God’s Comfort in the Loss of a Child

సంతానాన్ని కోల్పోయినప్పుడు దేవుని ఆదరణ

30/04/2026
God’s Comfort in the Loss of a Child

సంతానాన్ని కోల్పోయినప్పుడు దేవుని ఆదరణ

30/04/2026

యోవేలు గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

3 Things You Should Know About Joel

యోవేలు గ్రంథం గురించి చాలామందికి తెలిసిన ప్రాముఖ్యమైన విషయం 2:28-29లోని ఆ గొప్ప ప్రవచనం. అక్కడ దేవుడు తన ఆత్మను సర్వశరీరుల మీద కుమ్మరిస్తానని, తద్వారా దేవుని ప్రజల సమాజంలోని వారందరూ ప్రవచిస్తారని వాగ్దానం చేస్తాడు. అయితే, ఈ గ్రంథం యొక్క మొత్తం సందేశంతో ముడిపెట్టి చూస్తే తప్ప, ఆ వచనాల అంతరార్థాన్ని మనం సరిగ్గా గ్రహించలేము. యోవేలు గ్రంథ సందేశాన్ని మీరు అర్థం చేసుకోవడానికి సహాయపడే మూడు ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

1. యోవేలు గ్రంథం రాయబడిన కాలం అనిశ్చితం 

మొదటిగా, ప్రవచన గ్రంథాల సందేశాన్ని గ్రహించడంలో వాటి చారిత్రక నేపథ్యం ఎంతో ముఖ్యం; అయితే, యోవేలు గ్రంథం ఏ కాలంలో రాయబడింది అనేది స్పష్టంగా తెలియదు. ఇందులో దేవాలయ ఆరాధన జరుగుతున్నట్లు ప్రస్తావించబడింది, కాబట్టి ఇది సొలొమోను నిర్మించిన మొదటి దేవాలయ కాలం (క్రీ.పూ. 586లో అది నాశనం కాకముందు) కావచ్చు, లేదా చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రతిష్టించబడిన దేవాలయ కాలం (క్రీ.పూ. 516) కావచ్చు. ఇందులో ఏ రాజు పేరు గానీ, ఇశ్రాయేలు లేదా యూదా ప్రధాన శత్రువుల పేర్లు గానీ ప్రస్తావించబడలేదు. పండితులు దీని రచనా కాలం గురించి వివిధ అభిప్రాయాలను ప్రతిపాదించినప్పటికీ, ఏ ఒక్క తేదీపైనా ఏకాభిప్రాయం కుదరలేదు. బలులు నిలిపివేయబడటం (యోవేలు 1:9), ఉత్తర దిక్కు నుండి వచ్చే సైన్యం వల్ల కలిగే ముప్పు (యోవేలు 2:20), మరియు భవిష్యత్తులో కలగబోయే విమోచన (యోవేలు 2:23-29) వంటి అంశాలను బట్టి చూస్తే, ఈ గ్రంథం మొదటి దేవాలయ విధ్వంస కాలపు పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తుంది. జాతీయ విపత్తుల సమయంలో పదేపదే పఠించే ఒక ఆరాధన పాఠ్యంలా (liturgical text) ఇది మారడం వల్లే, దీని కాలనిర్ణయం చేయడం కష్టతరమైందని కొందరు భావిస్తారు.

