
తీవ్ర అనారోగ్యం మధ్యలో నిరీక్షణను కనుగొనడం
21/04/2026నిరాశను నేను ఎలా ఎదుర్కోగలను?
నిరీక్షణ అనేది జీవించాలనే తపన అయితే, నిరాశ అనేది ముగింపు కోసం చూసే ఆరాటం. చీపురు చెట్టు కింద కూర్చున్న ఏలీయా వలె (1 రాజులు 19:1-10), తన జన్మదినాన్ని శపించుకున్న యోబు వలె (యోబు 3), లేదా తన భారము భరించలేక బ్రతుకుపై ఆశ వదులుకున్న పౌలు వలె (2 కొరింథీ 1:8), సజీవమైన నిరీక్షణకు జన్మించిన విశ్వాసులు సైతం తీవ్రమైన వేదన సమయాల్లో చిక్కుకుపోయినట్లు భావించవచ్చు.
కీర్తనకారుడు ఇలా ఆర్తనాదం చేశాడు:
నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది; నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి. (కీర్తన 42:7)
“నా ప్రాణము నలిగిపోయియున్నది, నా దినములు ముగిసిపోయినవి” అని యోబు విలపించాడు (యోబు 17:1). ఇవి కేవలం కవితాత్మకమైన మాటలు మాత్రమే కావు; మన సహజమైన ఓర్పుకు మించిన శ్రమలు ఎదురైనప్పుడు కలిగే కఠిన వాస్తవికతను అవి ప్రతిబింబిస్తాయి.
నిరాశ అనేది కేవలం మనం ఊహించిన వారికి, అంటే నిరంతరం దిగులుగా ఉండేవారికి, అసంతృప్తిపరులకు లేదా ఆధ్యాత్మిక అవగాహన తక్కువగా ఉన్నవారికి మాత్రమే పరిమితం కాదు. దానికి భిన్నంగా, చార్లెస్ స్పర్జన్, మార్టిన్ లాయిడ్-జోన్స్, మరియు జాన్ బన్యన్ వంటి చైతన్యం కలిగిన దైవజనులు సైతం తమ జీవితాల్లో గాఢమైన వేదనను, మనోవ్యధను అనుభవించారు. ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి గానీ, వారి ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి గానీ నిరాశ ఎవరినీ వదిలిపెట్టదు; అది ఎవరికైనా రావచ్చు.
నిరాశలో ఉన్న వ్యక్తి కోరుకునేది ఒక్కటే: ఆ వేదన నుండి విముక్తి. ఈ పోరాటం యొక్క స్వభావమే ఒక భ్రమను కలిగిస్తుంది – అదేమిటంటే, ఇక ఏ పరిష్కారమూ లేదని, తప్పించుకునే మార్గమే లేదని, అంతా ఓటమి మరియు నిరర్థకత అని నమ్మిస్తుంది. కీర్తనకారుడు దీనిని ఈ విధంగా వర్ణించాడు:
నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను, అగాధ జలములలో నేను దిగబడియున్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. (కీర్తన 69:2)
అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లుగా, అందరికీ కనిపిస్తూనే, రక్షణకు అందనంత దూరంలో మునిగిపోతున్నామనే భావన మనకు కలగవచ్చు.
నిరాశ అనేది నిదానంగా మనసులోకి జారుకున్నా లేదా అకస్మాత్తుగా ప్రాణాన్ని, ఆత్మను అంచులకు నెట్టివేసినా, అది విశ్వాసికి ఉన్న నిరీక్షణ అనే వాస్తవికతను వక్రీకరించి, శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క సామర్థ్యాన్ని కుంగదీస్తుంది. కాబట్టి, పునరుద్ధరణ అనేది మన బలహీనతలో క్రీస్తుపై ఆనుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది. నిరాశ కలిగించే ఆ వేగాన్ని అడ్డుకోవడానికి విధేయత, సహనం మరియు నిరీక్షణ వంటి “చిన్న చిన్న” అడుగుల ద్వారా విశ్వాసాన్ని అభ్యాసం చేయాలి. తద్వారా మన అవగాహన మరియు అంతర్గత సామర్థ్యం తిరిగి పునరుద్ధరించబడతాయి.
ఆలోచనల సుడిగుండాన్ని అడ్డుకోవడం
జాన్ బన్యన్ రాసిన ‘యాత్రికుని ప్రయాణం’ (The Pilgrim’s Progress) గ్రంథంలో, క్రైస్తవుడు ‘నిరాశ’ (Giant Despair) అనే రాక్షసుడి కోటలో చిక్కుకుని కృశించిపోయినప్పుడు, అక్కడ అతడిని చుట్టుముట్టిన చీకటి కేవలం ఒక భ్రమ కాదు; అది ఊపిరి సలపనివ్వని అత్యంత కఠినమైన వాస్తవం. అదేవిధంగా, మనం కూడా చాలా దుర్భరమైన పరిస్థితుల మధ్య ఉండవచ్చు; అయితే నిరాశ మనల్ని ఆ పరిస్థితుల చుట్టూనే నిరంతరం ఆలోచించేలా చేస్తూ (Rumination), క్రీస్తునందు మనకున్న నిరీక్షణను మన కళ్లకు కనిపించకుండా చేస్తుంది. క్రైస్తవుడికి ఆ కోట నుండి విడుదల కలిగింది ఆ చీకటి అంతమవ్వడం వల్ల కాదు, తన జేబులో “వాగ్దానము” అనే తాళపుచెవి ఉందని అతను గుర్తుచేసుకున్నప్పుడు మాత్రమే ఆ బంధకాల నుండి విడుదల కలిగింది.
