Discipleship in the family
కుటుంబంలో శిష్యత్వం
02/12/2025
Discipleship in the family
కుటుంబంలో శిష్యత్వం
02/12/2025

ప్రభువు బల్ల అనేది ఎందుకు కృపకు సాధనం?

Why Is the Lord's Supper a Means of Grace

జొంటీ రోడ్స్

ఈ మధ్య కాలంలో, సంఘాలు “సువార్త-కేంద్రీకృతంగా” ఉండాలనే ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉంది. సువార్తను మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన ఉపదేశాలకు మరియు మన సంఘాలకు కేంద్రంగా చేసుకోమని అనేక పుస్తకాలు, బోధనలు మనకు చెబుతున్నాయి. ఇది నిజంగా చాలా మంచి విషయం. అయితే, ఒక సంఘం తమ పరిచర్యలో ప్రభువైన యేసు సిలువ త్యాగాన్ని, ఆయన ప్రాయశ్చిత్త మరణాన్ని ఎలా కేంద్రంగా ఉంచుకోగలదు? దేవునికి స్తోత్రం! ఈ ప్రశ్నకు జవాబు కోసం సంఘ కాపరులు తలలు పట్టుకుని గందరగోళపడాల్సిన అవసరం లేదు, కొత్త ఆలోచనల కోసం ఆందోళన పడాల్సిన పనీ లేదు. ఎందుకంటే, ప్రభువైన యేసు స్వయంగా స్పష్టమైన సూచనలను ఇచ్చాడు.

ఆయన బంధించబడి, సిలువ వేయబడటానికి ముందు, చివరిసారిగా భోజనమునకు తన శిష్యులతో కలిసి కూర్చున్నప్పుడు, “పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి–ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను” (లూకా 22:19). “నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి.” రొట్టె, ద్రాక్షారసముతో కూడిన ఒక సాధారణ భోజనమైన ప్రభువు బల్ల, సంఘం తన రక్షకుని మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను మహిమపరచడానికి చేసే ఆరాధనలో అత్యంత ప్రాముఖ్యమైనది.

ప్రభువు బల్ల యొక్క ఒక ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ చూడవచ్చు: మన శరీరం ఎన్నటికీ విరిగిపోకుండా ఉండేందుకు యేసు శరీరం విరగ్గొట్టబడింది, మన రక్తం చిందించబడకుండా ఉండేందుకు ఆయన రక్తం చిందించబడింది అని ఇది మనకు గుర్తు చేస్తుంది. మరణ శాపం ఆయనపై పడింది, అందుకే జీవం యొక్క ఆశీర్వాదాలు ఆయన ప్రజలకు ఇవ్వబడ్డాయి. ఈ సత్యం ద్వారా, ప్రభువు బల్లలో పాల్గొనడం అనేది గొల్గొతాలో ఒక్కసారే, సంపూర్ణంగా జరిగిన బలియాగానికి మనం దేనినీ కలపడం లేదా దానిని కొనసాగించడం కాదు అనేది స్పష్టమవుతుంది. “సమాప్తమైనది!” (It is finished) అని యేసు క్రీస్తు పలికిన విజయోత్సవ కేక, శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తూ, ప్రభువు బల్లలో ప్రకటించబడుతుంది. ఆయన రక్తం ఇప్పటికే కార్చబడింది. దానిని మళ్ళీ చిందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ బలియాగం పరిపూర్ణమైంది.

ఈ విధంగా, ప్రభువు బల్ల ఒక రకమైన “కనిపించే వాక్యం”గా పనిచేస్తుంది. బైబిలులో మనం ఇప్పటికే నేర్చుకున్న సువార్త సత్యాలకు ఇది కొత్త సమాచారాన్ని జోడించదు. బదులుగా, ఇది అదే సువార్తను మన కళ్ళు, చేతులు, పెదవులు, మరియు నోటికి ఒక చిత్రరూపంలో “బోధిస్తుంది.” ఇది ఒక ప్రసంగం వంటిది, కానీ ఇది మనం చూసే, తాకే మరియు రుచి చూసేది. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం: నేను ఇప్పుడు ఈ కథనం వ్రాస్తున్నప్పుడు, నా రెండేళ్ల కూతురు పార్కు నుండి తిరిగి వచ్చి నా స్టడీ రూమ్‌లోకి వచ్చింది. నేను ఆమెతో “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పగలను. ఆ తర్వాత నేను ఆమెను ఎత్తుకుని, గట్టిగా కౌగిలించుకుని, బుగ్గపై ముద్దు పెట్టుకోగలను. ఈ కౌగిలింత, ముద్దు ఏం జోడిస్తాయి? ఒక రకంగా చూస్తే, అవి కొత్త సమాచారాన్ని ఏమీ ఇవ్వడం లేదు, కానీ నేను చెప్పిన మాటలను బలపరుస్తాయి, ధృవీకరిస్తాయి. ప్రభువు బల్ల కూడా సరిగ్గా అలాగే పనిచేస్తుంది. ఇది మనకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప కృపావరం, ఇది సిలువ సందేశాన్ని ధృవీకరిస్తుంది. హైడెల్‌బర్గ్ కేటకిజం యొక్క 75వ ప్రశ్న-జవాబు దీనిని ఇలా వివరిస్తుంది: “నా కోసం విరగ్గొట్టబడిన ప్రభువు రొట్టెను, నాతో పంచుకోబడిన పాత్రను నేను నా కళ్లతో ఎంత నిశ్చయంగా చూస్తున్నానో, అంతే నిశ్చయంగా ఆయన శరీరం నా కోసం అర్పించబడి, విరగ్గొట్టబడింది, మరియు ఆయన రక్తం నా కోసం సిలువపై కార్చబడింది.”

