How-Is-Jesus-the-Way-the-Truth-and-the-Life
యేసు ఎలా మార్గం, సత్యం మరియు జీవం అయ్యాడు?
06/11/2025
క్రైస్తవ శిష్యత్వపు ప్రాథమిక అంశాలు
18/11/2025
How-Is-Jesus-the-Way-the-Truth-and-the-Life
యేసు ఎలా మార్గం, సత్యం మరియు జీవం అయ్యాడు?
06/11/2025
క్రైస్తవ శిష్యత్వపు ప్రాథమిక అంశాలు
18/11/2025

యేసుక్రీస్తు లోకానికి వెలుగు ఎలా అయ్యాడు?

How Is Jesus the Light of the World?

కొన్ని వారాల క్రితం, నేను మా ఇంటి పక్కన ఉన్న చిన్న అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా, చెట్లు సూర్యరశ్మి కోసం సూర్యుని వైపు చాచి పెరగడం  నేను గమనించాను. అడవి మధ్యలో ఉన్న చెట్లు నిటారుగా ఎత్తుగా పెరిగితే, అంచులలో ఉన్న వాటి కొమ్మలు పొడవుగా విరబూసి జీవాన్నిచ్చే ఆ వెలుగు కోసం ముందుకు వంగి ఉంటాయి. అప్పుడు నాకు యేసుక్రీస్తు బోధనల ప్రభావం గురించి యెషయా ప్రవక్త ప్రవచించిన మాటలు గుర్తొచ్చాయి.

“ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది,
దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను
యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు
యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును.”  (యెషయా 61:1, 3)

దేవుడు సృష్టి ఆరంభంలో తన వాక్యంతో వెలుగును ఉనికిలోకి తెచ్చాడు. “వెలుగు కలుగుగాక” అని ఆయన పలకగా, వెంటనే వెలుగు కలిగింది. ఆ వెలుగు స్వచ్ఛమైన శక్తి గానీ, పదార్థం గానీ కాదని, ఇప్పటికీ అది మనకు ఒక రహస్యంగానే ఉంది (ఆదికాండము 1:4). ఆయన కేవలం వెలుగును సృష్టించడమే కాదు, వెలుగును మోసుకొచ్చే వాటిని కూడా సృష్టించాడు. “పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని, నక్షత్రములను” ఆయన చేశాడు (ఆదికాండము 1:16). ఆ పెద్ద జ్యోతి, అంటే సూర్యుడు, ఒక అపారమైన అణు శక్తి కేంద్రం. అది తన అద్భుతమైన పరిమాణంతో, శక్తితో భూమిని నింపుతుంది. మనం మన దృష్టిని ఆకర్షించని లేదా అంతగా ప్రాముఖ్యత లేని విషయాలలో మునిగిపోయి, దాని గొప్పతనాన్ని సులభంగా మరిచిపోతాము. అయితే, చీకటి రాత్రిలో దారి వెతుక్కున్నప్పుడు గానీ, లేదా చలికాలపు సుదీర్ఘ చీకటి రోజుల తర్వాత వెలుగు నిండిన వసంతకాలం, సుదీర్ఘ వేసవి కాలం కోసం మన హృదయం ఆశగా ఎదురు చూసినప్పుడు గానీ, వెలుగు యొక్క విలువ మనకు తిరిగి గుర్తుకొస్తుంది. ఎందుకంటే, వెలుగే జీవితం.

అయితే, వెలుగు కేవలం భౌతికమైనది మాత్రమే కాదు. అది రక్షణకు కూడా ఒక సూచనగా సృష్టించబడింది. ఇశ్రాయేలీయులకు అగ్నిస్తంభం రక్షణగా ఉండగా, ఐగుప్తీయులు మాత్రం చీకటిలో జీవించారు (నిర్గమ. 14:20). దేవుని సన్నిధి గుడారంలో ఉన్న పన్నెండు రొట్టెలపై ఉన్న దీప స్తంభం వెలుగును ఇచ్చింది. ఇది ఇశ్రాయేలు గోత్రాలను దేవుడు ఎలా దీవించాడో సూచించే దృశ్యం. “యెహోవా తన ముఖకాంతి నీమీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక” (సంఖ్యాకాండము 6:24-27). కీర్తనల గ్రంథకర్త ఆనందంతో ఇలా అన్నాడు: “యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు” (కీర్తనలు 27:1). దీనికి విరుద్ధంగా, మానవుల పాపం కారణంగా ఈ లోకం చీకటితో నిండిపోయింది. దీనికి విరుద్ధంగా, మానవుల పాపం వల్ల ఈ లోకం చీకటితో నిండిపోయింది. అవిధేయత వలన స్వభావసిద్ధమైన మానవుడు “గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడును” (ద్వితీయో. 28:29). కానీ రక్షణ మార్గం దేవుని వాక్యం ద్వారా వెలిగించబడింది, అది మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగుగా ఉంటుంది (కీర్తనలు 119:105).

