Why Does Character Matter in Ministry?

పరిచర్యలో స్వభావం ఎందుకు అవసరం?

15/10/2026
Navigating the Challenges of Motherhood with Grace

మాతృత్వంలోని సవాళ్లను హుందాగా ఎదుర్కోవడం

27/10/2026
Why Does Character Matter in Ministry?

పరిచర్యలో స్వభావం ఎందుకు అవసరం?

15/10/2026
Navigating the Challenges of Motherhood with Grace

మాతృత్వంలోని సవాళ్లను హుందాగా ఎదుర్కోవడం

27/10/2026

అబ్రహాము ఎవరు?

Who Was Abraham?

క్రీ.పూ. 2000 ప్రాంతంలో జీవించిన పితామహుడైన అబ్రహాము, బైబిల్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరు. అద్భుతమైన విశ్వాసం గల వ్యక్తిగా చిత్రీకరించబడిన అబ్రహాము, దేవుని విమోచన ప్రణాళికకు కేంద్రబిందువు. ఆదికాండములో నమోదు చేయబడిన నీతిమంతులైన పితృవంశంలో ఒక అంతర్భాగమైన అతడు, రాజవంశ స్థాపన ద్వారా దేశాలకు ఆశీర్వాదం కలుగుతుందని ముందుగానే తెలియజేసే దైవిక వాగ్దానాలను అందుకున్నాడు; ఈ ఆశీర్వాదమే యేసు క్రీస్తు రాకతో పరాకాష్టకు చేరుకుంటుంది.

దైవిక వాగ్దానాలచే రూపుదిద్దుకున్న అబ్రహాము జీవితం

అబ్రాహాము కథ ఆదికాండము 11వ అధ్యాయంలో మొదలవుతుంది, అక్కడ అతను కల్దీయుల ఊరులో నివసించే తెరాహు కుమారుడైన అబ్రాముగా పిలువబడ్డాడు. దేవుడు అతన్ని పిలిచినప్పుడు, అబ్రాము మానవాళి మొత్తానికి ప్రగాఢమైన ప్రాముఖ్యతను కలిగి ఉండే ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఆదికాండము 12:1–3లో వివరించబడిన ఈ ప్రత్యేక పిలుపు, అబ్రాము ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయనే అద్భుతమైన హామీతో పరాకాష్టకు చేరుకుంటుంది.

విశ్వాసపూర్వకమైన విధేయతతో, అబ్రహాము తనకు సుపరిచితమైన పరిసరాలను విడిచిపెట్టి, తెలియని ప్రదేశంలోకి సాహసయాత్రకు బయలుదేరాడు. ఇది దేవునితో ఒక గాఢమైన సంబంధానికి నాంది పలికింది. యెషయా ప్రవక్త ద్వారా, దేవుడు ఆ పితామహుడిని ప్రేమగా “అబ్రహాము, నా స్నేహితుడా” అని సంబోధించాడు (యెషయా 41:8).

అబ్రాహాము జీవిత కథ సవాళ్లు, సంచారాలు మరియు దైవిక అనుభవాలతో నిండి ఉంది. అతను కనానుకు ప్రయాణిస్తాడు, కరువును అనుభవిస్తాడు, ఐగుప్తులో నివసిస్తాడు మరియు పొరుగు ప్రజలతో ఉన్న సంక్లిష్టమైన సంబంధాలను చక్కబెట్టుకుంటాడు. అతను రాజులతో కలిసి మెలుగుతాడు, అయినప్పటికి  ఒక పాక్షిక-సంచార జీవన విధానాన్ని కొనసాగిస్తాడు. దీనివల్లే హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త, అబ్రాహాము “వుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను” అని పేర్కొన్నాడు (హెబ్రీ. 11:10).

అతని భార్య శారాయి (తరువాత సారా అని పిలువబడింది) సంతానలేమి సమస్యను ఎదుర్కొంటుంది, ఇది ఆమెలో ఉద్రిక్తతను మరియు హృదయ వేదనను కలిగిస్తుంది. అతని సంతానం నక్షత్రాల వలె లెక్కలేనంతగా ఉంటారని మరియు చివరికి కనాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని దేవుడు అబ్రాహాముకు హామీ ఇస్తాడు (ఆదికాండము 15). అయినప్పటికి, సంవత్సరాలు గడిచినా శారాయి గొడ్రాలుగానే ఉంటుంది. సహనం కోల్పోయిన శారాయి తన దాసి అయిన హాగరును అబ్రాముకు ఇస్తుంది, మరియు ఆమె ద్వారా ఇష్మాయేలు జన్మిస్తాడు (ఆదికాండము 16). అయితే, అబ్రాహాముకు సరైన వారసుడు సారా ద్వారానే వస్తాడని దేవుడు ధృవీకరిస్తాడు.

వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు జననం ఆదికాండములో ఒక కీలకమైన ఘట్టం. అయితే, ఇస్సాకును బలిగా అర్పించమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అబ్రాహాము విశ్వాసం పరీక్షించబడుతుంది (ఆదికాండము 22). అంతటి హృదయ విదారకమైన ఆజ్ఞకు కూడా లోబడటానికి అబ్రాహాము సిద్ధపడటం, దేవునిపై అతనికి ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. చివరి క్షణంలో, దేవుడు జోక్యం చేసుకుని, బలి కోసం ఒక పొట్టేలును అందించి, అతని సంతానంలో ఒకరి ద్వారా భూమి మీద ఉన్న సకల జనులు ఆశీర్వదించబడతారని అబ్రాహాముతో చేసిన తన నిబంధనను ధృవీకరిస్తాడు (ఆదికాండము 22:18).

అబ్రాహాము జీవితం లోపాలు లేనిది కాదు. సందేహం, మోసం మరియు నైతిక సందిగ్ధత వంటి సందర్భాలను ఆదికాండము నమోదు చేస్తుంది. అయినప్పటికీ, దేవుని వాగ్దానాలపై అతని నిరంతర విశ్వాసం అతని శాశ్వత వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.

అనేక జాతుల పితామహుడు: సున్నతి నిబంధన

అబ్రాహాము జీవితంలోని అత్యంత కీలకమైన దైవిక సంఘటనలలో ఒకటి సున్నతి నిబంధనను స్థాపించడం (ఆదికాండము 17). ఈ నిబంధనకు కేంద్రబిందువు, అబ్రాహామును “అనేక జనములకు తండ్రిగా” చేస్తానని దేవుడు చేసిన వాగ్దానం, ఇది రాజరిక అర్థాన్నిచ్చే వాగ్దానం. ఇంతకుముందు దేవుడు మరొక నిబంధన ద్వారా, అబ్రాహాము ఒక జాతికి తండ్రిగా ఉంటాడని, అతని జీవసంబంధమైన సంతానం కనాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని హామీ ఇచ్చాడు (ఆదికాండము 15). ముఖ్యంగా, సున్నతి నిబంధన అబ్రాహాము యొక్క పితృత్వాన్ని అలంకారికంగా అనేక జనములను చేర్చుకునేలా విస్తరింపజేస్తుంది. అబ్రాహాము వారికి ఆధ్యాత్మిక తండ్రిగా ఉంటాడు. అబ్రాహాము వలె విశ్వాసం ఉన్నవారు అతని పిల్లలుగా ఉంటారు (గలతీయులకు 3:1-9).

ఆదికాండము 17వ అధ్యాయంలో, దేవుడు అబ్రాహామును తన ఇంటిలోని ప్రతి మగపిల్లవాడికి, విదేశీయుల నుండి కొన్నవారితో సహా, “నిబంధనకు గుర్తుగా” సున్నతి చేయమని ఆజ్ఞాపించాడు (ఆది. 17:10–14). ఆదికాండములోని తొలి అధ్యాయాల నేపథ్యంలో చూస్తే, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా గుర్తించబడిన ఈ విశిష్టమైన వంశపరంపర, దుష్టశక్తులను జయించి, భూమిపై దేవుని రాజ్యాన్ని స్థాపించడం ద్వారా దేశాలను ఆశీర్వదించే ఒక రాజుతో ముగుస్తుందనే దేవుని వాగ్దానానికి సున్నతి ఒక నిరంతర జ్ఞాపికగా పనిచేస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, మత్తయి సువార్త, అబ్రాహాము నుండి మొదలయ్యే రాజవంశవృక్షంతో ప్రారంభించడం ద్వారా అబ్రాహాముకు చేసిన వాగ్దానాలు యేసులో ఎలా నెరవేర్చబడ్డాయో స్పష్టం చేస్తుంది (మత్తయి 1:1–17).

