What Is Repentance?

పశ్చాత్తాపం అంటే ఏమిటి?

19/11/2026
What Is Repentance?

పశ్చాత్తాపం అంటే ఏమిటి?

19/11/2026

అసలు జీవితానికి అర్థం ఏమిటి?

What’s the Point of Life?

మానవులుగా పుట్టిన మనమందరం, ఏదో ఒక సమయంలో మనల్ని మనం కొన్ని మౌలికమైన అస్తిత్వపరమైన ప్రశ్నలు వేసుకోక తప్పదు: నేను ఎవరు? నేనిక్కడ ఎందుకు ఉన్నాను? నా జీవిత లక్ష్యం ఏమిటి? నా జీవితం ఎందుకు ప్రాముఖ్యమైనది? తోటి వారితో తనకున్న సంబంధం ఏమిటో, వారి మధ్య తన స్థానం ఏమిటో తెలుసుకోవాలనుకునే యుక్తవయస్కుడైనా, ఏ విద్యావిషయాన్ని ఎంచుకోవాలి, భవిష్యత్తులో ఏ వృత్తిని చేపట్టాలి అనే ఆలోచనలతో సతమతమయ్యే కళాశాల విద్యార్థైనా, లేదా తన జీవితం తాను ఒకప్పుడు ఊహించుకున్న విధంగా కాకుండా పూర్తిగా భిన్నంగా ఎందుకు మారిపోయిందని ఆలోచించే మధ్యవయస్కుడైనా—ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమయంలో వెంటాడే ప్రశ్న “అసలు జీవితానికి అర్థం ఏమిటి?” అన్నదే. ఈ ప్రశ్నకు ఎప్పటికీ ప్రాసంగికత ఉంటుంది. జీవితంలోని వివిధ కాలాల్లో, వివిధ దశల్లో, ఇది కొత్త కొత్త రూపాల్లో మనల్ని మళ్లీ మళ్లీ ఆలోచింపజేస్తూనే ఉంటుంది.

ఈ ప్రశ్నకు సమాధానమే లేకపోతే, అది ఎంతటి విషాదకరమైన విషయమో ఒక్క క్షణం ఆలోచించండి. అదే నిజమైతే, జీవితానికి అసలు అర్థమే ఉండదు. మనకు ఎలాంటి లక్ష్యం ఉండదు, మనం తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు, చివరికి ప్రతిదీ వ్యర్థంగానే మిగిలిపోతుంది. నిహిలిజం (శూన్యవాదం) బోధించే ఈ శూన్యత మన జీవితాలపై, మన ప్రపంచంపై చీకటి నీడను కమ్మేస్తుంది 

అయితే, ఈ ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇవ్వడం కూడా అంతే విషాదకరం. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, సమాజాలు ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి అనేక రకాలుగా ప్రయత్నించడం మనం చూస్తూనే ఉంటాం. మన హృదయాలను నడిపించే అసలు ప్రేరణలు, కోరికలు ఏమిటో మనకు స్పష్టంగా తెలియకపోయినా, జీవితానికి అర్థం ఏమిటని మనం నమ్ముతున్నామో అది మన విలువల్లో, ప్రాధాన్యతల్లో, మనం అనుసరించే లక్ష్యాల్లో ఎల్లప్పుడూ ప్రతిబింబిస్తుంది. జీవిత పరమార్థం ఏమిటనే ఈ ప్రశ్నకు ప్రజలు అనేక రకాల సమాధానాలు చెబుతారు: ప్రేమ, అధికారం, విజయం, సంతోషం, వివాహం, పిల్లలు, వృత్తి, కీర్తి, సాధింపు, హోదా, సంబంధాలు, ప్రజాదరణ, అందం, సాహసాలు, సంపద, సుఖవంతమైన జీవితం, లేదా గొప్పగా వినిపించే “ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడం” వంటివి.

ఈ విషయాల్లో ఏదీ స్వతహాగా చెడ్డది కాకపోయినప్పటికీ, “జీవితానికి అర్థం ఏమిటి?” అనే మన ప్రశ్నకు వీటిలో ఏదీ సరైన సమాధానం కాదు. ఎందుకంటే, వీటిలో ఏదీ భూసంబంధమైన మన సమమట్టమైన భూసంబంధమైన ఉనికి యొక్క స్థాయిని, మన కళ్లముందున్న భౌతిక ప్రపంచాన్ని, మన స్వంత ఆలోచనలు, కోరికల సమాహారాన్ని అధిగమించలేవు. దేవుడు లేడని, విశ్వమంతా, అందులో ఉన్న సమస్తమూ ఏదో ఒక విధంగా శూన్యం నుంచి ఆవిర్భవించి, క్రమంగా సమస్తంగా పరిణమించాయని వాదించేవారు ఉన్నప్పటికీ, వాస్తవమేమిటంటే, మానవులమైన మనం సృష్టించబడిన జీవులం. మనం దేవునిచేత సృష్టించబడ్డాం. కాబట్టి, మనం ఎవరం, మనం ఎందుకు ఉనికిలో ఉన్నాం, ఈ ప్రపంచం ఎందుకు ఉనికిలో ఉంది, జీవిత పరమార్థం ఏమిటి అనే విషయాలను తెలుసుకోవడానికి దేవుని నుండి వచ్చే బయలుపాటు (లేదా ఆయన మనతో చేసే సంభాషణ) మీద ఆధారపడాలి.

