
అసలు జీవితానికి అర్థం ఏమిటి?
24/11/2026నీవు చనిపోయినప్పుడు నీ ఆత్మకు ఏమి జరుగుతుంది?
మనమందరం ఎప్పుడో ఒకప్పుడు దీని గురించి ఆలోచించాము. మనం చివరిసారిగా శ్వాస విడిచినప్పుడు, మన హృదయం కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, మన ఆత్మ అప్పటికే నిర్జీవమైన మన దేహాన్ని విడిచివెళ్లినప్పుడు ఏమి జరుగుతుంది? నిజం చెప్పాలంటే, మనలో చాలామందికి మరణ ప్రక్రియ అంటే భయం లేకపోయినా, చనిపోవడమంటే భయమే. చనిపోవడం తరచుగా బాధాకరమైన పోరాటంగా ఉంటుంది. అది తరచుగా పరిశుభ్రత, వైద్యపరమైన నియమాలు పాటించే ఆసుపత్రి వాతావరణంలో జరుగుతుంది; సాధారణంగా అది చూడటానికి అసహ్యకరమైన ప్రక్రియగా ఉంటుంది. అయినప్పటికీ, మరణం అంటే ప్రభువు సన్నిధిలో నిత్యజీవంలోకి ప్రవేశించడమేననే వాగ్దానాన్ని, అలాగే మృతులను తిరిగి లేపగల క్రీస్తు శక్తిని విశ్వసించడం ద్వారా, చనిపోయే ప్రక్రియను గురించి మనకు భయం లేదా ఆందోళన కలిగినప్పటికీ, మరణం యొక్క అంతిమ ఫలితాన్ని గురించి క్రైస్తవులు భయపడవలసిన అవసరం లేదు.
మరణం, చనిపోవడం గురించి కథలు, పురాణగాథలు ఎన్నో ఉన్నాయి. దీనికి ఒక కారణం, లేఖనాలు చనిపోయే ప్రక్రియను వివరించకపోవడమే; అయితే చనిపోయిన తరువాత యేసు తిరిగి బ్రతికించిన కొందరు వ్యక్తుల గురించి అవి చెబుతున్నాయి. వారిలో లాజరు మనకు గుర్తుకు వస్తాడు (యోహాను 11); అలాగే నాయీను పట్టణపు విధవరాలి కుమారుడు వంటి ఇతరులూ ఉన్నారు (లూకా 7:11–17). అయితే, ఈ వ్యక్తులు చనిపోయినప్పుడు ఏమి అనుభవించారో తెలిపే ప్రత్యక్ష వృత్తాంతం మన దగ్గర లేదు; లాజరు విషయంలో కూడా అలాంటి వృత్తాంతం లేదు. లాజరు రెండవసారి చనిపోయినప్పుడు, ఈసారి నిత్యజీవంలోకి ప్రవేశించడానికి చనిపోయినప్పుడు, అతడు ఏమి ఆలోచించి ఉంటాడో మనం ఊహించగలం. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు జరిగే సంపూర్ణమైన మార్పును, మనం నాశనము కాని స్థితిలో లేపబడటాన్ని పౌలు విశేషంగా వివరించాడు కాబట్టి, మన పునరుత్థాన దేహాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు (1 కొరింథీయులకు 15:35–49). అయితే, మధ్యంతర స్థితి గురించి—అంటే, విశ్వాసులుగా మరణించినవారి ఆత్మలు తమ దేహాల పునరుత్థానం కోసం, శాపం (మరణం) పూర్తిగా తొలగించబడే సమయం కోసం ఎదురుచూసే కాలం గురించి—బైబిలులో ఎక్కువ సమాచారం లేదు.
