నా జీవితం కొరకు దేవుని చిత్తం ఏమిటి?
25/03/2025
దేవుడు మంచివాడు అంటే ఏమిటి?
01/04/2025
నా జీవితం కొరకు దేవుని చిత్తం ఏమిటి?
25/03/2025
దేవుడు మంచివాడు అంటే ఏమిటి?
01/04/2025

కీర్తనలను నేను ఎందుకు ఇష్టపడతాను

  1. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో, బైబిలులో నాకు ఇష్టమైన పుస్తక౦ ఏమిటి అని నన్ను అడిగారు. అది చెడ్డ ప్రశ్నేనా అని నా మొదటి ప్రతిస్పందన. దేవుని వాక్యాలన్నిటినీ సమానంగా ఇష్టపడకూడదా? అప్పుడు నేను సహకరించాలని అనుకున్నాను, మరియు నేను తరచుగా ఏ పుస్తకాన్ని ఆశ్రయిస్తాను మరియు ఆనందిస్తాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. సమాధానం సులభం అని గ్రహించాను. ఇటీవలి స౦వత్సరాల్లో, ఆ పుస్తక౦ కీర్తనల గ్రంథము అయివుంది.

    హైస్కూల్ లో జూనియర్ గా ఉన్నప్పుడు, కీర్తనలను ప్రధానంగా పాడే సంఘ పరిచర్య ద్వారా నేను క్రీస్తువైపునకు మల్లి మారాను. కాబట్టి, చాలా స౦వత్సరాలుగా నేను కీర్తనలతో జీవి౦చి, వాటి గురి౦చి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. కానీ ఇటీవలి సంవత్సరాలలో మాత్రమే నేను వాటిని చాలా ఆకర్షణీయంగా మరియు మనోహరమైనవిగా కనుగొన్నాను.

    కీర్తనల్లోని అనేక విశేషాలు నన్ను విశేషంగా ఆకర్షించాయి. మొదటిది భాష యొక్క సౌందర్యం మరియు విశ్వాసంలోని గొప్ప సత్యాలను కవితాత్మకంగా వ్యక్తీకరించడం. “యెహోవా నా కాపరి” (కీర్తన 23:1) అనే సరళమైన మాటలను పరిశీలి౦చ౦డి. ఆపదలో ఉన్న ఎంతోమంది ఆత్మలకు అవి ఎంత ఓదార్పునిచ్చాయో. లేదా కీర్తన 103లో దేవుని విమోచన వాగ్దానాల గురి౦చి ఆలోచి౦చ౦డి: “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు ¸యౌవనమువలె నీ ¸యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు” (వచనము 2-5). లేదా “నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి” (కీర్తనలు 56:8) అని మన బాధను దేవుడు స్మరించుకున్న హృదయవిదారక చిత్రాన్ని ఆలోచి౦చ౦డి.

    రెండవ ఆకర్షణ ఏమిటంటే, మీరు కీర్తనల గ్రంథమును ఎంత ఎక్కువగా తవ్వితే, మీరు మరింత కనుగొంటారు. అన్ని గొప్ప కవితల మాదిరిగానే, కొత్త లోతులను చేరుకోవటానికి మరియు మరింత బంగారాన్ని కనుగొనడానికి కీర్తనలు కూడా ఒక గనిలాంటివి. వాటిని బాగా తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నానికి అవి పుష్కలంగా ప్రతిఫలం ఇస్తాయి.

