
మెరుగైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటానికి 3 మార్గాలు
03/03/2026
కాల్వినిజం అంటే ఏమిటి?
10/03/2026ఆత్మ ఫలం అంటే ఏమిటి?
అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 వచనాలలో పేర్కొన్న తొమ్మిది రకాల సద్గుణాల సమాహారమే ‘ఆత్మ ఫలం’. మానవ ఉనికి యొక్క నిరాశాజనకమైన మరియు అసహ్యకరమైన పరిస్థితిని చూపించే పాపపు దుర్గుణాల సుదీర్ఘ జాబితాకు అంటే “శరీర కార్యాలకు” పూర్తి భిన్నంగా పౌలు ఈ సద్గుణాలను మనకు పరిచయం చేస్తున్నాడు (గలతీ 5:19-21). ఆ శరీర కార్యాలలో క్రోధము, కలహము, మత్సరము వంటివి ఉన్నాయి. వీటికి పూర్తి భిన్నంగా, “ఆత్మ ఫలమేమనగా: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.” క్లుప్తంగా ఉన్న ఈ జాబితా క్రైస్తవులుగా మన అస్తిత్వానికి (మనం ఎవరో), మన అనుదిన ప్రవర్తనకు దిక్సూచి వంటిది. ఈ గుణాలను పరిశీలిస్తే అవి మూడు దిశలలో మన జీవితాలను ప్రభావితం చేస్తాయని అర్థమవుతుంది. దేవునితో మనకున్న సంబంధాన్ని వివరించేవి: ప్రేమ, సంతోషము, సమాధానము. ఇతరులతో మనకున్న సంబంధాలను ప్రతిబింబించేవి: దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. మన అంతర్గత స్వభావాన్ని లేదా హృదయ ధోరణిని తెలిపేవి: విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. వాస్తవానికి, ఈ సద్గుణాలన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకొని (overlap) ఉన్నప్పటికీ, ఒక్కొక్కటి ఏయే అంశాలపై ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయో గమనించడం మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
“క్లుప్తంగా చెప్పాలంటే, ఈ లోక రీతికి భిన్నంగా ఒక క్రైస్తవుని ఆలోచనా విధానం, మాట తీరు, ప్రవర్తన మరియు అంతరంగ వాంఛలు ఏ విధంగా ఉండాలో ‘ఆత్మ ఫలం’ మనకు స్పష్టం చేస్తోంది. అయితే, ఈ సద్గుణాలు ఏమిటో తెలుసుకోవడమే కాకుండా, ఇవి మనలో అసలు ఎలా పనిచేస్తాయి మరియు ఎలా కార్యరూపం దాల్చుతాయి అని అడగడం బహుశా అన్నింటికంటే ముఖ్యమైన విషయం. దీనికి సమాధానం దొరకాలంటే, ఈ కృపాతిశయాలను వివరించడానికి ఉపయోగించిన ‘ఆత్మ’ మరియు ‘ఫలం’ అనే రెండు కీలక పదాలను మనం మరింత లోతుగా పరిశీలించాలి.”
మొదటగా, మరియు అన్నింటికన్నా ముఖ్యంగా, అపొస్తలుడైన పౌలు ఈ గుణాలను ఆత్మ ఫలమని పిలుస్తున్నాడనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవి మన సొంత బలంతో లేదా మన సొంత ప్రయత్నంతో సాధించాలని దేవుడు మనపై మోపిన ప్రమాణాలు కావు. ఇవి కేవలం దేవుని ఆత్మ మనలో ఉత్పన్నం చేసే సత్యాలు. ఆత్మ ఫలం అనేది చేయవలసిన పనుల జాబితా కాదు. ఇది విశ్వాసులపై దేవుడు మోపిన భారం కంటే కూడా, క్రీస్తు ఆత్మను పొందినవారి విషయంలో ఏది వాస్తవంగా నెరవేరుతుందో దేవుడు చేసే ఒక ప్రకటన వంటిది. ఆత్మ ఫలం గురించి చెప్పిన వెంటనే వచ్చే వచనాలలో ఈ ప్రకటన మరింత స్పష్టంగా కనిపిస్తుంది; ‘క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు’ అని పౌలు రాశాడు (గలతీ 5:24).” మరో మాటలో చెప్పాలంటే, ఆత్మ ఫలం అనేది క్రీస్తు సిలువపై మన కోసం సాధించిన విజయ సారాన్ని ఆస్వాదించమని మనకు ఇచ్చే పిలుపు. ఆ సిలువ ద్వారా ఆయన శరీర కార్యాలను లయం చేసి, తన పరిశుద్ధతలో మనకు పాలుపంపులు దయచేశాడు. క్రీస్తునందు మాత్రమే లభించే ఆ ‘పరిశుద్ధీకరణను’ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల హృదయాలలో జీవం పోసి ఫలింపజేస్తున్నాడు. ఆత్మ ఫలాన్ని వేరే ఏ కోణంలో అర్థం చేసుకున్నా, దేవునితో మనకున్న సంబంధం ‘క్రియల’ మీద ఆధారపడిన ఒక భారమైన యాతనగా మారిపోతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి: ఇది ‘ఆత్మ ఫలం’, అంతేకానీ క్రైస్తవుని సొంత క్రియల ఫలితం కాదు.
