
యేసు ఎలా జీవాహారము?
28/10/2025
యేసు పునరుత్థానమును, జీవమును ఎలా అయ్యాడు?
04/11/2025యేసు నిజమైన ద్రాక్షావల్లి ఎలా అయ్యాడు?
మార్క్ జాన్‌స్టన్
యేసు చెప్పిన ఏడు “నేను ఉన్నవాడను” (“I Am”) ప్రకటనలలో చివరిది, “నేనే నిజమైన ద్రాక్షావల్లిని” (యోహాను 15:1), ముఖ్యంగా యూదులు కాని వారికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలామంది పాఠకులు, బోధకులు ఈ మాటలను కేవలం వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఫలించాలి అనేదానికి ఒక ఉపమానంగా మాత్రమే చూసేందుకు మొగ్గు చూపుతారు. అయితే, యేసు ఈ మాటలను మొదటిసారి పలికినప్పుడు, వాటిని విన్న యూదులు మాత్రం అలా అర్థం చేసుకోలేదు.
ఈ ప్రకటనలోని ప్రతి అంశం ఆ యూదుల మనస్సులను వెంటనే వారి హెబ్రీ బైబిల్‌లోకి మళ్ళించి ఉంటుంది. ఎందుకంటే ద్రాక్షావల్లి అనే ప్రతీక దేవుడు ఇశ్రాయేలుతో వ్యవహరించిన విమోచన చరిత్ర అంతటా నిరంతరం కనిపిస్తుంది. అందువల్ల, యేసు మాటల ప్రాముఖ్యత వారికి అర్థం కావడం మొదలైనప్పుడు, ఆయనే దాని నెరవేర్పు అని తన గురించి ధైర్యంగా చెప్పినందుకు వారు ఎంతో ఆశ్చర్యపోయారు.
కీర్తనల గ్రంథంలో, ఇశ్రాయేలు ఒక దేశంగా ఎలా ఉనికిలోకి వచ్చిందో కీర్తనకారుడు ఇలా చెబుతున్నాడు:
“నీవు [దేవుడా] ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి;
అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి (కీర్తన 80:8).”
ప్రవక్త యెషయా, ఇశ్రాయేలు ఆత్మీయంగా దేవుని నుండి దూరమవుతున్నప్పుడు వారిని హెచ్చరిస్తూ, దేవుడు నాటి శ్రద్ధగా చూసుకున్న ఒక ద్రాక్షతోట గురించి మాట్లాడాడు. అయితే, ఆ తోట అదుపు తప్పి, ఫలించకుండా పోయింది (యెషయా 5:1–6). యిర్మీయా కూడా అదే భాషను ఉపయోగించాడు (యిర్మీయా 2:21). ఇది చాలా అందమైన, అదే సమయంలో లోతైన, దుఃఖభరితమైన రూపకం.
దేవుని ప్రజలుగా ఇశ్రాయేలు చరిత్ర అంతా ఆయన ప్రేమకు, వారి పట్ల ఆయనకున్న శ్రద్ధకు నిదర్శనాలతో నిండి ఉంది. ఆయన వారిని ఎన్నుకున్నాడు, బానిసత్వం నుండి విమోచించాడు, అరణ్యం గుండా నడిపించాడు, మరియు వారికి సొంత దేశాన్ని ఇచ్చాడు. ఒక దేశంగా వారు ఆత్మీయంగా వర్ధిల్లడానికే కాకుండా, లోకంలోని ప్రజలందరికీ తన ఆశీర్వాదాన్ని అందించే సాధనంగా ఉండటానికి కావలసినవన్నీ వారికి ఇచ్చాడు (ఆదికాండము 12:3). కానీ వారు ఆ బహుమానాన్ని వృథా చేసుకుని, తమ ఉనికికి కారణమైన దేవుని నుండి దూరమయ్యారు.
