Why Should I Go to Church
నేను ఎందుకు సంఘానికి వెళ్లాలి?
25/12/2025
Is It OK for Christians to Grieve
క్రైస్తవులు దుఃఖించడం సరైనదేనా?
01/01/2026
Why Should I Go to Church
నేను ఎందుకు సంఘానికి వెళ్లాలి?
25/12/2025
Is It OK for Christians to Grieve
క్రైస్తవులు దుఃఖించడం సరైనదేనా?
01/01/2026

నేను దైవభక్తిగల తండ్రిగా ఎలా ఉండగలను?

How Can I Be a Godly Father?

జోయెల్ స్మిత్

తండ్రులుగా మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అనే విషయంలో లేఖనాలు దైవికమైన ఉపదేశాలతో నిండి ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ రెండు ప్రధానమైన సూచనలే దీనికి స్పష్టమైన నిదర్శనం:

“తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” (ఎఫెసీయులకు 6:4).

ఈ బోధనతో పాటు, పవిత్ర లేఖనాలు పితృత్వానికి సంబంధించి ఎన్నో సానుకూల (మంచి) మరియు ప్రతికూల (చెడు) ఉదాహరణలను మనకు అందిస్తున్నాయి. ప్రతికూల ఉదాహరణలు మన మనస్సుకు మరింత గాఢంగా తగులుతాయి. ఎందుకంటే, ఎంతో దైవభక్తిగల పురుషుల పిల్లలు సైతం తమ తండ్రుల మార్గంలో నడవకపోవడాన్ని, లేదా జీవితంలో పెద్ద వైఫల్యాలు ఎదుర్కోవడాన్ని మనం వాటిలో గమనిస్తాం. ఈ అనేక ఉదాహరణలను పరిశీలించినప్పుడు, తండ్రులు తప్పక గమనించవలసిన ఒక నమూనా ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ, పిల్లలలో తరచుగా కనిపించే, ప్రమాదకరమైన ఒకానొక పాపం, తండ్రిచేత సమయానుసారంగా సరిచేయబడి ఉంటే, బహుశా దాని ఫలితం ఇంత దురవస్థకు దారి తీసి ఉండేది కాదేమో.

ఈ పాత నిబంధన గ్రంథంలోని వృత్తాంతాలు కేవలం తల్లిదండ్రులకు ఉపదేశం ఇవ్వడం కోసమే కాక, దాని కంటే లోతైన ఉద్దేశంతో దేవునిచేత అందించబడ్డాయి. అయితే, ఆ లోతైన ఉద్దేశం కంటే ఇవి ఏ మాత్రం తక్కువ ముఖ్యమైనవి కావు. అందువల్ల, ఈ కథలు మన పిల్లలను (మరియు మనలను కూడా) దైవభక్తి వైపు ఎలా ఉత్తమంగా నడిపించాలో నేర్చుకోవడానికి మనకు హెచ్చరికలను మరియు అవకాశాలను రెండింటినీ అందిస్తున్నాయి. నిజమే, మనం మన పిల్లలకు రక్షకులం కాలేము. అయినప్పటికీ, దేవుని అపారమైన కృప ద్వారా, తండ్రులుగా మనం చొరవ తీసుకుని, వారిని సదా యేసు క్రీస్తు వైపుకు నడిపించగలం. ఆయన మనల్ని ఇప్పటికే చేసిన పాపముల నుండి మాత్రమే కాక, రాబోయే ప్రమాదకరమైన పాపముల నుండి, వాటి ఘోరమైన పర్యవసానాల నుండి కూడా రక్షిస్తాడు. ఇప్పుడు, ఈ దైవిక సత్యాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, ఆదికాండము గ్రంథంలోని కొన్ని కీలక సంఘటనలను పరిశీలిద్దాం.

