
“సోలా ఫిడే” అంటే ఏమిటి?
15/05/2025
“సోలి డియో గ్లోరియా” అంటే ఏమిటి?
22/05/2025“సోలా గ్రాటియా” అంటే ఏమిటి?

-
- పదహారవ శతాబ్దపు సంస్కరణోద్యమంతో ముడిపడిన నినాదాలలో లాటిన్ సూక్తి “పోస్ట్ టెనెబ్రాస్ లక్స్” (“చీకటి తర్వాత వెలుగు”) ఒకటి. రోమన్ కాథలిక్ సంఘం యొక్క అవినీతికి విరుద్ధంగా, సంస్కర్తలు తమను తాము క్రీస్తు సువార్త యొక్క వెలుగును తిరిగి కనుగొన్నట్లుగా భావించారు. ఈ సిద్ధాంతాన్ని సంప్రదాయంగా సంస్కరణోద్యమం యొక్క “ఐదు సోలాస్” అనే మూలసూత్రాలలో ఒకటిగా సంక్షిప్తంగా పేర్కొనబడింది. ఈ ఐదు సోలాస్‌లో ఒకటి లాటిన్ పదమైన “సోలా గ్రాటియా” (“కేవలం కృప”) అనే పదం. సంస్కర్తల దృష్టిలో, “సోలా గ్రాటియా” సిద్ధాంతం క్రీస్తులో ఉన్న రక్షణను సరిగ్గా మరియు పూర్తిగా బైబిలు ప్రకారం అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు, మార్టిన్ లూథర్ (1483–1546) దీనిని చాలా స్పష్టంగా చెప్పాడు: “తన రక్షణ పూర్తిగా తన స్వంత శక్తి, యుక్తి, ప్రయత్నం, సంకల్పం, మరియు క్రియలకు పూర్తిగా అతీతమైనదని, మరియు పూర్తిగా మరొకరి యొక్క ఎంపిక, సంకల్పం మరియు క్రియలపై, అంటే దేవునిపై మాత్రమే ఆధారపడి ఉంటుందని ఒక వ్యక్తి తెలుసుకునే వరకు పూర్తిగా వినయంగా ఉండలేడు… అప్పుడు మాత్రమే అతడు కృపకు దగ్గరవుతాడు, మరియు రక్షణ పొందగలడు.” వాస్తవానికి, లూథర్ మరియు ఇతర సంస్కర్తలకు, “సోలా గ్రాటియా” సిద్ధాంతంలోని ప్రతి అవినీతి మానవ ప్రయత్నాన్ని చాటుమాటుగా రక్షణలో చొప్పించేదిగా కనిపించింది. ఈ కారణంగానే నేటి క్రైస్తవులు సరైన రీతిలో “సోలా గ్రాటియా”ను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం. సువార్త పవిత్రత ఈ సత్యంపై ఆధారపడి ఉంది.“సోలా గ్రాటియా” అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి, ముందుగా “సోలా గ్రాటియా” అంటే ఏమి కాదో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
- “సోలా గ్రాటియా” అంటే “దాదాపుగా కృప మాత్రమే” కాదు.
మరో మాటలో చెప్పాలంటే, “సోలా గ్రాటియా” అంటే దేవుడు మన రక్షణ కోసం దాదాపుగా ఎక్కువ భాగం పని చేశాడనీ, కానీ ఆ మిగిలిన కొంత భాగాన్ని మనమే చేయాల్సిన అవసరం ఉందని అర్థం కాదు. దేవుని కృప మనల్ని తటస్థ మానవ ప్రతిస్పందనకు వీలు కల్పించే స్థితికి తీసుకురాదు. అలా చేస్తే మానవ క్రియలు ప్రధాన పాత్ర పోషిస్తాయి, ఎందుకంటే మన రక్షణ అప్పుడు చివరికి మానవ చర్యలపై ఆధారపడి ఉంటుంది.
