
ఎక్సెజెసిస్ అంటే ఏమిటి?
09/10/2025
హెర్మెన్యూటిక్స్ అంటే ఏమిటి?
16/10/2025సువార్తలను ఎలా చదవాలి?
మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలు అనేవి యేసుక్రీస్తు యొక్క జీవితం, ఆయన మరణం, మరియు ఆయన పునరుత్థానం గురించిన “సువార్త”ను వివరించే నాలుగు వృత్తాంతాలు. అయితే, వీటిని తరచుగా సరిగా అర్థం చేసుకోకపోవడం లేదా వాటి లోతైన ప్రాముఖ్యతను గుర్తించకపోవడం జరుగుతుంది. సువార్తలను చదవడానికి ఇక్కడ నాలుగు సాధారణమైన, స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి.
1. సువార్తలను చదివేటప్పుడు, ప్రతి వచనాన్ని, ప్రతి భాగాన్ని యేసుక్రీస్తు వ్యక్తిత్వం మరియు ఆయన సందేశం యొక్క గొప్ప వెలుగులో చదవండి.
మనం తరచుగా ద్వితీయ పాత్రల (ఉదాహరణకు, శిష్యులు, బర్తిమయి, మగ్దలేనే మరియ వంటివారు) మీద దృష్టి పెట్టడం ద్వారా, ఈ వృత్తాంతాలకు కేంద్ర బిందువైన యేసు ప్రభువును విస్మరిస్తూ ఉంటాము. యేసు పరిచర్య సుమారు మూడు సంవత్సరాల పాటు కొనసాగింది, ఈ కాలంలో ఆయన వందలాది, బహుశా వేలాది మంది వ్యక్తులకు బోధించారు, స్వస్థతనిచ్చారు మరియు వారితో సంభాషించారు. యోహాను 21:25 కూడా ఇలా చెబుతుంది: “యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.” ఈ సువార్తల సారాంశం ఏమిటంటే, ప్రతి సువార్త వృత్తాంతం యేసు పరిచర్యలో ఒక భాగాన్ని మాత్రమే మనకు తెలియజేస్తుంది. ఇది ఆయన చేసిన మొత్తం సేవలో ఒక ముఖ్యమైన, ప్రతినిధించే భాగం మాత్రమే. కాబట్టి, మన దగ్గర క్రీస్తు చేసిన కార్యములలో కేవలం ఒక కొంత భాగం మాత్రమే ఉంది. ఉదాహరణకు, లూకా సువార్తలో ఇరవై ఒక్క అద్భుతాలు, యోహాను సువార్తలో ఎనిమిది నమోదు చేయబడ్డాయి. నాలుగు సువార్తలు క్రీస్తు జీవితాన్ని నేర్పుగా వివరించడమే కాక, అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలను కూడా కలిగి ఉన్నాయి. సువార్తికులు కథావిశేషాలు, పాత్రలు, కథాంశం, భౌగోళిక అంశాలు, మరియు పాత నిబంధనతో ఉన్న సంబంధం ద్వారా యేసు కథను ఎలా చెప్పారో మనం చదవాలి.
2. మనం సువార్తలను క్రీస్తుకు అనుగుణంగా చదవడమే కాకుండా, పాత నిబంధనతో అవి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో కూడా చదవాలి.
విమోచన కథనం (లేదా రక్షణ నాటకం) వెలుపల ఏ ఒక్క వాక్యాన్ని కూడా చదవకూడదు. మత్తయి సువార్త తన వంశావళిని మత్తయి 1:1లో ఆదికాండము 2:4కి ఒక పరోక్ష సూచనతో ప్రారంభిస్తాడు. యోహాను సువార్త 1:1–5, యేసును ఆదికాండము 1–2లోని సృష్టి కథనంలో ఉంచడం ద్వారా మొదలవుతుంది. అంతేకాకుండా, నాలుగు సువార్తలు పాత నిబంధనను స్పష్టమైన ఉదాహరణలు, పరోక్ష సూచనలు మరియు భావనాత్మక పోలికల ద్వారా వేల సార్లు పేర్కొంటాయి. సువార్తలు అద్భుతమైన పని చేస్తున్నాయి: అవి క్రీస్తు పరిచర్య ద్వారా ఈ సృష్టి చరిత్రను మరియు ఇశ్రాయేలు కథను నమోదు చేస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే, పాత నిబంధనతో ఉన్న సంబంధాలను(క్రాస్-రిఫరెన్సులను) దృష్టిలో పెట్టుకొని సువార్తలను చదవండి. పాత నిబంధనతో క్రీస్తు సంబంధాన్ని వివరించకుండా సువార్తలను బోధిస్తే, మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తల యొక్క సారాన్ని పూర్తిగా నాశనం చేసినట్టే.