    మూడవది, అన్ని సందర్భాలకు కీర్తనలు ఉన్నాయి. కీర్తనలు హాల్మార్క్ కార్డులున్న అన్ని సందర్భాల గురి౦చి స్పష్ట౦గా ప్రస్తావి౦చవు. కానీ అవి దేవుని ప్రజల జీవితాలలో అన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షణాలను మరియు భావోద్వేగాలను సూచిస్తాయి. జాన్ కెల్విన్ అన్నట్లు, “ఈ పుస్తకాన్ని ‘ఆత్మ యొక్క అన్ని భాగాల నిర్మాణ శాస్త్రం’ అని పిలవడం నాకు అలవాటైపోయింది, ఎందుకంటే ఇక్కడ అద్దంలో సూచించినట్లుగా ఎవరికీ తెలియనట్టి భావోద్వేగం ఇందులో లేనే లేదు.” కీర్తనలు మన జీవితపు అన్ని పరిస్థితులలో మన భావోద్వేగాలను దేవునికి ఎలా వ్యక్తపరచాలో నేర్పుతాయి. నాల్గవది, కీర్తనలు క్రీస్తుతో నిండి ఉన్నాయి. అవి క్రీస్తు రాకను స్పష్టంగా ప్రవచించడమే కాదు (ఉదా . కీర్తనలు 2; 22; 110), కీర్తనల సందేశం ఎల్లప్పుడూ ఆత్మను క్రీస్తు వద్దకు మరియు ఆయన గొప్ప రక్షణ పని వైపు లాగుతుంది. ప్రాచీన సంఘములో చెప్పినట్లు, “ఎల్లప్పుడూ నోటిలో కీర్తన, ఎల్లప్పుడూ హృదయంలో క్రీస్తు” (సెంపెర్ ఇన్ ఒర్ సాముస్, సెంపెర్ ఇన్ కొర్డే క్రీస్టూస్). కీర్తనలు క్రీస్తుతో మన సహవాసాన్ని తీవ్రతరం చేస్తాయి.

    కీర్తనలలో నేను కనుగొన్న విషయాలు సంఘ చరిత్రలో చాలా మందికి బాగా తెలుసు. చరిత్ర అంతటా, కీర్తనల గ్రంథాన్ని చాలా చోట్ల చాలా మంది క్రైస్తవులు విలువైనదిగా భావించారు. ప్రాచీన మరియు మధ్యయుగ కాలాలలో, ముఖ్యంగా సన్యాసులుచే కీర్తనలు చాలా తరచుగా అధ్యయనం చేయబడ్డాయి మరియు పాడబడ్డాయి. గొప్ప అథనాసియస్ (296-373) ఇలా అన్నాడు, “ఒక వ్యక్తి ఈ కీర్తనల కంటే గొప్పది మరొకటి కనుగొనలేడని నేను నమ్ముతున్నాను; ఎందుకంటే అవి మానవుని జీవితమంతా, అతని మనస్సు యొక్క అనురాగాలను, అతని ఆత్మ యొక్క కదలికలను స్వీకరిస్తాయి. దేవుణ్ణి స్తుతి౦చడానికి, మహిమపరచడానికి, ఆయన ప్రతి స౦దర్భానికి అనువైన కీర్తనను ఎన్నుకోగలడు, ఆ విధ౦గా అవి ఆయన కోస౦ వ్రాయబడినవని కనుగొనవచ్చు. “సంస్కరణలో, సంఘములో అందరికీ బైబిలును పునరుద్ధరించడం అంటే కీర్తనల పునరుద్ధరణ కూడా. లూథర్ సన్యాసిగా కీర్తనలను చిన్నతనంలోనే నేర్చుకున్నాడు మరియు వాటిని ప్రేమించడం కొనసాగించాడు. ఆయన కీర్తనను “ఒక చిన్న బైబిలు” అని పిలిచాడు, “కీర్తన ఒక అమూల్యమైన మరియు ప్రియమైన పుస్తకముగా ఉండాలి, ఇది తప్ప మరే ఇతర కారణం లేదు: అది క్రీస్తు మరణాన్ని మరియు పునరుత్థానాన్ని చాలా స్పష్టంగా వాగ్దానం చేస్తుంది- మరియు అతని రాజ్యాన్ని మరియు క్రైస్తవ సామ్రాజ్యము అంతటి యొక్క స్థితిని మరియు స్వభావాన్ని చిత్రిస్తుంది- దీనిని చిన్న బైబిల్ అని కూడా పిలుస్తారు.”

