Jesus Is the New David

యేసు నూతన దావీదు

22/09/2026
How Can I Grow in Wisdom?

నేను జ్ఞానంలో ఎలా ఎదగగలను?

29/09/2026
Jesus Is the New David

యేసు నూతన దావీదు

22/09/2026
How Can I Grow in Wisdom?

నేను జ్ఞానంలో ఎలా ఎదగగలను?

29/09/2026

యేసు పరిపూర్ణుడా?

Was Jesus Perfect?

“ఎవరూ పరిపూర్ణులు కారు.” ఇది నేటి కాలపు ఒక సూక్తి, ఇది నిజమే అనిపిస్తుంది. మనందరికి మన తప్పులు, పరిమితులు తెలుసు, మరియు మన తరపున ఈ సూక్తిని వెంటనే ఉటంకిస్తాము.

అయినప్పటికీ, బైబిల్ ఈ నియమానికి ఒక మినహాయింపును ఇస్తుంది. కొన్నిసార్లు మనం ఇలా కూడా వింటాము: “పరిపూర్ణుడైన పురుషుడు ఒక్కడే ఉన్నాడు.” ఆ పురుషుడే యేసు క్రీస్తు.

ఇప్పటివరకు జీవించిన వారిలో యేసు ఒక్కడే పరిపూర్ణుడు అన్నది నిజమే. కానీ బైబిల్ ఈ విషయాన్ని ఎక్కడ, ఎలా బోధిస్తుంది? ఆసక్తికరంగా, కొన్ని వచనాలు యేసు పరిపూర్ణుడయ్యాడని కూడా చెబుతున్నాయి. యేసు యొక్క పరిపూర్ణతను పరిశీలిద్దాం.

దేవుని దైవ కుమారుడు

యేసు యొక్క పరిపూర్ణ మానవ జీవితం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడే ముందు, ఆయన ఒక నిత్య, దైవిక వ్యక్తి అని మనం గుర్తించాలి. మరో మాటలో చెప్పాలంటే, ఆయన నిత్య దేవుని కుమారుడు (యోహాను 1:1). దేవుని స్వభావాన్ని ఏర్పరిచే సంపూర్ణ పరిపూర్ణతతో ఆయన నిత్యముగా ఉనికిలో ఉన్నారు. ఆయన “తన ఉనికి, జ్ఞానం, శక్తి, పరిశుద్ధత, న్యాయం, మంచితనం మరియు సత్యం విషయంలో అనంతమైనవాడు, నిత్యమైనవాడు మరియు మార్పులేనివాడు” (వెస్ట్‌మిన్‌స్టర్ షార్టర్ కేటకిజం 4).

మరో మాటలో చెప్పాలంటే, యేసు తన దైవిక కుమారుని హోదా వలన పరిపూర్ణుడు. ఆయన పాపం నుండి పూర్తిగా విముక్తుడు.

యేసు యొక్క పరిపూర్ణ మానవత్వం

ఆయన దైవ కుమారుని హోదాకు భిన్నంగా, మనం యేసు యొక్క పరిపూర్ణ జీవితం గురించి మాట్లాడినప్పుడు, శరీరదారియై ఉన్న  స్థితిలో  ఆయన మానవత్వాన్ని బట్టి, అంటే ఆయన మానవ స్వభావం యొక్క పరిపూర్ణతను బట్టి ఆయన గురించి మాట్లాడుతున్నాము. దీనిని అనేక కోణాల నుండి చూడవచ్చు.

మొదటిగా, యేసు ఆదాము పాపంలో చేర్చబడలేదు. రోమా 5:12–21 వంటి వాక్యభాగం యొక్క అంతరార్థం ఇదే. ఆదామునందు “అందరూ పాపం చేశారు” (రోమా 5:12), కానీ యేసు దానికి విరుద్ధమైన వాదనను అందిస్తారు. ఆదామునందు ఉన్న ప్రజలందరికీ ఒకే పాపం శిక్షకు దారితీసింది, అయితే క్రీస్తునందు ఉన్న ప్రజలందరికీ ఒకే నీతి కార్యము సమర్థనకు దారితీసింది (రోమా 5:18–19).