2. యోవేలు గ్రంథం రాయబడిన కాలం అనిశ్చితం 

యోవేలు గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన రెండవ విషయం ఏమిటంటే, ఈ గ్రంథం రాయడానికి దారితీసిన సందర్భం దాని సందేశంతో ముడిపడి ఉంది. ఆ సందర్భమే ‘మిడతల దండు’ తెగులు. పూర్వం ఎన్నడూ జరగనంత వినాశకరమైన రీతిలో మిడతలు విరుచుకుపడటంతో, ప్రజలందరూ సమిష్టిగా విలపించాలని మొదటి అధ్యాయం పిలుపునిస్తోంది. ఈ విపత్తును యోవేలు 1:4 లో వర్ణిస్తూ, మిడతల గుంపులు తినదగిన ప్రతిదాన్ని ఎలా నాశనం చేశాయో వివరించబడింది. ఆ పర్యవసానాలను బట్టి వివిధ వర్గాల ప్రజలు రోదించాలని పిలుపునివ్వబడింది: ద్రాక్షావల్లులు నాశనమైనందుకు ద్రాక్షారస ప్రియులు (యోవేలు 1:5-7), దేవాలయంలో అర్పణలు నిలిచిపోయినందుకు యాజకులు (యోవేలు 1:8-10), మరియు పంటలు పండనందున రైతులు (యోవేలు 1:11-12) విలపించాలి. అంతేకాకుండా, కన్నీళ్లతోను, ఉపవాసంతోను కూడిన అంగలార్పు ఆరాధనలో దేవుని ప్రజలను నడిపించాలని యాజకులకు పిలుపునివ్వబడింది (యోవేలు 1:13-14).

మిడతల దండు సృష్టించిన ఈ అల్లకల్లోలం, ‘యెహోవా దినము’ (the day of the Lord) గురించిన వర్ణనగా మారుతుంది. ఆ దినం, దేవుడిని తిరస్కరించేవారికి తీర్పు దినముగాను, ఆయన యొద్దకు తిరిగి వచ్చేవారికి ఆశీర్వాద దినముగాను ఉంటుంది. ఆ దినాన రాబోయే తీర్పుకు ఈ మిడతల విపత్తు ఒక పరిచయం వంటిది. ఈ అంశం యోవేలు 1:15లో మొదటిసారిగా ఇలా ప్రస్తావించబడింది:

ఆహా, యెహోవా దినము వచ్చెనే
అది ఎంత భయంకరమైన దినము!

ఆ దినమున సంభవించే వినాశనం యోవేలు 1:16-20లో వివరించబడింది. ఆ తర్వాత యోవేలు 2:1-2లో అత్యవసరమైన హెచ్చరిక వినిపిస్తుంది. ఆ “దినము” యొక్క స్వభావాన్ని నొక్కి చెబుతూ, అది “చీకటియు గాఢాంధకారమును కలిగిన దినమని,” “మేఘములును దట్టమైన అంధకారమును కమ్మిన దినమని” అది వివరిస్తోంది. పర్వతాల మీద వ్యాపించిన ఆ అంధకారం, యుద్ధానికి సన్నద్ధమైన ఒక మహా బలమైన సైన్యాన్ని సూచిస్తుంది; ఆ సైన్యంలోని యోధులను ఎవరూ అడ్డుకోలేరు. ఆ సైన్యాన్ని ఎదుర్కోవాలనే ఆలోచనకే ప్రజలు విలవిలలాడుతున్నారు, ఎందుకంటే అది కేవలం భూసంబంధమైన సైన్యం కాదు; అది సాక్షాత్తు యెహోవా సైన్యం. ఆ సైన్యం ముందర యెహోవా తన స్వరాన్ని వినిపిస్తాడు; అప్పుడు సృష్టి అంతా కంపించిపోతుంది, సూర్యచంద్రులు చీకటిమయమవుతారు (యోవేలు 2:10-11). “యెహోవా దినము గొప్పదియు మిక్కిలి భయంకరమునై యున్నది, దానిని సహింపగలవాడెవడు?” (యోవేలు 2:11). కాబట్టి, ఆ దినాన్ని ఎవరూ సహించలేరు.

యోవేలు గ్రంథంలో ‘యెహోవా దినము’ అనేది కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు; అది మానవ చరిత్రను ముగింపుకు తీసుకువచ్చే ఒక అంత్యకాల (eschatological) సంఘటనను వివరిస్తుంది. ఆ దినాన సంభవించబోయే దేవుని భీకర తీర్పును యోవేలు ప్రస్తావిస్తూ, దేవుని ప్రజలు మారుమనస్సు పొందాలని పిలుపునిస్తున్నాడు (యోవేలు 2:15-17). మిడతల విపత్తు కలిగించిన వినాశనాన్ని దేవుడు మళ్ళీ ఆశీర్వాదంగా మారుస్తానని (reversal) భౌతికపరమైన వాగ్దానం చేస్తున్నాడు (యోవేలు 2:21-27). వీటన్నిటికంటే మిన్నగా, తన పరిశుద్ధాత్మను కుమ్మరించడం ద్వారా లభించే ఆత్మీయ ఆశీర్వాదాలను ఆయన వాగ్దానం చేస్తున్నాడు (యోవేలు 2:28-32).