ఆదాము: కయీను యొక్క కోపం

ఆదికాండము మూడవ అధ్యాయంలో ఆదాము, హవ్వ చేసిన పాపం వారి మొదటి కుటుంబంలో దాని ప్రభావాన్ని చూపించడానికి ఎంతో సమయం పట్టలేదు. వారి కుమారులు, కయీను మరియు హేబెలు పరిచయం కాగానే, వారి మధ్య ఒక కుటుంబ కలహం మొదలవుతుంది. తన అర్పణను కాక, తన సోదరుడైన హేబెలు అర్పణను దేవుడు అంగీకరించాడనే కోపం, అసూయ కయీనులో రగిలాయి. దేవుడు స్వయంగా కయీనును నేరుగా ఎదుర్కొని, అతనితో మాట్లాడినప్పటికీ, తన సోదరుడైన హేబెలును చంపడానికి కారణమైన ఆ కోపాగ్ని నుండి అతన్ని మళ్లించడానికి అది సరిపోలేదు (ఆదికాండము 4:6). అతని కోపం పరాకాష్టకు చేరి, హేబెలు హత్యకు దారితీసింది. పర్యవసానంగా, కయీను తన జీవితాంతం పారిపోవువాడుగాను, దేశదిమ్మరిగాను ఉండవలసి వచ్చింది. ఇక్కడ తండ్రులుగా మనం ముఖ్యంగా గమనించవలసిన ప్రశ్నలు ఇవి: కయీనులో ఇలాంటి కోపము, క్రోధము ఉన్నట్లు ఏవైనా సంకేతాలు ముందే కనిపించాయా? తండ్రిగా ఆదాము వాటిని సమయానుసారంగా గుర్తించి, సరిచేసి ఉండవచ్చా? సర్పము హవ్వను మోసగించినప్పుడు ఆదాము ఏమీ చేయకుండా మౌనంగా కూర్చున్నట్టుగానే, ఇక్కడ కూడా ఆదాము తన కుమారుల సంఘర్షణలో జోక్యం చేసుకున్నాడా, లేదా మౌనంగా ఉండిపోయాడా?

ఇస్సాకు: ఏశావు యొక్క ఆవేశము, యాకోబు యొక్క మోసము

లేఖనాలు మనకు చెబుతున్నట్లు, శరీరంపై వెంట్రుకలు గల ఏశావు “వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను” (ఆదికాండము 25:27). అయినప్పటికీ, తాను వేటాడిన జంతువుల వలెనే అతడు తరచుగా ఆవేశపూరితుడిగా, ఉద్రేకపరుడిగా కనిపించాడు. ఒక సందర్భంలో, పొలంలో కష్టపడి అలసిపోయి ఉన్నందున, ఒక గిన్నె చిక్కుడుకాయల కూర కోసం తన అత్యంత విలువైన జ్యేష్ఠత్వపు హక్కును తన సోదరునికి అమ్మివేయడం ఎంతమాత్రమూ తెలివైన నిర్ణయం కాదు (ఆదికాండము 25:30–34). ఆ ఒప్పందానికి అంగీకరించే ముందు, అతడు తన నిర్ణయం యొక్క పర్యవసానాలను ఏమాత్రం ఆలోచించలేదా? సంవత్సరాల తరువాత, ఏశావు అన్య స్త్రీని పెండ్లి చేసుకున్నాడు. “నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవవద్దు” అని తన తండ్రి ఇస్సాకు అతనికి స్పష్టంగా ఉపదేశించినా (ఆదికాండము 28:6), అతడు ఆ మాటను లెక్క చేయలేదు. బహుశా, తన తండ్రి పట్ల ఉన్న కోపంతో, అలాగే తన సోదరుని చేతిలో మోసపోయిన బాధకు ప్రతిగా అతడు అలా చేసి ఉండవచ్చు. అయినప్పటికీ, అన్య స్త్రీతో నివసించినందుకు, మరియు దేవుని నిబంధన ప్రజల నుండి దూరంగా జీవించినందుకు సంబంధించిన ఘోరమైన పర్యవసానాలను అతడు చివరికి భరించాల్సి వచ్చింది. ఇక్కడ, తండ్రులుగా మనకు ఎదురయ్యే ప్రశ్న: ఒకవేళ, తండ్రిగా ఇస్సాకు, ఏశావు తీసుకునే చెడు నిర్ణయాల పర్యవసానాలను అతడు ముందుగానే గ్రహించేలా ఒప్పించి ఉంటే, తరువాత సంభవించిన ఫలితాలు కూడా ఇంత ఘోరంగా ఉండేవా?

