ప్రార్థనా యొక్క స్థానం
09/12/2024ప్రాయశ్చిత్తము మరియు సంతృప్తిచెందటం అంటే ఏమిటి?
పాపపరిహారం యొక్క ప్రత్యామ్నాయ కోణాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు, రెండు సాంకేతిక పదాలు మళ్లీ మళ్లీ వస్తాయి: ప్రాయశ్చిత్తము మరియు సంతృప్తిచెందటం. ఈ పదాలు ఒక నిర్దిష్ట గ్రీకు పదాన్ని అనువదించడానికి దేనిని ఉపయోగించాలనే దాని గురించి అన్ని రకాల వాదనలను రేకెత్తిస్తాయి, మరియు బైబిల్ యొక్క కొన్ని తర్జుమాలలో (వెర్షన్లు) ఈ పదాలలో ఒకదాన్ని మరికొన్ని తర్జుమాలలో ఇంకొకదాన్ని ఉపయోగిస్తాయి. ప్రాయశ్చిత్తము మరియు సంతృప్తిచెందటం మధ్య వ్యత్యాసాన్ని వివరించమని నన్ను తరచుగా అడుగుతారు. కష్టమేమిట౦టే, ఈ పదాలు బైబిలులో ఉన్నప్పటికీ, మన౦ వాటిని రోజువారీ పదజాలం భాగ౦గా ఉపయోగి౦చడ౦ లేదు, కాబట్టి అవి లేఖన౦లో ఏమి తెలియచేస్తున్నాయో మనకు ఖచ్చిత౦గా తెలియదు. ఈ పదాలకు సంబంధించి మనకు అనుసంధానమైన విషయాలు లేవు.
ప్రాయశ్చిత్తము మరియు సంతృప్తిచెందటం
అయితే, ప్రాయశ్చిత్తము (ఎక్స్పీసిఏషన్) అనే పదంతో ప్రారంభిస్తూ ఈ పదాలకు అర్థం ఏమిటో ఆలోచిద్దాం. ఎక్స్ అనే పూర్వపదానికి “బయటకు” లేదా “నుండి” అని అర్థం, కాబట్టి ప్రాయశ్చిత్తము అనేది దేనినైనా తొలగించడం లేదా దేనినైనా తీసివేయడంతో సంబంధం కలిగి ఉంటుంది. వాక్యానుసారమైన పరిభాషలో చెప్పాలంటే, ఇది జరిమానా చెల్లించడం ద్వారా లేదా పాపపరిహారం చేయడం ద్వారా అపరాధాన్ని తొలగించడంతో సంబంధం కలిగి ఉంటుంది. దీనికి వ్యత్యాసంగా, సంతృప్తిచెందటం (ప్రోపీసిఏషన్) అనేది దేని కొరకు ప్రాయశ్చిత్తము చేయబడుతుందో దానితో ముడిపడి ఉంటుంది. ప్రో అనే పూర్వపదానికి “కొరకు” అని అర్థం, కాబట్టి సంతృప్తిచెందటం అనేది దేవుని దృక్పథంలో మార్పును తెస్తుంది, తద్వారా ఆయన మనతో శత్రుత్వం నుండి మన కొరకు ఉండటానికి మళ్లుతాడు. సంతృప్తిచెందటం అనే ప్రక్రియ ద్వారా, మనం ఆయనతో సహవాసం మరియు అనుగ్రహానికి పునరుద్ధరించబడతాము.
