
సంతృప్తిని వెంబడించడానికి 5 మార్గాలు
13/01/2026
ఒక క్రైస్తవునిగా నేను పనిచేసే ప్రదేశంలో దేవునికి మహిమకరంగా ఎలా ఉండగలను?
20/01/2026దేవుడు క్రైస్తవులనుబట్టి ఎల్లప్పుడూ సంతోషిస్తాడా?
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం తెలుసుకోవాలంటే, మనం ఖచ్చితమైన వేద ప్రామాణికత కలిగిన పునాదిని వేయాలి. ఆ పునాది దేనితో మొదలవుతుందంటే, మన క్రియలకంటే ముందు ఆయన కృపకే అగ్రతాంబూలం ఇవ్వడం ద్వారానే.
1. క్రీస్తు లేకుండా, మన సొంత నీతి, కృషి లేదా యోగ్యతల ద్వారా మనం దేవుణ్ణి ఎన్నటికీ సంతోషపరచలేము.
నూతన జన్మ లేని ఆత్మలు దేదేవుణ్ణి సంతోషపరచడానికి ఇష్టపడవు, ఆ శక్తి కూడా వాటికి ఉండదు, పైగా అవి ఆయన ఆజ్ఞలను వ్యతిరేకిస్తాయి (రోమా. 8:5-8). శారీరక స్వభావం లో లోతుగా పాతుకుపోయిన పాపభరితమైన స్వార్థం వారి జీవితాలను శాసిస్తుంది (2 తిమో. 3:1-5). విశ్వాసం ద్వారా మాత్రమే హనోకు దేవునితో నడవగలిగాడు (హెబ్రీ. 11:5-6). మన మనస్సు, సంకల్పం మరియు హృదయంలో మూలమైన, కృపతో కూడిన నవీకరణ సంభవించినప్పుడు మాత్రమే, మనం మన నిస్సహాయ స్థితిని అర్థం చేసుకుంటాము, దేవుడు నీతిమంతుడని అంగీకరిస్తాము, మరియు మనల్ని మనం క్రీస్తుపై ఆధారపరుచుకుంటాము. కృతజ్ఞతతో, దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం ఆయనను నిజంగా సంతోషపెట్టడానికి ప్రయత్నించకముందే, మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుని ధర్మశాస్త్రాన్ని మన హృదయంపై లిఖించి, దాని పట్ల మనలో అభిరుచిని కలిగించాలి.
2. అనాది కాలం నుండి ఒక్క క్షణం కూడా, దేవుడు తన సార్వభౌమ ఎంపిక గురించి పశ్చాత్తాపపడలేదు.
సృష్టికి ముందే, దేవుడు తన పెండ్లికుమార్తె అయిన సంఘాన్ని తనకు అమూల్యమైన ఆస్తిగా, తన కనుపాపగా ఉండడానికి, ప్రేమతో ఆనందంగా గానం చేస్తూ, ఆమెను శాంతపరచడానికి (జెఫన్యా 3:11-17) ముందుగా నిర్ణయించడం ఆయనకు మంచిదనిపించింది. గుర్తించదగిన కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, గొప్పవారిని, జ్ఞానులను, మరియు అధికారంలో ఉన్నవారిని సిగ్గుపరచడానికి, సామాన్యులను, చదువురానివారిని, మరియు బలహీనులను ఎన్నుకోవడమే దేవునికి సంతోషాన్నిచ్చింది (1 కొరిం. 1:20-29). జ్ఞానుల నుండి బయలుపరచు వెలుగును మరుగుచేసి, దానిని అవివేకులపై ప్రకాశింపజేయడం తండ్రికి సంతోషకరమైన సంకల్పం (మత్త. 11:25-27; లూకా 2:14; 12:32). తొందరపాటు గల జాలర్లు, నరహంతకులైన శాస్త్రులు, మరణ శిక్ష పొందుతున్న బందిపోట్లు, పేరుమోసిన వేశ్యలు, అల్లరిచేసే దయ్యాలు పట్టినవారు, మరియు అవినీతిపరులైన సుంకరుల ఉదాహరణలను గమనిస్తే, మానవ అహంకారాన్ని పూర్తిగా పడగొట్టడానికి మరియు తనకు మరింత మహిమను పొందడానికి, అత్యంత అనారోగ్యులుగా మరియు చెత్తవారుగా కనిపించినవారినే దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దేవుడు తన ఎంపిక పట్ల సంతృప్తి చెందితే, ఈ ఎన్నుకునే కోణం నుండి, క్రైస్తవుడు దేవుణ్ణి సంతోషపరుస్తున్నాడు. దేవుడు తన ఎంపిక పట్ల సంతృప్తి చెందితే, ఈ ఎంపిక యొక్క దృష్టిలో, క్రైస్తవుడు దేవుణ్ణి సంతోషపరుస్తున్నాడు.
