్తకాలు రచించారు. వాటిలో, 'ది లార్డ్స్ సప్పర్: ఆన్సర్స్ టు కామన్ క్వశ్చన్స్' (The Lord’s Supper: Answers to Common Questions) అనే పుస్తకం కూడా ఉంది.