
మానవ స్వభావం ప్రాథమికంగా మంచిదా లేక పూర్తిగా పాపపూరితమైనదా?
14/05/2026దేవుని ఉగ్రత అంటే ఏమిటి?
క్రీస్తు ప్రాయశ్చిత్తము ద్వారా కప్పబడని పాపముపై మరియు పాపులపై, పరిశుద్ధుడును నీతిమంతుడునైన దేవుడు కనబరిచే ప్రతిస్పందనే ‘దేవుని ఉగ్రత’. దేవుడు ఉగ్రత కలిగినవాడని తలంచడానికి అనేకులు ఇష్టపడనప్పటికీ, దుష్టత్వానికి వ్యతిరేకంగా ప్రభువు తన ఉగ్రతను ఏ విధంగా ఉపయోగిస్తాడో (కనబరుస్తాడో) లేఖనాలు పదేపదే ప్రస్తావిస్తున్నాయి. దేవుడు అనీతిపై తన ఉగ్రతను కుమ్మరిస్తాడని (అమలు చేస్తాడని) పాత మరియు కొత్త నిబంధనలు రెండూ సమృద్ధిగా సాక్ష్యమిస్తున్నాయి (ద్వితీ. 9:8; 2 రాజులు 23:26; కీర్తన. 21:9; 90:11; యెష. 13:9; మీకా 5:15; జెఫన్యా 1:18; యోహాను 3:36; రోమా. 1:18; ఎఫెసీ. 5:6; ప్రకటన 16:1 చూడండి).
దైవిక ఉగ్రత మరియు దేవుని లక్షణాలు
దేవుడు తన స్వభావాన్ని బట్టి, అనగా ఆయన పరిశుద్ధ వ్యక్తిత్వాన్ని బట్టి అనీతిపై తన ఉగ్రతను వెల్లడిపరుస్తాడు. దేవుడు నీతిమంతుడును న్యాయవంతుడునై ఉన్నాడని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి (ద్వితీ. 32:4; దాని. 9:14; రోమా. 1:17; ప్రక. 15:3). ఒకవేళ ఆయన దుష్టత్వాన్ని, దుష్టులను శిక్షించని యెడల ఆయన నీతిమంతుడుగాను న్యాయవంతుడుగాను ఉండజాలడు. కాబట్టి, పాపంపై ఆయన తన ఉగ్రతను కుమ్మరించడం అనేది ఆయన నీతిమంతమైన స్వభావానికి సంపూర్ణంగా అనుగుణమైనదే. పాపులు తమ నేరములకు తగిన శిక్షను అనుభవించి తీరాలి; దేవుడు తన న్యాయబద్ధమైన ఉగ్రతను అమలుపరచకుండా దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టలేడు, లేనియెడల ఆయన అనీతిమంతుడవుతాడు (నిర్గమ. 34:6-9). దేవుడు ప్రేమాస్వరూపి (1 యోహాను 4:7-8), ఆయన ప్రేమించే వాటిలో నీతి ఒకటి (కీర్తన 33:5). దేవుడు పరిపూర్ణుడు గనుక, నీతి పట్ల ఆయనకుండే ప్రేమ కూడా పరిపూర్ణమైనదే; తత్ఫలితంగా, ఆయన “భక్తిహీనుల మార్గమును” అసహ్యించుకొనక తప్పదు (సామెతలు 15:9; ద్వితీ. 32:4 కూడా చూడండి).
