Exceptional Mediocrity

అసాధారణమైన సాధారణత

30/07/2026
Love’s Attributes

ప్రేమ యొక్క లక్షణాలు

06/08/2026
Exceptional Mediocrity

అసాధారణమైన సాధారణత

30/07/2026
Love’s Attributes

ప్రేమ యొక్క లక్షణాలు

06/08/2026

 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను

For God So Loved the World

ప్రతి క్రైస్తవుడు పరిమిత ప్రాయశ్చిత్తాన్ని నమ్ముతాడు. ఇది నా ఆర్మీనియన్ స్నేహితులకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు, ఎందుకంటే ట్యూలిప్ (TULIP) లోని భయంకరమైన “ల” (L) అక్షరాన్ని కేవలం కాల్వినిస్టులు మాత్రమే పాటిస్తారని చాలా కాలంగా భావించబడింది. కానీ యేసు క్రీస్తు మరణాన్ని ఒక వాస్తవ ప్రాయశ్చిత్తంగా (కేవలం సంభావ్యమైనదిగా కాకుండా) గుర్తిస్తే, మీరు విశ్వవ్యాప్తవాదం అనే అబద్ధాన్ని నమ్మితే తప్ప, పరిమితి అనే ప్రశ్న నుండి తప్పించుకోలేము.

క్రీస్తు మరణం వాస్తవానికి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిందనే గుర్తింపు, ఆయన రక్షణా కార్యం యొక్క గొప్ప విస్తృతిని తెలియజేసే ఆ అద్భుతమైన లేఖనాల యొక్క మన వ్యాఖ్యానాన్ని నిర్దేశిస్తుంది. ఉదాహరణకు, యోహాను ఇలా వ్రాశాడు, యేసు “ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు” (1 యోహాను 2:2). ఇక్కడ ఎంపిక కాల్వినిజం మరియు ఆర్మీనియనిజం మధ్య కాదు. అది కాల్వినిజం మరియు విశ్వవ్యాప్తవాదం మధ్య ఉంది. ఒకవేళ “లోకం” అంటే “ఇప్పటివరకు జీవించిన లేదా జీవించబోయే ప్రతి ఒక్క వ్యక్తి” అని అర్థమైతే, ప్రాయశ్చిత్తం యొక్క వాస్తవిక స్వభావం కారణంగా ప్రతి ఒక్కరూ రక్షించబడతారు. అవిశ్వాసం అనే పాపంతో సహా ఏ పాపమూ ప్రాయశ్చిత్తం లేకుండా మిగిలిపోదు.

నరకం మరియు తీర్పు గురించిన బైబిలు బోధలను శ్రద్ధగా పరిగణించే వారెవరూ విశ్వవ్యాప్తవాదాన్ని ఎన్నటికీ సమర్థించరు. దీని అర్థం ఏమిటంటే, యోహాను ఇక్కడ “ప్రపంచం” అనే పదాన్ని, ఇకపై జీవించే ప్రతి ఒక్కరినీ కాకుండా వేరొక దానిని సూచించడానికి ఉపయోగించాడు (అతను తరచుగా చేసే విధంగానే; యోహాను 14:19; 16:8; 18:20; 1 యోహాను 2:15 చూడండి). ప్రపంచానికి ఉన్న ఏకైక రక్షకుడు యేసే అని నొక్కి చెప్పడమే యోహాను ఉద్దేశం. ఆయన మరణం కేవలం యూదులు, అమెరికన్లు లేదా మరేదైనా ఒక సమూహం నుండి మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచం నుండి ప్రజలను విమోచిస్తుంది.

కాల్వినిజం ఒకవైపు విశ్వవ్యాప్తవాదం అనే మతవిశ్వాసభ్రష్టత్వం నుండి, మరోవైపు ప్రాయశ్చిత్తం యొక్క వస్తుగత స్వభావాన్ని తగ్గించే దోషం నుండి రక్షిస్తుంది. యేసు మరణం ఎవరి కోసం ఉద్దేశించబడిందో వారందరినీ రక్షిస్తుందని కాల్వినిస్ట్ గుర్తిస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, ప్రాయశ్చిత్తం దాని పరిధి మరియు ఉద్దేశ్యంలో పరిమితమైనదిగా పరిగణించబడుతుంది. క్రీస్తు ఎవరి కోసం మరణించాడో వారందరూ రక్షింపబడతారు.