దేవుని వాక్యం నిరంతరం మన ఆలోచనల సుడిగుండాన్ని అడ్డుకుంటూ, వాటిని సరిదిద్ది సరికొత్తగా మలచాలి. మీరు విస్మరించబడ్డారని లేదా ఒంటరివారైపోయారని అనిపించినప్పుడు, “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి (హెబ్రీ 13:5). దేవుని కృప కూడా అందలేనంత అగాధంలో మీరు ఉన్నారని అనిపించినప్పుడు, ఆయన పాతాళము (Sheol) వరకు దిగి వెళ్ళాడని గుర్తుంచుకోండి. మీకు ఏమి ప్రార్థించాలో తెలియనప్పుడు, పరిశుద్ధాత్ముడు మీ పక్షాన ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడని తెలుసుకోండి (రోమా 8:26).
శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం
ఏలీయా పూర్తిగా నిస్సహాయుడై, అలసిపోయినప్పుడు, దేవుడు అతనికి ఆహారాన్ని, విశ్రాంతిని మరియు తన సన్నిధిని అనుగ్రహించాడు. మనం పరిమితమైన సామర్థ్యాలతో సృష్టించబడ్డాము; మన శక్తి క్షీణించినప్పుడు దానిని తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, శరీరానికి పౌష్టికాహారాన్ని అందించడం, సూర్యకాంతిలో కొంత సమయం గడపడం, అవసరమైనప్పుడు వైద్య సహాయం తీసుకోవడం మరియు బాధ్యతల ఒత్తిడిలో కొట్టుకుపోకుండా విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయడానికి ‘వినయం’ ఎంతో అవసరం. మన శారీరక అవసరాలను తీర్చుకోవడం అనేది ఒక స్వల్పమైన లేదా వ్యర్థమైన విషయంగా అనిపించవచ్చు; కానీ వాస్తవానికి, మనం దేవుని సృష్టి అని, మనకు పరిమితులు ఉన్నాయని అంగీకరిస్తూ ఆయన పోషణపై నమ్మకం ఉంచడం ఒక శక్తివంతమైన విధేయతతో కూడిన చర్య.
ఇతరుల వైపు దృష్టి మళ్లించడం
బ్రతకాలనే సహజ ప్రేరణ (Survival instinct) లాగే, నిరాశ కూడా బాధితుడిని పూర్తిగా ఆవహించి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచించేలా (Self-focus) మరియు ఒంటరితనంలోకి నెట్టివేస్తుంది. తనను తాను అతిగా విశ్లేషించుకుంటూ కృంగిపోయే ఈ వక్రీకరించిన ఆత్మపరిశీలనను, ఇతరులతో సమయం గడపడం ద్వారా, వారి పట్ల శ్రద్ధ చూపడం ద్వారా మరియు వారి మధ్య ఉండటం ద్వారా తగ్గించవచ్చు. ఇతరుల నుండి ప్రేమను పొందడానికే కాకుండా, సంభాషణల ద్వారా మరియు వారిపై శ్రద్ధ చూపడం ద్వారా ప్రేమను పంచడానికి కూడా మన జీవితాల్లోకి ఇతరులను ఆహ్వానించడం మంచిది. ఇతరులకు ప్రాధాన్యతనిస్తూ మనం చేసే చిన్న చిన్న కార్యాలు, మనపైనే దృష్టి కేంద్రీకరించుకునే ప్రవృత్తికి బలమైన ప్రతిబంధకాలుగా నిలుస్తాయి. మీ చుట్టూ ఉన్నవారి కోసం ప్రార్థించడం, ఒక ప్రోత్సాహకరమైన సందేశాన్ని పంపడం లేదా మీ సంభాషణలో వారి అవసరాలపై దృష్టి పెట్టడం – ఇవన్నీ దేవుని వైపు మరియు పొరుగువారి వైపు మన చూపును మళ్లించి, మనకు స్వేచ్ఛను ప్రసాదించే పునరుద్ధరణ మార్గాలు.