పాపం లేనిదే ప్రభువు తన ఉగ్రతను వెల్లడిపరచలేడు; అలాగే, పాపం చేసే సృష్టించబడిన జీవులు లేనిదే పాపం ఉనికిలో ఉండదు. కాబట్టి, సృష్టి మరియు అది పాపంలో పడిపోవడం సంభవించకుండా దైవిక ఉగ్రత అనేది వ్యక్తమవ్వదు. ఈ కారణము చేతనే, అనేకమంది క్రైస్తవ వేదాంతవేత్తలు దేవుని ‘ఉగ్రతను’ సంపూర్ణమైన దైవిక గుణంగా (Absolute Attribute) కాకుండా, పాపానికి ప్రతిస్పందనగా వ్యక్తమయ్యే సంబంధిత దైవిక గుణంగా (Relative Attribute) వర్గీకరించారు. ఒకవేళ ప్రభువు దేనినీ సృష్టించకపోయినా, ఆయనలో ఏ లక్షణాలైతే వ్యక్తమవుతాయో లేదా కనబడతాయో వాటిని ‘సంపూర్ణ దైవిక గుణాలు’ అంటారు. దేవుని నిత్యత్వము మరియు సర్వజ్ఞానము వంటివి ఈ సంపూర్ణ దైవిక గుణాల క్రిందకు వస్తాయి. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినా, సృష్టించకపోయినా ఆయన ఎల్లప్పుడూ నిత్యుడు మరియు సర్వజ్ఞానిగానే ఉంటాడు.
దేవునికి వెలుపల ఆయనతో సంబంధం కలిగి ఉండేది ఏదైనా ఉంటే తప్ప, సంబంధిత దైవిక గుణాలు (Relative Attributes) వ్యక్తమవ్వవు. పైన పేర్కొన్నట్లుగా, పాపులు లేనిదే దైవిక ఉగ్రతకు ఉనికి ఉండదు; కాబట్టి, ఉగ్రత అనేది సంబంధిత దైవిక గుణము. అయితే, ఉగ్రత (లేదా మరే ఇతర సంబంధిత దైవిక గుణమైనా) సృష్టి జరగడం వల్ల దేవుడు క్రొత్తగా పొందుకున్న గుణం మాత్రం కాదు. దేవుడు పాపానికి ఉగ్రతతో స్పందించడానికి కారణం – ఆయన స్వతహాగానే ఉత్తముడును, నీతిమంతుడునై ఉండటమే. దేవుడు స్వయంగా మారడం వల్ల కాకుండా, సృష్టించబడిన జీవి పాపిగా మారిపోవడం వల్లే దైవిక ఉగ్రత వెల్లడవుతుంది. మానవుని పతనం ద్వారా దేవుడు ఏదో ఒక కొత్త లక్షణాన్ని ధరించుకోలేదు; కానీ, పాపులు స్వతహాగా నీతిమంతుడైన దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన ఉగ్రతను అనుభవిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా, దేవుడు మార్పులేనివాడు (మలాకీ 3:6).
దేవుని ఉగ్రతను అనుభవించుట
దేవుని ఉగ్రత అత్యంత భయంకరమైనదని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభువు ఉగ్రత యొక్క ‘ప్రచండమైన అగ్నిజ్వాలల’ గురించి బైబిల్ తరచుగా ప్రస్తావిస్తుంది (నిర్గమ. 32:11; విలాప. 4:11). అంతేకాకుండా, తమ పాపములను విడిచి క్రీస్తు వైపు తిరగని పాపులపై కుమ్మరించబడే నిత్య ఉగ్రత నిలయాన్ని లేఖనాలు “అగ్నిగుండము”గా వర్ణిస్తున్నాయి (ప్రకటన 20:10). యెషయా 66:24ను ఉటంకిస్తూ, నరకములో “వారి పురుగు చావదు” అని యేసు ప్రభువు సెలవిచ్చారు (మార్కు 9:42-49). ఈ దృశ్యం ద్వారా, దేవుని తీర్పు అనేది పాపిని నిరంతరం దహిస్తూ, అంతము లేని వినాశనానికి గురిచేస్తుందని మన రక్షకుడు చిత్రీకరించాడు. ప్రవక్తలు మరియు అపొస్తలులు “ప్రభువు దినమున” సంభవించే మహా నాశనమును గురించి హెచ్చరించారు. ఈ ‘ప్రభువు దినము’ అనేది చరిత్రలో కొన్ని నిర్దిష్ట సమయాల్లో దేవుడు కుమ్మరించిన తీర్పులను మాత్రమే కాక, యుగాంతమందు ఆయన నిర్వహించబోయే అంతిమ తీర్పును కూడా సూచిస్తుంది (యెషయా 13:6; యెహెజ్కేలు 30:3; యోవేలు 1:15; 2 పేతురు 3:10).