వృద్ధాప్యం వచ్చి, కంటిచూపు మందగించిన తన తండ్రి ఇస్సాకును మోసం చేయడానికి, యాకోబు మేక చర్మాన్ని ధరించి, తన అన్న దుస్తులు వేసుకున్న కథ మనందరికీ సుపరిచితమే. అయితే, తన అన్న నుండి జ్యేష్ఠత్వాన్ని మోసపూరితంగా పొందినప్పుడే, యాకోబులో మోసపూరితమైన లక్షణాలు ముందుగానే కనిపించలేదా? అతనికి తల్లిదండ్రులు పెట్టిన “మడమను పట్టుకొనువాడు” మరియు “మోసగాడు” అనే ద్వంద్వార్థం ఉన్న పేరుకు తగినట్లే అతడు జీవించలేదా? తన కవల సోదరుడైన ఏశావు తాను మోసపోయానని గ్రహించినప్పుడు, అతడు బాధతో, బిగ్గరగా ఇలా కేక వేశాడు:

“యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను కూడా తీసుకున్నాడు” (ఆదికాండము 27:36)

ఈ కథలోని గొప్ప విడ్డూరం ఏమిటంటే, ఇస్సాకు పూర్వకాలంలో అబీమెలెకు విషయంలో ఎలా మోసం చేసి, అబద్ధం చెప్పాడో, అదే విధంగా అతడు కూడా తన సొంత కొడుకు చేత మోసపోయాడు, అబద్ధానికి గురయ్యాడు (ఆదికాండము 26:7). ఒకవేళ, ఇస్సాకు తన జీవితంలోని ఆ తప్పిదాన్ని గనుక నిజాయితీగా ఎదుర్కొని ఉంటే, తన కుమారుడైన యాకోబుకు నిజాయితీ, దేవునియందు భయభక్తులు, దేవుని నమ్మకత గురించి ఎంత విలువైన పాఠాన్ని నేర్పించి ఉండేవాడు!

యాకోబు: దీనా యొక్క అసంతృప్తి మరియు యోసేపు యొక్క అహంకారము

లేఖనాలలో పేరు చెప్పబడిన యాకోబు యొక్క ఏకైక కుమార్తె దీనా. ఆమె “ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను” అని ఆదికాండము చెబుతోంది (ఆదికాండము 34:1). ఆ దేశం అనేది షెకెము అనే అన్యజనుల పట్టణం, అనగా దైవ భక్తి లేని ప్రాంతం. తన ఇంటిని, దేవుని నిబంధన ప్రాంతాన్ని విడిచి, పక్కనున్న ఆ అన్య పట్టణంలోని స్త్రీల నుండి ఏదో కొత్తదాన్ని అన్వేషించాలని ఆమెను ప్రేరేపించినది ఏమిటి? ఆమె హృదయంలోని అసంతృప్తి లేదా దేవుని నుండి దృష్టి మరలిన వైఖరి ఆ నిర్ణయానికి దారితీసిందా? కానీ షెకెములో, ఆమెను ఆ పట్టణపు యువరాజు బలవంతంగా చెరిచి, తనను తాను పూర్తిగా అనుభవించినప్పుడు, ఆ అన్య దేశం యొక్క భయంకరమైన దుష్టత్వాన్ని ఆమె తెలుసుకుంది. ఇక్కడ తండ్రిగా యాకోబు పాత్ర ప్రశ్నార్థకం అవుతుంది: యాకోబు తన సొంత జీవిత సమస్యలు, ఆలోచనలతో మరీ ఎక్కువగా నిమగ్నమై ఉండి, తన కుమార్తె మనసులో ఉన్న ఆ తపనను, లోకంపట్ల ఉన్న దృష్టి తారతమ్యాన్ని గమనించలేదా? తన కూతురు ఎందుకు బయలుదేరిందో, ఆమె హృదయ స్థితి ఏమిటో గుర్తించలేకపోయిన తండ్రి యొక్క నిర్లక్ష్యం లేదా జాగ్రత్త లేమి, చివరికి ఆమెకు ఈ భయంకరమైన దుర్మార్గపు చర్యను అనుభవించడానికి దారి తీసిందా?

