War and Peace with a Holy God
పరిశుద్ధుడైన దేవునితో యుద్ధం మరియు సమాధానం
24/02/2026
3 Ways to Have a Better Prayer Life
మెరుగైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటానికి 3 మార్గాలు
03/03/2026
War and Peace with a Holy God
పరిశుద్ధుడైన దేవునితో యుద్ధం మరియు సమాధానం
24/02/2026
3 Ways to Have a Better Prayer Life
మెరుగైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటానికి 3 మార్గాలు
03/03/2026

మహిమ కోసం అన్వేషణ

The Quest for Glory

మహిమను పొందాలనే తపన మనల్ని అమితంగా ప్రేరేపిస్తుంది. ఆ మహిమ మనకు అందేంత దూరంలో ఉందని అనిపించినప్పుడు, మనం మరింత పట్టుదలతో శ్రమిస్తాం, మరికొంత దూరం పరుగెత్తుతాం. ఆ ఘనతను దక్కించుకోవడం కోసం మన వ్యక్తిగత సౌకర్యాలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడం. “ప్రయాస లేనిదే ప్రతిఫలం ఉండదు” అని మనల్ని మనం ఉత్తేజపరుచుకుంటూ, ప్రతి అడ్డంకిని అధిగమించడానికి పోరాడతాం. మన జీవితానికి ఒక సార్థకత ఉండాలని, మన ఉనికికి ఒక అర్థం ఉండాలని మనమందరం ఆశిస్తాం. ఏదో ఒక గొప్ప లక్ష్యం కోసం మనం పడిన ప్రయాసను ఇతరులు గుర్తించాలని, మనల్ని అభినందించాలని కోరుకోవడం మానవ సహజం. 

మహిమ కోసం మనలో ఇంతటి గాఢమైన తృష్ణ ఉండటానికి ఒక బలమైన కారణం ఉంది. మనం మహిమ కోసమే సృష్టించబడ్డామని దేవుని వాక్యం మనకు వెల్లడిస్తోంది.  ఆయన తన పరిశుద్ధతలోని గొప్పతనాన్ని మనం గ్రహించి, ఆశ్చర్యముతో ఆయన ఎదుట సాగిలపడాలనే ఉద్దేశంతోనే మన శరీరాలను నిర్మించి, తన జీవవాయువును మనలో ఊదాడు. ఆయన మంచితనం మన హృదయాలపైన, మనస్సులపైన ఎంతటి గాఢమైన ముద్ర వేయాలంటే, మనం సంపూర్ణ విధేయతతో, ఆనందంగా ఆయనను ఆరాధించాలి. ఆ విధంగా, సృష్టికర్త అయిన దేవుని అద్భుతమైన మహిమను ప్రతిబింబించే ప్రతిరూపాలుగా మనం జీవించాలన్నదే ఆయన సంకల్పం.

కానీ, ఒక్కసారి మన చుట్టూ ఉన్న లోకాన్ని గమనించండి. ఈ లోకం దేవుని పరిశుద్ధ మహిమతో ప్రకాశిస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? దుష్టత్వం ఈ ప్రపంచాన్ని ఎంతగా వికృతం చేసిందో బహుశా మీరు గమనించే ఉంటారు. మన కళ్ళముందు కన్నీరు, వేదన, ద్వేషం, వంచన మరియు మరణం తాండవిస్తున్నాయి. మనం దేవుని మహిమను అనుభవించడానికి, ఆయన స్వరూపంలో సృష్టించబడిన వారమైతే, అసలు ఈ విపత్తు ఎలా సంభవించింది? అసలు తప్పు ఎక్కడ జరిగింది?