3. దేవుడు అందరికీ మేలు చేస్తూనే, పరిశుద్ధులను మేలు కోరుతూనే ఉన్నప్పటికీ, తనంతట తానుగా తండ్రికి ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఇష్టుడైన ఒకే ఒక్క మానవుడు యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు (యోహాను 8:29).
క్రీస్తు యొక్క మెస్సీయ సందేశాలు, ఆయన అద్భుతాలు, ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించడం మరియు ఆయన శ్రమల పట్ల దేవుడు సంతోషిస్తాడు. ఆకాశం నుండి ఆయన చేసిన ఉజ్వలమైన అంగీకార ప్రకటన ఇలా ప్రతిధ్వనించింది: “ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను” (మత్త. 3:16-17; 17:5). నిత్య కుమారుడుగా మరియు నిబంధనకు మధ్యవర్తిగా యేసు నిరంతరం దేవుణ్ణి సంతోషపెడుతున్నట్లయితే, ఆయనతో ఐక్యత పొందినవారు ఆయన రక్తంలో కడగబడి, ఆయన నీతిని వస్త్రంగా ధరించుకుని, ప్రియునియందు అంగీకరించబడినవారై (ఎఫె. 1:3-6), తద్వారా దేవుణ్ణి సంతోషపెడుతున్నారు.
4. క్రీస్తులో మన సుస్థిరమైన ఎంపిక మరియు స్థితి (Status), కృతజ్ఞత కలిగిన శిష్యులను, దేవుణ్ణి మరింతగా సంతోషపెట్టే విధేయత వైపుకు నడిపిస్తుంది (ఎఫె. 5:1-10; కొలస్స. 1:9-14). ఈ విధేయత, ముందుగా సిద్ధం చేయబడిన సత్క్రియలను చేయాలనే పిలుపును (ఎఫె. 2:5-10) ఏ మాత్రం నిరాకరించదు లేదా నిర్లక్ష్యం చేయదు.
దానికి బదులుగా, ప్రభువుకు ఇష్టులుగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని మనం నిర్ణయించుకుంటాము. మన సేనాధిపతియైన యేసును సంతోషపెట్టడమే మన ప్రధాన లక్ష్యంగా చేసుకుని, తిమోతి వలె సైనికుల్లాగా మనం దీనిని నెరవేరుస్తాము (2 తిమో. 2:1-4). సిలువ వరకు తనను తాను తగ్గించుకున్న క్రీస్తు మాదిరిలో, మనం సేవకుల్లాగా దీనిని ఆచరిస్తాము. మనం ఇకపై మానవ మెప్పుదల కోసం ఆరాటపడము. బదులుగా, మన స్వార్థపూరిత ఉద్దేశాలను పక్కనపెట్టి, ఎటువంటి అభ్యంతరాలకు తావివ్వకుండా, బలహీనులను స్థిరపరచడానికి, మరియు దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేయడానికి సోదరుల మరియు ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తాము.
5. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో లేఖనం తరచుగా స్పష్టంగా తెలియజేస్తుంది.
ఉద్యోగులు కష్టపడి పని చేసినప్పుడు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడినప్పుడు, వివాహ బంధాలు పటిష్టంగా ఉన్నప్పుడు, పౌరులు పాలకులను గౌరవించినప్పుడు, సభ్యులు పెద్దల బోధలకు శ్రద్ధ వహించినప్పుడు, మరియు వ్యభిచారానికి బదులు నమ్మకత్వం ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు (1 థెస్స. 4:1-8). శాంతి కలహాలను అణచివేసినప్పుడు, సంఘాలు దేవుని వాక్యంతో నిండినప్పుడు, మరియు విశ్వాసులు (గాయపడకుండా లేదా ఆకలితో ఉండకుండా) పోషించబడినప్పుడు మన ప్రవర్తనను దేవుడు ఆమోదిస్తాడు. అంతరంగ వాస్తవికత వ్యర్థమైన ఆచారాల స్థానాన్ని భర్తీ చేసినప్పుడు, అపరాధులు విరిగిన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు (కీర్త. 51:16-17; మీకా 6:6-8), క్షమించబడిన పరిశుద్ధులు ఉదారమైన కానుకలు కలిపి బలిపూర్వకమైన సేవను అర్పించినప్పుడు (ఫిలిప్పీ. 4:18; హెబ్రీ. 13:16), మరియు మనం ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు (1 తిమో. 2:1-4), క్రైస్తవ సేవ ప్రశంసించబడుతుంది.
6. దేవుణ్ణి సంతోషపెట్టే మార్గాన్ని అనుసరించడానికి రెండు సత్యాలు తోడ్పడతాయి.