యువకుడైన యోసేపుకు రెండు కలలు వచ్చాయి: ఒకటి తాను ఉన్నత స్థానంలో ఘనపరచబడినట్లు, మరొకటి తన సహోదరులంతా తన పాదాల వద్ద వంగి నమస్కరించినట్లు. ఈ కలలు అతని సహోదరులలోని కోపాన్ని మరియు అసూయను మరింతగా రగిలించాయి. అయితే, ఈ కలల గురించి వారికి ఎలా తెలిసింది? యోసేపు స్వయంగా వారితో చెప్పడం ద్వారానే వారికి తెలిసింది. అతని ఈ ప్రవర్తన కేవలం యౌవన అపరిపక్వతయేనా, లేక అతని హృదయంలో దాగి ఉన్న అహంకారమా? బహుశా, అతని తండ్రి యాకోబు యోసేపు పట్ల చూపించిన పక్షపాతం ఆ గర్వాన్ని మరింతగా పెంచి ఉండవచ్చు (ఆదికాండము 37:3). తన తల్లిదండ్రులు, సోదరుడైన ఏశావు విషయంలో తనకు ఎదురైన పక్షపాతం వల్ల కుటుంబంలో ఎంత విభేదం, బాధ కలిగిందో యాకోబు స్వయంగా అనుభవించాడు. అయినప్పటికీ, ఆ పాఠాన్ని అతను నేర్చుకోలేదా? తన కుమారుడు యోసేపును ప్రత్యేకంగా ప్రేమించి, మిగతా కుమారులను నిర్లక్ష్యం చేయడం ద్వారా, తాను అనుభవించిన అదే విభేదాన్ని తిరిగి తన ఇంటిలోనే మళ్లీ రగిలించలేదా?

తండ్రులకు ఒక పిలుపు

సమయం అనుమతిస్తే, మనమంతా ఈ అధ్యయనాన్ని మనోహ మరియు సమ్సోను, ఏలీ మరియు అతని కుమారులు, సమూయేలు మరియు అతని కుమారులు, లేదా దావీదు మరియు అబ్షాలోము వంటి కథల వరకు కూడా విస్తరించవచ్చు. అయితే, నా ఉద్దేశం తండ్రులపై తీర్పు చెప్పడం ఎంతమాత్రమూ కాదు, లేదా కేవలం "అలా జరిగి ఉండి ఉంటే ఎలా ఉండేది?" అనే ఊహాత్మక ప్రశ్నలతో సమయం గడపడం కూడా కాదు. దేవుడు తన విమోచన ప్రణాళిక కొరకు, ఈ తండ్రుల మరియు పిల్లల పాపభరిత పరిస్థితులను కూడా ఉపయోగించుకున్నాడు. ఈ సత్యం ఒక మహత్తరమైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది అదేమిటంటే, ఆయన కృప నిజంగా మన పాపాలన్నింటికంటే ఎంతో గొప్పది అని నిరూపిస్తుంది.