అయితే, ఆర్మీనియనిజం అటువంటి తప్పుల నుండి విజయవంతంగా కాపాడుకోలేదు. చరిత్రలోని ప్రతి ఒక్కరినీ రక్షించడానికే యేసు మరణం ఉద్దేశించబడిందని ఆర్మీనియన్ వాదిస్తుంది, కానీ వాస్తవానికి అలా చేయదు. అందువల్ల, ప్రాయశ్చిత్తం ఎవరి కోసం ఉద్దేశించబడిందో వారందరినీ రక్షించలేదు. మరో మాటలో చెప్పాలంటే, ప్రాయశ్చిత్తం దాని పరిధిలో అపరిమితమైనదని వాదిస్తున్నప్పటికీ, దాని ప్రభావం పరిమితమైనదని ఆర్మీనియన్ దృక్పథం నిర్ధారించవలసి వస్తుంది. అది తన సార్వత్రిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడంలో విఫలమైంది.

ఈ రెండు దృక్పథాల మధ్య ఉన్న తేడా, లోయకు అటువైపు వరకు పూర్తిగా విస్తరించి ఉండే ఇరుకైన వంతెనకు మరియు సగం దూరం మాత్రమే వెళ్ళే వెడల్పైన వంతెనకు మధ్య ఉన్న తేడా వంటిది. అవతలి వైపునకు చేర్చని పక్షంలో, ఆ వంతెన ఎంత వెడల్పుగా ఉందన్న దానితో ఎవరికి పని?

ఈ వ్యత్యాసం కారణంగానే, కాల్వినిజం కంటే ఆర్మినియనిజమే క్రీస్తు ప్రాయశ్చిత్తాన్ని మరింతగా పరిమితం చేస్తుందని చార్ల్స్ స్పర్జన్ వాదించారు. ఆర్మినియన్ ఇలా అంటారు:

“ఎవరైనా రక్షించబడటానికి క్రీస్తు మరణించాడు, ఒకవేళ…” — అని చెప్పి, ఆ తర్వాత రక్షణకు సంబంధించిన కొన్ని షరతులను వివరిస్తారు. అసలు క్రీస్తు మరణం యొక్క పరిధిని పరిమితం చేసేది ఎవరు? మీరే కదా. ఎవరి రక్షణనైనా కచ్చితంగా చేకూర్చేలా క్రీస్తు మరణించలేదని మీరు అంటారు. క్రీస్తు మరణాన్ని మేము పరిమితం చేస్తున్నామని మీరు అన్నప్పుడు, మేము మిమ్మల్ని క్షమించమని కోరుతూనే ఇలా అంటాము: “కాదు అయ్యా, నిజానికి అలా చేస్తున్నది మీరే.” క్రీస్తు మరణం ద్వారా లెక్కలేనంత మంది సమూహం యొక్క రక్షణ కచ్చితంగా చేకూరేలా ఆయన మరణించారని మేము చెబుతాము; వారు ఆ మరణం ద్వారా రక్షించబడవచ్చు మాత్రమే కాదు, రక్షించబడ్డారు, కచ్చితంగా రక్షించబడతారు మరియు రక్షణ పొందకుండా పోయే ప్రమాదానికి గురయ్యే అవకాశం అస్సలు లేదు. మీ ప్రాయశ్చిత్త సిద్ధాంతం మీకే చెందుతుంది; దానిని మీరే ఉంచుకోండి. దాని కోసం మేము మా సిద్ధాంతాన్ని ఎప్పటికీ వదులుకోము. (స్పర్జన్ ప్రసంగాలు, సంపుటి 4, పేజీ 228)