దేవుడు తన సృష్టి ద్వారా, మనస్సాక్షి ద్వారా ప్రజలందరితో “మాట్లాడుతాడు.” అయితే, ఆయన తన లిఖిత వాక్యమైన బైబిలు ద్వారా అత్యంత సంపూర్ణంగా మాట్లాడుతాడు. “జీవితానికి అర్థం ఏమిటి?” అనే సంక్లిష్టమైన ప్రశ్నకు సరైన సమాధానం మనకు లభించేది కేవలం ఇక్కడే. ఉదాహరణకు, రోమా 11:36లో దేవుడు సమస్తానికి మూలము, ఆధారము, గమ్యము అని మనకు తెలియజేయబడింది. అక్కడ ఇలా వ్రాయబడి ఉంది: “ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన కొరకే సమస్తమును కలిగియున్నవి. ఆయనకు నిరంతరము మహిమ కలుగును గాక” (ప్రాధాన్యత కోసం నొక్కి చెప్పబడింది). ఈ సత్యాన్ని బట్టి, మానవులు దేవుని మహిమపరచడమే వారి సహజమైన ప్రతిస్పందనగా ఉండాలని తార్కికంగా స్పష్టమవుతుంది. అపొస్తలుడైన పౌలు విశ్వాసులతో స్పష్టంగా ఇలా చెబుతున్నాడు: “మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి” (1 కొరింథీ. 6:20). అదే పత్రికలోని తరువాతి అధ్యాయంలో, పౌలు ఒక విస్తృతమైన ప్రకటన చేస్తున్నాడు: “కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను, మీరేమి చేసినను, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి” (1 కొరింథీ. 10:31).  అది మన పనిలోనైనా, విశ్రాంతి సమయంలోనైనా; సుఖకాలంలోనైనా, కష్టకాలంలోనైనా; యౌవనంలోనైనా, వృద్ధాప్యంలోనైనా; పని దినాల్లోనైనా, వారాంతపు సెలవుల్లోనైనా; పరిచర్యలోనైనా, జీవితంలోని సాధారణ పనుల్లోనైనా సరే—ప్రతిదానిలో, రక్షణ కొరకు కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి విమోచకుడును రక్షకుడును అయిన మన సృష్టికర్తను మహిమపరచడమే మనిషిగా మన జీవిత పరమార్థం.

సర్వశక్తిమంతుడైన ఏకైక సత్యదేవుని మహిమపరచడం, ఆయనలో ఆనందించడం అనే ఈ ఉద్దేశం కేవలం క్రొత్త నిబంధనలోనే కాకుండా, పాత నిబంధనలో కూడా కనిపిస్తుంది. సూర్యుని క్రింద మానవ జీవితం వ్యర్థమైనదని, అశాశ్వతమైనదని పన్నెండు అధ్యాయాలపాటు ధ్యానించిన తరువాత, ప్రసంగి గ్రంథం చివరగా ఇలా ముగుస్తుంది: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి 12:13). ఇక్కడ దేవునియందు భయభక్తులు కలిగి, ఆయన ఆజ్ఞలను గైకొనడం అనేది, దేవునిని మహిమపరచడం మరియు ఆయనతో ఆనందభరితమైన సహవాసంలో నడుచుకోవడం అంటే ఏమిటో తెలియజేసే మరో విధానం మాత్రమే.

ఈ విధంగా భూమిపై జీవించడం అనేది, నూతన ఆకాశములలోను నూతన భూమిలోను దేవుని ప్రజలు నిత్యత్వమంతా ఏమి చేయబోతున్నారో దానికి ఒక ముందస్తు సూచన, మునుజూపు వంటిది. ప్రకటన గ్రంథం 4:11లో, ఇరవై నాలుగు పెద్దలు దేవునిని ఆరాధిస్తూ ఇలా చెప్పడం మనం చూస్తాం: 

ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; 

నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను

గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.

