
క్రైస్తవ జీవితం కొరకు ఒక తీర్మానం
02/06/2026
“క్రీస్తునందు” ఉండటం అంటే ఏమిటి?
09/06/2026యేసుక్రీస్తు పరలోకారోహణకు ముందు ఇచ్చిన వాగ్దానం ఏమిటి?
యేసుప్రభువు పరలోకానికి వెళ్లేముందు తన శిష్యులకు ఇచ్చిన చివరి వాగ్దానం పరిశుద్ధాత్మ గురించినది. లోకమంతటా సువార్తను చాటిచెప్పడానికి కావాల్సిన శక్తిని వారు పొందుకునేలా, వారిపైకి పరిశుద్ధాత్మ దిగివస్తాడని ఆయన సెలవిచ్చాడు (అపొస్తలుల కార్యములు 1:8). ఈ వాగ్దానం ఎలా నెరవేరిందో లూకా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పొందుపరిచాడు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ సంఘం మీదికి ఏ విధంగా దిగివచ్చాడో అక్కడ మనం చూడవచ్చు.
పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు తప్పనిసరిగా యెరూషలేముకు యాత్ర చేయవలసిన మూడు ప్రధాన పండుగలలో పెంతెకొస్తు ఒకటి (ద్వితీయోపదేశకాండము 16). పస్కా వారంలోని మొదటి విశ్రాంతి దినం తర్వాత జరుపుకునే “ప్రథమ ఫలముల పండుగ” నుండి సరిగ్గా ఏడు వారాలకు, అంటే యాభై రోజులకు ఈ పండుగ వచ్చేది; అందుకే దీనిని “వారముల పండుగ” అని కూడా పిలుస్తారు. పాత నిబంధన ఆచారం ప్రకారం, పెంతెకొస్తు వసంతకాలపు ధాన్యపు కోత ముగింపునకు గుర్తు (లేవీయకాండము 23:4-22). కాలక్రమేణా యూదులు ఈ పండుగను సీనాయి పర్వతం వద్ద ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఘట్టంతో ముడిపెట్టారు. ఐగుప్తు నుండి బయలుదేరిన యాభై రోజులకు ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని పొందుకోవడమే ఇందుకు కారణం కావచ్చు (నిర్గమకాండము 19:1).
కొత్త నిబంధన ప్రారంభంలో, యేసుక్రీస్తు మరణపునరుత్థానాల తర్వాత వచ్చిన మొదటి పెంతెకొస్తు దినాన దేవుని ప్రజలపైకి పరిశుద్ధాత్ముడు వేంచేశాడు. ఆ సమయంలో ఆత్మ దేవుడు “బలమైన గాలి వీచినట్లుగా” ఒక శబ్దంతో దిగివచ్చాడు. నిజానికి గ్రీకు, హెబ్రీ భాషల్లో “ఆత్మ”, “గాలి” అనే పదాలకు ఒకే మూలపదం ఉంటుంది; అందుకే లేఖనాలు పరిశుద్ధాత్మ శక్తిని బలమైన గాలి లేదా శ్వాసతో పోలుస్తాయి (యెహెజ్కేలు 37:1-14; యోహాను 3:8). ఆ గాలి శబ్దంతో పాటు, విభాగింపబడిన అగ్ని జ్వాలల వంటి నాలుకలు అక్కడ ఉన్న వారిలో ఒక్కొక్కరి మీద నిలిచాయి (అపొస్తలుల కార్యములు 2:3). ఇక్కడ ‘అగ్ని’ అనేది దైవ సన్నిధికి, అలాగే మెస్సీయ వాగ్దానం చేసిన పవిత్రపరిచే బాప్తిస్మానికి సూచనగా ఉంది (నిర్గమకాండము 3:1-6; లూకా 3:15-17).
నిజానికి, కొత్త నిబంధన కాలపు పెంతెకొస్తు దినానికి ముందే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు. ఎందుకంటే, ఆయనే పాత నిబంధన భక్తులకు నూతన జన్మను అనుగ్రహించి, వారిలో విశ్వాసాన్ని కలిగించాడు. ఏ నిబంధన కాలంలోనైనా సరే, ఎవరైనా సత్యదేవుని యందు విశ్వాసముంచాలంటే వారు ఆత్మ మూలముగా తిరిగి జన్మించడం (Born again) ఒక్కటే మార్గం (యోహాను 3:3). అయినప్పటికీ, పాత నిబంధనతో పోలిస్తే కొత్త నిబంధనలో ఆత్మ అనుభవం ఎంతో శ్రేష్ఠమైనది; ఎందుకంటే ఇప్పుడు విశ్వాసులందరూ దేవుని పరిచర్య నిమిత్తం ఆత్మ వరాలను పొందుకునే భాగ్యం కలిగింది.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్లో ప్రచురించబడింది.