ఈ ప్రశ్న స్వభావమే (మనం చనిపోయినప్పుడు మన ఆత్మకు ఏమి జరుగుతుంది?) ఊహాగానాలకు తావిస్తుంది. నా భక్తిగల అమ్మమ్మ నాకు గుర్తుకొస్తోంది; ఒక సంఘకాపరి యొక్క కుమార్తె. మరణాసన్న స్థితిలో ఉన్న సంఘ సభ్యుల పడకల పక్కన తాము గడిపిన సమయాల గురించి ఆమె చెప్పేది. ఒక వ్యక్తి చివరి శ్వాస విడిచే ముందు తరచుగా కళ్ళు తెరిచి, పైకి ఆకాశంవైపు చూసి, ఏదో ఆనందాన్ని, ఎదురుచూపును వ్యక్తపరిచి, ఆ తరువాత తప్పనిసరిగా సంభవించబోయే మరణానికి తనను తాను అప్పగించుకునేవాడని ఆమె వివరించేది. ఆ విశ్వాసులకు తమ కోసం ఎదురుచూస్తున్నది ఏమిటో (లేదా ఎవరో) కొద్దిసేపు చూపించబడిందని ఆమె నమ్మేది. అది నిజమే కావచ్చు. అయితే, శరీరం పనిచేయడం ఆగిపోతున్నప్పుడు మెదడులో జరిగే జీవరసాయనిక ప్రతిచర్యలు అనేక రకాల ఇంద్రియ అనుభూతులను కలిగించే అవకాశమూ అంతే ఉంది. ఇలాంటి వృత్తాంతాలు ఎంత నిజాయితీతో చెప్పబడినప్పటికీ, అవి వ్యక్తిగత అనుభవాల ఆధారంగా చెప్పబడిన కథనాలు మాత్రమే; వాటి ఆధారంగా సిద్ధాంతాన్ని నిర్మించడానికి ఎలాంటి ఆధారము లేదు.
మరణించి, ఆ తరువాత పరలోకం నుండి తిరిగి వచ్చినట్లు చెప్పుకునే వ్యక్తుల కథలను మనమందరం విన్నాము. అలాంటి కథలు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే మరణానికి సమీప అనుభవాల గురించి పుస్తకాలు రాసే ఒక చిన్న ప్రచురణ రంగం ఏర్పడింది. ఆ పుస్తకాలలో రచయితలు తాము వ్యక్తిగతంగా పరలోకాన్ని సందర్శించి, తిరిగి వచ్చి తమ అనుభవం గురించి పుస్తకం రాసినట్లు కథలు చెబుతారు. ఈ పుస్తకాలలో సాధారణంగా మరణించిన తమ ప్రియమైనవారిని కలుసుకున్నట్లు చెబుతారు; పరలోకాన్ని గురించి (చాలాసార్లు భూలోక దృశ్యాలను అతిశయోక్తితో వర్ణిస్తూ) వివరిస్తారు; యేసును కలుసుకున్నట్లు, దేవునితో మాట్లాడినట్లు, పరలోక సంబంధమైన విషయాలను చూసినట్లు వర్ణిస్తారు.
అయితే, ఈ కథనాలన్నీ చాలావరకు కల్పితమైనవే కావచ్చు; దేవుని సన్నిధిలోకి ప్రవేశించడం గురించి బైబిలు చెప్పే విషయాలతో అవి విభేదిస్తున్నాయి. యెషయా 6:1–7 జ్ఞాపకానికి వస్తుంది. ప్రభువును దర్శనంలో చూసినప్పుడు, యెషయా తన అయోగ్యతను బట్టి తీవ్రంగా కలవరపడ్డాడు. దేవునితో జరిగిన భేటీల గురించి బైబిలులోని వృత్తాంతాలు—ఉదాహరణకు, ప్రభువు మహిమను మోషే కొంతమేరకు చూడటం (నిర్గమకాండము 33:18–23), లేదా ఎమ్మాయికి వెళ్లే మార్గంలో యేసు తన ఇద్దరు శిష్యులకు ప్రత్యక్షమవడం (లూకా 24:37)—పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఉండటం భీతిని కాకపోయినా భయాన్ని కలిగిస్తుందని చూపిస్తున్నాయి. “నేను పరలోకాన్ని చూశాను” లేదా “నేను యేసుతో నడిచాను” అనే తరహా సాహిత్యంలో కనిపించే నిర్లక్ష్యపూరితమైన, కనీసం అల్పమైన స్వభావంతో బైబిలు వృత్తాంతాలు సరిపోలవు. బైబిలు చనిపోయే ప్రక్రియను గానీ, మరణాసన్న స్థితిలో ఉన్నవారి ఆలోచనలను గానీ వివరించదు కాబట్టి, ఆ లోటును కల్పిత కథలతో పూరించడానికి చాలామంది ప్రయత్నించారు. విచారకరంగా, ఆ ప్రయత్నంలో వారు ఎంతో విజయవంతమయ్యారు. అనేకమంది ఈ పురాణగాథలను సత్యంగా అంగీకరిస్తున్నారు.