మానవుల జీవిత పరమార్థం దేవుని మహిమపరచడమేనని లేఖనాలు ఇంత విస్తృతంగా నొక్కిచెబుతున్నాయి. కాబట్టి, వెస్ట్‌మినిస్టర్ సంక్షిప్త విశ్వాస ప్రశ్నోత్తరములలోని మొదటి ప్రశ్న, “మానవుని ముఖ్యమైన లక్ష్యం ఏమిటి?” అని అడిగినప్పుడు, దానికి “నిరంతరము దేవుని మహిమపరచుటయు మరియు ఆయనయందు ఆనందించుటయు మానవుని ముఖ్యమైన లక్ష్యం” అని సమాధానమివ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు. దేవునిని మహిమపరచడం అనేది ఆయన మనపై మోపిన భారమైన బాధ్యత కాదు; ఇష్టం లేకుండా ఆయనకు చేసే సేవ కూడా కాదు. అలాగే, అది ఆయనతో మనకున్న ప్రేమపూర్వకమైన వ్యక్తిగత సంబంధానికి వేరైనది కూడా కాదు. దానికి బదులుగా, దేవునిచేత నూతనంగా సృష్టించబడిన హృదయంలో నుండి సహజంగా ఉద్భవించే నిజమైన కోరికే దేవునిని మహిమపరచడం. ఆ కోరిక ఏమిటంటే—నిబంధన చేసుకునే మన దేవునితో సహవాసం కలిగి, ఆయన సన్నిధికి సమీపంగా చేరడం; ఆయనకు ప్రీతికరమైన మార్గాలలో నడుచుకోవడం; ఆయన మహిమాన్వితమైన స్వభావాన్ని, కార్యాలను బట్టి ఆయనను స్తుతించి కృతజ్ఞతలు చెల్లించడం; ఆయన వాక్యం ద్వారా ఆయనను మరింతగా తెలుసుకోవడం; మరియు ఆయన మహాత్మ్యాన్ని, గొప్పతనాన్ని ఈ లోకానికి ప్రకటించడం. 

వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో, చేయవలసిన పనుల సుదీర్ఘ జాబితాలు, కార్యాలయ సమావేశాలు, కుటుంబ బాధ్యతలు, బయటికి వెళ్లి చేయవలసిన పనులు, ఇంకా అనేక ఇతర పనుల మధ్య, దేవునిని మహిమపరచడం మరియు ఆయనయందు ఆనందించడం అనే మన జీవిత పరమార్థాన్ని సులభంగా మరచిపోయే ప్రమాదం ఉంది. అయితే, మనం ఆ రోజుకు సంబంధించిన భూసంబంధమైన బాధ్యతలన్నింటినీ పూర్తి చేసిన తరువాత చేయవలసిన కేవలం ఒక “ఆధ్యాత్మిక” కార్యం మాత్రమే దేవునిని మహిమపరచడం, ఆయనయందు ఆనందించడం కాదు. దానికి బదులుగా, మన దైనందిన జీవితాన్ని నింపే సాధారణ పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా ఈ పరమార్థాన్ని మరచిపోకుండా జాగ్రత్తపడాలి. అవి—వైద్యుని దగ్గరకు వెళ్లడం, ఫుట్‌బాల్ ఆట, మధ్యాహ్న భోజనం, వాహనానికి ఇంజిన్ ఆయిల్ మార్చించడం, సమావేశం, బట్టలు ఉతకడం లేదా పాఠశాల అసైన్‌మెంట్ పూర్తి చేయడం వంటి పనులైనా సరే.

దేవునిని మహిమపరచడం, ఆయనయందు ఆనందించడం కోసమే మనం సృష్టించబడ్డాం. అలా చేయడం ద్వారా, మన జీవితంలోని అత్యున్నత పరమార్థాన్ని నెరవేర్చడమే కాకుండా, అత్యధికమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తాం. ఎందుకంటే, మనం ఎవరి కొరకు సృష్టించబడ్డామో ఆ త్రిత్వ దేవునికి ఇది మనలను మరింత సమీపంగా చేరుస్తుంది.


ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

క్యారీ హాన్

క్యారీ హాన్

క్యారీ హాన్ (Karrie Hahn) లిగోనియర్ మినిస్ట్రీస్ మరియు టేబుల్‌టాక్ పత్రికలకు సహాయ సంపాదకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ధృవీకరించబడిన బైబిలు సలహాదారు కూడా. లింపింగ్ హెవెన్‌వర్డ్: లివింగ్ బై ఫెయిత్ ఇన్ కాంప్రిహెన్సివ్ అండ్ క్రానిక్ సఫరింగ్ అనే పుస్తకానికి ఆమె రచయిత్రి.