What Is Christian Maturity?

క్రైస్తవ పరిపక్వత అంటే ఏమిటి?

29/10/2026
Jesus Is the New Temple

యేసే నూతన దేవాలయం

05/11/2026
What Is Christian Maturity?

క్రైస్తవ పరిపక్వత అంటే ఏమిటి?

29/10/2026
Jesus Is the New Temple

యేసే నూతన దేవాలయం

05/11/2026

రోజువారీ జీవితంలో దేవుని పరిశుద్ధత యొక్క పరివర్తన శక్తి

The Transforming Power of God’s Holiness in Everyday Life

నేను క్రీస్తును స్వీకరించిన కొన్ని వారాల తర్వాత, నా స్నేహితులలో చాలామంది నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు, ముఖ్యంగా భవిష్యత్తులో నా రాత్రి జీవితంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే దాని గురించి: నేను అప్పటికి బయటకు వెళ్తానా? నేను మద్యం సేవించడానికి “అనుమతి” ఉందా? ఆ తొలి రోజుల్లో నా స్నేహితుడి తండ్రి అడిగిన ఒక ప్రశ్న నా మదిలో ప్రత్యేకంగా నిలిచింది. ఆయన నా దగ్గరకు వచ్చి, “అందరూ బయట సరదాగా గడుపుతూ, జీవితాన్ని ఆస్వాదిస్తుంటే, మీ జీవితాంతం మీరు సంఘానికి వెళ్తూ ఉండిపోవాల్సి వస్తుందని తెలుసుకోవడం ఎలా ఉంటుంది?” అని అడిగారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, అలాంటి ప్రశ్నకు నాకే నవ్వు వస్తుంది, కాని ఆ క్షణంలో అది నన్ను నిశ్శబ్దంగా ఇలా ప్రశ్నించుకునేలా చేసింది: నా “విందు” జీవితాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా (మరియు సమర్థంగా) ఉన్నానా? ఆదివారం సంఘములో గడపడానికి నేను సిద్ధంగా ఉన్నానా? అపొస్తలుడైన పౌలు మాటల్లో చెప్పాలంటే, గడిచిపోయినవాటిని మరచిపోయి, రాబోయే వాటి కోసం ప్రయాసపడటానికి నేను సిద్ధంగా ఉన్నానా? (ఫిలిప్పీయులకు 3:13).

నేను క్రీస్తును అనుసరిస్తున్న ముప్పై ఏళ్లకు పైగా కాలంలో, పైన చెప్పినటువంటి సంభాషణలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు, వాటిలో ప్రధానంగా వినిపించే అంశం ఎప్పుడూ భూసంబంధమైన విషయాలే. అది ఎప్పుడూ నా గురించి, నా కోరికల గురించి, నేను ఎవరనే దాని గురించి, నాకు ఏమి కావాలనే దాని గురించి ఉండేది. అది ఎన్నడూ దేవుని గురించి, ఆయన కోరికల గురించి, ఆయన ఎవరనే దాని గురించి, ఆయనకు ఏమి కావాలనే దాని గురించి ఉండేది కాదు. ఇందులో ఆశ్చర్యమేమి లేదు; అవిశ్వాసులు భౌతిక ప్రపంచానికి అతీతంగా ఆలోచిస్తారని మనం ఎన్నడూ ఆశించకూడదు. క్రీస్తుతో ఐక్యమైన వారు మాత్రమే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. పౌలు చెప్పినట్లుగా, “భౌతిక సంబంధమైన వాడు దేవుని ఆత్మ సంబంధమైన విషయములను అంగీకరించడు; అవి వాని దృష్టిలో అవివేకముగా కనబడును; ఆత్మ సంబంధమైన వివేచన వలన కలుగునవి గనుక వాటిని గ్రహించజాలడు” (1 కొరింథీ. 2:14).

