How-Is-Jesus-the-True-Vine
యేసు నిజమైన ద్రాక్షావల్లి ఎలా అయ్యాడు? 
03/11/2025
How-Is-Jesus-the-Way-the-Truth-and-the-Life
యేసు ఎలా మార్గం, సత్యం మరియు జీవం అయ్యాడు?
06/11/2025
How-Is-Jesus-the-True-Vine
యేసు నిజమైన ద్రాక్షావల్లి ఎలా అయ్యాడు? 
03/11/2025
How-Is-Jesus-the-Way-the-Truth-and-the-Life
యేసు ఎలా మార్గం, సత్యం మరియు జీవం అయ్యాడు?
06/11/2025

యేసు పునరుత్థానమును, జీవమును ఎలా అయ్యాడు?

The-Resurrection-and-the-Life

ప్రసంగి గ్రంథంలోని జ్ఞానియైన బోధకుడు, దైవభక్తిని వృద్ధిచేసే ఒక స్థలం గురించి చెబుతున్నాడు. ఆ స్థలం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఆయన ఇలా అంటున్నాడు:

విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె
ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; (ప్రసంగి 7:2).

అంతేకాకుండా, ఆయన ఇలా కూడా గుర్తుచేస్తున్నాడు: “జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటి మీద నుండును;” (ప్రసంగి 7:4).

ఆయన ఉద్దేశం మీకు సులభంగా అర్థమవుతుందనుకుంటాను. ఒక అంత్యక్రియలకు హాజరవడం లేదా స్మశానవాటికను సందర్శించడం మన ఆత్మకు మేలు చేస్తుంది, ఎందుకంటే నిత్యత్వపు వాస్తవాలు మనకు మరింత సమీపంగా వస్తాయి.

యోహాను 11వ అధ్యాయం పాఠకుడిని ఒక దుఃఖ గృహమునకు తీసుకువస్తుంది. మరణం కలిగించే నిరాశను, దాని ఓటమిని మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ మనలను ఇక్కడికి నడిపిస్తుంది. యోహాను 11వ అధ్యాయం గురించి జె.సి. రైల్ ఇలా వ్రాశాడు: “దాని గొప్పదనంలో, సరళతలో, భావోద్వేగంలో, గంభీరతలో కొత్త నిబంధనలో ఇది అత్యంత విశిష్టమైన అధ్యాయాలలో ఒకటిగా నిలుస్తుంది; దీనికి సాటిగా వ్రాయబడినది లేదు.”¹

సందర్భం

ఈ భాగం యేసు తన స్నేహితుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడని ఒక సమాచారం అందడంతో ప్రారంభమవుతుంది (యోహాను 11:3). యేసు రోగులను స్వస్థపరిచే శక్తి గురించి మరియ, మార్తాలు నిశ్చయంగా విని ఉంటారు, బహుశా చూసి కూడా ఉండవచ్చు. యేసు త్వరగా వస్తే, లాజరును రక్షించగలరని వారు నమ్మారు.

అయితే, యేసు యొక్క ప్రతిస్పందన ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.

యోహాను ఇలా రాశాడు: “యేసు మార్తను, ఆమె సహోదరియైన మరియను, లాజరును ప్రేమించెను. కాబట్టి, లాజరు రోగముగా ఉన్నాడని విన్నప్పుడు, తాను ఉన్నచోటనే ఇంకా రెండు దినములు నిలిచెను” (యోహాను 11:5–6).

ఇక్కడ ఉపయోగించిన “కాబట్టి” అనే చిన్న పదం సాధారణంగా “అందువల్ల” అని అనువదించబడుతుంది. కాబట్టి, ఈ వాక్యం మరింత సూటిగా ఇలా చెబుతుంది: “యేసు మార్తను, మరియను, లాజరును ప్రేమించాడు, అందువల్ల… ఆయన ఇంకా రెండు రోజులు అక్కడే ఉండిపోయాడు.” ఆసక్తికరంగా, ఆయనకున్న ప్రేమయే ఆయనను వేచి ఉండేలా చేసింది. తన శిష్యులపట్ల ఉన్న లోతైన ప్రేమ ఆలస్యానికి కారణమైంది. ఆ బాధ, అనారోగ్యం వాటి పూర్తి స్థాయికి చేరుకునే వరకు ఆయన వేచి ఉన్నాడు.

క్రీస్తు పాఠశాలలో మనం ఎల్లప్పుడూ ఈ గొప్ప పాఠాన్ని నేర్చుకుంటూనే ఉంటాము. మీరు ప్రభువును ఏదైనా చేయమని అడిగినప్పుడు, ఆయన వెంటనే జవాబివ్వకపోయినా, లేదా మీరు కోరిన సమయానికి జవాబివ్వకపోయినా ఎన్నిసార్లు అలా అనిపించింది? ఆయన ప్రతిస్పందనలో ఉన్న ఆలస్యం ఆయన ప్రేమ పనిచేస్తుండటానికి, మరియు మీరు అడిగినదానికంటే, లేదా ఊహించినదానికంటే ఎక్కువగా చేయడానికి ఆయనకున్న ప్రణాళికకు మాత్రమే నిదర్శనమని తెలుసుకోండి.