వాటిలో ఒకటి: దేవుని మెప్పుదల పొందాలనే ఈ పట్టుదల మరియు అపేక్ష ఏవీ స్వయంగా మనలో పుట్టినవి కావు. బదులుగా, దేవుడు అంగీకరించే విధంగా మనం ఆలోచించడానికి మరియు ప్రవర్తించడానికి మన హృదయాలలో పనిచేస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా అన్వయించబడిన క్రీస్తు యొక్క శక్తివంతమైన సువార్త వాక్యపు ఫలితం మరియు ప్రభావం మాత్రమే అది (ఫిలిప్పీ. 2:12-13; హెబ్రీ. 13:20-21). మరొక సత్యం ఏమిటంటే, మనం మానవ ప్రశంసల కోసం ఆరాటపడటాన్ని విడిచిపెట్టి, స్వార్థాన్ని చంపుకొని, మనల్ని మనం దేవునికి అర్పించుకుని, మరియు ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, సిలువ యొక్క వినయపూర్వకమైన మార్గమే నిజమైన స్వాతంత్ర్యానికి మరియు జీవితానికి మార్గమని మనం కనుగొంటాము (రోమా. 14:1-15:33; 1 కొరిం. 10:31–33). లేఖనం చెప్పినట్లుగా, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” (అపొ. కార్యములు 20:35). మనం ఆయనయందు ఆనందాన్ని పొందడం దేవునికి మరింత సంతోషాన్నిస్తుంది.
7. మన జీవితాలలో ఉన్న పాపాన్ని దేవుడు నిస్సందేహంగా అంగీకరించడు అని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది.
దావీదు బత్సెబాను గ్రహించినప్పుడు మరియు గర్వంతో జనాభా లెక్కలను ఆజ్ఞాపించినప్పుడు, యెహోవా సంతోషించలేదు (2 సమూ. 11:27; 1 దిన. 21:1-7). దయలేని పనులు పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలిగిస్తాయి (ఎఫె. 4:25-32). తన పరిశుద్ధులకు నిత్యమైన మేలు కలగడానికి, మన తండ్రి ప్రేమతో తన పిల్లలను క్రమ శిక్షణ చేస్తాడు (హెబ్రీ. 12:5-11), ఘోరమైన అపరాధాల విషయంలో కూడా తీవ్రంగా క్రమ శిక్షణ చేస్తాడు(1 కొరిం. 11:28-34). ఏడు ఆసియా సంఘాలలో ఆరింటిలో క్రీస్తు తప్పులను ఎత్తి చూపినప్పటికీ (ప్రకటన 2:1-3:22), కృప ఎల్లప్పుడూ చివరి మాటై ఉంటుంది. మనం మట్టి వంటివారమని, మరియు పాపం యొక్క వేతనాన్ని మనం చెల్లించలేమని ప్రభువుకు తెలుసు, అయితే మనం పొరబడినప్పుడు, దేవుడు ఓర్పుతో మనలను క్షమించి, జాలి చూపిస్తాడు (కీర్త. 103:8-18).
ముగింపు
తన నిత్య సంకల్పం విషయమై, దేవుడు పరిశుద్ధుల పట్ల ఎల్లప్పుడూ సంతోషిస్తాడు. విశ్వాసులకు క్రీస్తులో ఉన్న సుస్థిరమైన స్థితి కారణంగా, దేవుని సంపూర్ణ ఆమోదం ఖచ్చితమైనది. అయితే, మన క్రియల విషయానికి వస్తే, దేవుడు పాపాన్ని అంగీకరించడు. కానీ, ఆయన శక్తితో మనలో కలుగజేసే విధేయతను మాత్రమే ఆమోదిస్తాడు. మన తీవ్రమైన పాపాలు మరియు తప్పులు ఉన్నప్పటికీ, మనలను రక్షించడానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడని మనం ఆలోచిస్తే, దానికి కారణం ఇది: ఆయన మహిమపరచబడాలి మరియు ఆనందించబడాలి అనే. మన హీన స్థితికి ఆయన దిగివచ్చి, మనలను తన ఔన్నత్యాలకు ఎత్తడం ద్వారా, ఆయన తన ఓర్పుగల, కరుణామయ, క్షమించే హృదయాన్ని బయలుపరుస్తాడు. దీనివల్ల, ఆయన మహిమగల కృపకు స్తోత్రము కలుగునట్లుగా, ఆయన నిత్యజీవితం మనలో ప్రదర్శితమవుతుంది.
ఈ వ్యాసం క్రైస్తవ శిష్యత్వం యొక్క ప్రాథమిక అంశాలు అనే సేకరణలో భాగం.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