    బైబిలు మొత్తంలో ఉన్న ప్రతిదీ చాలా అందంగా, క్లుప్తంగా ఇందులో అర్థం చేసుకోబడుతుంది.” సంస్కరించబడినవారిలో, కీర్తనలు సంఘము యొక్క పాటల పుస్తకంగా క్రమబద్ధీకరించబడ్డాయి మరియు పాడబడ్డాయి. ఆ తొలి కాల్వినిస్టులు దేవుని మాటలను తమ పెదవులపై పెట్టుకుని ఆయనను స్తుతించగలిగినందుకు సంతోషించారు. కీర్తనలన్నిటినీ గానం చేయడాన్ని పర్యవేక్షించిన జాన్ కెల్విన్ కీర్తనలపట్ల తన ఉత్సాహాన్ని ఈ మాటలలో వ్యక్తపరిచాడు: “దేవునికి మొఱ్ఱపెట్టడమనేది మన భద్రతను కాపాడే ప్రధాన సాధనాలలో ఒకటి కాబట్టి, ఈ [ప్రార్థన] సాధనలో మనకు మార్గనిర్దేశం చేయడానికి ఒక మంచి మరియు మరింత కఠినమైన నియమం కీర్తనలలో కంటే మరెక్కడా కనిపించదు. వాటిని అర్థం చేసుకోవడంలో మనిషి సాధించిన ప్రావీణ్యానికి అనుగుణంగా, ఖగోళ సిద్ధాంతం యొక్క అతి ముఖ్యమైన భాగం గురించి అతని జ్ఞానం ఉంటుంది.”

    కెల్విన్ అనుచరులు దాని విలువ గురించి తన నమ్మకాన్ని పంచుకున్నారు. ఉదాహరణకు, హుగ్నోట్స్ అని పిలువబడే ఫ్రెంచ్ కాల్వినిస్టుల అనుభవంలో మనం దీనిని స్పష్టంగా చూడవచ్చు. బెర్నార్డ్ కాట్రెట్ వ్రాసినట్లుగా, “కీర్తనల గ్రంథము అనేది ఫ్రెంచ్ సంస్కరణ.” పదహారవ శతాబ్దం మధ్యకాలానికి చెందిన ఆ ఫ్రెంచ్ ప్రొటెస్టెంట్లు కీర్తనలను ప్రేమించి, హతసాక్షులుగా మరణించే మార్గంలో కూడా వాటిని ఆసక్తిగా ఆలపించారు. ఫ్రెంచ్ హుగ్నోట్లు కీర్తనల పాటల యొక్క మెట్రిక్ వెర్షన్ లో “కాల్విన్ యొక్క భక్తి కవితా శక్తిని అందించారు” అని కనుగొన్నారు. పదహారవ శతాబ్దంలో పాడటానికి కీర్తనల యొక్క ఈ కవితా అనువాదాలు కీర్తన యొక్క శక్తిని మరియు ఔచిత్యాన్ని చూడటానికి సంఘానికి మళ్ళీ సహాయపడ్డాయి.

    అయితే, కీర్తనలు సంస్కరించబడిన క్రైస్తవులకు ప్రేరణ మరియు ఓదార్పు కంటే ఎక్కువ. కీర్తనలు దేవుని మాటల్లో తమ సుఖదుఃఖాలను వ్యక్తపరచడానికి ఒక మార్గం మాత్రమే కాదు. తమను ఎదిరించిన దుష్టులకు మరియు తమను పోషించిన దేవునికి స౦బ౦ధి౦చి వారు జీవి౦చిన జీవితాన్ని కీర్తనల గ్రంథము వివరి౦చింది. వారు దేవుని ప్రజలుగా కీర్తనలలో జీవించారు.

  1. ఈ భాగాన్ని డబ్ల్యు. రాబర్ట్ గాడ్ ఫ్రే రచించిన లెర్నింగ్ టు లవ్ ది సామ్స్ నుండి స్వీకరించారు.
W. రాబర్ట్ గాడ్ఫ్రే
W. రాబర్ట్ గాడ్ఫ్రే
డాక్టర్ W. రాబర్ట్ గాడ్‌ఫ్రే లిగోనియర్ బోర్డ్‌కు చైర్మన్, అలాగే కాలిఫోర్నియాలోని వెస్ట్‌మిన్‌స్టర్ సెమినరీలో చర్చి చరిత్రకు సంబంధించిన ప్రెసిడెంట్ ఎమెరిటస్ మరియు ప్రొఫెసర్ ఎమెరిటస్. అతను సేవింగ్ ది రిఫార్మేషన్ మరియు లెర్నింగ్ టు లవ్ ది పామ్స్ వంటి అనేక పుస్తకాల రచయిత.