ఒక రకంగా, సంతృప్తిచెందటం అనేది దేవుడు శాంతింపబడటంతో ముడిపడి ఉ౦టు౦ది. సైనిక, రాజకీయ సంఘర్షణలలో శాంతింపజేయటం అనే పదం ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు. ప్రపంచాన్ని జయించిన హింసాత్మకమైన ఒక వ్యక్తి ఖడ్గముతో చప్పుడు చేస్తూ తిరుగుతూ వుంటే, మీరు అతని మెరుపుదాడికి గురి అవ్వడం కన్నా చెకోస్లోవేకియా లేదా అలాంటి మరొక ప్రాంతం నుండి అతనికి సుడెటెన్ల్యాండ్ ఇచ్చివేయడం అన్న తత్వశాస్త్రం రాజకీయాలలోని శాంతింపజేయటం అన్నట్లుగా మనము ఆలోచిస్తాము. అతను మీ దేశంలోకి వచ్చి మిమ్మల్ని నరికివేయకుండా ఉండటానికి అతనికి సంతృప్తి కలిగించే ఏదైనా ఇవ్వడం ద్వారా మీరు అతని ఉగ్రతను చాలార్చడానికి ప్రయత్నిస్తారు. అది దైవభక్తి లేని శాంతింపబడటం యొక్క వ్యక్తీకరణ. కానీ, మీరు కోపంగా వున్నారు, మీరు ఉల్లంఘించబడినారు అనుకోండి, నేను మీ కోపాన్ని చల్లార్చితే, మిమ్మల్ని శాంతింపజేస్తే, అప్పుడు నేను మీ కటాక్షము పొందుకున్న వాడిని అవుతాను ఇక సమస్య పరిష్కరింపబడింది.
కాలానుగుణంగా ఒకే గ్రీకు పదాన్ని ప్రాయశ్చిత్తం, సంతృప్తిచెందటం అనే రెండు పదాలతో అనువదిస్తారు. కానీ ఆ పదాలలో స్వల్ప వ్యత్యాసం ఉంది. మనపట్ల దేవుని దృక్పథాన్ని మార్చడానికి దోహదపడే చర్యే ప్రాయశ్చిత్తము. క్రీస్తు సిలువపై చేసినది అదే, క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్త కార్యము యొక్క ఫలితము సంతృప్తిచెందటం—దేవుని కోపము మరలించబడినది. చెల్లించే విమోచన క్రయధనానికి, విమోచన క్రయధనాన్ని స్వీకరించే వ్యక్తి దృక్పథానికి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉంటుందో అలాంటిదే ఇక్కడ వున్న వ్యత్యాసం.
క్రీస్తు చేసిన కార్యము ఒక శాంతింపజేసే చర్య
ప్రాయశ్చిత్తము మరియు సంతృప్తిచెందటం కలిసి శాంతింపజేసే చర్యగా ఉంటాయి. క్రీస్తు దేవుని ఉగ్రతను చల్లార్చడానికి సిలువపై తన కార్యాన్ని చేసాడు. దేవుని ఉగ్రతను చల్లార్చాలనే ఈ ఆలోచన ఆధునిక వేదాంతవేత్తల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఏమీ చేయలేదు. వాస్తవానికి, దేవుని ఉగ్రతను చల్లార్చాలనే పూర్తి ఆలోచన పట్ల వారు చాలా కోపగించుకుంటారు. ఆయనను శాంతపరచడానికి లేదా ఆయనకు ఉపశమనాన్ని కలిగించడానికి మనం ఏదో ఒకటి చేసి ఆయనను సంతృప్తిపరచవలసి ఉంటుంది అనేది దేవుని గౌరవానికి తగినది కాదు అని వారు ఆలోచిస్తారు. దేవుని ఉగ్రతను మనం ఎలా అర్థం చేసుకోవాలనే విషయంలో మనం చాలా జాగ్రత్తపడాలి, కానీ దేవుని ఉగ్రతను తగ్గించే భావన ఇక్కడ ఒక పరిధీయమైన, అప్రస్తుతమైన వేదాంత దృక్పథంతో కాకుండా, రక్షణ యొక్క సారంతో ముడిపడి ఉందని నేను మీకు గుర్తు చేస్తున్నాను.
రక్షణ అంటే ఏమిటి?
