The Transforming Power of God’s Holiness in Everyday Life

రోజువారీ జీవితంలో దేవుని పరిశుద్ధత యొక్క పరివర్తన శక్తి

03/11/2026
6 Kinds of Hearers of God’s Word

దేవుని వాక్యాన్ని వినే 6 రకాల శ్రోతలు

10/11/2026
The Transforming Power of God’s Holiness in Everyday Life

రోజువారీ జీవితంలో దేవుని పరిశుద్ధత యొక్క పరివర్తన శక్తి

03/11/2026
6 Kinds of Hearers of God’s Word

దేవుని వాక్యాన్ని వినే 6 రకాల శ్రోతలు

10/11/2026

యేసే నూతన దేవాలయం

Jesus Is the New Temple

బైబిల్లోని దేవాలయం గురించి మీరు ఆలోచించినప్పుడు మీ మదిలో ఏమొస్తుంది? అరణ్యంలో, అందమైన పరదాలతో అల్లిన, పవిత్ర స్థలానికి ఇరువైపులా బంగారు స్తంభాలున్న ఒక అలంకరించబడిన గుడారం మీకు గుర్తుకురావచ్చు. లేదా, అతి పరిశుద్ధ స్థల ప్రవేశద్వారం వద్ద కెరూబులు కాపలా కాస్తున్నట్లుగా, బంగారు పూత పూసిన గోడలపై దానిమ్మ చెట్లు చెక్కబడి ఉన్న ఒక భారీ కట్టడం మీకు గుర్తుకురావచ్చు. ప్రాచీన ప్రపంచంలోని హెరోదియన్ అద్భుతంగా, యెరూషలేముకు పైన ఎత్తుగా నిలబడి ఉన్న, జాగ్రత్తగా అమర్చబడిన గంభీరంగా చెక్కబడిన రాళ్ల గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ఈ చిత్రాలన్నీ బైబిల్లోని దేవాలయానికి సంబంధించిన వివిధ సందర్భాల యొక్క కచ్చితమైన వర్ణనలే. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనం దేవాలయం గురించి ఆలోచించినప్పుడు, యేసు గురించి ఆలోచించాలని లేఖనం మనకు చెబుతోంది. మిగతావన్ని ఆయన వైపు చూపే చ్ఛాయలే.

లేఖనాలలో కనిపించే మొదటి దేవాలయం ఏదేను తోట. తరువాత వచ్చిన గుడారం మరియు దేవాలయం వలెనే, దేవుడు ఏదేనును తన పరిశుద్ధ స్థలంగా, అంటే ఆయన తన ప్రజలతో ఉండే నివాసంగా సృష్టించాడు. పతనానికి ముందు, ఏదేను ఆ పవిత్ర స్థలంగా ఉండవలసి ఉంది. ఈ కారణంగా, దేవుడు తరువాత గుడారంలో నడిచినట్లే ఏదేనులో కూడా నడిచాడు (ఆది. 3:8; లేవీ. 26:12; ద్వితీ. 23:14; 2 సమూ. 7:6–7 కూడా చూడండి). ఏదేను మరియు గుడారంలోకి తూర్పు నుండి ప్రవేశం ఉండేది (ఆది. 3:24; నిర్గ. 26:18–22), ఏదేను మరియు సొలొమోను దేవాలయం కెరూబులచేత కాపలాగా ఉండేవి (ఆది. 3:24; నిర్గ. 26:31; 1 రాజులు 6:23–29) మరియు చెట్లతో నిండి ఉండేవి (ఆది. 2:16; 1 రాజులు 6:20–36). ఆదాము మరియు యాజకులు తమ పరిశుద్ధ స్థలాలను “పనిచేసి కాపాడాలి” (ఆది. 2:15; సంఖ్యా. 3:8; 8:26; 18:5–6). ఏదేను ఒక దేవాలయం.

