
మహిమ కోసం అన్వేషణ
26/02/2026
ఆత్మ ఫలం అంటే ఏమిటి?
05/03/2026మెరుగైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటానికి 3 మార్గాలు
తమ ప్రార్థన జీవితం పట్ల సంపూర్ణ సంతృప్తితో ఉన్న క్రైస్తవుడు నాకు ఎక్కడా తారసపడలేదనే నేను అనుకుంటున్నాను. బహుశా మీకు కూడా ఈ అనుభవం ఉండే ఉంటుంది: మీరు ప్రార్థించడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ మాటలు పైకప్పును కూడా దాటలేక గాలిలో కలిసిపోతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మనసులో ఒక సందేహం తలెత్తుతుంది, “దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా, లేక నాకు నేనే మాట్లాడుకుంటున్నానా?” అని. దీనికి తోడు, ప్రార్థనలో ఎదురయ్యే ఆ మొద్దుబారిన నిస్సత్తువ మరొకటి. మనం మెలకువగా ఉండి ప్రార్థించాలని ప్రయత్నిస్తాము కానీ, నాటి యేసు శిష్యుల మాదిరిగానే, కళ్ళు మూసుకుని “ప్రియమైన ప్రభువా…” అని అనగానే ఏదో నిద్రమాత్ర వేసుకున్నట్టుగా గాఢనిద్ర మనల్ని ముంచెత్తుతుంది. ఒకవేళ నిద్ర రాకపోయినా, రేపటి గురించిన చింతలు మనల్ని పక్కదారి పట్టిస్తాయి. దేవుని సన్నిధిలో విన్నపంగా మొదలైన ప్రార్థన, కొద్దిసేపటికే మన తోటి ఉద్యోగితో మనసులో జరిపే సంభాషణగా మారిపోతుంది. అయ్యో! అప్పుడు మనలో ఒక నిరాశ ఆవహిస్తుంది: “ప్రార్థన చేయడంలో నేను ఎందుకింత బలహీనుడిని?” అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం.
నిజానికి, మనం తరచుగా ప్రార్థనను ఉండాల్సిన దానికంటే కష్టతరం చేసుకుంటాం. ప్రార్థనను ఒక ఆత్మీయ ‘వ్యాయామం’ లాగా భావించండి. వ్యాయామం చేయాలని మనకు ఎల్లప్పుడూ అనిపించకపోవచ్చు; కొన్నిసార్లు చేసిన వ్యాయామం ఎంతో సంతృప్తిని ఇస్తుంది, మరికొన్నిసార్లు అలా అనిపించదు. వ్యాయామంలో క్రమబద్ధత ఉన్నప్పుడే ఫలితాలు కనిపిస్తాయి. అయితే, ఆ వ్యాయామం చేసేటప్పుడు సరైన పద్ధతిని పాటించడం, అలాగే ఆశించే ఫలితాల పట్ల వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. మీ ‘ప్రార్థన’ అనే ఆత్మీయ కండరాన్ని బలపరచుకోవడానికి ఇక్కడ కొన్ని సాధారణమైన సూచనలు ఉన్నాయి:
1. మారుమనస్సు పొందుడి
మొట్టమొదటిది, మారుమనస్సు పొందండి. తిరుగుబాటు చేసే హృదయాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే వేషధారణ ప్రార్థనల పట్ల దేవుడు ఏమాత్రం ఆసక్తి చూపడు. యేసుక్రీస్తు కొండమీద ప్రసంగంలో తన శిష్యులకు “పరలోక ప్రార్థనను” నేర్పించడానికి ముందు, ప్రార్థన ఎలా చేయకూడదు అనే అంశంపై వరుసగా కొన్ని సూచనలు ఇవ్వడం కేవలం యాదృచ్ఛికం కాదు. సంక్షిప్తంగా చెప్పాలంటే, ప్రార్థనలో వేషధారణతో ఉండటాన్ని, అలాగే ప్రార్థనను ఒక మూఢనమ్మకంలా మార్చుకోవడాన్ని యేసు ఖండించాడు (మత్తయి 6:5-8).
కొన్నిసార్లు మనం దాక్కోవడానికి ప్రార్థనను ఒక ముసుగులా వాడుకుంటాం. మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నప్పటికీ, పెదవులతో మాత్రం సరైన మాటలనే పలుకుతాం. ప్రార్థన అనేది దేవుని ఎదుట మనల్ని మనం నీతిమంతులుగా నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నం కాదు, అలాగే ఇతర క్రైస్తవ విశ్వాసుల ముందు మన భక్తిని ప్రదర్శించుకునే సాధనమూ కాదు. కపటత్వంతో కూడిన ప్రార్థనల అంతరంగాన్ని దేవుడు స్పష్టంగా చూడగలడు. యెషయా గ్రంథంలో తన నిబంధన ప్రజలతో దేవుడు ఇలా సెలవిచ్చాడు:
““మీరు మీ చేతులు చాపునప్పుడు,
మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును;
మీరు బహుగా ప్రార్థనచేసినను,
నేను వినను;
మీ చేతులు రక్తముతో నిండియున్నవి.” (యెషయా 1:15; సామెతలు 15:29 కూడా చూడండి)
“పాపంలో జీవించడం కంటే ప్రార్థన అనే ప్రవాహాన్ని వేగంగా ఎండగట్టేది మరొకటి లేదు. మీరు ప్రార్థనలో దేవునితో సహవాసం చేయడానికి ముందు, మీ పాపాలను ఆయన ఎదుట ఒప్పుకోవడానికి సమయం కేటాయించండి. మీ ప్రార్థనలకు అడ్డుపడుతున్న ఆ ఆటంకం మరెక్కడో లేదు, అది మీ స్వహస్తాలతో చేసిన పనుల్లోనే ఉందని మీరు అప్పుడు గ్రహించవచ్చు.