దేవుని వాక్యం ఇచ్చే సమాధానం నేరుగా మన హృదయాల వైపే వేలెత్తి చూపుతోంది. మనం దేవునిపై ఆధారపడుతూ, ఆయనను మహిమపరచడం కోసమే సృష్టించబడ్డాము. కానీ, దానికి భిన్నంగా మన స్వంత మహిమను వెతకడానికే మనం మొండిగా ప్రయత్నిస్తాం. దేవుని చిత్తానికి బదులుగా మన స్వంత కోరికలను ప్రతిష్ఠించుకుని, మనకంటూ ఒక పేరు సంపాదించుకోవడానికి ఉరకలు వేస్తాం. దీనినే బైబిల్ ‘పాపం’ అని పిలుస్తుంది. ఇది మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశ్యానికి మనం చూపే తిరుగుబాటు. దేవుని గొప్పతనంలో సంతృప్తిని వెతకడానికి బదులు, మన అశాశ్వతమైన బలహీనతల్లోనే తృప్తిని కనుగొనమని పాపం మనల్ని శోధిస్తుంది. పొరపాటున, మనం మన గుర్తింపులోనో, మన వృత్తిలోనో లేదా మన కలలలోనో శాశ్వతమైన మహిమ దొరుకుతుందని భ్రమపడతాము. కానీ ప్రతిసారీ మనకు మిగిలేది రిక్తహస్తాలే; మన ఆత్మలు అసంతృప్తితో అలమటిస్తూనే ఉంటాయి. అంతటితో ఆగక, మన పాపం దేవుని దృష్టికి రాకుండా పోదు గనుక మనం ఆయన తీర్పుకు లోనవుతున్నాం.  ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన సత్యాన్ని విసర్జించి, మన స్వంత ప్రగల్భాలను స్థాపించుకోవడానికి ప్రయత్నించినందుకు మనం దేవుని ఎదుట నేరస్థులుగా నిలబడ్డాము. ఈ పాపానికి దేవుడు నిర్ణయించిన శిక్ష అత్యంత భయానకమైనది: అదే మరణం మరియు నిత్యకాలం దేవుని సన్నిధికి దూరమైపోయే దౌర్భాగ్యం.

అయితే, సువార్త సందేశం అద్భుతమైన మహిమతో నిండిన శుభవార్త! దేవుని వాక్యం ఇలా ప్రకటిస్తోంది: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16). దేవుని పరిపూర్ణ కుమారుడైన యేసుక్రీస్తు, నరరూపిగా ఈ లోకానికి విచ్చేశారు. ఆయన మనలాగే మనుష్య రూపం దాల్చినప్పటికీ, మానవ స్వభావానికి అంటిన పాపం ఆయనలో ఏమాత్రం లేదు. ఆయన మనుష్యుల మధ్య జీవించినా, మన అవిధేయతలో గానీ, తిరుగుబాటులో గానీ ఆయన పాలిభాగస్థుడు కాలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలోనూ, ఆయన నామాన్ని మహిమపరచడంలోనూ క్రీస్తు ఎన్నడూ వెనుకాడలేదు, తడబడలేదు. దేవుని మహిమను ఈ భూమిపై పరిపూర్ణంగా ప్రతిబింబించిన ఏకైక వ్యక్తి ఆయనే.

పరిశుద్ధ లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి: యేసుక్రీస్తు “మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను” (ఫిలిప్పీ 2:8). తన తండ్రి పట్ల ఆయనకున్న ఆ అచంచలమైన విధేయత, చివరకు ఆయనను అత్యంత అవమానకరమైన ఆ సిలువ మరణం వైపు నడిపించింది. పరిపూర్ణ నీతిమంతుడైన ఆయన, అపరాధిగా సిలువపై అంతం కావడానికి గల కారణం ఏమిటి? అసలు ఇది ఎందుకు జరగాల్సి వచ్చింది?