పరిశుద్ధీకరణ ప్రక్రియ గురించి ‘ఫలం’ అనే ఈ రూపకం మనకు ఎంతో లోతైన పాఠాలను నేర్పుతుంది. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ‘ఫలాలు’ (బహువచనం) అని అనకుండా, ‘ఫలము’ అని ఏకవచన రూపంలో సంబోధించడం గమనార్హం. ఇది రూపంలో ఏకవచనమైనప్పటికీ, అర్థంలో మాత్రం సామూహిక నామవాచకంగా ఉండి అనేక సద్గుణాల సమాహారాన్ని సూచిస్తుంది. దీని ప్రాముఖ్యత ఏమిటి? దేవుడు మనలో పెంపొందించే ఈ సద్గుణాలన్నీ ఒకదానికొకటి సంబంధం లేని విడివిడి భాగాలు కావు; ఇవన్నీ కలిసి మనల్ని దేవుని కుమారుడైన క్రీస్తు స్వరూపంలోనికి మార్చే ఒకే ఒక మహత్తర లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి (రోమా 8:29). కాబట్టి, ఒక క్రైస్తవుడిలో ఈ ఆత్మ ఫలానికి సంబంధించిన కొన్ని గుణాలు మాత్రమే ఉండి, మరికొన్ని పూర్తిగా లేకపోవడం అనేది జరగదు.
మన చుట్టూ ఉన్న విశ్వాసులలో కొందరు ఇతరులకంటే ఎక్కువ ప్రేమగానో లేదా దయగానో కనిపించవచ్చు; కానీ క్రీస్తును కలిగిన ప్రతి విశ్వాసిలో ఈ సద్గుణాలన్నీ ఏదో ఒక మోతాదులో తప్పక ఉండి తీరుతాయి. ఎందుకంటే మనం క్రీస్తులో కేవలం కొంత భాగాన్ని మాత్రమే పొందలేదు, సంపూర్ణ క్రీస్తునే కలిగి ఉన్నాము. ఆయనే ఈ సద్గుణాలన్నింటికీ పరిపూర్ణ రూపం మరియు నెరవేర్పు. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చక్కని ఉదాహరణ: ఈ సద్గుణాలను కిరీటంలో పొదిగిన వేర్వేరు రత్నాలుగా కాకుండా, ఒకే వజ్రానికి ఉన్న విభిన్న కోణాలుగా (Facets) భావించవచ్చు. ఏ వైపు నుండి చూసినా ఆ వజ్రం యొక్క మెరుపు మరియు అందం ఎలాగైతే కనిపిస్తుందో, ఈ గుణాలు కూడా అలాగే క్రీస్తు అందాన్ని మనలో ప్రతిబింబిస్తాయి. ఆత్మను కలిగి ఉండటం అంటే క్రీస్తును కలిగి ఉండటమే (రోమీ 8:9); క్రీస్తును కలిగి ఉన్నామంటే అర్థం అన్ని విషయాల్లో ఆయనలా మారడం ప్రారంభించడమే.
ఈ రూపకం నుండి మనం గ్రహించవలసిన పాఠం ఇంకొకటి ఉంది. ఉదాహరణకు, మీరు ఆపిల్ తోటను పండించాలనుకుంటే, మీ పెరట్లో విత్తనాలు నాటి, మరుసటి రోజు ఉదయానికల్లా కోతకు సిద్ధంగా ఉన్న పండ్ల తోటను చూడాలని ఆశించరు కదా? మన పరిశుద్ధీకరణ ప్రక్రియ కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. ఇందులో మనం తక్షణ ఫలితాలను ఆశించకూడదు; బదులుగా, కాలక్రమేణా దేవుని ఆత్మ ద్వారా కలిగే నిలకడైన, స్థిరమైన ఎదుగుదల కోసం వేచి చూడాలి. మన జీవితాల్లో దేవుని కృపాతిశయాలు ఒక ‘ఫలం’ వలె ఫలిస్తాయనే ఈ సత్యం, యథార్థవంతుడైన ప్రతి విశ్వాసిలో రెండు ముఖ్యమైన లక్షణాలను పెంపొందించాలి: అవి కృప మరియు నిరీక్షణ.
దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు రెండు: మొదటిది, దేవుడు మన నుండి ఆశించే పరిపూర్ణత మనలో కానీ, తోటి విశ్వాసులలో కానీ వెంటనే కనిపించనప్పుడు మనం ఒకరిపట్ల ఒకరం కృపతో మెలగాలి. మనమందరం దేవుని చేతిలో రూపుదిద్దుకుంటున్న వారమే. “మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి” (2 పేతురు 3:18) అన్న లేఖన పిలుపు మేరకు, ఈ ఆత్మీయ ఎదుగుదలకు తగినంత సమయం పడుతుందని మనం గుర్తించాలి. రెండవది, ప్రస్తుతం మన జీవితాల్లో ఏ సద్గుణాలు అయితే లోపించాయని మనం భావిస్తున్నామో, అవి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేరుతాయని నిరీక్షణతో కూడిన భరోసాను కలిగి ఉండాలి. దేవుని ఆత్మపై మరియు ఆయన మనకిచ్చిన కృపా సాధనాలపై మనం ఆధారపడినప్పుడు, నిశ్చయంగా మార్పు చెందుతాము. ఎందుకంటే, ” మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని తుదముట్టించును” (ఫిలిప్పీ 1:6) అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నాటిన ఏ విత్తనమైనా సరే, అది తప్పక అంకురించి ఫలిస్తుంది. ఆయన సంరక్షణలో పెరుగుతున్న ఏ ఫలమూ తీగ పైన వాడిపోదు; అది పరిపక్వత చెంది తీరుతుంది.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


