The Self Disclosure of God
దేవుని స్వయం ప్రత్యక్షత
06/02/2026
The Bond of Love
ప్రేమ బంధం
13/02/2026
The Self Disclosure of God
దేవుని స్వయం ప్రత్యక్షత
06/02/2026
The Bond of Love
ప్రేమ బంధం
13/02/2026

మన చీలిపోయిన హృదయాలకు దివ్యౌషధం

The Cure for Our Divided Hearts

వయసు పైబడిన ప్రియమైనవారు తల్లిదండ్రులు లేదా ఆప్తమిత్రులు మరణించినప్పుడు, వారు చివరి వీడ్కోలు చెప్పగలిగారా అని మనం తరచుగా ఆ కుటుంబ సభ్యులను ఆరా తీస్తాం. చివరి మాటలు కేవలం అంతిమ వీడ్కోలుగానే కాక, అవి తరచుగా ఆ వ్యక్తి జీవితకాలపు జ్ఞానాన్ని, ప్రేమను, మరియు లోతైన అనుబంధాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతాయి. అందుకే వాటిని అమూల్యమైన నిధిగా భావిస్తారు.

ఈ చివరి వీడ్కోలులలో ఒకదానిని దర్శించే అవకాశాన్ని పరిశుద్ధ గ్రంథం మనకిస్తుంది అది మరణ పడకపై ఉన్న రాజైన దావీదుకు మరియు సింహాసనాన్ని అధిరోహించబోతున్న ఆయన కుమారుడు సొలొమోనుకు మధ్య జరిగిన చివరి క్షణాలు. రాజ్య పరిపాలనకు సంబంధించిన ఆచరణాత్మకమైన, వివేకవంతమైన సలహాలను అందించిన తరువాత, దావీదు వ్యక్తిగతమైన అంశానికి మళ్లుతాడు. వృద్ధాప్య పితరుడైన దావీదు, తన కొడుకు సొలొమోను వైపు ప్రేమతో వంగి, అతని కళ్ళలోకి చూస్తూ, ఈ పదాలను ఉచ్చరించడాన్ని మనం ఊహించుకోవచ్చు: “నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవాను తెలిసికొని, హృదయపూర్వకముగ ఆయనను సేవించుము” (1 దిన. 28:9).

“పూర్ణ” అనే పదానికి అర్థం “మొత్తం” లేక “సంపూర్ణం”. దీనికి విరుద్ధంగా, “భాగం” అంటే మన జీవితంలో కొంత భాగాన్ని దేవునికి ఇవ్వకుండా, మనకోసం దాచుకోవడం లేదా మన హృదయాన్ని విభజించడం అని అర్థం. దావీదు “దేవుని హృదయానుసారుడైన వ్యక్తి”గా పిలవబడ్డాడు (అపొ. కా. 13:22). అయినప్పటికీ, తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అర్పించకుండా, కొన్ని విషయాలను, కొన్ని కోరికలను తనకే ఉంచుకోవాలని తన చీలిపోయిన హృదయం ఎంత బలంగా ఆకర్షిస్తుందో అతనికి తెలుసు. ఈ ఆధ్యాత్మిక సంఘర్షణతోనే ఆయన దేవుని ముందు మోకరించి, హృదయపూర్వకంగా ఇలా విన్నవించాడు: “నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము” (కీర్త. 86:11).

దేవుడు మనల్ని ప్రేమించే దానికంటే, మనమే మనల్ని బాగా చూసుకోగలం లేదా ప్రేమించుకోగలం అని మనం ఎప్పుడైతే భ్రమపడతామో, అప్పుడే మన జీవితంలో ఒక భాగంపై దేవునికి తెలియకుండానే, మౌనంగా “ఇది నా సొంతం” అనే ముద్ర వేసి, దానిని వేరుచేసి ఉంచుకుంటాము. సొలొమోను, అపారమైన జ్ఞానం మరియు బలం కలిగిన శక్తివంతమైన రాజుగా ఎదిగాడు. కానీ, తన హృదయ తృష్ణను తీర్చుకోవడానికి దేవుని నిత్య వాగ్దానాలకు మించి, ఈ లోక సంబంధమైన విషయాల వైపు చూడటం ప్రారంభించాడు. ఈ పతనం దేవునిలో భద్రత వెదకడానికి బదులు, విదేశీ స్త్రీలలో ఆశ్రయం వెతకడంతో మొదలైంది. ఈ తప్పటడుగు క్రమంగా విగ్రహారాధనకు దారితీసింది; తద్వారా, సొలొమోను జీవితంలో మరియు అతని పరిపాలనలో దేవుని మహిమ యొక్క ప్రతిబింబం పరిమితమైంది. చివరికి, ఆ పాపం యొక్క చేదు ఫలితం ఏమైందంటే – రాజ్యం వినాశకరంగా విభజించబడడం!

