
మరియ పాపరహితంగా పుట్టిందా?
06/10/2026
మరణంలో క్రైస్తవునికి లభించే ఓదార్పు ఏమిటి?
13/10/2026సంఘము తన దివ్యాంగ సభ్యులను ఎలా సంరక్షించగలదు?
నా ప్రస్తుత సంఘములో పిల్లల పరిచర్య డైరెక్టర్‌గా నన్ను నియమించిన కొన్ని వారాలకే, ఒక సంఘ పెద్ద మరియు అతని భార్య ఒక సమావేశం కోరారు. వారు ఈ గూఢమైన ప్రశ్నతో ప్రారంభించారు: “మీరు మా సంఘములో ని పిల్లలందరికీ పరిచర్య చేయడానికి వచ్చారా, లేక వారిలో చాలామందికి మాత్రమేనా?” నేను సరైన సమాధానం (తప్పకుండా, అందరికీ!) ఇచ్చిన తర్వాత, మా సంఘములో సభ్యులుగా ఉన్న, వైకల్యంతో బాధపడుతున్న ఐదుగురు పిల్లలను మరియు వారి కుటుంబాలను నేను ఎలా చూసుకోవాలని ప్రణాళిక వేస్తున్నానో వారు నన్ను అడిగారు. ఈ సవాలుతో కూడిన ప్రశ్నలు నా హృదయాన్ని కదిలించి, నా పరిచర్య ప్రపంచాన్ని కుదిపేశాయి, తద్వారా మా సంఘములో చివరికి అభివృద్ధి చెందుతున్న వైకల్య పరిచర్యకు పునాది వేశాయి.
సంఘంలో వైకల్యాలతో బాధపడుతున్న వ్యక్తులను, కుటుంబాలను ఎలా ఆదుకోవాలి అనే ప్రశ్నకు, సంఘంలోని సభ్యులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యతను గుర్తించడం ద్వారా మొదట సమాధానం లభిస్తుంది. మీ సంఘంలో వైకల్యాలున్న వారు ఎక్కువ మంది లేకపోయినప్పటికీ, వైకల్య పరిచర్య అనేది ఐచ్ఛికం కాదు. పిల్లలు, యువత మొదలైన వారికి చేసే “మరింత ముఖ్యమైన” పరిచర్యల తర్వాత మనం దృష్టి సారించే పరిచర్య ఇది కాదు. వాస్తవానికి, దాదాపు ప్రతి స్థానిక సంఘంలోనూ, స్పష్టంగా కనిపించేదైనా లేదా అంతగా కనిపించనిదైనా, వైకల్యంతో ప్రభావితమైన వారు ఎవరో ఒకరు ఉంటారు. ఇంకా, సంఘం తమను కూడా ఆదరించాలని ఆకాంక్షించే వారు సమాజంలో ఇంకా చాలా మంది ఉన్నారు.
1 కొరింథీయులు 12వ అధ్యాయంలో, అపొస్తలుడైన పౌలు సంఘమును అనేక అవయవములు గల క్రీస్తు యొక్క ఒకే శరీరముగా వర్ణించాడు. అవయవములన్నియు విభిన్నమైనవనియు మరియు అవసరమైనవనియు వర్ణించిన తరువాత, ఆయన ఇలా వ్రాశాడు: “శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే . . . అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదాని నొకటి యేకముగా పరామర్శించులాగున… అమర్చియున్నాడు” (1 కొరింథీ. 12:22, 25). ఈ సత్యాలను వైకల్యాలున్న వారికి అన్వయించినప్పుడు, మనం వారిని బాగా చూసుకోవడమే కాకుండా, వారు క్రీస్తు శరీరానికి అత్యవసరమైన వారని కూడా గుర్తించాలి.
లేఖనాల్లో సంఘం క్రీస్తు శరీరం అని మాత్రమే కాకుండా దేవుని కుటుంబం అని కూడా వర్ణించబడింది. కాబట్టి, మనం ఆ శరీరంలో ఒక భాగంగా వైకల్యాలున్న వారిని చూసుకోవాలని పిలువబడినప్పటికీ, మనం దానిని ఒక కుటుంబ హృదయంతో చేయాలి. క్రీస్తులో సహోదర సహోదరీలుగా, మనమందరం క్రీస్తులో ఒక కుటుంబ బంధాన్ని మరియు ఒకరిపట్ల ఒకరికి ప్రేమను పంచుకుంటాము. సంఘానికి సంబంధించిన ఈ రెండు చిత్రాలను మనసులో ఉంచుకొని, వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులను మరియు కుటుంబాలను మనం ఎలా చూసుకోవాలో తెలియజేసే ఐదు ఆచరణాత్మక సూచనలు ఇక్కడ ఉన్నాయి:
చేరిక
సంఘ కుటుంబంగా, ప్రజలందరూ చేర్చబడాలని మనం కోరుకోవాలి. వివిధ వైకల్యాలు సంఘ కార్యకలాపాలలో పాలుపంచుకోవడాన్ని మరియు సంఘంలో క్రియాశీలక భాగంగా ఉండటాన్ని సవాలుగా మారుస్తాయి. ఆరాధన నుండి శిష్యరికం నుండి మిషన్ల వరకు ఇంక మొదలైన సంఘంలోని ప్రతి పరిచర్య విభాగాన్ని మనం పరిశీలించి, మన సభ్యులందరిని ఎలా చేర్చుకోగలమో ప్రశ్నించుకోవాలి. వైకల్యాలున్న వారు కేవలం చేర్చబడటమే కాకుండా, పూర్తిగా సంఘానికి చెందినవారిగా ఉండేలా చేయడానికి మనం సాధ్యమైనదంతా చేయాలి (ఎఫెసీయులు 2:19).
