
యేసే నూతన దేవాలయం
05/11/2026
పిల్లల కోసం నిబంధన దైవశాస్త్రం: ఒక ప్రారంభ మార్గదర్శిని
12/11/2026దేవుని వాక్యాన్ని వినే 6 రకాల శ్రోతలు
సమాచారంతో నిండిపోయిన ఈ ప్రపంచంలో, లెక్కలేనన్ని స్వరాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. అయినప్పటికీ, ఈ కోలాహలం మధ్య, దేవుని వాక్యం కంటే ముఖ్యమైన మాటలు ఏవీ లేవు—దానినే కీర్తనకారుడు “తేనె కంటే మధురమైనది” (కీర్తన. 119:103) అని పిలుస్తాడు. ఈ నేపథ్యంలో, యాకోబు 1:22–25 ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది: మనం దేవుని వాక్యానికి ఎలా స్పందిస్తాము? మనం కేవలం వింటామా, లేక దానిని మన జీవితాలకు అన్వయించుకుంటామా?
యాకోబు ఇలా బోధిస్తున్నాడు, “మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి” (యాకోబు 1:22). ఆయన వినవలసిన అవసరాన్ని తక్కువ చేసి చెప్పడం లేదు; నిజానికి, ఆయన తన పాఠకులను “వినుటకు వేగిరపడు” అని ప్రోత్సహిస్తున్నాడు (యాకోబు 1:19). అయితే, కేవలం దేవుని వాక్యాన్ని వినడమే నిజమైన ఆధ్యాత్మికత అని భావించే వారి ప్రమాదకరమైన స్వీయ-మోసాన్ని యాకోబు బయటపెడుతున్నాడు. ప్రామాణికమైన విశ్వాసం, మనం విన్న సత్యం ద్వారా రూపుదిద్దుకున్న జీవితంలో, అంటే క్రియలలో వ్యక్తమవుతుందని ఆయన వాదిస్తున్నాడు (యాకోబు 2:14–17).
యాకోబు, కేవలం వినేవారిని, అద్దంలో తన లోపాలను చూసుకొని, తాను చూసినదాన్ని మరచిపోయి వెళ్ళిపోయే వ్యక్తితో పోలుస్తున్నాడు (యాకోబు 1:23–24). దేవుని వాక్యాన్ని విని, దానిని ఆచరించకపోవడంలోని విషాదకరమైన అవివేకాన్ని ఈ ఉపమానం శక్తివంతంగా వివరిస్తుంది. ఈ సందర్భంలో, ఆ అద్దం దేవుని వాక్యమే. అది మన పాపాన్ని బయటపెట్టి, మన నిజమైన ఆధ్యాత్మిక స్థితిని బయలుపరిచి, మనలను క్రీస్తు వైపు నడిపిస్తుంది—ఆయనే మనలను క్షమించి, సమస్త పాపాల నుండి శుభ్రపరచగల ఏకైక వ్యక్తి. వాక్యాన్ని విని, పశ్చాత్తాపం మరియు విశ్వాసం కొరకు దాని పిలుపును విస్మరించడం అంటే, అది అందించే కృపను నిర్లక్ష్యం చేసి, మన పాపంలోనే మార్పు లేకుండా ఉండిపోవడమే.
యాకోబు హెచ్చరిక మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఆహ్వానిస్తుంది. మనం ఎలాంటి శ్రోతలం? దేవుని వాక్యానికి భిన్నమైన ప్రతిస్పందనలను సూచించే ఆరు రకాల శ్రోతలు ఇక్కడ ఉన్నారు:
1. మిస్టర్ గ్రుడ్డివాడు
ఈ వినేవాడు అద్దంలోకి చూసుకుంటాడు కానీ ఆత్మీయ అంధత్వం కారణంగా స్పష్టంగా చూడలేడు. అతడు లేఖనాలను చదివినా లేదా అధ్యయనం చేసినా, దేవుడు నిర్వచించిన పాపాన్ని గుర్తించడంలో విఫలమవుతాడు. అతడు చెడును మంచి అని, మంచిని చెడు అని పిలుస్తాడు (యెషయా 5:20). అతని జీవితం అలవాటైన పాపంతో గుర్తించబడుతుంది, అయినప్పటికి తన జీవితంపై ఆధిపత్యం చెలాయించే పాపపు పద్ధతుల గురించి అతడు ఏమాత్రం పట్టింపు కలిగి ఉండడు. అతనికి కావలసింది, సత్యం వైపు అతని కళ్ళు తెరిపించడానికి పరిశుద్ధాత్మ చేసే పునరుజ్జీవన కార్యం.
2. మిసెస్ భయస్తురాలు
తనకు లోపాలు ఉన్నాయని ఆమెకు తెలుసు, కాని వాటిని ఎదుర్కోవడానికి ఆమె భయపడుతుంది. తప్పుడు రోగ నిర్ధారణ జరుగుతుందేమోనన్న భయంతో వైద్యుడిని తప్పించుకునే వారిలాగే, ఈ భయపడే మహిళ వాక్యపు ఒప్పింపును ప్రతిఘటిస్తుంది. పశ్చాత్తాపం యొక్క మూల్యాన్ని ఎదుర్కోవడానికి ఆమె ఇష్టపడదు. అయినప్పటికి, నిజమైన స్వేచ్ఛ తప్పించుకోవడం ద్వారా రాదు; మన పాపాన్ని వెలుగులోకి తీసుకువచ్చి, పశ్చాత్తాపంతో మరియు విశ్వాసంతో క్రీస్తు వైపు తిరగడం ద్వారానే వస్తుంది.
