How Can I Grow in My Faith
నా విశ్వాసంలో నేను ఎలా ఎదగగలను?
27/11/2025
How Can I Grow in My Faith
నా విశ్వాసంలో నేను ఎలా ఎదగగలను?
27/11/2025

కుటుంబంలో శిష్యత్వం

Discipleship in the family

స్కాటీ ఆండర్సన్

శిష్యత్వం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, బైబిల్లోని మరే వచనం కూడా క్రీస్తు గొప్ప ఆజ్ఞ (Great Commission) కన్నా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉండదు. శిష్యులుగా మారినవారికి, యేసు ఇచ్చిన ఈ ఆజ్ఞ, ఇతరులను కూడా శిష్యులుగా చేయమని పిలుస్తుంది (మత్తయి 28:16, 19-20). ఈ గొప్ప కార్యాన్ని ఎలా చేయాలో యేసు స్పష్టంగా వివరించాడు: “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వడం” మరియు “వారు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించేలా వారికి బోధించడం.” తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించే ముందు, శిష్యులను తయారు చేయాలనే క్రీస్తు ప్రణాళికను శ్రద్ధగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. క్రీస్తు ఆదేశించిన ఈ శిక్షణ మన ఇళ్ళల్లో ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ఇది కేవలం పిల్లలకు శారీరక శిక్ష లేదా మందలింపు ఇవ్వడం మాత్రమే కాదు (సామెతలు 13:24; 19:18; 22:15; 23:13–14; 29:15–17). అంతకంటే ఎక్కువగా, ఇది తల్లిదండ్రుల నుండి గొప్ప త్యాగాన్ని, పూర్తి అంకితభావాన్ని, మరియు వ్యక్తిగత శిష్యత్వాన్ని కోరుతుంది.

సమస్త లేఖనాల వెలుగులో సామెతల గ్రంథాన్ని జాగ్రత్తగా చదవకపోతే, మనం సులభంగా ప్రవర్తనావాదం (behaviorism) అనే సిద్ధాంతంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. ఈ లౌకిక మానసిక శాస్త్ర పద్ధతి మనిషి చేసే పనులను కేవలం అలవాట్లు లేదా శిక్షణ ద్వారా వచ్చిన ప్రతిస్పందనలుగా (conditioned responses) మాత్రమే చూస్తుంది. కానీ, క్రీస్తు బోధించిన సత్యం దీనికన్నా చాలా లోతైనది. మనం మరియు మన పిల్లలు కేవలం బాహ్య ప్రవర్తనకే పరిమితం కాకుండా, అంతకు మించిన ఒక ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని కలిగి ఉన్నాం. బైబిలు ప్రకారం, మన హృదయం మన అస్తిత్వానికి ఆధ్యాత్మిక కేంద్రం. మన ఆలోచనలు, నిర్ణయాలు, మరియు ప్రవర్తనలన్నీ అక్కడి నుంచే పుట్టుకొస్తాయి (సామెతలు 4:23; మత్తయి 12:33–35; 15:10–20; లూకా 6:43–45). ఒక మంచి చెట్టు మంచి ఫలాలను ఎలా ఇస్తుందో, అలాగే మనిషి హృదయంలోనిది అతని ప్రవర్తన ద్వారా వెల్లడవుతుంది. మన హృదయాలు పాప స్వభావంతో జన్మించాయని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది (కీర్తనలు 51:5; రోమా 5:12). కాబట్టి, కుటుంబ సభ్యుల సమస్యలు – తల్లిదండ్రులవైనా, పిల్లలవైనా – కేవలం పైపైన పరిష్కారాలతో సమసిపోవు. వాటిని అంతిమంగా హృదయం నుండి పరిష్కరించుకోవాలి. ఈ లోతైన హృదయ పరివర్తన క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం.

ఈ అంశం మరలా తల్లిదండ్రులను గొప్ప ఆజ్ఞ యొక్క ప్రాముఖ్యత వైపుకు నడిపిస్తుంది. శిష్యరికానికి అత్యంత ప్రాథమికమైన అవసరం పాపం నుండి శుద్ధి చేయబడిన నూతన హృదయం. ఈ గొప్ప కార్యాన్ని క్రీస్తు మాత్రమే సాధించగలడు. ప్రవక్తయైన యెహెజ్కేలు ద్వారా ప్రభువు ఇలా ప్రకటిస్తున్నాడు: “నేను మీ మీద శుద్ధజలము చల్లుదును…నూతన హృదయము మీ కిచ్చెదను… నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను” (యెహెజ్కేలు 36:25-27). ఈ దైవిక మార్పు ద్వారానే మన జీవితాల్లో నిజమైన శిష్యరికం ప్రారంభమవుతుంది. గొప్ప ఆజ్ఞలో ఉన్న బాప్తిసానికి దీనికి ఉన్న సంబంధం స్పష్టంగా ఉంది. ఒక వ్యక్తి విశ్వాసి బాప్తిసాన్ని (Credobaptism) లేదా శిశు బాప్తిసాన్ని (Paedobaptism) సమర్థించినా, అందరూ అంగీకరించేదేమంటే: బాప్తిసం అనేది మనం మనకోసం చేసుకునే కార్యం కాదు, అది దేవుడు మనకోసం చేసే కార్యం. ఇది పరిశుద్ధాత్మ చేసే అంతరంగిక కార్యం యొక్క అవసరాన్ని సూచించే ఒక బాహ్య చిహ్నం మాత్రమే. క్రైస్తవ తల్లిదండ్రులు ఈ ప్రాథమిక సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి: హృదయ మార్పు లేకుండా నిజమైన శిష్యత్వం సాధ్యం కాదు. మన పిల్లల శిష్యత్వానికి ప్రారంభ స్థానం బాప్తిసం నుండి వేరు చేసి చూడలేము. దేవుని కృప మరియు ఆత్మ కార్యం లేకుండా మన పిల్లలు క్రీస్తుకు నిజమైన శిష్యులు కాలేరు.