ఆదాము ద్వారా ప్రజలందరూ పాపం చేసినప్పటికీ, క్రీస్తు నీతిని మరియు జీవాన్ని తెస్తే, ఆదాము ద్వారా పాపం చేసిన ‘అందరిలో’ యేసు లేనట్టే. ఆయన అనుగ్రహించే నీతి, నిబంధనకు శిరస్సుగా మరియు సంపూర్ణ నీతిమంతుడైన ప్రతినిధిగా ఆయనకున్న ప్రత్యేక స్థానం నుండి వస్తుంది. ఇది, మరియ కనే శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అయి ఉంటాడు దేవదూత గబ్రియేలు మరియకు ఇచ్చిన సందేశానికి అనుగుణంగా ఉంది (లూకా 1:35).

వీటన్నింటి అర్థం ఏమిటంటే, యేసుకు పాపం వైపు మొగ్గుచూపే పతన స్వభావం లేదు. యేసుకు పతనమవని, పాపరహితమైన మానవ స్వభావం ఉంది. ఆయన పరిపూర్ణ నీతిమంతుడు.

రెండవదిగా, యేసు సంపూర్ణ విధేయతతో కూడిన మానవ జీవితాన్ని గడిపారు. దీనిని కూడా ఆదాముతోనే ముడిపెట్టాలి. ఆదాము యొక్క అవిధేయత శిక్షకు దారితీసింది, కానీ క్రొత్త నిబంధన యేసును రెండవ మరియు కడపటి ఆదాముగా, అంటే మొదటి ఆదాము యొక్క అవిధేయతను తన విధేయతతో రద్దు చేసిన ప్రతినిధిగా చూపిస్తుంది.

రోమీయులకు 5:12–21తో పాటు, మార్కు సువార్తలోని శోధన వృత్తాంతం కూడా యేసును క్రొత్త ఆదాముగా, అంటే శోధన ఎదురైనప్పుడు విధేయత చూపిన ప్రతినిధిగా చిత్రీకరిస్తుంది. బహుశా అందుకే అడవి జంతువుల ప్రస్తావన వచ్చి, ఏదేను తోటను గుర్తుచేస్తుంది (మార్కు 1:12–13).

అదేవిధంగా, లూకా 3:21–22లో యేసు బాప్తిస్మము పొందిన తరువాత, లూకా సువార్త ఆదాము వరకు యేసు వంశావళిని చూపిస్తుంది (లూకా 3:23–38). దీని తరువాత, యేసు అరణ్యంలో విధేయత చూపాడు (లూకా 4:1–13). ఇది మళ్ళీ యేసు విధేయతను, నూతన ఆదాముగా ఆయనకున్న గుర్తింపుతో ముడిపెడుతుంది.

పౌలు కూడా 1 కొరింథీయులకు 15వ అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. యేసు కడపటి ఆదాము, ఆయన ద్వారానే మృతుల పునరుత్థానం కలుగుతుంది (1 కొరింథీ. 15:21–22, 45). యేసు పునరుత్థానం ఆయన అన్యాయపు మరణానికి సమర్థనగా నిలిచింది. ఆయన పాపరహితుడు కాబట్టి, ఒక నేరస్థునిగా హత్య చేయబడటం ఆయనకు జరిగిన అన్యాయం, మరియు ఆయన నూతన జీవితానికి లేవడం ఆయన పరిపూర్ణ విధేయతను ప్రదర్శిస్తుంది (1 తిమోతి 3:16 చూడండి). యేసు పునరుత్థానం ఆయన జీవితకాలమంతటి విధేయతను సూచిస్తుంది (హెబ్రీ. 2:14–18 చూడండి).

