Who Was Abraham?

అబ్రహాము ఎవరు?

20/10/2026
Who Was Abraham?

అబ్రహాము ఎవరు?

20/10/2026

మాతృత్వంలోని సవాళ్లను హుందాగా ఎదుర్కోవడం

Navigating the Challenges of Motherhood with Grace

ఈ వసంతకాలం నా మాతృత్వంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తోంది: నా చిన్నవాడు హైస్కూల్ పూర్తి చేసి పట్టభద్రుడవుతాడు. ఇది తల్లిదండ్రుల బాధ్యతలోని ఈ దశకు ముగింపు పలికే ఒక గమ్యం. ఇది జరుగుతుందని నేను కొంతకాలంగా ఊహిస్తున్నాను, నాలో అనేక భావోద్వేగాలు నిండిపోయాయి—నా కొడుకు జీవితంలోని తదుపరి దశలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందం; ఇక ప్రతిరోజూ అతన్ని ఇంట్లో చూడలేనేమోనని తలచుకుంటే బాధ. మనమందరం ప్రయాణించే గమ్యాన్ని నేను చేరుకున్నాను, అయినప్పటికి అవతల వైపు ఏముంటుందోనన్న అనిశ్చితితో నిండి ఉన్నాను.

నేను ఈ ప్రయాణాన్ని మొదట ప్రారంభించినప్పుడు, నాకు తెలియని విషయాలన్నీ నన్ను కుంగదీశాయి. కొత్తగా, తెలియని ఎన్నో విషయాల ముందు నేను అసమర్థురాలిగా భావించాను. తల్లిదండ్రులుగా సవాలుతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి నాకు వివేకం కొరవడింది మరియు వాటిని సరిగ్గా తీసుకోలేనేమోనని భయపడ్డాను. అప్పటి నుండి, నా మాతృత్వంలో నేను అనేక కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను మరియు భవిష్యత్తులో మరిన్ని ఎదురవుతాయని ఊహిస్తున్నాను. అయినప్పటికీ, వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, నా కష్టాలన్నింటిలోనూ దేవుని కృప పనిచేయడాన్ని మరియు ఆయన విశ్వసనీయతను నేను చూడగలుగుతున్నాను.

మీరు మీ మాతృత్వ ప్రయాణంలో ఏ దశలో ఉన్నప్పటికిని—అది తొలిదశలో అయినా, మధ్యదశలో అయినా, లేదా పిల్లలు పెద్దవారై ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత అయినా—దేవుడు మిమ్మల్ని మీరుగా కలుసుకుంటాడు. ఆయన తన కృపను అనుగ్రహిస్తాడు. బైబిల్లోని ముగ్గురు తల్లుల జీవితాలలో మనం దీనిని చూస్తాము. వారిలో ప్రతి ఒక్కరి పరిస్థితులలో, దేవుడు వారికి అవసరమైన వాటిని సమకూర్చి, తన కృపను వారికి అనుగ్రహించాడు.

దేవుడు చూస్తాడు మరియు దేవునికి తెలుసు

హాగరు కథలో, త్వరలో తల్లి కాబోతున్న ఆమె పడుతున్న కష్టాన్ని దేవుడు చూశాడు. శారాయి దాసిగా, దేవుని వాగ్దానాలను నెరవేర్చే శారాయి ప్రణాళికలో ఆమె భాగమైంది (ఆదికాండము 16). శారాయి కోపం నుండి పారిపోయి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు, దేవుడు ఆమెను కలుసుకుని తన కృపను చూపించాడు. అక్కడ ఆమె దేవుణ్ణి ‘ఎల్ రోయ్’ అని పిలిచింది; “చూచుచున్న దేవుడవు నీవే… నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా” (ఆదికాండము 16:13). ఆ తర్వాత ఆమె మళ్ళీ అరణ్యంలో ఉన్నప్పుడు, తను మరియు తన కుమారుడు చనిపోతారని అనుకున్నప్పుడు, దేవుడు ఆమెను చూశాడు. ఆయన ఆమె మొరలను విన్నాడు. ఆయన తన కృపతో ఆమె అవసరాలను మరోసారి తీర్చాడు: “భయపడకుడి, దేవుడు వినియున్నాడు” (ఆదికాండము 21:17).

తల్లులుగా మనం కష్టపడుతున్నప్పుడు, మనము ఎక్కడ ఉంటామో అక్కడ దేవుడు తన అపారమైన కృపతో మనలను కలుసుకుంటాడు. ఆయన ఎల్ రోయి, అనగా చూచుచున్న దేవుడు. ఆయన మన భయాలను, దుఃఖాలను, మరియు అనిశ్చితులను చూచుచున్నాడు. మన పిల్లల పట్ల మనకున్న శ్రద్ధ ఆయనకు తెలుసు. సహాయం కోసం మనం పెట్టే  మొరలను ఆయన విని మనలను విడిపిస్తాడు. మనము అనుభవించాల్సిన శిక్షను ఆయన తన సొంత కుమారుడు చెల్లించడానికి ఎక్కడికైతే పంపించాడు ఆ సిలువ చెంత మన పాపములనుండి మనలను దేవుడు విడిపించడంలో దీనికి గొప్ప రుజువు ఉన్నది. మన కోసం క్రీస్తు చేసిన కార్యంపై విశ్వాసం ద్వారా, మనం పాపం నుండి విడిపించబడి, ఇప్పుడు దేవునికి చెందినవారమయ్యాము: “ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” (రోమా 8:31-32).