3. మిస్టర్ స్వీయ-నీతిపరుడు
అతడు తన లోపాలను చూస్తాడు కానీ వాటిని సమర్థించుకుంటాడు. తన నైతిక చరిత్రపై తనకు ఉన్న నమ్మకంతో, దిద్దుబాటును ప్రతిఘటిస్తాడు. ఎదుర్కొన్నప్పుడు, “నేను మారనవసరం లేదు—ఇతరులు మారాలి” అని చెబుతూ బాధ్యతను తప్పించుకుంటాడు. అతని స్వీయ నీతి, దయ కోసం అతనికి ఉన్న లోతైన అవసరాన్ని చూడకుండా అంధుడిని చేస్తుంది. యేసు ఉపమానంలోని పరిసయ్యుడు ఇలా ప్రార్థించినందుకు అతడు పోలి ఉన్నాడు: “దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవవంతు చెల్లించుచున్నాను” (లూకా 18:11–12). భక్తిపరునిగా కనబడుతున్నప్పటికి, అతని హృదయం గర్వంతో, పశ్చాత్తాపం లేకుండా ఉంది. తాను నీతిమంతులను పిలవడానికి రాలేదని, పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చానని యేసు మనకు గుర్తుచేస్తాడు (లూకా 5:32).
4. మిస్ నిరాశావాది
ఆమె అద్దంలో చూసుకుని, తన లోపాలను గుర్తిస్తుంది, కాని వాటిని శుభ్రపరచడం అసాధ్యమని నమ్ముతుంది. దయ కోసం దేవుని వైపు తిరగడానికి బదులుగా, ఆమె తన దుఃఖంలోనే మునిగిపోయి, “క్షమించబడటానికి నేను చాలా పాపిని” అని నిరాశ చెందుతుంది. ఈ నిరాశావాదికి కావలసింది సువార్త నిరీక్షణ. రాబర్ట్ ముర్రే మెక్చెయిన్ జ్ఞానయుక్తంగా చెప్పినట్లుగా, “మిమ్మల్ని మీరు చూసుకునే ప్రతిసారీ, క్రీస్తును పదిసార్లు చూడండి.” క్రీస్తునందు, పశ్చాత్తాపపడి విశ్వసించే అత్యంత నీచమైన పాపికి కూడా సంపూర్ణ క్షమాపణ ఉంది.
5. మిస్టర్ పక్షపాతం
1 సమూయేలు 15వ అధ్యాయంలోని సౌలు రాజు వలె, ఇతను కూడా ఎంపిక చేసిన విధేయతనే పాటిస్తాడు. అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమని సౌలుకు ఆజ్ఞాపించబడినప్పటికి, అతను శ్రేష్ఠమైన పశువులను మరియు అగాగు రాజును విడిచిపెట్టాడు. తాను అర్పించిన బలులను చూపిస్తూ తనను తాను సమర్థించుకున్నాడు. కాని ప్రవక్తయైన సమూయేలు, “బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు శ్రేష్ఠము” అని జవాబిచ్చాడు (1 సమూయేలు 15:22). పాక్షిక విధేయత చూపే వ్యక్తి దేవుడు చెప్పినదానిలో కొంత చేస్తాడు, కాని అంతా కాదు. అయినప్పటికి పాక్షిక విధేయత కూడా అవిధేయతే. నిజమైన శ్రోత దేవుని వాక్యానికి పూర్తిగా లోబడతాడు, తనకు సౌకర్యవంతంగా ఉండే భాగాలకు మాత్రమే కాదు.
6. మిస్ జ్ఞాని
నిజమైన శ్రోత ఈమెయే. లేఖనమనే అద్దంలో తన లోపాలను చూసుకొని, ఆమె పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి, క్రీస్తు ద్వారా శుద్ధీకరణను కోరుకుంటుంది. యేసు ఉపమానంలోని పన్ను వసూలు చేసేవాని వలె, ఆమె, “దేవా, పాపినైన నన్ను కరుణించుము!” అని ప్రార్థిస్తుంది (లూకా 18:13). అటువంటి వ్యక్తి “తన క్రియలయందు ఆశీర్వదింపబడును” అని యాకోబు అంటాడు (యాకోబు 1:25). ఆమె జీవితం కీర్తన 1లో చెప్పబడిన నీటి ప్రవాహాల దగ్గర నాటబడిన చెట్టు యొక్క లక్షణాలను —ఫలవంతమైన మరియు శాశ్వతమైనవి — కలిగి ఉంటుంది.
మిమ్మల్ని మీరు పరిగణించుకొండి
అయితే, మీరు ఎలాంటి శ్రోత? గుర్తుంచుకోండి, విని విధేయత చూపేవారిపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది. విధేయత రక్షణను సంపాదించిపెడుతుందని కాదు, కాని అది దేవుని కృపచేత నిజంగా రూపాంతరం చెందిన హృదయం నుండి ప్రవహిస్తుంది. కాబట్టి, దేవుని వాక్యాన్ని వినే శ్రోతగా ఉండటం అంటే కేవలం శ్రద్ధగా వినడం లేదా బైబిలు సత్యాన్ని మేధోపరంగా ధృవీకరించడం మాత్రమే కాదు. అది వాక్యాన్ని వినయంతో స్వీకరించి, అది మనల్ని శోధించడానికి అనుమతించి, విశ్వాసంతో దానికి లోబడటం. అది ఆయన వాక్యపు వెలుగులో ప్రభువుతో నడవడం. పాత గీతం చెప్పినట్లుగా:
నమ్మి విధేయత చూపు, వేరే మార్గము లేదు
యేసులో ఆనందించాలంటే, నమ్మి విధేయత చూపు.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్లో ప్రచురించబడింది.