చాలా ప్రాథమిక ప్రశ్నను నన్ను అడగనివ్వండి: రక్షణ అనే పదానికి అర్థం ఏమిటి? దాన్ని త్వరగా వివరించడానికి ప్రయత్నించడం మీకు తలనొప్పిని కలిగిస్తుంది, ఎందుకంటే రక్షణ అనే పదాన్ని బైబిల్లో సుమారు డెబ్బై రకాలుగా ఉపయోగిస్తారు. ఎవరైనా యుద్ధంలో ఓటమి నుండి రక్షించబడితే, అతను రక్షణను అనుభవిస్తాడు. ఎవరైనా ప్రాణాంతక వ్యాధి నుండి బయటపడితే, ఆ వ్యక్తి రక్షణను అనుభవిస్తాడు. ఎవరైనా మొక్కలను ఎండిపోయిన స్థితి నుండి దృఢమైన ఆరోగ్యానికి తీసుకువస్తే, అవి రక్షించబడ్డాయి. ఇది బైబిల్ భాష, మరియు ఇది నిజంగా మన స్వంత భాష కంటే భిన్నమైనది కాదు. డబ్బు ఆదా చేస్తాం. ఒక బాక్సర్ గంట ద్వారా రక్షింపబడతాడు, అనగా అతను దేవుని శాశ్వత రాజ్యంలోకి కొనిపోబడినట్లు కాదు కానీ అతను పడగొట్టబడటం ద్వారా పోరులో ఓడిపోకుండా రక్షించబడతాడు. సంక్షిప్తంగా, స్పష్టమైన మరియు ప్రస్తుత ప్రమాదం నుండి విముక్తి యొక్క ఏదైనా అనుభవాన్ని రక్షణ యొక్క ఒక రూపంగా చెప్పవచ్చు.
మన౦ వాక్యానుసారంగా రక్షణ గురి౦చి మాట్లాడేటప్పుడు, మన౦ అంతిమంగా దేని ను౦డి రక్షి౦చబడ్డామో చెప్పడానికి జాగ్రత్తగా ఉ౦డాలి. అపొస్తలుడైన పౌలు 1 థెస్సలొనీకయులు 1:10 లో యేసు “రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించును” అని చెప్పాడు. అంతిమంగా, దేవుని ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి యేసు చనిపోయాడు. దీనికి వేరుగా నజరేయుడైన యేసు యొక్క బోధనను, సందేశాలను మనం అర్థం చేసుకోలేము, ఎందుకంటే ఏదో ఒక రోజు లోకమంతా దైవిక తీర్పు క్రిందకు వస్తుందని ఆయన ప్రజలను నిరంతరం హెచ్చరించాడు. తీర్పుకు స౦బ౦ధి౦చిన ఆయన హెచ్చరికలు కొన్ని ఇక్కడ ఉన్నాయి: “నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును” (మత్తయి 5:22); “మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును” (మత్తయి 12:36); మరియు “నీనెవెవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.” (మత్తయి 12:41). యేసు యొక్క వేదాంతశాస్త్రం ఒక సంక్షోభ వేదాంత శాస్త్రం. సంక్షోభం అనే గ్రీకు పదానికి “తీర్పు” అని అర్థం. యేసు బోధించిన సంక్షోభం లోకానికి రాబోయే తీర్పు యొక్క సంక్షోభం, ఈ సమయంలో దేవుడు తన ఉగ్రతను విమోచింపబడని వారిపై, దైవభక్తి లేనివారిపై, అపవిత్రులపై కుమ్మరించబోతున్నాడు. ఆ ఉగ్రత ను౦డి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక నిరీక్షణ క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త౦తో కప్పబడి ఉ౦డడమే.
కాబట్టి, సిలువపై క్రీస్తు సాధించిన అత్యున్నత విజయం ఏమిటంటే, క్రీస్తు త్యాగం ద్వారా మనం కప్పబడకపోతే మనకు వ్యతిరేకంగా మండే దేవుని ఉగ్రతను ఆయన చల్లార్చాడు అనునదియే. కాబట్టి ఎవరైనా దేవుని ఉగ్రతను క్రీస్తు సంతృప్తి పరిచాడనే ఆలోచనకు వ్యతిరేకంగా వాదించినట్లయితే, అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే సువార్త ప్రమాదంలో ఉంది. ఇది రక్షణ యొక్క సారాంశానికి సంబంధించినది— ఏ వ్యక్తికైనా బహిర్గతమయ్యే అత్యున్నత ప్రమాదం నుండి, ప్రాయశ్చిత్తంతో కప్పబడిన వ్యక్తులుగా, మనం విమోచన పొందుతాము. ఉగ్రతతో వున్న పరిశుద్ధ దేవుని చేతిలో పడటం భయంకరమైన విషయం. ఎవరి పాపాల కొరకు వెల చెల్లించబడిందో వారి పట్ల దేవుని ఉగ్రత ఉండదు. రక్షణ అనేది దీని గురించియే.