అరణ్యంలో హాగరును చూసిన అదే దేవుడు, సహాయం కోసం మనం చేసే మొరలను కూడా చూసి వింటాడు.

దేవుడు తన నిబంధన ప్రేమ వలన విడిపిస్తాడు

రూతు గ్రంథంలో, మోయాబు దేశంలో సర్వస్వం కోల్పోయిన నయోమిని మనం కలుస్తాము. ఆమె భర్త మరణించాడు, ఆ తర్వాత ఆమె ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఆమె దుఃఖం అపారంగా ఉంది; జీవితం అనేది మళ్ళీ సంతోషాన్ని ఇస్తుందని ఆమె ఊహించలేకపోయింది. దేవుడు ఆమె కోడలైన రూతు ద్వారా ఆమెకు సహాయం చేశాడు. రూతు తన ప్రజలను విడిచిపెట్టి, బేత్లెహేముకు తన ఇంటికి వెళ్లే ప్రయాణంలో నయోమితో చేరింది. ఆ తర్వాత ఆయన ధాన్యపు పొలాలలో రూతుకు ప్రేమగల భర్తను, నయోమికి ఒక మనవడిని అనుగ్రహించాడు. వారి కథలో తరచుగా కనిపించే ఇతివృత్తం దేవుని హెసెద్ ప్రేమ. అటువంటి ప్రేమ కేవలం దయ కంటే గొప్పది; అది తన ప్రజల పట్ల దేవుని నిబంధన వాగ్దానం.

నిస్సహాయ పరిస్థితులలో ఉన్న తల్లులను దేవుడు తన ప్రేమతో ఆదుకుంటాడు. సవాలుతో కూడిన పరిస్థితులలో ఉన్న తల్లుల కోసం, కష్టమైన పిల్లల పెంపక దశలను ఎదుర్కొంటున్న మనలాంటి వారి కోసం, మన పట్ల దేవుని స్థిరమైన ప్రేమను మనం విశ్వసించవచ్చు. అది నమ్మకమైన ప్రేమ. అది విడిపించి, సమకూర్చే ప్రేమ. అది తన వాగ్దానాలను నిలబెట్టుకునే ప్రేమ. అది ఎన్నటికి విఫలం కాని ప్రేమ.

దుఃఖంలో ఉన్న నయోమిని విడిపించి, ఆమె పట్ల, రూతు పట్ల తన హెసెద్ ప్రేమను చూపిన అదే దేవుడు, మన పట్ల కూడా తన ప్రేమలో నమ్మకమైనవాడు.

దేవుడు మన పిలుపు కొరకు మనలను సన్నద్ధం చేస్తాడు

యుక్తవయసులో ఉన్న మరియ ఒక రోజు గబ్రియేల్ దేవదూతను కలుసుకుంది, ఆమె లోక రక్షకునికి జన్మనిస్తుందని అతను ఆమెకు చెప్పాడు. ఒక కొత్త తల్లిగా నేను అనుభవించిన అసమర్థత నాకు బాగా గుర్తుంది; అలాంటి వార్త విన్నప్పుడు మరియ ఎలా అనిపించిందో నేను ఊహించలేను. ఆమె పాట, దేవుడు తన కృప ద్వారా మన జీవితాలలో ఎలా పనిచేస్తాడో మనకు గుర్తుచేస్తుంది:

సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను 

… ఆయన నామము పరిశుద్ధము.

ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును. (లూకా 1:49-50).

మనం ఏమి చేస్తున్నామో మనకు ముందే తెలుసు కాబట్టి దేవుడు మనలను తల్లులుగా పిలవడు. ఆయన మన సంరక్షణకు అప్పగించిన పిల్లలను పెంచడానికి మనకు సామర్థ్యం లేదా జ్ఞానం ఉందని  ఆయన మనలను ఎన్నుకోడు. దానికి బదులుగా, ఆయన తన అపారమైన కృప ద్వారా మనలను మాతృత్వానికి సన్నద్ధం చేస్తాడు: “తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున” (2 పేతురు 1:3). మన పిల్లలను పెంచడానికి అవసరమైనవన్నీ ఆయన మనకు ఇస్తాడు. ఆయన జ్ఞానాన్ని, బలాన్ని, మరియు ఓర్పును అందిస్తాడు. ఇది తల్లులకు శుభవార్త.

మరియపై తన కృపను కురిపించిన అదే దేవుడు మనపై కూడా అదే కృపను కురిపిస్తాడు.

లేఖనాల్లోని ఈ తల్లులందరూ తమ జీవితాల్లో దేవుని కృపను అనుభవించి, ఆయన విశ్వసనీయతను వెల్లడి చేశారు. తల్లులారా, ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు తన కృపతో మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాడని నమ్మండి.


ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

క్రిస్టినా ఫాక్స్

క్రిస్టినా ఫాక్స్

క్రిస్టినా ఫాక్స్ జార్జియాలోని లుక్అవుట్ మౌంటెన్‌లో ఉన్న కోవనెంట్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సంబంధాల విభాగంలో పనిచేస్తున్నారు. ఆమె 'క్లోజర్ దాన్ ఎ సిస్టర్'తో సహా పలు పుస్తకాల రచయిత్రి. ఆమె జార్జియాలోని మరియెట్టాలో ఉన్న ఈస్ట్ కాబ్ పిసిఎలో సభ్యురాలు.