ఆదాము పాపంలో పడినందున, అతడు పరిశుద్ధ స్థలం నుండి వెలివేయబడ్డాడు. దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించినప్పుడు, పాపులు పశ్చాత్తాపంతో ఆయనను సమీపించి, పదేపదే బలులు అర్పించడం ద్వారా ఆరాధించగలిగేలా ఆయన కృపతో ఒక పరిశుద్ధ స్థలాన్ని తిరిగి స్థాపించాడు (హెబ్రీ. 10:1). దేవుడు తన ప్రజలతో ఉండటానికి ఈ “సమావేశపు గుడారాన్ని,” అనగా ప్రధాన గుడారాన్ని స్థాపించాడు (నిర్గమ. 29:45–46). అయితే ప్రధాన గుడారం పూర్తయిన తర్వాత, దేవుని సన్నిధి యొక్క పరిశుద్ధ మేఘం దగ్గరకు వచ్చేవారందరి పరిశుద్ధతను కోరడాన్ని ఇశ్రాయేలీయులు చూశారు. కాబట్టి, మోషేతో సహా ఎవరూ ప్రవేశించలేకపోయారు (నిర్గమ. 40:35). రాజైన సొలొమోను ప్రధాన గుడారం కంటే గొప్ప నిర్మాణాన్ని నిర్మించాడు, మరియు అదే మేఘం ఈ ఆలయాన్ని కూడా కప్పివేసింది, ఇది యాజకులు కూడా పరిశుద్ధుని సన్నిధిలోకి ప్రవేశించలేరని సూచించింది (1 రాజులు 8:10–11).

నెబుకద్నెజరు సొలొమోను ఆలయాన్ని పడగొట్టి ఇశ్రాయేలును చెరలోకి తీసుకువెళ్ళిన తరువాత, పారసీక దేశపు రాజు, గొప్ప కోరెషు, ఇశ్రాయేలును వారి స్వదేశానికి తిరిగి వచ్చి ఒక కొత్త ఆలయాన్ని నిర్మించుకోవడానికి అనుమతించాడు (ఎజ్రా 1; 2 దినవృత్తాంతములు 36:22–23). అయినప్పటికి, ఇంతకుముందు సొలొమోను ఆలయాన్ని చూసిన పెద్దలు ఈ కొత్త నిర్మాణాన్ని చూసినప్పుడు, వారు దుఃఖంతో ఏడ్చారు, ఎందుకంటే ప్రవక్తలు ముందుగా చెప్పిన దానిని ఈ రెండవ ఆలయం ఎప్పటికి నెరవేర్చదని వారికి తెలుసు (ఎజ్రా 3:12). పాత నిబంధన ప్రవక్తలు – యూదులు మరియు అన్యజనులతో సహా – అనేక దేశాల వారు యెరూషలేముకు వచ్చి ఆలయంలో ఆరాధిస్తారని ఆశించారు (యెషయా 2:1–5 చూడండి). అయినప్పటికి, ఈ ఆలయం సొలొమోను ఆలయం కంటే చాలా గొప్పదిగా ఉంటుందని వారు అర్థం చేసుకున్నారు; ఈ కొత్త ఆలయం ఆకాశాన్ని, భూమిని కదిలించి, ప్రజలందరికి మహిమగా మరియు రక్షణగా మారుతుంది (హగ్గయి 2:5–9), సరిగ్గా అదే సంఘటనలో దేవుడు, “నేను మీతో ఉంటాను” అని అంటాడు (హగ్గయి 2:4).

