
పాప ఒప్పుకోలు అంటే ఏమిటి?
09/04/2026దేవునికి నిజంగానే మనపై పట్టింపు ఉందా?
తీవ్రమైన నిరాశానిస్పృహలు మనల్ని చుట్టుముట్టినప్పుడు లేదా అమితమైన ఆందోళనలతో మనస్సు వికలమైనప్పుడు, విశ్వాసుల హృదయాల్లో తరచుగా ఒక ప్రశ్న మెదులుతుంటుంది – బహుశా అది పైకి చెప్పలేకపోయినా తమ అంతరంగంలో కలిగే నిగూఢ సందేహం కావచ్చు: “దేవుడు నిజంగానే నా గురించి పట్టించుకుంటాడా?” ఒకవేళ నేడు మీరు కూడా అదే స్థితిలో ఉన్నట్లయితే, మీ కోసం ఒక శుభవార్త ఉంది.
ఒక సామాన్యమైన ప్రశ్న
మొదటగా మీరు గ్రహించాల్సింది ఏమిటంటే, ఈ పోరాటంలో మీరు ఒంటరి వారు కారు. చరిత్ర పొడుగునా భక్తులందరూ ఏదో ఒక సందర్భంలో ఇటువంటి ప్రశ్నలను ఎదుర్కొన్నవారే. ప్రవక్తయైన హబక్కూకు కాలంలో, దేవుని ప్రజలు దుర్మార్గుల చేత అణచివేయబడటం, హింసించబడటం చూసినప్పుడు ఆయన హృదయం తల్లడిల్లిపోయింది. ఆ వేదనలో ఆయన అడిగిన ప్రశ్న నేటికీ మనకు సుపరిచితమే:
యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు (హబక్కూకు 1:2; మరియు 1:3, 13 చూడండి)
కీర్తనకారులు సైతం తమ వేదనలకు సమాధానం లభించనప్పుడు, దేవుని శ్రద్ధను ప్రశ్నిస్తూ ఆయనను “మేల్కొమ్మని” (లేక లెమ్మని) తరచుగా బ్రతిమాలారు (కీర్తన 35:23; 44:23). ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వారికి సైద్ధాంతికంగా తెలిసినప్పటికీ (కీర్తన 121:4), తమ శ్రమల మధ్య దేవుడు మౌనంగా ఉన్నట్లు, ఏమీ చేయనట్లు, కనిపించే ఆ స్థితి వారిని కలచివేసింది. తమ దుస్థితిలో దేవుడు చూపిస్తున్నట్లుగా అనిపించే ఆ నిశ్శబ్దమే, “నిజంగా ఆయనకు నాపై శ్రద్ధ ఉందా?” అని వారు సందేహించేలా చేసింది.
ఈ పోరాటం కేవలం పాత నిబంధన కాలానికే పరిమితం కాలేదు. గాలివానలో చిక్కుకున్న శిష్యులు తీవ్ర భయాందోళనలతో యేసును చూసి, “బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా?” (మార్కు 4:38, ప్రాధాన్యత జోడించబడింది) అని కేకలు వేశారు. ఈ పోరాటం కేవలం విపత్కర పరిస్థితుల్లోనే కాదు, మన దైనందిన సాధారణ జీవితంలో కూడా ఎదురవుతుంది. తన ఇంటి పనుల భారంతో సతమతమవుతున్న మార్త, తాను ఒకతె పరిచర్య చేస్తుంటే యేసుప్రభువుకు తన గురించి పట్టింపు లేదా అన్నట్లుగా ఆయనను ప్రశ్నించింది (లూకా 10:40). కాలం ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా.. మనం ఆశించినంత త్వరగా దేవుడు మన శ్రమల్లో జోక్యం చేసుకోకపోయినా (లేదా అసలు ఆ శ్రమలు రాకుండా అడ్డుకోకపోయినా), అన్ని తరాల విశ్వాసుల మనస్సులో ఆయన ప్రేమ మరియు పట్టింపుపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి.
ఒక అద్భుతమైన సమాధానం
రెండవదిగా, దేవునికి మీపై శ్రద్ధ ఉందా లేదా అని మీరు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంటే, ఆయన మిమ్మల్ని అలా ఒంటరిగా వదిలివేయడు. ఊహాతీతమైన అత్యంత లోతైన రీతిలో ఆయన తన ప్రియ కుమారుని పంపడం ద్వారా మీ పట్ల తనకున్న శ్రద్ధను వెల్లడిపరిచాడు. యోహాను సువార్తలో ఈ సత్యాన్ని మనం చూడవచ్చు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానిని ఇచ్చెను” (యోహాను 3:16). దీని అర్థం ఏమిటంటే, పాపంతో నిండిన ఈ లోకంలో జీవించడంలో ఉండే నిరాశ, వేదన మరియు భయాలను క్రీస్తు పూర్తిస్థాయిలో అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాడు; కాబట్టి ఆయన మీ బలహీనతల పట్ల సహానుభూతి చూపగలడు (హెబ్రీ. 4:15).