కృతజ్ఞతగా, మరణానికి మనలను సిద్ధపరచడంలో సహాయపడే మధ్యంతర స్థితికి సంబంధించిన రెండు ఆధారాలను బైబిలు మనకు అందిస్తుంది. మొదటిగా, ప్రసిద్ధమైన అనేక వాక్యభాగాలలో, విశ్వాసులు చనిపోయిన సమయం నుండి క్రీస్తు తిరిగి వచ్చే సమయం వరకు వారి స్థితి ఏమిటనే విషయాన్ని పౌలు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 2 కొరింథీయులకు 5:8 ప్రకారం, ఒక విశ్వాసి మరణించిన క్షణంలోనే మనం వెంటనే ప్రభువు సన్నిధిలోకి ప్రవేశిస్తామని పౌలు బోధిస్తున్నాడు. అపొస్తలుడు ఇలా వ్రాశాడు: “దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.” అలాగే, “నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు” అని తన కోరికను పౌలు తెలిపాడు (ఫిలిప్పీయులకు 1:23). మనం చనిపోయినప్పుడు వెంటనే “క్రీస్తుతో కూడ” ఉండి, దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తాము. “పరలోకం” అని మనం చెప్పినప్పుడు సాధారణంగా ఉద్దేశించేది ఇదే.
రెండవదిగా, ప్రకటన 4–6 అధ్యాయాలలో యోహాను వివరించిన పరలోక దృశ్యం, మనం మరణించినప్పుడు అనుభవించబోయే ఇంతవరకు చూడని వాస్తవికతను మనకు కొంత చూపిస్తుంది. క్రీస్తును మాత్రమే విశ్వసించిన మనం, దేవుని సన్నిధిలో పరలోక సింహాసనం ఎదుట విమోచించబడిన పరిశుద్ధులతో కలిసి ఉంటాము. మనకు స్పృహ ఉంటుంది; మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలుసు; ఆనందంతో దేవునిని స్తుతిస్తాము. సరళంగా చెప్పాలంటే, మనం చనిపోయినప్పుడు మన ఆత్మకు ఏమి జరుగుతుందో తెలిపే అత్యంత స్పష్టమైన చిత్రణ ఈ పరలోక దృశ్యమే. ఈ మూడు అధ్యాయాలలో, యుగసమాప్తిలో మన దేహాల పునరుత్థానం జరిగేంతవరకు దేవుడు తన ప్రజల మధ్య నివసించే పరలోక మహిమను యోహాను మనకు చూపిస్తున్నాడు. పరలోకం అంటే ఇదే—విమోచించబడినవారు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నివసిస్తూ, మన సృష్టికర్తను, విమోచకుడిని సర్వస్తుతులకు, మహిమకు పాత్రునిగా ఘనపరచడం.
ఈ దృశ్యం అద్భుతమైనది; అనేక విధాలుగా మన అవగాహనకు మించినది. అయినప్పటికీ, పరలోకంలోని పరిశుద్ధులు ఇలా మొరపెడుతున్నారని గమనించడం అవసరం: “వారు నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు?” (ప్రకటన 6:10). మనకంటే ముందుగా మరణించి, ఇప్పుడు మధ్యంతర స్థితిని—అంటే మరణం నుండి ప్రభువు తిరిగి వచ్చేంతవరకు ఉండే కాలాన్ని—అనుభవిస్తూ, దేవుని సింహాసనం ఎదుట ఆయన సన్నిధిలో ఇప్పటికే ఉన్నవారు, యేసుక్రీస్తు పునరుత్థాన దినాన, తీర్పు దినాన భూమికి తిరిగి వచ్చే ఆ దినం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
కాబట్టి, మనం చనిపోయినప్పుడు విశ్వాసుల ఆత్మలకు ఏమి జరుగుతుంది? యుగసమాప్తిలో మన దేహాల పునరుత్థానం కోసం ఎదురుచూస్తూ, మనం వెంటనే ప్రభువు మహిమగల సన్నిధిలోకి ప్రవేశిస్తాము.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్లో ప్రచురించబడింది.