ఇది నన్ను ఈ వ్యాసం యొక్క అంశానికి తీసుకువస్తుంది: దేవుని పరిశుద్ధత యొక్క పరివర్తన శక్తి. నేను క్రైస్తవునిగా మారిన కొన్ని నెలల తర్వాత, ఈ లోక విషయాలను విడిచిపెట్టి, వాటికి బదులుగా పరిశుద్ధతను వెంబడించాలనే నా కోరిక, క్రీస్తులో ఉన్న దేవుని గురించిన నా అనుభవజ్ఞానం మీద ఆధారపడి ఉందని నాకు స్పష్టమైంది. దేవుడు ఎవరో అనే దానిపై నా అవగాహన ఎంత లోతుగా ఉంటే, ఆయనలా ఉండాలనే నా అన్వేషణ అంత గొప్పదైంది. దేవుని పరిశుద్ధత విషయంలో ఇది ప్రత్యేకంగా నిజము.

దేవుని పరిశుద్ధత కేవలం ఒక గుణం కాదు—అది ఆయన స్వరూపానికి పునాది మరియు అసలైన సారం. అది ఆయన సంపూర్ణ స్వచ్ఛత, నైతిక పరిపూర్ణత, మరియు సామాన్యమైన లేదా అపవిత్రమైన వాటి నుండి పూర్తిగా వేరుగా ఉండటం. దైవశాస్త్రి లూయిస్ బెర్ఖోఫ్ చెప్పినట్లుగా, పరిశుద్ధుడైన దేవుడు “తన జీవులన్నిటి నుండి వేరుగాను, అనంతమైన మహిమతో వాటికంటే ఉన్నతంగాను ఉన్నాడు.”1 “పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” (యెషయా 6:3; ప్రకటన 4:8) అనే త్రివిధ ఉచ్ఛారణతో నొక్కి చెప్పబడిన దేవుని ఏకైక గుణం పరిశుద్ధత మాత్రమే. పరిశుద్ధతను గురించిన ఈ త్రివిధ ప్రకటన, దేవుడు పూర్తిగా వేరుగా ఉన్నాడని—ఆయన వంటి వారు ఎవరూ లేరని నొక్కి చెబుతుంది. జోయెల్ బీకి దీనిని ఈ క్రింది విధంగా వివరిస్తాడు: “ఆయన తన మహిమ చేత, తన మహిమ కొరకే వేరుగా ఉన్నాడు. . . . ఆయన దేవునిగా తన స్వరూపమునుబట్టి పరిశుద్ధుడు, [మరియు] ఆయన చేసే ప్రతి పనిలో తన స్వరూపాన్ని ప్రదర్శించడానికి తీవ్రంగా కట్టుబడి ఉన్నందున పరిశుద్ధుడు.”2

లోపాలతో, అస్థిరతలతో కూడిన మన పరిశుద్ధతకు భిన్నంగా, దేవుని పరిశుద్ధత నిత్యమైనది మరియు మార్పులేనిది. ఆయన చేసే ప్రతి పనిని అదే నిర్వచిస్తుంది. ఉదాహరణకు, దేవుని ప్రేమ పరిశుద్ధమైనది; ఆయన న్యాయం పరిశుద్ధమైనది; ఆయన కరుణ పరిశుద్ధమైనది; ఆయన శక్తి పరిశుద్ధమైనది; ఆయన సత్యం పరిశుద్ధమైనది. కాబట్టి, దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకుని, దానిని స్వీకరించడం మన ఆలోచనా విధానాన్ని, జీవన విధానాన్ని మరియు ఆరాధనా విధానాన్ని రూపాంతరం చెందిస్తుంది.

మనం దేవుని పరిశుద్ధతను నిజంగా అనుభవించినప్పుడు, మనం మార్పు చెందుతాము. యెషయా 6వ అధ్యాయాన్ని పరిశీలించండి. దేవుని పరిశుద్ధతను చూసి యెషయా ఎంతగానో దిగ్భ్రాంతి చెందాడు. అతడు పూర్తిగా కృంగిపోయి, “నాకు శ్రమ!” అని కేకలు వేశాడు (యెషయా 6:5). దేవుని పరిశుద్ధతను అనుభవించడం మనల్ని వినయవంతులుగా చేస్తుంది, మన పాప స్వభావాన్ని బయటపెడుతుంది, మరియు మన మనస్సులను, హృదయాలను పునర్నిర్మిస్తుంది. ఇది మన కోరికలను, సంకల్పాలను ఆయన కోరికలకు, సంకల్పాలకు అనుగుణంగా మార్చుకునేలా మనల్ని ప్రేరేపిస్తుంది. మరియు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేది మన పట్ల దేవుని కోరిక మరియు సంకల్పం: “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండవలెను” (లేవీయకాండము 11:44; 1 పేతురు 1:16). ఆయన అవసరాన్ని మనం గుర్తించినప్పుడు, ఆయన ఉద్దేశ్యాల కొరకు మనం ప్రత్యేకించబడి, ఆయన స్వరూపంలోకి రూపాంతరం చెందుతాము.