2. దేవుడు ఎవరనేది గుర్తుంచుకోండి
రెండవదిగా, దేవుడు ఎవరనేది గుర్తుంచుకోండి. ప్రభువు నేర్పిన ప్రార్థన “పరలోకమందున్న మా తండ్రీ” అనే మాటలతో ప్రారంభమవుతుంది. గ్రీకు కొత్త నిబంధన మూల భాషలో “తండ్రి” అనే పదం వాక్యం మొదట్లో వస్తుంది. దేవుడిని “తండ్రీ!” అని పిలిచే హక్కు మనుషులందరికీ సహజంగా లభించేది కాదు; కేవలం యేసుక్రీస్తు చేసిన సిలువ కార్యము ద్వారా దేవుని కుటుంబంలోకి దత్తత తీసుకోబడిన వారికి మాత్రమే ఆ హక్కు ఉంటుంది. అపొస్తలుడైన పౌలు ఈ సత్యాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు: “ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము – ‘అబ్బా, తండ్రీ’ అని మొరపెట్టుచున్నాము” (రోమా 8:15).
తండ్రి అయిన దేవుని యొద్దకు మీకు లభించిన ఈ విశిష్టమైన ప్రవేశం, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే లభించిందని గుర్తుంచుకోండి. పాపులమైన మనం, పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి ధైర్యంతో ప్రార్థించడానికి వెళ్ళగలిగేలా యేసుక్రీస్తు ప్రభువు ఎంతటి అద్భుతమైన మార్గాన్ని సిద్ధపరిచారో కదా! (హెబ్రీ 4:16 చూడండి). దేవుడు మన పక్షాన చేసిన కార్యాలను స్మరించుకోవడం వల్ల, ఆయనకు ప్రియమైన బిడ్డలమనే మన గుర్తింపులో నెమ్మదిని పొందేందుకు సహాయపడుతుంది. అంతేకాదు, మన ప్రార్థనలను ఆయన ఏదో భారంగా భరిస్తున్నాడని కాక, ఒక మంచి తండ్రి తన పిల్లల మొరను ఎంత వాత్సల్యంతో ఆలకిస్తాడో, అలాగే ఆయన మన విన్నపాలను వినాలని ఆశపడుతున్నాడనే నిశ్చయతను ఇది మనకు ఇస్తుంది (మత్తయి 7:11).
3. పదే పదే ప్రార్థించండి
చివరిగా, పదే పదే ప్రార్థించండి. ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనో, లేదా మీకు ప్రార్థన చేయాలని అనిపించినప్పుడు మాత్రమే ప్రార్థిస్తే, మీరు ఎప్పటికీ స్థిరమైన ప్రార్థన జీవితాన్ని పెంపొందించుకోలేరు. ప్రార్థనను ఒక అలవాటుగా మార్చుకోవడం అంటే ప్రతిరోజూ, బహుశా కొన్ని నిర్ణీత సమయాల్లో దేవుని యొద్దకు రావాలని ఒక బలమైన సంకల్పాన్ని కలిగి ఉండటం. వ్యర్థమైన మాటలు పదే పదే వల్లించడాన్ని యేసు ఖండించినప్పటికీ, పదే పదే విన్నవించుకోవడాన్ని ఆయన తప్పుపట్టలేదు. ఆ విధవరాలు “నిత్యము రావడం” ద్వారా చూపిన పట్టుదలను యేసు ఎంతగా అభినందించాడో గుర్తు తెచ్చుకోండి (లూకా 18:5). పరలోక ద్వారాలను మీ ప్రార్థనలతో తట్టండి; ఆ తలుపులు తెరుచుకునే వరకు వదలని దీక్షతో పోరాడండి. మీరు నిరుత్సాహానికి గురైనప్పుడు, యోహాను చెప్పిన ఈ మాటలను గుర్తుంచుకోండి: “ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే” (1 యోహాను 5:14).
మీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలని, ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరచాలని, మరియు మిమ్మల్ని మరింతగా క్రీస్తు స్వరూపంలోకి మలచాలని మీరు ప్రార్థిస్తున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి – మీరు తట్టే తలుపులు తీయబడకుండా ఉండవు, మీ విన్నపాలు నిరాకరించబడవు. యేసుప్రభువు తన శిష్యులకు “అనుదిన ఆహారం” కోసం ప్రార్థించమని నేర్పించారంటే, దాని అర్థం ఆయన ప్రతిరోజూ మీ నుండి విన్నపాలను ఆశిస్తున్నాడని, అవును, ప్రతిరోజూ ఆయన మీ మొర వినాలనుకుంటున్నాడని అర్థం (మత్తయి 6:11).
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