ఈ చర్యలన్నిటిపై దేవునికి సార్వభౌమాధికారం ఉన్నప్పటికీ, ఆ వ్యక్తులు అనుభవించిన బాధ, పర్యవసానాలు ఏ మాత్రం తగ్గవు. అలాగే, కుటుంబాలుగా మనం అనుభవించే పాపం యొక్క వినాశకరమైన పర్యవసానాలు కూడా ఏ మాత్రం తగ్గవు. పైన పేర్కొన్న పాపాలన్నీ పూర్తి జాబితా కాకపోయినప్పటికీ అవి కేవలం గతకాలపు పాపాలు మాత్రమే కావు. అవి నేడు మన పిల్లలలో (మరియు తరచుగా తండ్రులుగా మనలో కూడా) ఎల్లప్పుడూ కనిపిస్తాయి. మన పిల్లలలో అటువంటి పాపపు స్వభావం, చెడు ఆకర్షణలు, లేదా తిరుగుబాటు లక్షణాలు మనం చూసినప్పుడు, తండ్రులు మౌనంగా కూర్చుండిపోకూడదు, తమ పిల్లలకు ఏమీ చెడు జరగదని ఆశించకూడదు. పైన చెప్పబడిన కథలు అలా జరిగే అవకాశం లేదని, అది ఎంత ప్రమాదకరమో స్పష్టంగా సూచిస్తున్నాయి. దానికి బదులుగా, మనం మన పిల్లల హృదయాలను, మనస్సులను సత్యముతో నిమగ్నం చేయాలి. వారు పాపం చేసినప్పుడు, క్షమాపణ మరియు పశ్చాత్తాపము ద్వారా వారిని ప్రేమతో నీతి మార్గంలోకి తిరిగి తీసుకురావాలి. విశ్వాస మార్గంలో మన పిల్లలకు కాపరులుగా మరియు మార్గదర్శకులుగా ఉండాలని తండ్రులుగా మనం దేవునిచే పిలువబడ్డాము. యెషయా ప్రవక్త చెప్పిన ఈ స్వరంలా మనం మన పిల్లలకు ఉండగలుగుదాం:

“మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను –ఇదే త్రోవ దీనిలో

నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.”  (యెషయా 30:21)

అయినప్పటికీ, పరిశుద్ధ బైబిల్లో పితృత్వ సంబంధాలకు సంబంధించిన అన్ని మానవ ఉదాహరణలను మనం చూస్తున్నప్పుడు, ఒక పరిపూర్ణమైన తండ్రీ-కుమారుల సంబంధాన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. ఆ సంబంధం ఎప్పుడూ పడిపోలేదు, ఎప్పుడూ తొట్రుపడలేదు, మరియు ఎన్నటికీ విఫలం కాదు. తండ్రిగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే మన ప్రయత్నాలన్నిటికీ మించి, మనం నిత్యం దేనిలో విశ్రాంతి పొందాలంటే – అది క్రీస్తులో సాధించబడిన, సంపూర్తి చేయబడిన పనిలోనే! ఆయన మరణం వరకు కూడా తన తండ్రికి సంపూర్ణంగా విధేయుడుగా లోబడ్డాడు. ఆ పరిపూర్ణ తండ్రీ-కుమారుల సంబంధం నుండే మనకు – తండ్రులుగా – సమస్తమైన కృప, దయ, మరియు బలం లభిస్తున్నాయి. దైవభక్తిలో మనం వృద్ధి చెందడానికి, మన కుటుంబాలు కూడా అదే మార్గంలో వృద్ధి చెందాలని కోరుకోవడానికి ఆ దైవ బలం మనకు స్థిరమైన ఆధారం.

ఈ వ్యాసం క్రైస్తవ శిష్యత్వం యొక్క ప్రాథమిక అంశాలు అనే సేకరణలో భాగం.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

      1.        

జోయెల్ స్మిత్
జోయెల్ స్మిత్
రెవ. జోయెల్ ఈ. స్మిత్ గారు జార్జియాలోని స్ముర్నలో ఉన్న స్ముర్న ప్రెస్బిటేరియన్ చర్చిలో సీనియర్ పాస్టర్‌గా సేవ చేస్తున్నారు.