దానికి సమాధానం ఇదే: మనకు రావలసిన ఆ భయంకరమైన శిక్షావిధిని యేసుక్రీస్తు తనపై వేసుకున్నాడు. మనం జీవించాలనే ఉద్దేశంతో, ఆయన మనకు బదులుగా మరణాన్ని రుచిచూశారు. మనం అనుభవించాల్సిన దండనను ఆయన భరించాడు; మనం క్షమాపణ పొందేలా మన పాపభారాన్ని ఆయన మోశాడు. దేవుని సముఖంలో మనం అంగీకరించబడాలని ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. మనం మన పాపాలను ఒప్పుకొని, ఆయనలో విమోచనను కనుగొనాలనే క్రీస్తు మన కోసం మరణించాడు. ఇది ఎంతటి అద్భుతమైన, మహిమాయుక్తమైన శుభవార్త! అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. మరణించిన మూడు రోజుల తర్వాత, యేసుక్రీస్తు సమాధిని గెలిచి తిరిగి లేచాడు! శిక్షావిధిపై, మరణంపై మరియు పాపంపై ఆయన సకల విజయశీలిగా పునరుత్థానుడయ్యాడు!

పరిశుద్ధ లేఖనాలు ఈ శుభవార్తను ఎంతో తేటగా ప్రకటిస్తున్నాయి: “కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు” (రోమీయులకు 8:1). యేసుక్రీస్తు నందు మనకు పాపక్షమాపణ, నిరీక్షణ, సమాధానం మరియు పరిపూర్ణమైన తృప్తి ఉచిత కృపావరాలుగా లభిస్తాయి. క్రీస్తు ద్వారానే మనం దేవుని సన్నిధిలోకి అత్యంత ధైర్యముతో ప్రవేశించగలుగుతున్నాం; ఆయన ప్రేమలోని అనంతమైన సౌందర్యాన్ని, ఆయన పరిశుద్ధతలోని వైభవాన్ని సరికొత్తగా దర్శించగలుగుతున్నాం. అవును, ఇదే రక్షణ! ఇది నిజంగా మహిమాయుక్తమైన సత్యం. ఇదే నిత్యజీవాన్ని ప్రసాదించే అమూల్యమైన సువార్త!

ప్రియ స్నేహితుడా, నీవు నీ పాపాలను ఒప్పుకొని, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచావా? మన రక్షణ నిమిత్తం ఆయన పొందిన మరణము, మరియు ఆయన సాధించిన పునరుత్థాన విజయమే మన విముక్తికి ఏకైక మార్గమని నీవు పూర్ణహృదయంతో నమ్ముతున్నావా? నీవు ఈ క్షణమే రక్షణ పొందవచ్చు. ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. 

నీవు ఆయనపై విశ్వాసముంచి, క్రీస్తు మహిమ మాత్రమే నీ ఆత్మకు నిజమైన తృప్తినిస్తుందని నీవు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలన్నదే మా ప్రార్థన.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

ఆర్.సి.స్ప్రౌల్
ఆర్.సి.స్ప్రౌల్
డాక్టర్ ఆర్.సి.స్ప్రౌల్ లిగోనియర్ మినిస్ట్రీస్ స్థాపకుడు, సాన్ఫోర్డ్, ఫ్లోరిడా లోని సెయింట్ ఆండ్రూస్ చాపెల్లో ప్రభోధన మరియు బోధన యొక్క మొదటి పరిచారకుడు, రిఫార్మేషన్ బైబిల్ కళాశాల యొక్క మొదటి అధ్యక్షుడు మరియు టేబుల్టాక్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. అతని రేడియో కార్యక్రమం, రెన్యూవింగ్ యువర్ మైండ్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందలాది రేడియో స్టేషన్లలో ప్రతిరోజూ ప్రసారం చేయబడుతుంది మరియు ఆన్లైన్లో కూడా వినవచ్చు. దేవుని పరిశుద్ధత, దేవునిచే ఎన్నుకోబడటం, మరియు ప్రతి ఒక్కరూ ఒక వేదాంతవేత్తతో సహా వందకు పైగా పుస్తకాలను రచించారు. లేఖనాలలో తప్పులు లేవు అని, దేవుని ప్రజలు ఆయన వాక్య౦పై నమ్మక౦తో నిలబడవలసిన అవసరాన్ని ఆయన స్పష్ట౦గా సమర్థి౦చిన౦దుకు ఆయన ప్రప౦చవ్యాప్త౦గా గుర్తి౦చబడ్డాడు.