“సోలా గ్రాటియా” అంటే దేవుడు ప్రజలను సాధారణంగా రక్షించాడు కానీ వ్యక్తిగతంగా కాదు అని కాదు.
“సోలా గ్రాటియా” అంటే దేవుడు ప్రజలను సామూహికంగా రక్షించాడు కానీ ప్రత్యేకంగా ఒక్కొక్కరిని కాదు అని కాదు. మరో విధంగా చెప్పాలంటే, క్రీస్తు రక్షణను కొనుగోలు చేశాడు కానీ అది మీ కోసం కాదు అని “సోలా గ్రాటియా” బోధించదు. విమోచన ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది మరియు వ్యక్తిగతమైనది. దీనిని కాదనడం అంటే భక్తితో కూడిన ముసుగులో మానవ ప్రయత్నాలను రక్షణలోకి చొప్పించడానికి ప్రయత్నించడం. లేఖనాల్లో “రక్షణ” అనేది ఒక వస్తువును కొనడం కాదు, కానీ ప్రత్యేక వ్యక్తులను విమోచించడం.
సోలా గ్రాటియా అంటే రక్షణలో కొంత భాగం మాత్రమే కృప ద్వారా వస్తుంది అని కాదు.
కొంతమంది క్రైస్తవులు ప్రజలు తమ స్వంత స్వేచ్ఛా చిత్తంతో క్రీస్తు వద్దకు వస్తారని, ఆపై దేవుడు వారిని విశ్వాసంలో సార్వభౌమంగా కాపాడుతాడని నమ్ముతారు. మరికొందరు క్రైస్తవులు సార్వభౌమాధికారం ద్వారా విశ్వాసంలోకి ఆకర్షించబడతారని, కానీ వారు తరువాత తమ రక్షణను కోల్పోగలరని వాదిస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ, మనం అనుకోకుండా మానవ క్రియలను రక్షణలోకి అక్రమంగా చొప్పించాము. ఒక మానవ ఎంపిక (మార్పిడికి ముందు లేదా తరువాత అయినా) రక్షణకు నిర్ణయాత్మక అంశం అయితే, రక్షణ ప్రాథమికంగా మానవ ప్రయత్నం (అనగా, క్రియలు) యొక్క ఫలితం అవుతుంది.
కాబట్టి, “సోలా గ్రాటియా” అంటే ఏమిటి?
దేవుడు మీ రక్షణకు అవసరమైన ప్రతిదాన్ని సాధించాడు.
రక్షణ అనేది ఒక అస్పష్టమైన చర్య కాదు, కానీ ఇది మీ కొరకు నెరవేర్చబడిన కృపాపూరితమైన విమోచన కార్యం. అనంత కాలం నుండి త్రియేక దేవుడు(తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ) ఒక నిబంధన చేసుకున్నారు : తన కోసం ఒక ప్రత్యేకమైన ప్రజలను రక్షించాలని నిర్ణయించుకున్నారు. తండ్రి అయిన దేవుడు కుమారుని కోసం ఒక ప్రత్యేకమైన ప్రజలను ఎన్నుకున్నాడు (లూకా 22:29; ఎఫెసీ 1:3–14), కుమారుడైన యేసుక్రీస్తు ఆ ప్రజల కోసం రక్షణను సంపాదించడానికి అంగీకరించాడు (కీర్తన 2; యోహాను 3:35; 14:31; 15:9), మరియు పరిశుద్ధాత్ముడు ఆ ప్రజలకు ఆ రక్షణను వర్తింపజేస్తాడు (యెషయా 63:10–14; యెహెజ్కేలు 36:25–27; 37:14; యోహాను 3:5; 14:26; 15:26; 16:7–15; 20:21–23). ఈ విధంగా, రక్షణ మీ గురించి నిర్ణయించబడింది, మీ కోసం సంపాదించబడింది మరియు మీకు వర్తింపజేయబడింది.
రక్షణ దేవుని కృపగల ప్రేమపై ఆధారపడి ఉంటుంది.