3. పెంతెకొస్తు దినమున జరిగిన సంఘటనలను వివరించడానికి అపొస్తలుడైన పేతురు యోవేలు ప్రవచనాన్ని  ఉటంకించాడు

ఈ గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన మూడవ విషయం ఏమిటంటే, పెంతెకొస్తు దినమున జరిగిన ఆశ్చర్యకరమైన కార్యాలను వివరించడానికి అపొస్తలుడైన పేతురు యోవేలు 2:28-32 వచనాలను అపొస్తలుల కార్యములు 2:17-21లో ఉటంకించాడు. దేవుడు తన ఆత్మను సర్వశరీరుల మీద కుమ్మరించడం ద్వారా, యోవేలు ప్రవచించిన ఆత్మీయ ఆశీర్వాదాలు అప్పుడు నెరవేరడం ప్రారంభించాయి. తద్వారా, ప్రభువు నామమున మొఱ్ఱపెట్టు వారెవరైనా రక్షణ పొందుతారనే వాగ్దానం నెరవేరింది.

అంతేకాక, దేవుని వాక్యాన్ని ప్రకటించే ప్రవచనాత్మక పరిచర్య అన్యజనులతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు విస్తరించింది; పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి ద్వారా, వారు తమ తమ భాషలలో దేవుని సంగతులను ఒకరికొకరు వివరించారు (అపొస్తలుల కార్యములు 2:4). దేవుని శత్రువులపై తుది తీర్పు (యోవేలు 3:1-8) మరియు దేవుని ప్రజల సంపూర్ణ పునరుద్ధరణ (యోవేలు 3:17-21) ఆ క్షణంలోనే సంభవించే బదులు, యేసుక్రీస్తు సువార్త సర్వలోకానికి ప్రకటించబడటం ద్వారా దేవుని రక్షణ సంకల్పం నెరవేరుతూ వస్తోంది. దీని ఫలితంగా, మనకు లభించబోయే రక్షణకు ‘అడ్వాన్సు’ లేదా ‘ముందస్తు హామీ’ని (down payment) మనం ఇప్పటికే క్రీస్తులో అనుభవించాం. మన రక్షకుడు ఈ లోకానికి తిరిగి వచ్చి, దేవుని శత్రువులకు తుది తీర్పు తీర్చి, తన ప్రజలను సంపూర్ణంగా పునరుద్ధరించినప్పుడు ‘యెహోవా దినము’ పరిపూర్ణమవుతుంది. ఆ రక్షణ సంపూర్ణత కోసం మనం నిరీక్షిస్తున్నాం. ఆ సమయంలో, మనం నిత్యత్వమంతా ఆయన సన్నిధిని, ఆ సన్నిధి ద్వారా లభించే సమృద్ధమైన ఆత్మీయ మరియు భౌతిక ఆశీర్వాదాలను సంపూర్ణంగా అనుభవిస్తాం.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

రిచర్డ్ బెల్చర్ జూనియర్.

రిచర్డ్ బెల్చర్ జూనియర్.

డాక్టర్ రిచర్డ్ పి. బెల్చర్ జూనియర్ జాన్ డి. మరియు ఫ్రాన్సిస్ ఎమ్. గ్విన్ పాత నిబంధన ప్రొఫెసర్ మరియు అట్లాంటా మరియు న్యూయార్క్ లోని రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరీలో అకడమిక్ డీన్ మరియు అమెరికాలోని ప్రెస్బిటేరియన్ చర్చిలో బోధనా పెద్ద. ఆయన ద ఫుల్ ఫిల్మెంట్ అఫ్ ద ప్రామిస్స్ అఫ్ గాడ్: ఆన్ ఎక్సప్లనేషన్ అఫ్ కావనెంట్ తియాలజీ, మరియు ప్రాఫెట్, ప్రీస్ట్, అండ్ కింగ్ తో సహా అనేక పుస్తకాల రచయిత.