అయితే, ప్రభువు బల్ల ఎలా కృపకు సాధనమో అర్థం చేసుకోవడానికి మనం ఇంకా చాలా చెప్పగలం. ఈ బల్ల కేవలం ఒక దృశ్య సహాయం మాత్రమే కాదు. ఎందుకంటే, పాస్టర్ కేవలం ముందు నిలబడి విరగ్గొట్టబడిన రొట్టెను మరియు ద్రాక్షారస పాత్రను చూపించి ఊరుకోరు. లేదు, మనం ఆ అంశాలను తీసుకుని, వాటిని మన శరీరాల్లోకి భుజిస్తాము. లేదు, మనం ఆ రొట్టె, ద్రాక్షారసాలను తీసుకుని, వాటిని భుజిస్తాము, వాటిని మన శరీరంలోకి తీసుకుంటాము. బయటి నుండి చూసేవారికి, మనం ఒక సాధారణ భోజనంలో పాలుపంచుకుంటున్నట్లుగా అనిపించవచ్చు. అయితే, ఈ భోజనాన్ని మనం ఇలా ఆలోచిస్తే, అది దేవుని సంఘానికి కృపకు సాధనమవ్వడానికి గల రెండవ కారణాన్ని మనం చూడగలం: ప్రభువు బల్ల ఒక ఆధ్యాత్మిక ఆహారం. దీని ద్వారా మనం క్రీస్తునే స్వీకరిస్తాము. మనం క్రీస్తుతో కలిసి భోజనం చేయడమే కాకుండా, ఆయననే మనకు ఆహారంగా పొందుతాము.

ప్రతి విశ్వాసికి, రెండు రకాల “జీవితాలు” ఉన్నాయని చెప్పవచ్చు. మనకు ఒక భౌతిక శరీరం ఉంది, దానిని దేవుడు తన దయతో భౌతిక ఆహారం ద్వారా బలపరుస్తాడు. బహుశా, మీరు ఈరోజు కొంత రొట్టె తిని, ఒక గ్లాసు ద్రాక్షారసం కూడా తాగి ఉండవచ్చు. ఈ రెండూ మీ శరీరాన్ని ఖచ్చితంగా బలపరిచి ఉంటాయి. అదే విధంగా మనకు ఒక ఆధ్యాత్మిక జీవితం కూడా ఉంది. మనం విశ్వాసులుగా ప్రభువు బల్లలో పాలుపంచుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా పోషించబడుతున్నాము. రొట్టె, ద్రాక్షారసం కేవలం రొట్టె, ద్రాక్షారసంగానే ఉంటాయి; అవి క్రీస్తు శరీరం, రక్తంగా రూపాంతరం చెందవు. అయినప్పటికీ, అపొస్తలుడైన పౌలు ఈ భోజనాన్ని క్రీస్తు శరీరం, రక్తంలో “పాలుపంచుకోవడం”గా వర్ణించాడు. పాత ఇంగ్లీష్ అనువాదాలలో, “పాలుపంచుకోవడం” (participation) అనే పదం బదులు “సహవాసం” (communion) అనే పదం ఉపయోగించబడింది. అందుకే ప్రభువు బల్లకు “పరిశుద్ధ సహవాసం” (Holy Communion) అనే మరో పేరు వచ్చింది. దీనికి 1 కొరింథీయులు 10:16 ఒక ముఖ్యమైన ఆధారం: “మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయేగదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా?

ఖచ్చితంగా ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉంది. అయితే, పరిశుద్ధాత్మ యొక్క మర్మమైన శక్తి ద్వారా, మనం సాధారణ రొట్టె, ద్రాక్షారసం భుజించి, త్రాగేటప్పుడు, విశ్వాసం ద్వారా క్రీస్తును స్వీకరిస్తున్నాము మరియు ఆయనతో మన ఐక్యతలో బలోపేతం అవుతున్నాము. ఇది కేవలం గతంలో జరిగిన కృపను గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు; ఇది కృప యొక్క తాజా బహుమతి. మనం ఖాళీ చేతులతో వస్తాము – ఏ సంఘం కూడా ఈ ఆశీర్వాదం కోసం డబ్బు వసూలు చేయదు – మరియు ఆరాధనలో ముందుగా బోధించబడిన వాక్యంలో మనం పొందినట్లే, మళ్లీ క్రీస్తును స్వీకరిస్తాము. ఈ అవగాహన మన దృష్టిని ఒక ముఖ్యమైన రీతిలో మార్చడానికి సహాయపడుతుంది: ప్రభువు బల్ల అనేది, మనం ఆయనను భక్తితో జ్ఞాపకం చేసుకోవడానికి మన వంతు కృషి చేసే సమయం కంటే, ముందుగా క్రీస్తు మళ్లీ కృపలో మన వద్దకు వచ్చే సమయం. దీని ప్రధాన దిశ పరలోకం నుండి భూమికి, భూమి నుండి పరలోకానికి కాదు. ఇది దేవుని వైపు నుండి మన వైపుకు వచ్చే కృప యొక్క మరొక కదలిక.

ఈ వ్యాసం క్రైస్తవ శిష్యత్వం యొక్క ప్రాథమిక అంశాలు అనే సేకరణలో భాగం.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

      1.        

జొంటీ రోడ్స్
జొంటీ రోడ్స్
రెవరెండ్ జొంటీ రోడ్స్ ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో ఉన్న క్రైస్ట్ చర్చ్ సెంట్రల్ లీడ్స్ (IPC)లో పాస్టర్‌గా ఉన్నారు. ఆయన కవనెంట్ మేడ్ సింపుల్, మాన్ అఫ్ సరోస్, కింగ్ అఫ్ గ్లోరీ మరియు రిఫార్మ్డ్ వర్షిప్ వంటి అనేక పుస్తకాలను రచించారు.