అందుబాటు
వికలాంగుల పట్ల మనం శ్రద్ధ చూపే స్పష్టమైన మార్గాలలో ఒకటి, మన భవనాలను అందరికి అందుబాటులో ఉండేలా చేయడం. మనం ఒకచోట కలుసుకోలేకపోతే, ప్రజలందరూ కలిసి ఎలా ఆరాధించగలరు మరియు కలిసి శిష్యరికం పొందగలరు? మన సౌకర్యాలన్నింటిని అందరికి అందుబాటులో ఉంచడం ఎల్లప్పుడూ ఒక ప్రాధాన్యత. కానీ మన పరిచర్య కార్యక్రమాలన్నింటిని కూడా ప్రతిఒక్కరికి అందుబాటులో ఉంచడానికి మనం కృషి చేయాలి. వినికిడి మరియు దృష్టి లోపం ఉన్నవారిని, నిశ్శబ్ద ప్రదేశాలు అవసరమైన వారిని, అలాగే మేధోపరమైన లోపాలు ఉన్నవారిని మనం ఎలా ఆదరించాలి? సండే స్కూల్, బైబిల్ అధ్యయనాలు మరియు ఇతర పరిచర్య కార్యక్రమాలలో పాల్గొనడానికి కొంతమందికి తోడు అవసరమా? సంఘ కుటుంబంగా, సభ్యులందరికీ వారి కుటుంబ జీవితంలో పూర్తి అందుబాటును ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి.
ఈవులు పంచుకొనుట
దేవుని కుటుంబంలోని సభ్యులందరికి అందరి మేలు కొరకు ఆత్మీయ ఈవులు ఇవ్వబడ్డాయి (1 కొరింథీ. 12:7). ఇందులో వైకల్యాలున్న క్రైస్తవులందరూ కూడా ఉన్నారు. కాబట్టి, మనం వైకల్యాలున్న వారికి సేవ చేసి, వారిని సంరక్షించడమే కాకుండా, వారి ఈవులను దేవుని మహిమ కొరకు మరియు ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగించేలా వారికి శిక్షణనిచ్చి, వారిని సన్నద్ధం చేయాలి. వైకల్యాలున్న వారు అందించే ఈవులు లేకుండా సంఘ కుటుంబం అసంపూర్ణంగా ఉంటుంది.
నిజమైన సంబంధాలు
ఈ ప్రపంచం వికలాంగులను అమానవీయంగా చూసే ధోరణిని కలిగి ఉంది. క్రైస్తవులు కూడా కొన్నిసార్లు వారిలోని వైకల్యాన్ని మాత్రమే చూస్తారు కానీ ఆ వ్యక్తిని చూడరు. మనం ఒకరినొకరు కుటుంబంలా ఆదరించినప్పుడు, నిజమైన వ్యక్తులతో నిజమైన సంబంధాలను కోరుకుంటాము. మనం వికలాంగులను కేవలం “చూసుకోవడం” వరకే పరిమితం కాకుండా, వారి పట్ల నిజంగా శ్రద్ధ వహించాలి. వారి కథను తెలుసుకోండి. వారిని తెలుసుకోండి. వారిని ప్రేమించండి.
సంరక్షకులకు విశ్రాంతి
వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తుల పట్ల సంఘం శ్రద్ధ చూపగల చివరి మార్గం, వారి సంరక్షకులను ఆదుకోవడం. తల్లిదండ్రులకు ఒక రాత్రి బయటకు వెళ్లే అవకాశం ఇవ్వడం లేదా నిరంతర సంరక్షణ బాధ్యతల నుండి కొన్ని గంటల విశ్రాంతిని అందించడం దీర్ఘకాలిక సంరక్షణకు అత్యవసరం. ఈ లోకపు చింతల నుండి తమకు తాము ఉపశమనం పొందడం చాలా మందికి సాధారణంగా ఒక సులభమైన పని. వైకల్యాలతో బాధపడుతున్న కుటుంబాలు తమ శరీరానికి, ఆత్మకు విశ్రాంతి మరియు పునరుజ్జీవనం పొందడానికి వారి సంఘ కుటుంబం నుండి సహాయం అవసరం.
ముగింపు
ఒంటరితనం, విభజన మరియు సంఘర్షణలతో నిండిన మన ప్రపంచంలో, క్రైస్తవులు కూడా ఒకరికొకరు సులభంగా దూరం అయిపోవచ్చు. కానీ, సంఘంగా మనం మన ద్వంద్వ వాస్తవికతకు అనుగుణంగా జీవించాలి: మనం ఒకరికొకరు ఐక్యంగా ఉన్న క్రీస్తు శరీరం, మరియు మనం ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, శ్రద్ధ వహించడానికి పిలువబడిన దేవుని కుటుంబం. వికలాంగుల పరిచర్యకు పిలుపు అంటే దేవుని ప్రజలందరి పట్ల శ్రద్ధ వహించమని పిలవడమే.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.