అయితే, స్పర్జన్ ఎంతో ఉద్వేగంతో సమర్థించిన ప్రాయశ్చిత్తం గురించి “మన” దృక్పథం ఏమిటి? ప్రత్యేకంగా చెప్పాలంటే, యేసు సిలువపై తన రక్తాన్ని చిందించినప్పుడు, తాను విమోచించాలని ఉద్దేశించిన ప్రతి ఒక్కరినీ వాస్తవంగా విమోచించాడనేదే మన దృక్పథం. పాత నిబంధనలోని ప్రధాన యాజకుడు తన బలి అర్పణ సేవను చేసినప్పుడు ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల పేర్లను తన పతకముపై ధరించినట్లే, క్రొత్త నిబంధనలోని మన గొప్ప ప్రధాన యాజకుడు వారి పాపాల కొరకు తనను తాను బలిగా అర్పించుకున్నప్పుడు, ఆయన ప్రజల పేర్లు ఆయన హృదయంపై లిఖించబడ్డాయి.

యోహాను 10వ అధ్యాయంలో, పాపపరిహారార్థమైన తన మరణం యొక్క నిర్దిష్ట ఉద్దేశ్యాన్ని యేసు స్పష్టంగా తెలియజేస్తున్నారు. “గొర్రెల కోసం తన ప్రాణాన్ని అర్పించే” (యోహాను 10:11) “గొప్ప కాపరి”గా ఆయన తనను తాను అభివర్ణించుకుంటారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, తన తండ్రి తనకు అప్పగించినవారే తన గొర్రెలని ఆయన వివరిస్తారు. అంతేకాకుండా, విశ్వసించని కొందరు ఇశ్రాయేలీయులతో ఆయన సూటిగా ఇలా అంటారు: “మీరు నా గొర్రెలలో వారు కారు గనుకనే మీరు విశ్వసించడం లేదు” (యోహాను 10:26–29).

యోహాను 17వ అధ్యాయంలో మన ప్రభువు చేసిన ప్రధాన యాజక ప్రార్థన కూడా అటువంటి పరిమిత పరిధిని కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది. తన ప్రజల కోసం బలియాగంగా మరణించడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఆయన ప్రత్యేకంగా—అంతేకాదు, కేవలం వారి కోసమే—ప్రార్థిస్తారు. తండ్రి ఈ లోకం నుండి ఆయనకు అనుగ్రహించినవారే వారు (యోహాను 17:6). తదనుగుణంగా, ఆయన యాజక సంబంధమైన విజ్ఞాపన వారికి మాత్రమే పరిమితమైంది: “నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించియున్న వారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను” (యోహాను 17:9). ఎవరికి బదులుగా తాను బలియాగంగా మరణించబోతున్నారో, వారి కోసం యేసు ప్రార్థించకపోవడం అనేది అసంభవం. ఆయన ఎవరి కోసం ప్రార్థించారో, వారి కోసమే ఆయన మరణించారు కూడా.

పరిమిత ప్రాయశ్చిత్తం (limited atonement) లేదా నిర్దిష్ట విమోచన (particular redemption) అనే సిద్ధాంతం, క్రీస్తు మరణంలో ఏ విధమైన లోపం లేదా అసమర్థత ఉందని సూచించదు. బాధను అనుభవించిన వ్యక్తి యొక్క స్వభావం దృష్ట్యా, యేసు మరణం అనంతమైన విలువను కలిగి ఉంది. ‘కానన్స్ ఆఫ్ డార్ట్’ (Canons of Dort) ఈ విషయాన్ని స్పష్టంగా స్థాపించడానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చాయి మరియు “దేవకుమారుని మరణం… అనంతమైన విలువను కలిగి ఉండి, లోకపాపమంతటికి  ప్రాయశ్చిత్తం చేయడానికి అత్యంత సమృద్ధిగా సరిపోతుంది” (2.3) అని నిర్ద్వంద్వంగా ప్రకటించాయి.

