
నహూము గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు
24/06/2025
ఆమోసు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
26/06/2025ఒబద్యా గ్రంథం గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు

ఒబద్యా గ్రంథం పాత నిబంధనలో అతి చిన్న గ్రంథం కావడమే కాకుండా, చాలామంది బైబిలు పాఠకులకు అంతగా పరిచయం లేని చిన్న ప్రవక్తల గ్రంథాల మధ్య ఉన్నందున, ఓబద్యా ప్రవచనాన్ని సులభంగా విస్మరించవచ్చు. అయితే ఈ గ్రంథాన్ని కేవలం ఒకటి లేదా రెండు నిమిషాల్లో చదవగలం కాబట్టి, ఒబద్యా గ్రంథం గురించిన ప్రాథమిక సత్యాలను త్వరగా నేర్చుకోవచ్చు.
ప్రవక్త ఎదోము దేశానికి వ్యతిరేకంగా ప్రభువు తీర్పును ప్రకటిస్తున్నాడు (ఒబద్యా. 1-4, 8-10), ఏదోము చిన్న దేశమే అయినప్పటికీ ప్రశాంతంగా మరియు భద్రంగా జీవిస్తున్నామనే భావన అహంకారపూరితమైన గర్వంగా మారింది (ఒబద్యా 3, 12). అలాంటి నమ్మకానికి రెండు కారణాలు ఉన్నాయి: అది ఒక పర్వత దేశం కావడం వల్ల, మానవ దృక్కోణం నుండి చూస్తే సులభంగా రక్షించదగినదిగా ఉండేది (ఒబద్యా 3,4). అంతేకాకుండా, ఎదోము (తరచుగా దాని ప్రధాన నగరమైన తేమానుతో సూచించబడుతుంది) గొప్ప మానవ జ్ఞానాన్ని కలిగి ఉన్నందుకు ఖ్యాతిని కలిగి ఉంది (ఒబద్యా 8,9; యిర్మీయా 49:7). మరో మాటలో చెప్పాలంటే, ఎదోము తన ప్రజలు సురక్షితంగా జీవించడానికి అవసరమైన అన్ని వ్యూహాత్మక ప్రయోజనాలను కలిగి ఉంది.
అయితే, బాబిలోనీయులు యూదులపై దాడి చేసినప్పుడు వారికి సహాయం చేయడంలో విఫలమవడమే కాకుండా(క్రీ.పూ. 587/586లో యెరూషలేం నాశనం మరియు చెరతో ముగిసింది), కానీ పారిపోతున్న యూదా ప్రజలను పట్టుకొని బంధించి ఆక్రమణదారులకు అప్పగించడం ద్వారా చురుకుగా సహాయం చేసినందుకు ఏదోమీయులపై తీర్పు వస్తుందని ప్రభువు ప్రకటిస్తున్నాడు(ఒబద్యా 11–14; కీర్తనలు 137:8–9; యెహెజ్కేలు 25:12; 35:5). ఈ తీర్పు వాగ్దానాలతో పాటు, తన ప్రజలు తన రాజ్యాధికారం ద్వారా విడిపించబడి తిరిగి లేస్తారని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు (ఒబద్యా 17–21).
ఓబద్యా గ్రంథం గురించి ఈ క్రింది మూడు విషయాలను అర్థం చేసుకోవడం వల్ల దాని సందేశాన్ని మరింత సంపూర్ణంగా గ్రహించడంలో మనకు సహాయపడుతుంది.
- ఓబద్యా ప్రవచనం, ఇస్సాకు కుమారులైన యాకోబు, ఏశావుల గురించి ప్రభువు ఇచ్చిన సార్వభౌమ ఆజ్ఞ ఎలా నెరవేరిందో స్పష్టంగా చూపిస్తుంది: “పెద్దవాడు చిన్నవానికి దాసుడగును” (ఆదికాండము 25:23).
ఏదోము దేశం మరియు యూదా (ఇశ్రాయేలు) దేశం, వరుసగా ఏశావు మరియు యాకోబుల నుండి ఉద్భవించాయి (ఆదికాండము 36:1–43; 49:1–28). అన్నదమ్ములైన ఏశావు, యాకోబుల మధ్య సంబంధాలు సమస్యలతో కూడుకున్నవి (ఆదికాండము 27:41–45), అలాగే వారి నుండి ఉద్భవించిన రెండు దేశాల మధ్య (ఏశావు నుండి ఎదోము, యాకోబు నుండి యూదా) కూడా అలాంటి సంబంధాలే ఉన్నాయి. యాకోబు నిజాయితీ లేనివాడు మరియు మోసపూరితుడు అయినప్పటికీ, తన అన్న ఏశావుకు చెందాల్సిన జ్యేష్ఠత్వాన్ని మరియు ఆశీర్వాదాన్ని పొందాడు (ఆది. 25:29–33; 27:1–40). అదేవిధంగా, యూదా దేశానికి ఎదోమీయులపై ఆధిపత్యం కృపతో ఇవ్వబడింది (సంఖ్యాకాండము 24:18–19). ఇది వారి సంఘర్షణలతో కూడిన చరిత్ర పొడవునా కొనసాగింది (ఉదాహరణకు, 1 సమూయేలు 14:47; 2 సమూయేలు 8:11–14; 1 రాజులు 22:47; 1 దినవృత్తాంతములు 18:11 చూడండి). యాకోబు మరియు ఇశ్రాయేలు పట్ల ప్రభువు వ్యవహరించిన తీరు అర్హత లేనివారికి దేవుని అపారమైన కృపను ప్రదర్శిస్తుంది (మలాకీ 1:1–4; రోమీయులకు 9:10–16).
