
బాప్తిస్మం ఎందుకు కృపా సాధనం?
16/12/2025బోధించడం ఎందుకు కృపా సాధనం?
పాల్ లెవీ
“మీరు నా మాట వినకపోతే, నేను ఎలాంటివాడినో మీకు ఎలా తెలుస్తుంది? నేను మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వకపోతే, నేను ఎవరో మీకు ఎలా అర్థమవుతుంది?” ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధంలో ఇలాంటి మాటలే వినిపిస్తాయని మనం ఊహించవచ్చు. మీరు మరొక మనిషిని గూర్చి తెలుసుకోవాలంటే, తప్పనిసరిగా వారు మాట్లాడటం, మీరు వినడం జరగాలి. సంభాషణ అనేది ఈ విధంగానే పని చేస్తుంది.
బైబిలు యొక్క హృదయంలో, తనను తాను తెలియజేసిన, మాట్లాడే దేవుడే ఉన్నాడు. విగ్రహాలకు, దేవునికి ఉన్న గొప్ప తేడా ఇదే: దేవుడు సంభాషిస్తాడు. ఫ్రాన్సిస్ షేఫర్ చెప్పిన మాటల్లో, “ఆయన ఉన్నాడు, ఆయన మౌనంగా లేడు.” ఆయన సృష్టిలో తనను తాను తెలియజేశాడు, ఆయన చేసిన వాటిలో ఆయన మహిమ, మహాత్మ్యం, మరియు అందం కొంచెం మనం చూడగలం. ఈ లోకంలో ఆయన తిరుగులేని శక్తిని ఆయన ప్రదర్శిస్తాడు, అయితే, కేవలం సృష్టి ద్వారా అంతకంటే ఎక్కువ తెలుసుకోలేము. మీరు ఆకాశం వైపు చూసి, “నీవు ఎవరు? నీవు ఎలాంటివాడవు?” అని బిగ్గరగా అరిచినా, మీకు సమాధానం లభించదు.
అయితే, మనం బైబిల్ పేజీలను పరిశీలించినప్పుడు, ఆయన తనను తాను ప్రకటించుకుంటూ, తన వాక్యంలో మనతో మాట్లాడుతున్నట్లు చూస్తాం. దేవుడు బోధించే దేవుడు. బైబిల్ యొక్క మొదటి పేజీలోనే ఈ పునరావృతమైన మాట కనిపిస్తుంది: “దేవుడు – వెలుగు కలుగుగాక అనెను; వెలుగు కలిగెను.” మరియు దేవుడు సెలవిచ్చెను, అది జరిగెను. ఆయన వాక్యం ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తుంది. ఆది నుండీ మనం దేవుని వాక్యంలోని శక్తిని మరియు అధికారాన్ని చూస్తున్నాం. తన వాక్యం మరియు తన కార్యాల ద్వారా ఆయన ఇతర దేవతలందరి నుండి తనను తాను వేరుపరుచుకున్నాడు. యెషయా 55:11 ఈ విషయాన్ని మనకోసం ఇలా సంగ్రహిస్తుంది:
ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును; నిష్ఫలముగా నాయొద్దకు మరలక,
అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.
లేఖనం ఆరంభం నుండే, దేవుడు మాట్లాడుతాడని మరియు ఆయన వాక్యం తాను సంకల్పించిన దానిని నెరవేరుస్తుందని మనం చూస్తున్నాం. ఆయన “వెలుగు కలుగుగాక” అని సెలవియ్యగానే, వెలుగు కలిగింది. ఆయన తన కోసమే ఒక ప్రజలను పిలుచుకున్నాడు. వారిని ఆయన విమోచిస్తాడు (పాపం నుండి రక్షిస్తాడు). ఆయన తన వాక్యం ద్వారా వారిని నడిపిస్తాడు. తన ధర్మశాస్త్రం ద్వారా మరియు ఆయన పంపిన ప్రవక్తల ద్వారా వారిని పరిపాలిస్తాడు. ఈ ప్రవక్తలు దేవుని ప్రజలకు ఆయన సందేశాన్ని ప్రకటించడానికి పంపబడినవారు – వారి ద్వారా ఆయన మాటలనే పలికిస్తారు. వారు రక్షణ మరియు తీర్పు సందేశాన్ని అందిస్తారు.