అంతేకాకుండా, పరిశుద్ధాత్మ కార్యము ద్వారా దేవుని పరామర్శ మనకు నిరంతరం తోడుగా ఉంటుంది. యేసుప్రభువు పరిశుద్ధాత్మను వాగ్దానం చేసినప్పుడు, ఆయనను మనల్ని ఎన్నటికీ విడిచిపోని “ఆదరణకర్త” (లేదా మరొక సహాయకుడు) అని వర్ణించాడు (యోహాను 14:16). అలసిపోయే లేదా పరధ్యానంలో పడే మానవ మిత్రుల మాదిరిగా కాకుండా, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. ఆయన ఎన్నడూ విరామం తీసుకోడు, మిమ్మల్ని విడిచి పారిపోడు, మరియు మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోడు. దేవుడు మీకు చేసిన ప్రాథమిక నిబంధన వాగ్దానానికి ఇది ప్రత్యక్ష రూపం: “నేను నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” (ద్వితీయో. 31:8; హెబ్రీ. 13:5). మీరు ఒంటరివారమని, విడనాడబడ్డామని లేదా దేవుని సంరక్షణ పరిధికి ఆవల ఉన్నామని మీ భావోద్వేగాలు మిమ్మల్ని నమ్మించినప్పటికీ, ఈ వాగ్దానం మాత్రం అచంచలమైన సత్యం.
శ్రమలు దేవుని పరామర్శను చాటిచెబుతాయి
చివరగా, దేవుని పరామర్శ లేదా ఆయనకు మీపై ఉన్న పట్టింపు అంటే మీకు ఎటువంటి శ్రమలు, ఇబ్బందులు కలగవని అర్థం కాదని మీరు గ్రహించాలి. దానికి భిన్నంగా, ఆయన పరామర్శ మిమ్మల్ని ఆ శ్రమలను సహించేలా చేస్తుంది, అంతేకాకుండా వాటి ద్వారా మీరు ఆత్మీయంగా ఎదిగేలా చేస్తుంది. ఇది వినడానికి మన సహజ ఆలోచనకు విరుద్ధంగా అనిపించవచ్చు. అయినప్పటికీ, శ్రమలు మనల్ని నాశనం చేయవని, అవి మనలో ఓర్పును, నిలకడను, అనుభవమును మరియు నిరీక్షణను పుట్టిస్తాయని దేవుడు మనకు సెలవిస్తున్నాడు (రోమీ. 5:3-5).
కొన్ని శ్రమలు మన తండ్రి నుండి వచ్చే ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ రూపంలో వస్తాయి; ఇవి మన మేలు కోసమే ఉద్దేశించబడ్డాయి (హెబ్రీ. 12:7-11). దీనర్థం ఏమిటంటే – మనకు కలిగే శ్రమలు క్రమశిక్షణా స్వభావం కలిగి ఉన్నప్పటికీ – అవి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనడానికి సంకేతం కాదు, అది ఆయనకు మనపై ఉన్న పరామర్శకు నిదర్శనం.
మరికొన్ని శ్రమలు మనం క్రీస్తు జీవితంలో పాలివారమవడానికి తోడ్పడతాయి. పౌలు ఎంతో ధైర్యంగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాడు: “మనము ఆయనతోకూడ మహిమపొందుటకు ఆయనతోకూడ శ్రమపడినయెడల, దేవుని వారసులమును క్రీస్తుతోడి ఉమ్మడి వారసులమునై యున్నాము” (రోమీ. 8:17). సాక్షాత్తూ క్రీస్తు ప్రభువే తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు (హెబ్రీ. 5:8). మనం కూడా ఆయన పోలికలోనికి మారాలంటే, అదే పాఠశాలలో (అదే శ్రమల ద్వారా) నేర్చుకోవాలి. ఇది ఒక భారము కాదు, కానీ ఒక ఈవి (బహుమానం) – మన రక్షకుని అనుభవాలలో పాలుపంచుకోవడం మనకు దక్కిన గొప్ప భాగ్యం.
ముగింపు:
దేవునికి మీపై పట్టింపు ఉందా లేదా అని మీరు సందేహించే శోధన కలిగినప్పుడు, ఒక్కసారి ఆ సిలువ వైపు చూడండి. అక్కడ దేవుని ప్రేమ సంపూర్ణంగా ప్రదర్శించబడింది. అంతటి భారీ క్రయధనాన్ని చెల్లించిన తర్వాత, ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు – నిజానికి, ఆయన అలా విడిచిపెట్టలేడు కూడా. అసలు మొదట్లోనే తన ప్రజల పట్ల – అంటే మీ పట్ల – ఆయనకు అంతటి గాఢమైన ప్రేమ లేకపోతే, అంతటి భారీ వెలను ఆయన చెల్లించి ఉండేవారు కాదు. మీకు కలిగే శ్రమలు దేవుడు తన కృపను మీ నుండి ఉపసంహరించుకున్నాడనడానికి సూచన కానవసరం లేదు; బదులుగా, అది మీలో ఆయన నిరంతరం చేస్తున్న ఆత్మీయ కార్యానికి నిదర్శనం కావచ్చు.
ధైర్యం తెచ్చుకోండి. మీకు సందేహాలు కలిగినప్పుడు, మీ విశ్వాసం బలహీనపడినట్లు అనిపించినప్పుడు, ఆయన మిమ్మల్ని అస్సలు చేయి విడవడు. ఏదో ఒక రోజు, మీరు ప్రశాంత స్థితిలో ఉండి వెనక్కి తిరిగి ఈ శ్రమల వైపు చూసినప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది: ఆనాడు మిమ్మల్ని నిలబెట్టింది మీరు సిలువను ఎంత గట్టిగా పట్టుకున్నారనే మీ చేతుల బలం కాదు, మేకులతో గాయపడిన ఆయన హస్తాలు మిమ్మల్ని మోస్తూ, కాపాడుతూ, బలపరుస్తూ, ఎన్నడూ మిమ్మల్ని విడువక, ఎడబాయక తోడున్నాయనే సత్యం మీకు అప్పుడు స్పష్టమవుతుంది.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.


