
మరణంలో క్రైస్తవునికి లభించే ఓదార్పు ఏమిటి?
13/10/2026
అబ్రహాము ఎవరు?
20/10/2026పరిచర్యలో స్వభావం ఎందుకు అవసరం?
దేవుడు శక్తిమంతుడు, ప్రేమగలవాడు, మరియు తన గొప్ప నామము యొక్క మహిమ విషయమై అతిశయముగలవాడు. యెషయా 44:23–24లో, ప్రభువు తనను తాను “విమోచకుడు” అని పిలుచుకొని, తాను తన ప్రజలను రక్షించానని మరియు “ఇశ్రాయేలులో తాను మహిమపరచబడతానని” ప్రకటిస్తున్నాడు. నిజానికి, పాపుల రక్షణ ద్వారా దేవుడు ప్రత్యేకంగా మహిమపరచబడతాడు.
అయితే, ఎక్కువ మంది పాపులు ఎందుకు రక్షించబడటం లేదు? దేశవ్యాప్తంగా సువార్తను ప్రకటించే సంఘాలు ఎందుకు కిక్కిరిసిపోవడం లేదు? నీతి కొరకు ఆకలి దప్పికలతో ఉన్న స్త్రీపురుషులు, పిల్లలతో మరిన్ని సంఘాలు ఎందుకు నిండిపోవడం లేదు? ఒక్క మాటలో చెప్పాలంటే, క్రైస్తవులు చూడాలని ఆశించే ఆత్మీయ ఉజ్జీవనం ఎక్కడ ఉంది?
క్రీస్తు యొక్క ప్రజలలో ఉజ్జీవనం లేకపోవడం మరియు క్రీస్తు యొక్క నాయకులలో పరిశుద్ధత లోపించడం అనేవి తరచుగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.
నిస్సందేహంగా, ఇతర అంశాలు కూడా పనిచేస్తున్నాయి. సువార్తను నీరుగార్చే సంఘాలలో నిజమైన మార్పులు ఎక్కువగా జరగవు. వినోదాన్ని ఆదరించే పాస్టర్లు సంఘాలను కన్నీళ్లు పెట్టించలేరు. పశ్చాత్తాపాన్ని నిర్లక్ష్యం చేసే క్రైస్తవ నాయకులకు నిజమైన మార్పు చెందినవారు కొద్దిమందే ఉంటారు.
అయితే, తమ స్వంత నడవడిని నిర్లక్ష్యం చేసే బోధకులు తమ సంఘాలలో ఉజ్జీవనాన్ని ఆశించకూడదనేది కూడా అంతే నిజం. దేవుడు, తన సార్వభౌమ జ్ఞానంతో, తన సంఘం యొక్క ఎదుగుదల విషయానికి వస్తే, దాని నాయకుల నైతిక నీతి అవసరమనిచూపించాడు.
“రక్షణ యెహోవాదే!”
యోనా సంగతి ఏమిటి? అతన్ని తన్నుతూ, కేకలు వేస్తూ నీనెవెకు ఈడ్చుకెళ్లాల్సి వచ్చింది, అయినప్పటికీ ఆ పట్టణమంతా రక్షణ విశ్వాసాన్ని పొందింది. యిర్మీయా సంగతి ఏమిటి? ఈ దైవభక్తిగల వ్యక్తి తన హృదయపూర్వకంగా బోధించినప్పటికీ, బాగా తెలిసిన ఒక దేశం – ఆ దేశం అంతా తిరస్కరించడం అతను ఎదురుకోవాల్సి వచ్చింది. పేతురు సంగతి ఏమిటి? లోపాలున్న ఆ అపోస్తలుడు యెరూషలేములోని పెంతెకోస్తు దినాన శక్తివంతమైన ప్రసంగం చేశాడు, మరియు వేలాదిమంది రక్షణ విశ్వాసాన్ని పొందారు. ఇక, చివరిగా, పాపరహితుడైన మన రక్షకుని సంగతి ఏమిటి? ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపినప్పటికి, ఉజ్జీవనాన్ని కాక, తిరస్కారాన్ని మాత్రమే అనుభవించాడు.
ఇలాంటి ఉదాహరణలు యోనా ప్రకటించినది నిజమని నిరూపిస్తున్నాయి: “రక్షణ యెహోవాదే!” (యోనా 2:9). సరళమైన సత్యం ఏమిటంటే, మనం ఉజ్జీవనాన్ని సృష్టించలేము. ఎంత మంచి సిద్ధాంతం, నమ్మకమైన ప్రసంగం, మరియు ఉత్తమమైన నడవడిక ఉన్నప్పటికీ ఒక్క ఆత్మ కూడా మారుతుందని హామీ ఇవ్వలేవు. రక్షణ విషయంలో దేవుడే సర్వాధిపతి, మరియు అదే దానికి ఆదియు మరియు అంతము. రేపు రక్షింపబడే వారందరి పేర్లు ఈరోజే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. దేవునిచేత ఎన్నుకోబడిన వారు ఆయన పరిపూర్ణమైన సమయంలో రక్షణ విశ్వాసమునకు వస్తారు.