సరియైన సమయం వచ్చినప్పుడు, దేవుడు తన కుమారుడిని లోకంలోనికి పంపాడు ఈ కుమారుడే దేవుని స్వంత వాక్యం, ఈయనే దేవునితో ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, ఆరంభంలో దేవునితో ఉన్నవాడు, ఈయన ద్వారానే సమస్తము సృష్టించబడినవి. ఆయనలో జీవం ఉంది, మరియు ఆ వాక్యం శరీరధారియై మన మధ్య నివసించాడు (యోహాను 1:1–4, 14). ప్రభువైన యేసు అన్నిటికంటే గొప్ప బోధకుడు. ఆయన ఆనాటి మత నాయకుల వలె కాకుండా, అధికారము కలిగినవానిగా బోధించాడు. ఆయన సరళంగా, స్పష్టంగా మరియు లోతుగా బోధించాడు. ఆయన మాట్లాడేటప్పుడు ప్రజలు మంత్రముగ్ధులైపోయేవారు. ఆయన స్వరం చనిపోయినవారిని లేపుతుంది, తుఫానును శాంతింపజేస్తుంది, దయ్యాలను వెళ్ళగొడుతుంది మరియు రోగాన్ని దూరం చేస్తుంది. ఆయనే దేవుడిని లోకానికి తెలియజేసినవాడు. యేసు సువార్త యొక్క శుభవార్తను ప్రకటించడానికి బోధకులను పంపించాడు, మరియు వారు ఆయన అధికారంతోనే మాట్లాడారు. ప్రజలు సువార్త సందేశాన్ని స్వీకరించినప్పుడు, వారు ఆయన్నే స్వీకరిస్తారు. వారు మరణం నుండి జీవంలోనికి, చీకటి నుండి వెలుగులోనికి మారుతారు. దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారానే ఏర్పరచబడినవారు (ఎన్నుకోబడినవారు) సమకూర్చబడతారు మరియు ఆయన సంఘం (చర్చి) నిర్మించబడుతుంది.
వృద్ధాప్యంలో ఉన్న అపొస్తలుడైన పౌలు తన జీవితకాలం ముగిసిన తర్వాత సంఘం యొక్క అపోస్తలుల అనంతర కాలానికి ప్రాధాన్యతలను నిర్ణయిస్తూ, తిమోతికి ఒకే ఒక్క ముఖ్యమైన ఆజ్ఞను ఇస్తాడు: “వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంత ముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము” (2 తిమోతి 4:2). బోధించబడవలసిన ఈ దేవుని వాక్యము సజీవమై, శక్తిమంతమై, రెండు అంచులుగల ఖడ్గము కన్నా పదునైనది. దేవుడు మౌనంగా లేడు. ఆయన మాట్లాడే దేవుడు, మరియు ఈ రోజు ఆయన బోధించబడిన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. బోధన గురించిన మన వేదాంతం (Theology of preaching), త్రిత్వంలో ఉన్న దేవుడు ఎవరు అనే దానిలో పాతుకుపోయి, ఆధారపడి ఉండాలి.