పైన పేర్కొన్న వర్ణనలను బట్టి, దేవుని ఉగ్రత అనగా కేవలం అగ్నిమయమైన తీర్పులు లేదా అద్భుతమైన రీతిలో సంభవించే వినాశనమని అనేకులు భావిస్తుంటారు. అయితే, గమనించవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే, అటువంటి బహిరంగ తీర్పులు అంతకుముందే ప్రారంభమైన దైవిక ఉగ్రత యొక్క తుది పరిపూర్ణ నెరవేర్పు మాత్రమే. రోమీయులు 1:18-32 వంటి లేఖన భాగాలు, దేవుడు తన ఉగ్రతను ఎల్లప్పుడూ ఒకేసారి అమలు చేయకుండా, తరచుగా కాలక్రమేణా వెల్లడిస్తాడని సూచిస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు వివరించినట్లుగా, మనుష్యులను వారి పాపపు ఇచ్ఛలకే అప్పగించి, వారు ఆ పాపములోనే మరింత లోతుగా కూరుకుపోయేలా విడిచిపెట్టడమే దేవుని ఉగ్రతలో ఒక భాగం. పశ్చాత్తాపపడని పాపులను దేవుడు అగ్నిమయమైన తీర్పుతో శిక్షించడానికి ముందే, వారు కోరుకునే పాపములోనే వారు కొనసాగడానికి తరచుగా వారిని అనుమతిస్తాడు. దేవుడు తన ఉగ్రతలో భాగంగా, పశ్చాత్తాపము లేని వారిని వారి పాపమునకే అప్పగించివేస్తాడు.
దేవుని ఉగ్రతకు లోనైన వారికి నిరీక్షణ
పాపులపై దేవుని అంతిమ ఉగ్రత కుమ్మరించబడే దినం ఒకటి రాబోతోంది. అయితే, దేవుడు మహా కృపామయుడు గనుక, రాబోవు ఆ ఉగ్రత నుండి మనలను రక్షించుటకు ఆయన యేసుక్రీస్తును అనుగ్రహించాడు (1 థెస్స. 1:10). కుమారుడైన దేవుడు, అనగా యేసుక్రీస్తు, పాపానికి వ్యతిరేకంగా నీతిమంతుడైన దేవుడు విధించిన శిక్షను భరించడానికి మానవావతారమెత్తాడు. యేసుక్రీస్తు నందు, దేవుడు తన ఉగ్రతను కుమ్మరించి, ఆ ఉగ్రతను తానే భరించాడు. తద్వారా, పాపము క్రీస్తులో శిక్షించబడటం ద్వారా ఆయన తన నీతిని కనబరుచుకున్నాడు; అదే సమయంలో, క్రీస్తు ప్రాయశ్చిత్తము ద్వారా పాపమును విడిచిపెట్టి యేసునందు విశ్వాసముంచే పాపుల పట్ల ఆయన ప్రసన్నుడై (Propitious), తన కృపను వెల్లడిపరుస్తున్నాడు (రోమా. 3:21-31). ప్రభువు కృపను, నిరంతర ప్రేమను చూపించుటకు ఇష్టపడేవాడు (మీకా. 7:18). రక్షణ కొరకు కేవలం యేసుక్రీస్తుపైనే ఆధారపడేవారందరూ, దేవుని నిత్య ఉగ్రత నుండి సంపూర్ణముగా రక్షించబడతారు (హెబ్రీ. 7:25).
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.