“సోలా గ్రాటియా” అంటే మీ రక్షణ పూర్తిగా దేవుని కృపగల ప్రేమపై ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎన్నుకున్న వారి రక్షణ మానవ క్రియలు లేదా మానవ నిర్ణయాలపై ఆధారపడి లేదని పౌలు వివరించాడు. బదులుగా, ఈ రక్షణ పూర్తిగా దేవుని దయగల కనికరం వల్లనే వస్తుంది. ఆయన ఎవరికి దయ చూపాలనుకుంటే వారికి చూపిస్తాడు (రోమా 9:15–16, 22–23; నిర్గమ 33:19 కూడా చూడండి).
రక్షణ ప్రభువుకు చెందినది.
“సోలా గ్రాటియా” అంటే ఆది నుండి అంతం వరకు రక్షణ ప్రభువునకు చెందినది (కీర్తన 3:8; 62:1; రోమా 8:29–30). దేవుని సార్వభౌమ కృప కేవలం మీరు మారకముందు మాత్రమే మిమ్మల్ని మార్చడానికి రాదు, లేదా మీరు మారిన తర్వాత మాత్రమే మిమ్మల్ని కాపాడటానికి రాదు. బదులుగా, జగత్తు పునాది వేయబడినప్పటి నుండి రాబోయే అంతం లేని యుగం వరకు, దేవుడు తన చిన్నారి పిల్లలను తన చేతిలో గట్టిగా పట్టుకుంటాడు, మరియు క్రీస్తు చివరి రోజున తన ప్రజలందరినీ తిరిగి లేపుతాడు (యోహాను 6:41–46). ప్రారంభం నుండి ముగింపు వరకు, మనం దేవునిచే ఎన్నుకోబడటం నుండి, మారడం వరకు, చివరకు పరలోకానికి చేరుకోవడం వరకు, రక్షణ కేవలం దేవుని దయ ద్వారానే సాధ్యమవుతుంది.
క్రైస్తవులకు, “సోలా గ్రాటియా” అనేది లేఖనాల్లోని అత్యంత మధురమైన బోధనలలో ఒకటి. లూథర్ వివరించినట్లుగా, దేవుడు మనలో పనిచేస్తే, మన చిత్తం మారుతుంది, మరియు దేవుని ఆత్మ ద్వారా మృదువుగా ఊపిరి పోయబడి, అది మళ్ళీ శుద్ధమైన ఇష్టపూర్వకంగా మరియు స్వేచ్ఛాయుత ప్రవృత్తితో, స్వయంగా కోరుకుంటుంది మరియు పనిచేస్తుంది, బలవంతంగా కాదు, అందువలన దానిని ఏ వ్యతిరేకతతో మరొక మార్గంలోకి మళ్ళించలేము, లేదా నరక ద్వారాలచే కూడా జయించలేము లేదా బలవంతం చేయలేము, కానీ అది ఇష్టపూర్వకంగా ఆనందిస్తూ మరియు మంచిని ప్రేమిస్తూ ముందుకు సాగుతుంది, గతంలో అది చెడును ఇష్టపడి, ఆనందించి, ప్రేమించినట్లుగానే.
అయితే మనం ఏమి చెప్పగలం? ఇంత గొప్ప రక్షణకు మన హృదయ స్పందన ఎలా ఉండాలి? మన దయగల దేవుని ఎదుట ఆయన అనంతమైన సంకల్పం తలచుకుని వినయపూర్వకమైన భయభక్తులతో ఆయన సన్నిధిలో మోకరించడం మాత్రమే సాధ్యమైన స్పందన. కృతజ్ఞతతో నిండిన నాలుకలతో మనం కేకలు వేయాలి, “ఓ ప్రభువా, ఇంతటి ప్రేమకు నేను ఎలా పాత్రుడనయ్యాను?”
ఈ వ్యాసం వాట్ ఆర్ ది ఫైవ్ సోలాస్? సేకరణలో భాగం.