విశ్వాసం ద్వారా నీతి: అబ్రహాము యొక్క శాశ్వత వారసత్వం

అబ్రాహాము జీవిత వృత్తాంతం విశ్వాసం ద్వారా ఆపాదించబడిన నీతి అనే భావనను వివరిస్తుంది. ఆదికాండము 15:6 ఇలా ప్రకటిస్తుంది, “అతడు యెహోవాను నమ్మెను; ఆయన దానిని అతనికి నీతిగా ఎంచెను.” ఈ వచనం తర్వాత కాలపు దైవశాస్త్రపరమైన ఆలోచనలకు, ముఖ్యంగా పౌలు రచనలలో, ఒక మూలస్తంభంగా నిలుస్తుంది, అక్కడ అబ్రాహాము విశ్వాసానికి ఆదర్శంగా నిలబెట్టబడ్డాడు (రోమా 4).

అబ్రాహాముకు దేవుని దృష్టిలో నీతిమంతుడైన స్థానాన్ని కల్పించేది అతని విజయాలు లేదా పరిపూర్ణత కాదు, కానీ దేవుని వాక్యంపై అతనికున్న నమ్మకం మరియు దాని ప్రకారం నడుచుకోవాలనే అతని సంసిద్ధత. ధర్మశాస్త్రానికి విధేయత కంటే విశ్వాసంలో పాతుకుపోయిన నీతి గురించిన ఈ విప్లవాత్మకమైన అవగాహన, యేసు క్రీస్తు అనుచరులకు ఒక మార్గదర్శక సూత్రంగా నిలిచి ఉంది.

అయినప్పటికీ అబ్రాహాము విశ్వాసం నిష్క్రియమైనది కాదు; అది అతన్ని నీతిగా ప్రవర్తించేలా నడిపిస్తుంది. తన స్వదేశాన్ని విడిచిపెట్టడానికి, కనబడని వాగ్దానాలపై నమ్మకం ఉంచడానికి, మరియు దేవుని ఆజ్ఞ మేరకు తన ప్రియ కుమారుని అర్పించడానికి అతను సిద్ధపడటం, అది సాధించిన దాని ద్వారా స్పష్టమయ్యే విశ్వాసాన్ని వెల్లడిస్తుంది (యాకోబు 2:20–24 చూడండి). అబ్రాహాము, విశ్వాసం ద్వారా ఆపాదించబడిన నీతికి మాత్రమే కాకుండా, దేవుని ఆజ్ఞలకు విశ్వాసంతో ప్రేరేపించబడిన విధేయత ద్వారా రూపుదిద్దుకున్న జీవితానికి కూడా ఒక మాదిరిగా నిలుస్తాడు.

ముగింపు

చిరకాల ప్రాముఖ్యత గల జీవితాన్ని కలిగిన ఒక వ్యక్తి అబ్రాహాము. అతని కథ ఏదో గతకాలపు గాథ కన్నా ఎక్కువ; అది దేవునికి మరియు ప్రపంచం కోసం దేవుని విమోచన ప్రణాళికలో కీలక పాత్ర పోషించిన ఒక పితామహుడికి మధ్య ఉన్న సంబంధం. యేసు క్రీస్తులో నెరవేరబోయే దైవిక వాగ్దానాలను పొందినవాడిగా మరియు విశ్వాసం ద్వారా పొందిన నీతికి ఒక ఉదాహరణగా, అబ్రహాము వారసత్వం ప్రతి జాతి మరియు దేశానికి చెందిన లెక్కలేనంత మంది ప్రజలను ప్రేరేపిస్తూ, సవాలు చేస్తూ, మరియు ఏకం చేస్తూనే ఉంది.


ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

టి. డెస్మండ్ అలెగ్జాండర్

టి. డెస్మండ్ అలెగ్జాండర్

డాక్టర్ టి. డెస్మండ్ అలెగ్జాండర్ ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్‌లో ఉన్న యూనియన్ థియోలాజికల్ కాలేజీలో బైబిల్ అధ్యయనాల విభాగంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ఉన్నారు. ఆయన 'ది న్యూ డిక్షనరీ ఆఫ్ బిబ్లికల్ థియాలజీ'కి సహ సంపాదకుడు మరియు 'ఫ్రమ్ పారడైజ్ టు ది ప్రామిస్డ్ ల్యాండ్', 'ఫ్రమ్ ఈడెన్ టు ది న్యూ జెరూసలేం' వంటి అనేక పుస్తకాల రచయిత.