మనం రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించి ఉన్నప్పటికీ, క్రీస్తు నీతి అనే పవిత్ర వస్త్రాలు మనల్ని కప్పి ఉంచుతున్నప్పటికీ, మన చీలిపోయిన హృదయం నుండి పుట్టిన రాజీ ధోరణి నీడలలో జీవించగలగడం అనేది నిజంగా మనల్ని వివేకంతో ఆలోచింపజేసే అంశం. నిజమే, క్రీస్తు అందించిన రక్షణ సంపూర్ణమైనది మరియు సుస్థిరమైనది – నరకం యొక్క శక్తులు కూడా దానిని కదిలించలేవు. అయినప్పటికీ, రెండు పాయలుగా విడిపోయిన హృదయం, ఆయన రక్షణలో మనకు సిద్ధంగా ఉన్న దివ్యమైన సమాధానాన్ని, ఆత్మ సంబంధమైన ఫలభరితత్వాన్ని , మరియు అపారమైన ఆనందాన్ని మన నుండి దోచుకుంటుంది. ఇటువంటి రాజీ ధోరణి మన జీవితాల ఉద్దేశాన్ని మసకబారుస్తుంది, సిలువపై జరిగిన మహిమకరమైన కార్యాన్ని మనం నిర్లక్ష్యం చేసేలా చేస్తుంది; అంతేకాక, మన జీవితాల ద్వారా ఇతరులకు ప్రవహించాల్సిన దేవుని మంచితనాన్ని మొగ్గలోనే తుంచేస్తుంది.

దావీదు మరియు సొలొమోనుల జీవిత గమనాలలో ఎంత స్పష్టమైన వ్యత్యాసముందో చూడండి. సొలొమోను క్రమంగా రాజీ మార్గంలో మరింత లోతుగా కూరుకుపోయాడు, కానీ దావీదు మాత్రం తన పతనం తర్వాత హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో దేవుని వైపుకు తిరిగాడు. అప్పుడు, దేవుడు అతన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనుగొన్నాడు. కారణం, దావీదు కీర్తించినట్లుగా: “ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు, దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు” (కీర్త. 86:15). మనకూ ఒక స్పష్టమైన ఎంపిక ఉంది. మనము మనలో ఉన్న చీలిపోయిన హృదయాలను విస్మరించవచ్చు, లేదా వాటిని లోకానికి దాచడానికి ప్రయత్నించవచ్చు. లేదంటే, వాటిని విడిచిపెట్టి, నిజమైన పశ్చాత్తాపం చెంది, ఆ గొప్ప కరుణామయుడైన దేవుని వాగ్దానాలను మళ్లీ విశ్వసించవచ్చు. 

యేసుక్రీస్తు మనపట్ల చూపిన పూర్ణహృదయ, పరిపూర్ణమైన ప్రేమ కారణంగానే , మనము మన చీలిపోయిన హృదయాలతో ఆయన చెంతకు వచ్చి, సంపూర్ణులుగా మార్చబడగలం. ఆయన హృదయం ఎన్నడూ ఏమాత్రం విభజించబడలేదు – మనం మన పాపాలలో ఆధ్యాత్మికంగా చనిపోయి ఉన్నప్పుడు, ఆయన మనకు తన అమూల్యమైన జీవితాన్ని ఇచ్చాడు; మనం ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు, ఆయన మనలను దేవునితో సమాధానపరచి, తన స్నేహితులమని పిలిచాడు. ఆహా! ఎంత గొప్ప, అద్భుతమైన కృప! మన జీవితాల పట్ల దేవునికున్న ఉద్దేశం, మనం మన కొరకు ఊహించుకోగలిగే లేదా సృష్టించుకోగలిగే తాత్కాలికమైన ఏ గొప్పదనం లేదా ఆనందం కంటే కూడా అత్యంత అతీతమైనది మరియు మహిమకరమైనది. మనం మన దృష్టిని దేవుని వైపు ఉంచి, ఆయన అక్షరాలా నెరవేరే వాగ్దానాలను విశ్వసించినప్పుడు, మన జీవితాలు ఆయన మహిమతో, ఆయన ఉద్దేశంతో, మరియు ఆయన నిత్య ప్రేమతో నిరంతరం ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయి.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

కారా డెడెర్ట్
కారా డెడెర్ట్
కారా డెడెర్ట్ ఒక ప్రైవేట్ కుటుంబ ఫౌండేషన్‌లో సేవలందిస్తున్నారు. ఆమె సువార్త దృక్పథంతో దైనందిన జీవితాన్ని విశ్లేషించే "థింక్ ట్వైస్: ఎవ్రీడే లైఫ్ విత్ గాస్పెల్ పెర్స్పెక్టివ్" అనే వేదికపై క్రమం తప్పకుండా వ్యాసాలు రాస్తుంటారు. ఆమె మరియు ఆమె భర్త డారిల్, తమ ఐదుగురు పిల్లలతో కలిసి మిచిగాన్‌లోని గ్రాండ్ రాపిడ్స్‌లో నివసిస్తున్నారు.