అయినప్పటికి . . .
అయినప్పటికీ, మన గొప్ప దేవుడు రక్షణ యొక్క గమ్యాన్ని మరియు సాధనాన్ని రెండింటినీ నియమించాడు. క్రొత్త నిబంధనలోని ఒకటి కంటే ఎక్కువ వాక్యభాగాలలో, సంఘ పెద్దలు సంఘం కొరకు పరిశుద్ధంగా ఉండాలని ప్రోత్సహించబడ్డారు. పాస్టర్లు విశ్వాసయుతమైన పరిచర్యకు మాదిరిగా ఉండకపోతే, వారు ఫలవంతమైన పరిచర్యను ఆశించకూడదు.
1 పేతురు 5:2–3లో పెద్దలకు పేతురు ఇచ్చిన ఉపదేశాన్ని పరిశీలించండి:
బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి.
ఈ కాపరులు మందకు మాదిరిగా ఎందుకు ఉండాలి? ఒక బోధకుడు సత్యమైన, సరైన విషయాలు చెబితే సరిపోదా? లేదు. అతను తన ఇంటిలో ఏకాంత సమయంలో ఏమి చేస్తాడనేది నిజంగా ముఖ్యమా? అవును, అది నిజంగా ముఖ్యమే.
అందుకే, అపొస్తలుడైన పౌలు తిమోతితో, తన శ్రోతల రక్షణ అతని జీవితం మరియు అతని బోధపైనే ఆధారపడి ఉందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు: “నిన్నుగూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.” (1 తిమోతి 4:16). నిస్సందేహంగా, రక్షణ ప్రభువుకు చెందినదని పౌలుకు తెలుసు. అయినప్పటికీ, దేవుని మర్మమైన ప్రణాళికలో, సువార్త ప్రకటించబడే పాత్ర పవిత్రంగా ఉండాలి.
“ఒక పవిత్ర పరిచారకుడు ఒక భయంకరమైన ఆయుధం.”
స్కాటిష్ పాస్టర్ రాబర్ట్ ముర్రే మెక్‌చెయిన్ తన అన్నయ్య అకాల మరణం తర్వాత విశ్వాసంలోకి వచ్చారు. తనకు ఇవ్వబడినన్ని రోజులు ప్రభువును తీవ్రంగా వెంబడించాలనే భావనతో ఆయన 1835లో దైవశాస్త్ర పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు. సెయింట్ పీటర్స్ డండీకి పరిచారకుడుగా మారడానికి కొద్దికాలం ముందు ఆయన ఇలా వ్రాశాడు, “జీవితం వేగంగా గడిచిపోతోంది, నిత్యత్వం కోసం త్వరపడండి.” ఊహించిన దానికంటే ముందే నిత్యత్వం లభించింది. ఆయన ఇరవై తొమ్మిదేళ్ల వయసులో మరణించాడు, కానీ అంతకు ముందే వ్యక్తిగత పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు.
మెక్‌చెయిన్ తన తోటి కాపరులు తమ సంఘాలకు మాదిరిగా ఉండమని కోరారు. వారు తమ జీవితాన్ని, బోధనను గమనించుకోవాలని ఆయన ఉద్బోధించారు:
అన్నిటికంటే ముఖ్యంగా, మీ ఆత్మను పెంపొందించుకోండి. మీ ఆత్మే మీ ప్రథమ మరియు అతి ముఖ్యమైన శ్రద్ధ. వ్యక్తిగత పరిశుద్ధతను పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు గొప్ప ప్రతిభల కంటే ఎక్కువగా యేసు పోలికనే ఆశీర్వదిస్తాడు. ఒక పరిశుద్ధ పరిచారకుడు దేవుని చేతిలో ఒక భయంకరమైన ఆయుధం. మీ మనస్సాక్షి నిర్మలంగా ఉండి, మీ హృదయం దేవుని ఆత్మతో నిండినప్పుడు మీరు పలికే ఒక్క మాట, అవిశ్వాసం మరియు పాపంతో పలికిన పదివేల మాటల కన్నా విలువైనది. 1
దేవుడు మనం చెప్పే మాటల గురించే కాదు; మనం ఎలాంటి వాళ్ళమో కూడా ఆయన పట్టించుకుంటాడు. ఒక క్రైస్తవ నాయకుని మనస్సాక్షి మబ్బుగా ఉండి, అతని హృదయం అవివేకంగా పాపపు అలవాట్లలో కూరుకుపోయినప్పుడు, ప్రభువు ఆ పరిచర్యపై తన ఆశీర్వాద హస్తాన్ని ఉపసంహరించుకుంటే మనం ఆశ్చర్యపోకూడదు.
లేదు, మనం సరైన సిద్ధాంతం మరియు పరిశుద్ధమైన జీవనంతో ఉజ్జీవనాన్ని తీసుకురాలేము, కానీ అవి లేకుండా ఉజ్జీవనాన్ని ఆశించకూడదు.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.