పాత నిబంధన పరిశుద్ధులు ఆశించిన దేవాలయం, మానవరూపం దాల్చిన దేవుని కుమారుని రూపంలో వచ్చింది. మన మధ్య నివసించడానికి, లేదా “గుడారం వేయడానికి” వచ్చినది నజరేయుడైన యేసే (యోహాను 1:14). ఆయనే దేవుని నిజమైన సన్నిధి, అక్కడ సమస్త దైవత్వం శరీరరూపంలో నివసిస్తుంది (కొలొస్సయులకు 2:9-10). యేసు స్వయంగా యూదులతో, “ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో నేను దానిని తిరిగి కట్టిస్తాను” అని చెప్పినప్పుడు ఈ విషయాన్నే స్పష్టం చేశారు (యోహాను 2:19). యూదులు ఆయన మాటలను అక్షరార్థంగా అర్థం చేసుకోవాలని భావించినప్పటికి, యేసు ఆత్మీయంగా తన గురించే, అంటే దేవుని నిజమైన ఆలయం గురించే మాట్లాడుతున్నారు (యోహాను 2:20-21). నిజానికి, ఒక యాజకునిగా, ఆయన తన పరిపూర్ణమైన జీవితం మరియు బలియాగ మరణం ద్వారా తనను తాను అర్పించుకున్నారు, తద్వారా పాపులు ఆయన బలియాగం ద్వారా పరిశుద్ధుడైన దేవుని ఆలయ సన్నిధిలోకి ప్రవేశం పొందగలుగుతారు (హెబ్రీయులకు 9:11-14; 10:19-20). యేసు ఒకే సమయంలో యాజకుడు, బలి మరియు ఆలయం.

అయితే క్రొత్త నిబంధన దేవాలయాన్ని మరో విధంగా కూడా వర్ణిస్తుంది. 1 కొరింథీయులకు 3:16–17లో, పౌలు ఇలా పేర్కొన్నాడు:

మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు. 

పౌలు “మీరు దేవుని ఆలయమై ఉన్నారు” అని వ్రాసినప్పుడు, అందులోని “మీరు” అనేది ఏకవచనం కాదు, బహువచనం. అంటే, పౌలు దేవుని ప్రజలను సమిష్టిగా సంఘం అని సంబోధిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తు సంఘం కూడా ఆలయమే. ఎందుకంటే, ఆయన ఆత్మ మనలో నివసిస్తాడు కాబట్టి, విశ్వాసులు క్రీస్తు స్వరూపమునకు మార్చబడుతున్నారు (రోమా 8:29). దేవుని సన్నిధి మరియు శక్తి ఆయన సంఘంలో ఉండి, సువార్తతో దేశాలను ఆశీర్వదించే పని కొరకు దానిని ఆత్మతో అభిషేకిస్తుంది (మత్తయి 28:18–20; 2 కొరింథీ 4:1–6). క్రీస్తు శరీరమైన మనము ఆయనలో ఆలయమై ఉన్నాము, ఎందుకంటే ఆయన మనలను తన వలె  చేస్తాడు. ఈ విధంగా, మనం ఈ లోకంలో క్రీస్తుకు ప్రతినిధులుగా ఉన్నందున, సంఘం దేవుని పరిశుద్ధతకు ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. క్రీస్తునందు మనము కొండమీదనున్న పట్టణముగాను (మత్తయి 5:14) మరియు జనములకు వెలుగుగాను (యెషయా 49:6 మరియు అపొస్తలుల కార్యములు 13:47) ఉన్నాము, తద్వారా లోకం మన ద్వారా నిజమైన ఆలయాన్ని చూడగలదు.

లేఖనాల్లో అలంకార ఫలకాలతో, బంగారు గోడలతో, అద్భుతమైన కట్టడాలతో ఉన్న దేవాలయాలు వర్ణించబడినప్పటికి, అవన్నీ రాబోయే మంచి విషయాలను సూచించే చ్ఛాయలే (హెబ్రీ. 9–10). మనం మరో దేవాలయం కోసం వెతకడం లేదు. ఆయన మనకు ఉన్నారు.


ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

డాక్టర్ లెవీ బెర్న్‌ట్సన్

డాక్టర్ లెవీ బెర్న్‌ట్సన్

రెవరెండ్ లెవి బెర్న్ట్సన్, ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లోని రిఫార్మేషన్ బైబిల్ కాలేజీలో వేదాంతశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్.