సారాంశం

లాజరు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత, యేసు చివరికి ఆ దుఃఖ గృహమునకు చేరుకున్నాడు. మార్త పరుగెత్తుకుని యేసు దగ్గరకు వచ్చి, ఆయన్ని కలుసుకుని ఇలా అంది: “ప్రభువా, నీవు ఇక్కడ ఉండినయెడల నా సహోదరుడు చనిపోక పోవును. ఇప్పుడైనను నీవు దేవుని ఏది అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని యెరుగుదును” (యోహాను 11:21-22). మార్తలో విశ్వాసపు విత్తనం స్పష్టంగా ఉంది. అప్పుడు యేసు ఆమెకు “నీ సహోదరుడు మరల లేచును” అని హామీ ఇస్తాడు (యోహాను 11:23).

అందుకు మార్త, “అంత్యదినమున పునరుత్థానమందు అతను లేస్తాడని నాకు తెలుసు” అని బదులిచ్చింది (యోహాను 11:24). యేసు కాలంలో పునరుత్థానం గురించి పరిసయ్యులకు, సద్దూకయ్యులకు మధ్య పెద్ద వాదన జరిగింది. చరిత్ర ముగింపున పునరుత్థానం ఉంటుందా అనేది వారి మధ్య ఉన్న ప్రశ్న. పునరుత్థానం విషయంలో సిద్ధాంతపరంగా మార్త పరిసయ్యుల పక్షాన ఉంది. యుగాంతంలో లాజరు మళ్లీ లేస్తాడనే నమ్మకం ఆమెకు ఉంది.

అయితే, యేసు ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఇలా అన్నాడు: “పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను జీవించును. మరియు బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా?” (యోహాను 11:25-26).

యోహాను సువార్తలో ఇది ఐదవ “నేనే” అనే ప్రకటన—మరియు ఇది ఎంతో అద్భుతమైనది. యేసు ఇలా చెబుతున్నాడు:

“నేను కేవలం పునరుత్థానమును బోధించేవాడిని కాదు; నేనే పునరుత్థానం. నేను కేవలం జీవము కొరకు దేవుని శక్తిని గురించి మాత్రమే ప్రకటించను; నేనే ఆ శక్తిని. కేవలం ఈ మాటను నమ్మడం కాదు; నన్నే నమ్మండి.”

నిజమైన విశ్వాసం అంటే యేసు గురించిన సమాచారాన్ని, లేదా వాస్తవాలను కేవలం నమ్మడం కాదు. అది సమస్త సత్యము ఎవరిలో ఉందో ఆయన్నే నమ్మడం.

నిశ్చయత

యేసు బిగ్గరగా “లాజరూ, బయటికి రా” అని పిలవగానే, మరణం నుండి సజీవుడిగా మారిన ఆ వ్యక్తి రక్షణకు ఒక నడిచే ఉపమానంగా మారాడు. పునరుత్థానము, జీవము అయిన యేసుకు అతను ఒక సజీవ స్మారక చిహ్నం. లాజరు లేచిన తర్వాత, యేసు “అతని కట్లు విప్పి, పోనివ్వండి” అని ఆజ్ఞాపించాడు (యోహాను 11:43–44).

సువార్తకు ఎంత గొప్ప చిత్రణ! మనం మన పాపాలలో చనిపోయామని బైబిల్ చెబుతోంది. అవిశ్వాసం అనే బంధనాలు మనల్ని కట్టివేస్తాయి, మరియు పాపం అనే వస్త్రాలు మనల్ని కప్పి ఉంచుతాయి. లాజరు విషయంలో ఉన్నట్లుగానే, మనల్ని మనం సజీవులనుగా చేసుకోవడానికి మనం ఏమీ చేయలేము. అయితే, దేవుడు చనిపోయిన పాపులు యేసును విశ్వసించినప్పుడు వారిని సజీవులనుగా చేస్తాడు. రక్షకుడు పాపుల స్థానంలో చనిపోయి, తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మరణంపై, పాతాళంపై అధికారం కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని పిలుస్తూ, “బయటికి రండి. మీ పాపం నుండి పశ్చాత్తాపపడి నన్ను నమ్మండి. నేను పాపపు బంధకాల నుండి మిమ్మల్ని విడిపించి మీకు స్వేచ్ఛను ఇస్తాను” అని అంటున్నాడు.

ఐదవ ‘నేనే’ అనే ప్రకటనలో, ఆ సూచనను చూచి, ఆ వాక్యమును విని, మనమందరం మార్త వలెనే ఇలా ప్రతిస్పందిద్దాం: “అవును ప్రభువా, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువని నేను నమ్ముచున్నాను” (యోహాను 11:27).

ఈ వ్యాసం యేసు చెప్పిన “నేనే” అనే ప్రకటనల శ్రేణిలోనిది.


¹ జె.సి. రైల్, ఎక్స్పోసిటరీ థాట్స్ ఆన్ జాన్ (ఎడిన్‌బర్గ్: బ్యానర్ ఆఫ్ ట్రూత్, 2012), 2:256.

జోర్డాన్ స్టోన్
జోర్డాన్ స్టోన్
డా. జోర్డాన్ స్టోన్ మెకిన్నీ, టెక్సాస్‌లోని రిడీమర్ ప్రెస్బిటేరియన్ చర్చిలో సీనియర్ పాస్టర్‌గా, మరియు డల్లాస్‌లోని రిఫార్మ్డ్ థియాలాజికల్ సెమినరీలో పాస్టోరల్ థియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆయన రచించిన అనేక పుస్తకాలలో ఎ హోలీ మినిస్టర్: ది లైఫ్ అండ్ స్పిరిచ్యువల్ లెగసీ ఆఫ్ రాబర్ట్ ముర్రే మక్‌చెయిన్ ఒకటి.