ప్రభువు తమ పిల్లల హృదయాలలో మార్పును తీసుకొస్తాడనే నమ్మకంతో, తల్లిదండ్రులు గొప్ప ఆజ్ఞలో చెప్పబడినట్లుగా, “నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” ( అనే తమ పనిని కొనసాగించవచ్చు మత్తయి 28:20). మరోసారి చెప్పాలంటే, ఇది కేవలం చిన్న పిల్లలలో ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఉండడం మాత్రమే కాదు. తమ పిల్లలు చూపించే అగౌరవం, అనైతిక హింస, లైంగిక పాపం, దొంగతనం, అబద్ధాలు మరియు అసంతృప్తి వంటి వాటికి తల్లిదండ్రులు సరైన పర్యవసానాలతో క్రమశిక్షణ నేర్పిస్తారు. ఈ శిక్షణలో గద్దింపు కూడా ఉంటుంది (సామెతలు 29:15). అయితే, ధర్మశాస్త్రం యొక్క మొదటి పట్టిక దేవుని-కేంద్రీకృతమైన ఆజ్ఞలను కలిగి ఉందని గుర్తుంచుకోవాలి (మొదటి నాలుగు ఆజ్ఞలు, నిర్గమకాండం 20:2–11).

తల్లిదండ్రులు తప్పనిసరిగా నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని” స్వీకరించాలి. ఇందులో కేవలం కొన్ని నియమాలు మాత్రమే కాదు, క్రీస్తు యొక్క సంపూర్ణమైన జీవన విధానం ఉంది. ఇందులో క్రీస్తును ఏకైక మార్గంగా అచంచలమైన విశ్వసనీయతతో అనుసరించడం (యోహాను 14:6; లూకా 10:27), ఇతరుల పట్ల ప్రేమతో కూడిన స్వీయ-నిరాకరణ (మత్తయి 16:24; 22:39), ధన్యతలను (మత్తయి 5:3-12) జీవితంలో అన్వయించుకోవడం, భౌతిక సంపద కంటే ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం (1 తిమోతి 6:17-18), మరియు సంఘ జీవితంలో చురుకుగా పాలుపంచుకోవడం (1 పేతురు 4:8; 1 యోహాను 4:7; 2 తిమోతి 2:22) వంటివి ఉన్నాయి. పై అంశాలలో శిష్యత్వం అనేది కేవలం దండం లేదా గద్దింపుకే పరిమితం కాదు. ఇది మరింత విశాలమైన మరియు లోతైన ప్రక్రియ. ఇందులో ఆత్మ-నిగ్రహాన్ని పెంపొందించడం, దైవిక జ్ఞానాన్ని వృద్ధి చేయడం, స్వార్థం లేకుండా సేవ చేయడానికి అవకాశాలను వెతకడం, క్రీస్తు కోసం త్యాగాలు చేయడానికి ప్రోత్సహించడం, నిరుత్సాహంలో ఓదార్పునివ్వడం, తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు సరిదిద్దడం, మరియు సరైన సమయంలో విశ్రాంతిని ఇవ్వడం కూడా ఉన్నాయి. పన్నెండు మంది శిష్యులకు శిక్షణ ఇచ్చేటప్పుడు యేసు ఈ అన్ని అంశాలను తన కార్యక్రమంలో భాగంగా చేర్చుకున్నారు. అయితే, ఆయన ఒకే పద్ధతిని అందరికీ వర్తింపజేయలేదు. బదులుగా, ఆయన శిక్షణ ఇస్తున్న వారి వ్యక్తిగత సామర్థ్యాలు, పాపపు స్వభావాలు, అంకితభావం మరియు మార్పులను బట్టి, వారిని సరైన మార్గంలో నడిపించడానికి సందర్భానుసారంగా వ్యవహరించారు. క్రీస్తు ప్రతి ఒక్కరి అవసరాలను, బలహీనతలను తెలుసుకొని, వ్యక్తిగతమైన పద్ధతిలో శిష్యత్వం నేర్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో ఇదే విధమైన సంపూర్ణమైన మరియు వ్యక్తిగతమైన శ్రద్ధ చూపించాలి.