మూడవదిగా, హెబ్రీయులకు రాసిన పత్రిక యేసు పరిపూర్ణుడుగా చేయబడటం గురించి మాట్లాడినప్పుడు (హెబ్రీ. 2:10; 5:9; 7:28), మనం దీనిని ఆయన యొక్క సారాంశ స్వభావం పరంగా కాకుండా, రక్షణ చరిత్ర సందర్భంలో అర్థం చేసుకోవాలి. నిత్య దేవుని కుమారుడైన యేసులో పాపం లేదు. అంతేకాక, యేసు తన భూలోక జీవితంలో ఎన్నడూ పాపం చేయలేదు. కాబట్టి, ఆయన పరిపూర్ణుడుగా చేయబడటం అనేది, అంతకు ముందున్న యాజకుల కంటే దేవుని యొద్దకు మనకు గొప్ప ప్రవేశాన్ని కల్పించే అంతిమ, పరిపూర్ణ యాజకుడిగా ఆయన పోషించిన విజయవంతమైన పాత్రను సూచిస్తుంది (హెబ్రీ. 5:7–10; 6:19–20; 9:11–14; 10:5–14 చూడండి).

యేసు అంతిమ బలిని అర్పించగలిగాడు, ఎందుకంటే ఆయన అక్షయమైన జీవశక్తిని బట్టి నిరంతరం జీవించే నిత్య దేవుని కుమారుడు (హెబ్రీ. 7:15–28). యేసు పునరుత్థానం మరియు ఆయన దేవుని యొద్దకు కల్పించే ప్రవేశం, ఆయన తనను తాను అర్పించుకున్న బలియాగం యొక్క పరిపూర్ణతను, అందువల్ల ఆయన భూలోక జీవితం యొక్క పరిపూర్ణతను సూచిస్తాయి.

ముగింపు

మనలో ఎవరూ పరిపూర్ణులు కారు కాబట్టి, యేసు పరిపూర్ణుడు అనే శుభవార్త ఎంతో గొప్పది. యేసు రెండవ మరియు కడపటి ఆదాము. ఆయన పరిపూర్ణ విధేయతే, విశ్వాసం ద్వారా మనం ప్రయోజనం పొందే మన నీతికి ఆధారాన్ని అందిస్తుంది. నిత్యజీవం ఆయనయందు లభిస్తుంది (యోహాను 1:4; 20:31). ఆయన కేవలం ఒక మనిషి కాదు; ఆయన నిత్యుడైన దేవుని కుమారుడు. అయినప్పటికి ఆయన నిజమైన మనిషి—మన కోసం మనం చేసుకోలేని దానిని చేసిన దైవమానవుడు.

పరిపూర్ణ యాజకునిగా, దేవుని వద్దకు సంపూర్ణ ప్రవేశాన్ని కల్పించే ఏకైక మధ్యవర్తి యేసు మాత్రమే (హెబ్రీ 10:14). కాబట్టి, మన అవసర సమయంలో కరుణను పొంది, కృపను కనుక్కోవడానికి ధైర్యముతో కృపా సింహాసనాన్ని సమీపిద్దాం (హెబ్రీ 4:14–16).


ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

డాక్టర్ బ్రాండన్ డి

డాక్టర్ బ్రాండన్ డి

డాక్టర్ బ్రాండన్ డి. క్రో ఫిలడెల్ఫియాలోని వెస్ట్‌మిన్‌స్టర్ థియోలాజికల్ సెమినరీలో క్రొత్త నిబంధన ప్రొఫెసర్ మరియు అమెరికాలోని ప్రెస్బిటేరియన్ సంఘములో బోధనా పెద్దగా ఉన్నారు. ఆయన ‘యేసు ఎందుకు పరిపూర్ణ జీవితం గడిపారు?’ మరియు ‘విశ్వాస మార్గం: నిబంధన మరియు ధర్మశాస్త్రం యొక్క బిబ్లికల్ దైవశాస్త్రం’ వంటి అనేక పుస్తకాల రచయిత.