3. సువార్తలను కలిపి చదవండి—నాలుగు సువార్తలు ఉండటానికి ఒక కారణం ఉంది.
సువార్తలు క్రీస్తు యొక్క చిత్రపటాలు, ప్రతి చిత్రపటం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. వాటి ప్రత్యేకతను తెలుసుకోవడానికి ఒక మార్గం సువార్తల యొక్క సారాంశాన్ని ఉపయోగించడం. సువార్తల సారాంశం (Synopsis), మత్తయి, మార్కు మరియు లూకా సువార్తలలోని ఒకే కథా భాగాలను, వాటిలో అతివ్యాప్తి చెందే విషయాలతో సహా, ఒకేచోట చూపిస్తుంది. కాబట్టి, సినోప్టిక్స్ (మత్తయి, మార్కు మరియు లూకా)లోని ఒక భాగాన్ని మీరు పరిశీలించేటప్పుడు, ప్రతి వృత్తాంతంలో ఉన్న సారూప్యతలను మరియు తేడాలను గుర్తించండి. ప్రతి సువార్త ఒకే విషయాన్ని ఎలా ప్రస్తావించిందో పరిశీలించడం ద్వారా, ప్రతి సువార్తికుడు ఒకే కథను కొద్దిగా భిన్నమైన రీతిలో ఎలా తిరిగి చెప్పాడో మనం మరింత సులభంగా గమనించవచ్చు. ఈ ప్రత్యేకమైన ఉద్ఘాటనలు ప్రతి సువార్తికుడి ఉద్దేశ్యాలు మరియు వేదాంతశాస్త్రాన్ని వెల్లడిస్తాయి. చాలామంది క్రైస్తవులు ఈ విధంగా సువార్తలను కలిసి చదవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు, కానీ వారు అలా చేస్తే గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
4. మీరు నేర్చుకున్న సత్యాలను ఆచరించండి.
సువార్త రచయిత లూకా, థెయొఫిలా అనే ఒక క్రైస్తవుడికి, తాను తన సువార్తను “నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు” రాశానని తెలియజేశాడు (లూకా 1:4; యోహాను 20:31). “ఉపదేశింపబడిన సంగతులు” అంటే యేసు జీవితం, మరణం మరియు పునరుత్థానం గురించిన ప్రధాన విషయాలే అని భావించవచ్చు. ఆ విధంగా, లూకా తన కథనాన్ని థెయొఫిలా మరియు సంఘం యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి రాశాడు. మరో మాటలో చెప్పాలంటే, లూకా సువార్త విశ్వాసుల విశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది. ఈ కథనాల యొక్క రూపురేఖలను తెలుసుకోవడం, క్రీస్తుపై మన నమ్మకాన్ని మరింత లోతుగా చేసి, దేవుని పట్ల మన భక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం కూడా ఒకే నిబంధన సమాజంలో భాగం, ఇది ఏదేను తోట నుండి నూతన యెరూషలేము వరకు విస్తరించి ఉన్న విశ్వాసుల సమాజం. కాబట్టి, మనం ఈ సువార్తలను మనకు చెందినవని చదవాలి. మనల్ని ఆ తొలి శ్రోతల నుండి రెండు వేల సంవత్సరాలు వేరు చేసినప్పటికీ, దేవుడు ఇప్పటికీ ఈ నాలుగు అమూల్యమైన గ్రంథాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
దీని సారాంశం ఏమిటంటే, మనం సువార్తలన్నిటినీ క్రీస్తు వెలుగులో, పాత నిబంధనతో వాటికున్న సంబంధాన్ని అర్థం చేసుకుంటూ, వాటిని ఒకే నాలుగు భాగాల కథనంగా చదవాలి. అంతేకాకుండా, ఈ సత్యాలను మన జీవితాలకు అన్వయించుకోవాలి. అలా చేయడం ద్వారా, మనం క్రీస్తును మరింత పూర్తిగా తెలుసుకొని, ఆయన కొరకు మరింత ఎక్కువగా జీవిస్తాం.
ఈ వ్యాసం హెర్మనెటిక్స్ (అర్థ వివరణ శాస్త్రం) అనే సేకరణలో ఒక భాగం.
ఉదాహరణకు: నాలుగు సువార్తల సారాంశ గ్రంథం (సంపాదకులు: కర్ట్ అలండ్; న్యూయార్క్: అమెరికన్ బైబిల్ సొసైటీ, 1985).