చీకటి నుండి వెలుగులోకి నడిపించబడటమే రక్షణ. అందుకే యేసుక్రీస్తు “నేను లోకమునకు వెలుగును” అని చెప్పినప్పుడు, ఆయన తన అద్భుతమైన మహిమను, అలాగే తన రక్షించే శక్తిని కూడా శక్తివంతంగా చాటి చాటిచెప్పాడు. ఈ వచనంలో, యేసు తన దైవత్వాన్ని స్పష్టంగా ప్రకటించాడు. “నేను ఉన్నవాడను” (I Am Who I Am) అని ప్రకటించిన యేసు, నిత్యమైనవాడు, స్వయంభవుడు, మరియు సూర్యచంద్రులతో సహా సమస్త నక్షత్రాలను సృష్టించినవాడు (నిర్గమ. 3:14). ఆయనే వెలుగు యొక్క మహిమకు మూలం మరియు నమూనా. యోహాను రాసినట్లుగా, “దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు” (1 యోహాను 1:5). యేసు ఆ వెలుగైన ప్రభువు. ఆయన తండ్రి నుండి ప్రకాశించే దివ్యమైన జీవానికి ప్రతిబింబం; ఎందుకంటే తండ్రి వెలుగులో, ఎవరు సమీపించలేని మహిమలో నివసిస్తున్నాడు. యోహాను 1:4-5 యేసు గురించి ఇలా చెబుతోంది: “ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.” ఈ ప్రకటనలు మనకు సరిగ్గా అర్థం కావాలంటే, మొదట మనం సహజమైన భౌతిక వెలుగు (ముఖ్యంగా సూర్యుడు) యొక్క మహిమను గమనించాలి, ఆ తర్వాత మన హృదయాలను తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క మహిమ వైపుకు మళ్లించాలి. అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం, నిజానికి అన్ని నక్షత్రాలు కూడా, మన దేవుని నిత్యమైన మహిమ యొక్క ఘనతకు అతి చిన్న సూచన మాత్రమే.

అయితే, యేసు తనను తాను లోకానికి వెలుగుగా ప్రకటించుకోవడంలో తన రక్షణ కార్యం గురించి కూడా మాట్లాడాడు. ఆయన పాపపు చీకటితో నిండిన ఈ లోకంలో ఆధ్యాత్మిక జీవానికి ఏకైక మూలం. మలాకీ ప్రవక్త మెస్సీయ రాకడను “నీతిసూర్యుడు… ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును” అని ముందుగానే ప్రకటించాడు (మలాకీ 4:2). యేసు రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది (మత్తయి 17:2). పౌలు, యేసుక్రీస్తు యొక్క మహిమ గల దర్శనాన్ని చూసినప్పుడు అది సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగుగా భావించాడు (అపొస్తలుల కార్యములు 26:13). యోహాను కూడా క్రీస్తు యేసు మహిమను “సూర్యునివలె  మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నట్లుగా” చూశాడు (ప్రకటన గ్రంథము 1:16-20). మనం క్రైస్తవులుగా మారడానికి కారణం, “అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక” అని పలికిన దేవుడే, యేసుక్రీస్తు ముఖంలో ఉన్న దేవుని మహిమను గూర్చిన జ్ఞానపు వెలుగును మన హృదయాలలో ప్రకాశింపజేశాడు (2 కొరింథీయులకు 4:6). గొప్ప వెలుగు అయిన దేవుని కుమారుడు, తన ప్రజ్వలిస్తున్న పరిశుద్ధత ద్వారా మన పాప స్వభావాన్ని బయటపెట్టి, ఆ తర్వాత మన హృదయాల లోతైన భాగాలలో శుద్ధి చేసే మరియు జీవాన్ని ఇచ్చే శక్తిని ప్రకాశింపజేస్తాడు.  యేసు సిలువపై ప్రకాశవంతంగా ప్రకాశించాడు, ఖాళీ సమాధి వద్ద మరింత ప్రకాశవంతంగా మరియు ఉన్నతమైన మహిమలో మళ్ళీ ప్రకాశవంతంగా ప్రకాశించాడు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆ వెలుగు ఒకేసారి ప్రపంచమంతటినీ వెలిగించే మెరుపులా ఉంటుంది. ఈ వెలుగు అంతా సువార్త ద్వారా ఈ లోకానికి అందించబడింది, మరియు యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా దానిని మనం పొందగలం.