దీనిని విపులంగా వివరించడం ఈ చిన్న ధ్యాన పరిధికి మించినది, కాని పాఠం చాలా సరళమైనది: మీరు క్రీస్తును మరింతగా పోలి ఉండాలనుకుంటే, మీ పరిశుద్ధ దేవుడైన తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముని తెలుసుకోవడానికి ప్రతీ ప్రయత్నం చేయండి. ఆర్.సి. స్ప్రౌల్ రాసిన ‘దేవుని పరిశుద్ధత’, లేదా జె.ఐ. ప్యాకర్ రాసిన ‘దేవుని తెలుసుకొనూట’, లేదా స్టీఫెన్ చార్నాక్ రాసిన ‘దేవుని ఉనికి మరియు లక్షణాలు’ అనే పుస్తకాలను చదవండి. అన్నిటికంటే ముఖ్యంగా, క్రీస్తును గూర్చిన మీ జ్ఞానంలో వృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రార్థనాపూర్వకంగా లేఖనాలను చదవండి. డి.ఎ. కార్సన్ చెప్పినట్లుగా:

ప్రజలు పరిశుద్ధత వైపు సహజంగా ప్రయానించరు. కృపాప్రేరితమైన ప్రయత్నం లేకుండా, ప్రజలు దైవభక్తి, ప్రార్థన, లేఖనాలకు విధేయత, విశ్వాసం మరియు ప్రభువునందు ఆనందించడం వంటి వాటి వైపు ఆకర్షితులు కారు. మనం రాజీ వైపు ప్రయానిస్తాము; . . . మనం అవిధేయత వైపు ప్రయానిస్తాము; . . . మనం మూఢనమ్మకం వైపు ప్రయానిస్తాము.3

క్రీస్తు ద్వారా మరియు క్రీస్తులో మన పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పెరగడం అనేది ఆ తప్పుడు వైపు ప్రయాణం నుండి మళ్లించి, మనలను పరిశుద్ధత మార్గంలో నడిపిస్తుంది, మరియు మనకు శాశ్వతమైన ఆనందం మరియు సంతోషంతో కూడిన జీవితాన్ని వాగ్దానం చేస్తుంది. కాబట్టి, మరోసారి ఎవరైనా మిమ్మల్ని, “అందరూ బయట సరదాగా గడుపుతూ, జీవితాన్ని ఆస్వాదిస్తుంటే, మీ జీవితాంతం మీరు సంఘానికి వెళ్తూ ఉండిపోవాల్సి వస్తుందని తెలుసుకోవడం ఎలా ఉంటుంది?” అని అడిగితే, చిరునవ్వుతో ఇలా చెప్పండి: “మీకు నా పరిశుద్ధ దేవుడు, యేసు ఎవరో తెలిస్తే, మీరు ఆ ప్రశ్న అడగరు. ఆయనను ఆరాధించడానికి సంఘానికి వెళ్లడమే నాకు సంతోషం, ఎందుకంటే ఆయన మాత్రమే నా హృదయాన్ని ఆనందంతో, అపారమైన సంతోషంతో నింపగలరు!” (కీర్తనలు 16:11; యెషయా 35:10; యోహాను 16:24).


ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

డ్రూ డినార్డో

డ్రూ డినార్డో

డాక్టర్ డ్రూ డినార్డో పెన్సిల్వేనియాలోని న్యూ హాలండ్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్ రిఫార్మ్డ్ సంఘానికి సీనియర్ పాస్టర్.