అనేకసార్లు మనం, బోధించడం అంటే ఏమిటి? అని మనల్ని మనం అడగడం మర్చిపోతాం. బోధించడం అంటే, దేవుని మనుష్యుడు, దేవుని ఆత్మ శక్తితో దేవుని వాక్యాన్ని ప్రకటించడమే. దేవుడు తాను ప్రకటించిన వాక్యాన్ని ఉపయోగించి తన ప్రజలను దీవిస్తాడు. దేవుడు కొందరు మనుష్యులను బోధకులుగా ప్రత్యేకించి, పిలిచి, తన వాక్యం ఏమి చెబుతుందో ప్రకటించడానికి వరాన్ని ఇచ్చాడు. దేవుడు నిస్సందేహంగా నేరుగా మాట్లాడగలడు, కానీ ఆయన బలహీనమైన, అల్పమైన మనుష్యులను ఉపయోగించి దేవుని వాక్యాన్ని పలికించడానికి ఎంచుకున్నాడు. ఆ బోధకులు తమ సొంత సందేశాన్ని గానీ, తమ శ్రోతలు వినాలనుకునే మాటలను గానీ కాకుండా, దేవుని వాక్యాన్ని మాత్రమే బోధించడానికి కట్టుబడి ఉంటారు. వారు దేవుని తరఫున మాట్లాడే ప్రతినిధులు (Spokesmen). దేవుని ప్రకటనను (Revelation) అర్థం చేసుకోవడానికి వారు శ్రమించి, సమయం వెచ్చించి చదవాలి, సిద్ధపడాలి. దేవుడు తన వాక్యంలో వారితో మాట్లాడతాడు, మరియు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారి ద్వారా కూడా మాట్లాడతాడు.
మనం దేవుని వాక్యం బోధించబడడాన్ని వింటున్నప్పుడు, అది మనకు ఒక కృపా సాధనంగా (Means of Grace) మారుతుంది. ఆకాశమునకు, భూమికి సార్వభౌముడైన ప్రభువు మనతో స్వయంగా మాట్లాడటం అనేది గొప్ప దీవెన మరియు విశేషాధికారం (privilege). రోమీయులకు 10వ అధ్యాయంలో, పౌలు బోధకుల యొక్క అత్యవసరమైన ఆవశ్యకత గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు:
వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై – ఉత్తమమైన వాటిని గూర్చిన “సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నది” (రోమా 10:14,15).
దేవుని మనుష్యుడు ఆత్మ శక్తితో దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, అది విశ్వాసంతో స్వీకరించబడుతుంది, అప్పుడు అది జీవాన్ని ఇస్తుంది. బైబిల్లో ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు, మరియు బోధకుడు ఆయన తరఫున మాట్లాడే ప్రతినిధి (Spokesman).
దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారానే మనం దేవుని అపారమైన దయను (Undeserved Kindness) పొందుతాము. తన వాక్యాన్ని దీవించడానికి దేవుడు వాగ్దానం చేశాడు. వెస్ట్‌మిన్‌స్టర్ సిద్ధాంతకర్తలు (Westminster Divines) తమ చిన్న కేటకిజం (Shorter Catechism) లోని 89వ ప్రశ్నోత్తరంలో ఈ ముఖ్యమైన అంశాన్ని ఇలా స్పష్టం చేశారు: “దేవుని ఆత్మ, వాక్యాన్ని చదవడాన్ని, ప్రత్యేకంగా వాక్యాన్ని బోధించడాన్ని, పాపులను ఒప్పించి, మార్చడానికి, మరియు విశ్వాసం ద్వారా వారిని పరిశుద్ధతలోను, ఆదరణలోను కట్టుటకు, రక్షణ నిమిత్తం, సమర్థవంతమైన సాధనంగా చేస్తాడు.”
కాబట్టి, మనం ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు, దానిని పొందుకోవడానికి మరియు వినడానికి సంతోషంతో మరియు నిరీక్షణతో వస్తాం. అయితే, కీర్తన 95:7–8 లోని ఈ మాటలు కూడా మన చెవుల్లో మారుమోగుతూ ఉండాలి: “నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి.”
ఈ వ్యాసం క్రైస్తవ శిష్యత్వం యొక్క ప్రాథమిక అంశాలు అనే సేకరణలో భాగం.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