పాప ప్రాయశ్చిత్తానికి సంబంధించిన పరిమితి, యేసును సిలువకు పంపడంలో దేవునికి ఉన్న సంకల్పం మరియు ఉద్దేశం నుండి ఉద్భవించింది. క్రీస్తు చేసిన విమోచన కార్యం, తండ్రి ఆయనకు అనుగ్రహించిన తన ప్రజల కోసం ఉద్దేశించిన ఒక ప్రత్యేక ప్రాయశ్చిత్తంగా రూపొందించబడింది. ఆయన మరణం దేవునిచే ఎన్నుకోబడిన వారిని రక్షించే ఉద్దేశంతో జరిగింది.

తన విమోచన పరిచర్య అంతా దైవికంగా ముందుగానే నిర్ణయించబడిన ఒక ప్రణాళిక నెరవేర్పులో భాగంగానే జరిగిందని యేసు బోధిస్తున్నారు. యోహాను 6:38–39లో ఆయన చెప్పదలచినది ఇదే:

తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.

దైవశాస్త్రవేత్తలు ఈ ఏర్పాటును ‘విమోచన నిబంధన’ (covenant of redemption) అని పిలుస్తారు; దీనిలో, చరిత్ర ఆరంభం కాకముందే, పతనమైన మానవాళికి రక్షణ కల్పించడానికి తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఒక ఒప్పందానికి వచ్చారు. కేవలం తన దయ మరియు కృపతో, రక్షణ పొందవలసిన వారిని తండ్రి ఎన్నుకున్నాడు (రోమీయులకు 9:11–13; ఎఫెసీయులకు 1:4; 2 థెస్సలొనీకయులకు 2:13). అలా ఎన్నుకోబడిన వారిని ఆయన తన కుమారునికి అప్పగించాడు (యోహాను 6:37, 39; 17:6, 9, 24); ఆ కుమారుడు మానవ రూపం దాల్చి, తన విమోచన కార్యము ద్వారా వారి రక్షణను నెరవేర్చడానికి పూనుకున్నాడు (మార్కు 10:45; యోహాను 10:11). ఈ దైవిక సంకల్పానికి అనుగుణంగా, తండ్రి కుమారునికి అనుగ్రహించిన వారికి మరియు కుమారుడు ఎవరి కోసం మరణించారో వారికి క్రీస్తు కార్యాన్ని వర్తింపజేయడానికి, తండ్రి మరియు కుమారుడు ద్వార ఆత్మ ఈ లోకంలోకి పంపబడ్డాడు  (యోహాను 15:26; 16:5–15).

పాపపరిహారానికి సంబంధించిన ఈ దృక్పథం సువార్త ప్రకటనా కార్యంలో విజయాన్ని నిశ్చయం చేస్తుంది. సువార్త ప్రకటించడం ద్వారా తప్పక రక్షించబడే ప్రజలు దేవునికి ఉన్నారు; ఆయన వారిని ఎన్నుకున్నాడు. క్రీస్తు వారి కోసం మరణించాడు, మరియు పరిశుద్ధాత్మ రక్షణ సందేశం ద్వారా వారిని నూతనపరుస్తాడు. కొరింథులో ఎదురైన నిరుత్సాహకర పరిస్థితులలో పౌలును ముందుకు సాగేలా చేసిన సత్యం ఇదే (అపొస్తలుల కార్యములు 18:9–10); నేడు స్థానికంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సువార్త ప్రకటనా కార్యంలో మనల్ని ముందుకు సాగేలా చేసేది ఇదే సత్యం (ప్రకటన 5:9).

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

టామ్ ఆస్కోల్

టామ్ ఆస్కోల్

డాక్టర్ టామ్ ఆస్కోల్ ఫ్లోరిడాలోని కేప్ కోరల్‌లో ఉన్న గ్రేస్ బాప్టిస్ట్ చర్చికి సీనియర్ పాస్టర్ మరియు ఫౌండర్స్ మినిస్ట్రీస్ మరియు ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ థియాలజీకి అధ్యక్షుడు. ఆయన ప్రతి వారం 'ది స్వోర్డ్ & ది ట్రోవెల్' అనే పాడ్‌కాస్ట్‌ను నిర్వహిస్తారు మరియు 'డియర్ తిమోతి: లెటర్స్ ఆన్ పాస్టరల్ మినిస్ట్రీ'కి సంపాదకుడు.