మనం యేసును విశ్వసించినప్పుడు, మన జీవితంలో ఒక శాశ్వతమైన మార్పు జరుగుతుంది. యేసు చెప్పినట్లుగా, “నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక, జీవపు వెలుగును కలిగి ఉంటాడు” (యోహాను 8:12). పౌలు చెప్పినట్లుగా, “మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు” కాబట్టి మనం ఈ చీకటి లోకంలో వెలుగువలె జీవిస్తున్నాము (ఎఫెసీయులకు 5:8). క్రీస్తుతో ఉన్న మన ఐక్యత ద్వారా, మనం ఎక్కడికి వెళ్తామో, అక్కడ ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఇది మనకు ఓదార్పునివ్వాలి, ముఖ్యంగా మనం లోకం ద్వారా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు. మనుష్యులు మన మంచి పనులను చూసి, పరలోకంలో ఉన్న మన తండ్రిని మహిమపరచి, వెలుగులోనికి రావాలని ప్రార్థించమని కూడా ఇది మనల్ని ప్రోత్సహించాలి.

దీనికి తోడు, క్రీస్తు జీవమే మనుష్యులకు వెలుగు అని యోహాను చెబుతున్నాడు (యోహాను 1:4). మనం కేవలం వెలుగు దగ్గరకు వచ్చి తిరిగి వెళ్లిపోవడం కాదు, నిరంతరం ఆ వెలుగు కోసం ఆశపడాలి. బదులుగా, పరలోకపు మహిమ మనపై మరింత ఎక్కువగా ప్రకాశించాలని కోరుకుంటున్నాము. ఉదయించే సూర్యుని మించిన మహిమను దానిని సృష్టించిన వాని ముఖంలో చూశాము. ఇప్పుడు మన ఆకలి అంతా దేవుని అద్భుతమైన, అపరిమితమైన మహిమ కోసం. మన ఈ చిన్న సూర్యుడు అంధకారంగా మారినప్పుడు, చంద్రుడు రక్తపు రంగులోకి మారినప్పుడు, అది త్రిత్వ దేవుని నిరంతర మహిమలో మన నిత్యజీవితం ప్రారంభమవుతుందనడానికి సంకేతం. మన జీవితాలు జీవపు వెలుగును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ వెలుగు సూర్యుడు లేదా చంద్రుడు అవసరం లేని నగరం మధ్యలో ఉన్న సింహాసనం నుండి నిరంతరం ప్రవహిస్తుంది, ఎందుకంటే దేవుని మహిమ దానిని ప్రకాశింపజేస్తుంది (ప్రకటన గ్రంథము 21:23). ప్రభువు మనకు వెలుగుగా ఉంటాడు, మరియు ఆయన యుగయుగాలకూ పరిపాలిస్తాడు.

యేసు “నేనులోకానికి వెలుగును” అని చెప్పినప్పుడు (యోహాను 8:12), దాని వెనుక ఇంత లోతైన, విస్తారమైన అర్థం ఉంది.

ఈ వ్యాసం యేసు చెప్పిన “నేను ఉన్నవాడను” అనే మాటల శ్రేణిలో భాగం.

పీటర్ వాన్ డూడ్‌వార్డ
పీటర్ వాన్ డూడ్‌వార్డ
రెవరెండ్ పీటర్ వాన్ డూడేవార్డ్ దక్షిణ కరోలినాలోని టేలర్స్‌లో ఉన్న కోవనెంట్ కమ్యూనిటీ సంఘానికి పాస్టర్‌గా ఉన్నారు.