యేసు తనను ద్రాక్షావల్లిగా ప్రస్తావించినప్పుడు, ఆయన శిష్యులు ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఎలాగైతే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు సమష్టి అస్తిత్వం వారి విమోచకుడైన దేవునిలో వేళ్లూనుకుందో, అలాగే వారి ఆత్మీయ జీవం, ఫలభరితత్వం కూడా ప్రభువుగా, రక్షకుడిగా ఆయనతో ఉన్న ఐక్యతలోనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు, మరింత మహిమాన్వితమైన రీతిలో, దేవుడు చేసిన వాగ్దానాలన్నీ క్రీస్తులోనే నెరవేరాయి.
నేటి క్రైస్తవులలో చాలామంది ఆలోచనలు ఆధునిక వ్యక్తివాదం (individualism) వల్ల ప్రభావితమయ్యాయి. ఇది ప్రధానంగా తమ గురించీ, తమ స్వంత జీవితాల గురించీ మాత్రమే దృష్టి పెడుతుంది. కానీ ఈ ఆలోచనా ధోరణి బైబిలు బోధనకు విరుద్ధం. ఎందుకంటే లేఖనాలు మనం కేవలం వ్యక్తిగతంగా ఏమై ఉన్నామో దానిపై మాత్రమే కాకుండా, రక్షణలో మన కొత్త జీవితంలో మనం సమిష్టిగా ఏమై ఉన్నామో దానిపై కూడా ప్రధానంగా దృష్టి పెడతాయి. యేసు తనకూ తన ప్రజలకూ మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి ద్రాక్షావల్లి, దాని కొమ్మల రూపకాన్ని ఉపయోగించాడు. ఆయన శిష్యులు ఆయన చెప్పిన దానిని ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా, ఆయనతో ఉన్న ఐక్యత అనివార్యంగా ఆత్మీయ ఫలభరితత్వానికి ఎలా దారి తీస్తుందో వారికి బాగా తెలుసు.
యేసు తాను నిజమైన ద్రాక్షావల్లి అనే ఉపమానాన్ని మొదట, పైకి తన అనుచరులుగా కనిపించేవారు కానీ నిజానికి ఆయనకు చెందని వారి గురించే ప్రస్తావించడం గమనార్హం: “నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన [తండ్రియైన దేవుడు] తీసివేయును” (యోహాను 15:2). ఆయన ఇక్కడ సంఘంలో బాహ్యంగా పాల్గొంటూ, కానీ నిజమైన విశ్వాసం లేని వారి గురించి మాట్లాడుతున్నాడు. వారి విశ్వాసం నిజమైనది కాదు కాబట్టి, పౌలు తర్వాత “ఆత్మ ఫలము” (గలతీయులకు 5:22–23) అని పిలిచిన దానికి సంబంధించిన సాక్ష్యం వారిలో ఉండదు.
ఆ తర్వాత, యేసు నిజమైన ద్రాక్షావల్లి అయిన తనలో ప్రజలు ఎలా భాగమయ్యారో వివరిస్తూ, నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు” (యోహాను 15:3) అని అంటాడు. సువార్తలో ఆయన పలికిన ఈ మాట ఒక ప్రకటన వంటిది. అది విశ్వసించే వారికి క్షమాపణనే కాకుండా, ఆయన నీతిమంతులుగా తీర్చే కృప ద్వారా పవిత్రీకరణను కూడా ధృవపరుస్తుంది. దేవుని ముందు మనకు లభించిన ఈ కొత్త స్థితిని గురించి ఆయన ఒకేసారి చేసే ఒక ప్రకటన ఇది.
అయితే, వేదాంతవేత్తలు తరచుగా చెప్పినట్లుగా, “విశ్వాసం మాత్రమే నీతిమంతులుగా తీరుస్తుంది, కానీ నీతిమంతులుగా తీర్చే ఆ విశ్వాసం ఒంటరిగా ఉండదు.” విశ్వాసం పవిత్రీకరణ అనే కృపతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంటుంది. ఆయన క్షమాపణ, అంగీకారం ద్వారా దేవుని ముందు మనకు లభించిన ఈ కొత్త న్యాయస్థితి, మన జీవితాల్లో ఆయన రూపాంతరపరిచే కృపకు సాక్ష్యంగా తప్పక వెల్లడి కావాలి. ఆయన తన కుమారుడైన, మన రక్షకుడు యేసు స్వరూపంలోనికి మనలను క్రమంగా మారుస్తాడు.