- ఓబద్యా దర్శనం (ఓబద్యా 1), దేవుని తీర్పు కార్యాలను మరియు ఆయన విమోచన కార్యాలను ఏకకాలంలో సంభవిస్తున్నట్లుగా కలిపి చూపిస్తుంది.
ఒబద్యా ఏదోముపై తీర్పు గురించే మాత్రమే కాకుండా, “యెహోవా దినం” గురించి కూడా మాట్లాడుతాడు (ఒబద్యా 15), ఆ దినం అన్ని దేశాలపై తీర్పును (ఒబద్యా 16) మరియు దేవుని ప్రజలకు విమోచనను (ఒబద్యా 17) తీసుకొస్తుంది. మొదటి చూపులో, ఇవన్నీ ఒకే సమయంలో జరుగుతాయని అనిపిస్తుంది. అయితే, బైబిలు ప్రవక్తలు దేవుని తీర్పు మరియు రక్షణ కార్యాలను తరచూ ఒకే దృశ్యంలో కలిపి చూపిస్తారు, అది పొడవుగా సాగిన టెలిస్కోప్‌ను మడిచి చిన్నదిగా మార్చినట్లుగా, ఈ రెండు కార్యాలనూ సమకాలీనంగా సమీపంగా తీసుకువస్తారు. ఈ విధంగా మాట్లాడే విధానాన్ని తరచుగా “ప్రవచనాత్మక ముందస్తు సూచన” (prophetic foreshortening) లేదా “టెలిస్కోపింగ్” అని పిలుస్తారు, ఈ పద్ధతి గురించి అవగాహన ఉండటం పాఠకులకు గందరగోళాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ప్రవచనాత్మక వాక్కులలో ఈ సాధారణ లక్షణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, ఓబద్యా ప్రవచనం యొక్క నెరవేర్పు వేర్వేరు సమయాలలో జరుగుతుందని గ్రహించవచ్చు. ఉదాహరణకు, ఎదోము నాశనం ఇప్పటికే జరిగింది, కానీ విశ్వాసులు ఇప్పటికీ “యెహోవా దినం” కోసం ఎదురుచూస్తున్నారు, ఆ దినం అన్ని దేశాలను తీర్పుకు పిలిచి, సంఘానికి రక్షణ సంపూర్ణతను తీసుకువస్తుంది.
- ఓబద్యా ప్రవచనం కొత్త నిబంధనలో నేరుగా ఉటంకించబడనప్పటికీ, లేఖనం యేసుక్రీస్తులో దాని ఆశ్చర్యకరమైన నెరవేర్పును సూచిస్తుంది.
ఓబద్యా, ఎస్తేరు, మరియు జెఫన్యా వంటి గ్రంథాల వలె మరికొన్ని పాత నిబంధనలోని గ్రంథాలు కొత్త నిబంధనలో ఉటంకించబడలేదు. అయినప్పటికీ, ఓబద్యా ప్రవచనం ఆశ్చర్యకరమైన రీతిలో నెరవేరిందని లేఖనాలు సూచిస్తున్నాయి. కాలక్రమేణా, ఎదోమీయులు విదేశీ శక్తులచే అణచివేయబడ్డారు, యూదు చరిత్రకారుడైన జోసెఫస్ ప్రకారం, వారు క్రీ.పూ. రెండవ శతాబ్దం చివరలో జాన్ హిర్కానస్ (ఒక హస్మోనియన్ పాలకుడు మరియు యూదు ప్రధాన యాజకుడు) పాలనలో మళ్లీ యూదుల ఆధిపత్యంలోకి వచ్చి, ఆచారబద్ధమైన సున్నతిని స్వీకరించవలసి వచ్చింది (యాంటిక్విటీస్ 13:256). దీని ఫలితంగా, “ఇదూమీయులు” అని పిలువబడిన ఈ ప్రజలు యూదా ప్రజలలో కలిసిపోవడం ప్రారంభించారు. వారికి తమ పూర్వీకుల భూమి, జాతీయ గుర్తింపు కోల్పోవడం ఒక దాచిన ఆశీర్వాదంగా మారింది, ఎందుకంటే, ఇదూమియా నుండి వచ్చిన ప్రజలు మెస్సీయ యేసును అనుసరించడానికి ఆకర్షితులయ్యారు (మార్కు 3:8–9). ఇది కొలొస్సయులు 3:11లోని సత్యాన్ని రుజువు చేస్తుంది: “ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.” ఓబద్యా ప్రకటించినట్లుగానే, సీయోను పర్వతంపై విమోచన లభించింది (ఓబద్యా 17), అంటే శ్రేష్ఠమైన నిబంధనకు మధ్యవర్తియైన యేసును అనుసరించే జీవముగల దేవుని ప్రజలలోనే ఆ విమోచన కనుగొనబడింది(హెబ్రీయులకు 12:22–24).
ఓబద్యా గ్రంథంతో, “చిన్న పొట్లాలలోనే గొప్ప వస్తువులు వస్తాయి” అనే పాత సామెత నిజమని మరోసారి రుజువవుతుంది. ఈ చిన్న పుస్తకంలో దేవుని అద్భుతమైన ప్రణాళిక, ఆయన తీర్పు, మరియు రక్షణ గురించిన లోతైన సత్యాలు నిక్షిప్తమై ఉన్నాయి.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.