నిజానికి, కుటుంబ శిష్యత్వం అనేది తల్లిదండ్రుల నుండి చాలా ఆశిస్తుంది. వారు సొంతంగా చేయగలిగిన దానికంటే ఇది చాలా ఎక్కువ. అయితే, వారికి లేని సహాయాన్ని దేవుడు తన సంఘం ద్వారా దయతో అందించాడు. సంపూర్ణమైన కుటుంబ శిష్యత్వం అంటే దేవుని కృపను పొందే మార్గాలకు ప్రాధాన్యత ఇస్తూ, సంఘ-కేంద్రీకృతమైన జీవితాన్ని గడపడం. ఈ మార్గాలలో ముఖ్యమైనవి: బోధించబడే దేవుని వాక్యం, ప్రార్థన, మరియు సంస్కారాలు (బాప్తిస్మం, ప్రభువు బల్ల), అలాగే సంఘ క్రమశిక్షణ. ఒక తండ్రి తన కుటుంబాన్ని సంఘానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా పెంచితే, అతను తన సంరక్షణలో ఉన్నవారిని జీవమిచ్చే దేవుని వాక్యం నుండి మరియు పరిశుద్ధతకు ఆశీర్వదించబడిన ప్రదేశం నుండి దూరం చేస్తున్నాడు. అంతేకాక, క్రొత్త నిబంధనలో సంఘానికి వ్రాయబడిన “ఒకరికొకరు” అనే ఆజ్ఞలన్నిటినీ అతను అపహాస్యం చేస్తున్నాడు. ఒక వ్యక్తి సోమరితనం వల్లనైనా, లేక అతిగా “జ్ఞానం” గలవాడిని అనుకుని అలా చేస్తే, అతడు భక్తిపరుల నుండి వేరుపడడం ద్వారా తనకు లేదా తన కుటుంబానికి ఆశీర్వాదం ఆశించే హక్కు లేదని తెలుసుకోవాలి. తన ఈ ఎంపిక ద్వారా, అతడు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్న క్రీస్తు శిష్యుని కంటే తక్కువైన దానిని ఉత్పత్తి చేస్తున్నాడు (ఎఫెసీయులు 5:2, 25). 

నిజమే, ఏ సంఘమూ పరిపూర్ణమైనది కాదు, కానీ కొన్ని సంఘాలు ఇతరులకంటే మెరుగ్గా ఉంటాయి (ప్రకటన 2-3). సహేతుకంగా ఎంపిక చేయబడిన ఒక స్థానిక సంఘం, ప్రభువు దినాన సమష్టి ఆరాధనతో బాప్తిసం, ప్రసంగించబడిన వాక్యం రెండింటినీ అందిస్తుంది. అంతేకాక, అది దేవునికి మరియు పొరుగువారికి సేవ చేయడానికి, స్వార్థాన్ని విడిచిపెట్టడానికి, మరియు జీవిత ప్రాధాన్యతలను సరిదిద్దుకోవడానికి అనేక సందర్భాలను కల్పిస్తుంది. ఈ క్రైస్తవ విద్య ద్వారా, మొత్తం కుటుంబం “ఇదే త్రోవ, దీనిలో నడువుడి” (యెషయా 30:21) అని చెప్పే అదనపు స్వరాల నుండి దేవుని సత్యాన్ని వింటుంది. ఈ లోకంలో క్రీస్తుతో నడవడానికి ప్రయత్నించే వారికి, ఆదివారం నాటి సహవాసం ఒక రకంగా ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. సంఘం ద్వారా శిష్యరికం అనేది మరింత సాధారణమైనదిగా మరియు ఆచరణాత్మకంగా అనిపిస్తుంది. శిష్యత్వం ఒక సామూహిక ఆజ్ఞగా (corporate command) ఇవ్వబడింది. కాబట్టి అది ఒక సామూహిక సందర్భంలోనే అత్యుత్తమంగా నెరవేరుతుంది. సంఘంలో జీవితాన్ని గడపడం అనే ఆధ్యాత్మిక క్రమశిక్షణ కుటుంబ శిష్యరికంలో ఒక భాగం మాత్రమే అయినప్పటికీ, ఇది అత్యంత ముఖ్యమైనది.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

      1.        

స్కాటీ ఆండర్సన్
స్కాటీ ఆండర్సన్
రెవ. స్కాటీ ఆండర్సన్, సౌత్ కరోలినాలోని సింప్సన్‌విల్లేలో ఉన్న వుడ్‌రఫ్ రోడ్ ప్రెస్బిటేరియన్ సంఘంలో కుటుంబ పరిచర్యలకు అసోసియేట్ పాస్టర్‌గా పనిచేస్తున్నారు.