అయితే, తరచుగా లేఖనాల్లో ఇతర చోట్ల ప్రతిధ్వనించినట్లుగానే, మన కొత్త జీవితంలో ఈ ఎదుగుదల, ఫలభరితత్వం ఒక మూల్యాన్ని కోరి వస్తుంది. తండ్రి కొమ్మలను మరింత ఫలభరితంగా ఉండటానికి వాటిని “కత్తిరిస్తాడు” (యోహాను 15:2). దేవుని సంకల్పంలోని కఠిన పరీక్షల ద్వారా, జీవిత పోరాటాల ద్వారా దేవుడు మనల్ని స్వయంపై ఆధారపడటం నుండి విడిపించి, తన కుమారునిలో మరింత సంపూర్ణంగా నిలిచి ఉండటం నేర్పిస్తాడు.
యేసు తనలో “నిలిచియుండడం” అంటే ఆచరణలో ఏమిటో అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన విషయాన్ని వివరించడం గమనించదగినది: మనం ఆయనలో నిలిచియుండాలి మరియు ఆయన మాటలు మనలో నిలిచియుండాలి (యోహాను 15:7). దీనికి సాక్ష్యం మన ప్రార్థనా జీవితంలో కనిపిస్తుంది. మనం మన అవసరాలను దేవుని ముందు ఉంచినప్పుడు, ఆయన మన ప్రార్థనలకు జవాబివ్వడం చూస్తాం.
సారాంశంలో చెప్పాలంటే, క్రీస్తు శిష్యులమైన మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి (యోహాను 15:9). ఈ ఒక్క విషయమే పౌలు మనస్సులో బలంగా నాటుకుపోయింది. అందుకే ఆయన గలతీయులకు ఇలా లోతైన భావంతో ప్రకటించాడు: “ఆయన [క్రీస్తు] నన్ను ప్రేమించి, నా కొరకు తన్ను తాను అప్పగించుకొనెను” (గలతీయులకు 2:20). క్రీస్తు పట్ల పౌలుకు ఉన్న ప్రేమ, క్రీస్తు ఆయనపట్ల చూపిన ప్రేమ అనే సారవంతమైన నేలలో చిగురించి, పెరిగింది. నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తుతో ఐక్యమైన మనందరికీ కూడా ఇదే జరుగుగాక.
ఈ వ్యాసం యేసు చెప్పిన “నేను ఉన్నవాడను” అనే మాటల శ్రేణిలో భాగం.
రెవ. మార్క్ జి. జాన్‌స్టన్ ఉత్తర ఐర్లాండ్‌లోని ట్రినిటీ ఈపీసీ, రిచ్‌హిల్ సంఘ స్థాపన పనుల్లో పది సంవత్సరాలు పర్యవేక్షకుడిగా సేవ చేశారు. ఆయన ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్ మరియు వేల్స్‌లలో కూడా పాస్టర్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన ఉత్తర ఐర్లాండ్‌లోని గ్రూమ్స్‌పోర్ట్ ఈపీసీలో పాస్టర్‌గా ఉన్నారు. ఆయన బ్యానర్ ఆఫ్ ట్రూత్ ట్రస్ట్ బోర్డులో కూడా పనిచేస్తున్నారు. అంతేకాకుండా, ఆయన ‘దిస్ వరల్డ్ ఈస్ నాట్ మై హోమ్: రిఫ్లెక్షన్స్ ఫర్ పిల్గ్రిమ్స్ ఆన్ ది వే’ తో పాటు, ‘లెట్స్ స్టడీ’ సిరీస్‌లో భాగంగా యోహాను, కొలొస్సయులు, ఫిలేమోను మరియు 2 పేతురు-యూదా పత్రికలపై వ్యాఖ్యానాలు వంటి అనేక పుస్తకాలను రచించారు.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