దైనందిన క్రమశిక్షణతో పునరుద్ధరణ
నిరాశ మనల్ని కృంగదీసి, జీవితాన్ని కేవలం మనుగడకు అవసరమైన ప్రాథమిక అంశాలకే పరిమితం చేసినప్పుడు, ఆ ప్రాథమిక పనులనే మన పునరుద్ధరణలో భాగంగా స్వీకరిద్దాం. మన దైనందిన పనులు ఎంత చిన్నవైనప్పటికీ, అవి మన జీవితంలో ఒక క్రమబద్ధతను తీసుకువస్తాయి. ప్రతి ఉదయం నిద్రలేవడం, ఇంటి పనులు చేసుకోవడం లేదా పరిసరాలను శుభ్రం చేసుకోవడం వంటి సాధారణ పనులు, మన జీవితాన్ని తిరిగి సాధారణ స్థితికి చేర్చి, ఒక ఉద్దేశాన్ని ఇచ్చే జీవనాధారాలుగా మారుతాయి. ఆ సమయంలో మన ప్రయత్నాలు యాంత్రికంగా అనిపించినప్పటికీ, ముందున్న తదుపరి పనిపై దృష్టి పెట్టడం అనేది నిరీక్షణతో కూడిన ఒక చర్య. “కొంచెములో నమ్మకముగా ఉండుట” (లూకా 16:10) మన సామర్థ్యాన్ని తిరిగి నిర్మిస్తుంది మరియు జీవితంలోని అర్థాన్ని, ఉద్దేశాన్ని స్థిరపరుస్తుంది; తద్వారా మన సామాన్యమైన పనులే మనల్ని నిరాశ నుండి రక్షించే మార్గాలుగా రూపాంతరం చెందుతాయి.
సృష్టి ద్వారా కలిగే ఆదరణ
భయం మనల్ని చుట్టుముట్టినప్పుడు, దేవుని మహోన్నతమైన ప్రభావం మరియు ఆయన సార్వభౌమాధికారం ముందు మనం ఎంత అల్పులమో గుర్తుచేసుకోవడం మనకు ఎంతో గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఆయన సమస్త సృష్టిని, అలాగే మనల్ని కూడా తన హస్తాలతో పట్టుకుని ఉన్నాడు. దేవుడు ఆకాశంలోని మృగశీర్ష నక్షత్రరాశి (Orion) నుండి సముద్ర ద్వారాల వరకు సమస్తాన్ని ఎలా కాపాడుతున్నారో తన స్వరూపాన్ని, సర్వాధికారాన్ని వివరించినప్పుడు, యోబు పడుతున్న వేదన ఆరాధనగా మారింది. ప్రకృతిలో నడవడం, నక్షత్రాల కింద విశ్రాంతి తీసుకోవడం, పూల మొక్కలు నాటడం లేదా మూగజీవాలను సంరక్షించడం వంటి పనుల ద్వారా సృష్టిలోని సౌందర్యం మనల్ని ఆదరిస్తుంది. ఈ సహజ ప్రపంచం ద్వారా దేవుడు మనకు పరిచర్య చేస్తూ, మన ఆలోచనా దృక్పథాన్ని తిరిగి తన వైపునకు మళ్లిస్తాడు.
ఓపికతో పట్టుదల కలిగి ఉండటం
జీవితంలో చీకటి అలాగే కొనసాగుతూ, ఉపశమనం లభించనప్పుడు, శ్రమ నుండి నిరీక్షణ వైపు సాగే ప్రయాణానికి ‘సహనం’ ఎంతో అవసరమని గుర్తుంచుకోండి. దీని అర్థం సమయం పడుతుందని గ్రహించడం మరియు దేవునిపై నమ్మకం ఉంచడం. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య జీవించడం అంత సులభం కాదు; అయితే క్రీస్తుపై సంపూర్ణంగా ఆధారపడటం నేర్చుకోవాలంటే మన బలహీనత మరియు అవసరతలే ప్రాథమిక అర్హతలు. ఆయన మనల్ని కేవలం తన విజయంలోను, పునరుత్థాన శక్తిలోను పాలుపంచుకోవడానికే కాకుండా, ఆయన శ్రమల సహవాసంలో పాలుపంచుకోవడానికి కూడా పిలిచాడు (ఫిలిప్పీ 3:10). విశ్వాసంలో మీ అడుగులు తడబడుతున్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగండి – ఈ కాలంలో మీరు చేయాలని ఆయన సిద్ధపరచిన సత్కార్యం సరిగ్గా ఇదే.
చీకటి నీడలను చూసి భయపడవద్దు. అవి అంతులేనివిగా మీకు అనిపించినప్పటికీ, వాస్తవం ఏమిటంటే, “క్రీస్తునందు తన నిత్యమహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులుగా చేసి, స్థిరపరచి, బలపరచి, పునాది వేయును” (1 పేతురు 5:10). ఈ నీడలు ఇంకా గాఢతరం కావచ్చు; అయినప్పటికీ, చీకటి అధికారము నుండి విమోచింపబడి, తన ప్రియ కుమారుని రాజ్యములోనికి చేర్చబడిన వారిని అవి ఎప్పటికీ స్వాధీనపరచలేవు (కొలొ. 1:13).
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.


