
ప్రార్థన ఎందుకు కృపా సాధనం?
20/11/2025
నా విశ్వాసంలో నేను ఎలా ఎదగగలను?
27/11/2025యువతకు వేదాంతశాస్త్రం నేర్పించడానికి 3 మార్గాలు
జాన్ నీల్సన్
మీరు యువత లేదా కళాశాల విద్యార్థుల పరిచర్యలో ఉన్నట్లయితే, “భోజనం మరియు వేదాంతం (Dinner and Doctrine)” లేదా “ఈ రాత్రి వేదాంతం (Theology Tonight)” వంటి కార్యక్రమాల ప్రకటనలు చాలామందిని ఆకర్షించకపోవచ్చని మీకు తెలుసు. వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి యువతను ప్రోత్సహించడం సవాలుతో కూడుకున్న పని. ముఖ్యంగా, రెండు నిమిషాల వీడియో క్లిప్‌లు, సౌండ్‌బైట్‌లు, వినోదం మరియు సోషల్ మీడియా సంస్కృతి వారిపై బలమైన ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల, నిరంతరంగా, ఏకాగ్రతతో కూడిన వేదాంతపరమైన ఆలోచనలపై వారికి ఉన్న ఆసక్తి బాగా తగ్గుతోంది. అయినప్పటికీ, మన యువతను దేవుని వాక్యం ద్వారా నడిపిస్తూ, వారు వేదాంతపరంగా ఆలోచించేలా మరియు తమ వేదాంతపరమైన అవగాహనలో ఎదిగేలా ప్రోత్సహించడం అనేది స్థానిక సంఘంలో ఉన్న నమ్మకమైన విశ్వాసుల బాధ్యత.
మా సంఘంలో యువత, కళాశాల విద్యార్థుల పాస్టర్ మా విద్యార్థులను మంచి బైబిల్ బోధనలో నిమగ్నం చేస్తూ, వారిని లోతైన వేదాంతపరమైన అవగాహన వైపు నడిపిస్తున్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడను. మా కళాశాల విద్యార్థులు గొప్ప ప్యూరిటన్ రచనలపై పుస్తక చర్చలు జరిపారు, మరియు ఆదివారం సాయంత్రం సమావేశమై లోతైన వేదాంత అంశాలను విశ్లేషించారు. మా ఉన్నత పాఠశాల మరియు మాధ్యమిక పాఠశాల విద్యార్థులు వెస్ట్‌మినిస్టర్ షార్టర్ కేటకిజంను అధ్యయనం చేశారు. వారు కేటకిజంలోని ప్రశ్నలను కంఠస్థం చేసి, దాని వేదాంతం యొక్క అర్థాన్ని మరియు దానిని జీవితానికి ఎలా అన్వయించుకోవాలో నేర్చుకున్నారు.
మా సంఘంలో, యువతను వేదాంతపరమైన ఆలోచనల్లో నిమగ్నం చేయడానికి మేం ప్రయత్నిస్తున్నాం. అందుకోసం మేము ప్రోత్సహిస్తున్న మూడు విషయాలను మీతో వినయపూర్వకంగా పంచుకోవాలనుకుంటున్నాను.
-
వేదాంతం ఆచరణాత్మకమైనది అని వారికి తెలియజేయండి
యువతను వేదాంత అధ్యయనం వైపు నడిపించడానికి మొదటి ప్రోత్సాహం, చాలామందిలో ఉన్న ఒక అపోహను ఖండించడం. వేదాంతం అనేది కేవలం సెమినరీ లైబ్రరీలలోని పుస్తకాలకు మాత్రమే పరిమితమైనది, మామూలు జీవితానికి పనికిరాదు అనే ఆలోచనను మార్చాలి. యువతకు ఒక విషయం గుర్తు చేయడం చాలా ముఖ్యం: వారి ఆలోచనా విధానం, తీసుకునే నిర్ణయాలు, నమ్మకాలు, ఇతరులతో వారి సంబంధాలు, మరియు వారు చేసే ప్రతి పని వెనుక ఉన్న ప్రేరణ – ఇవన్నీ కూడా వారు నమ్మే వేదాంతం ద్వారానే రూపుదిద్దుకుంటాయి. దేవుని గురించి మనం నమ్మే విషయమే మన జీవితంలో అత్యంత ఆచరణాత్మకమైనది.
వేదాంత విశ్వాసం యొక్క ఆచరణాత్మక స్వభావానికి బైబిల్లో ఒక అత్యంత స్పష్టమైన, కానీ ప్రతికూలమైన ఉదాహరణ రోమా 1:18–32లో కనిపిస్తుంది. విగ్రహారాధనతో, అంటే సృష్టికర్తను విడిచిపెట్టి, సృష్టించబడిన వాటిని ఆరాధించడం ద్వారా ప్రారంభమైన పాపపు నిర్ణయం అన్ని రకాల చెడు ప్రవర్తనకు మరియు పనులకు దారితీస్తుంది. నిజమే, మనం దేవుని గురించి ఏమి నమ్ముతామో, అది మన జీవన విధానంలో ఫలిస్తుంది. ఈ విషయాన్ని మనం యువతకు వివరిస్తున్నప్పుడు, వారు ఇప్పటికే ఎల్లప్పుడూ వేదాంతపరమైన ఆలోచనల్లో నిమగ్నమై ఉన్నారని వారికి గుర్తు చేయడం చాలా సహాయపడుతుంది. పాటల సాహిత్యం, ట్వీట్‌లు, టిక్‌టాక్ వీడియోలు, మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ల ద్వారా వారు ఒక రకమైన వేదాంతపరమైన ఆలోచనలకు “శిష్యులు”గా మారుతున్నారు. క్రైస్తవ వేదాంతాన్ని అధ్యయనం చేయడంలో వారు విఫలమైనప్పుడు, వారు కేవలం తటస్థంగా ఉండరు, బదులుగా అపవిత్రమైన లేదా అవాస్తవమైన వేరే రకమైన వేదాంత ఆలోచనలకు ప్రభావితమవుతారు.
-
వేదాంతం ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో వారికి చూపించండి
నా సెమినరీ రోజుల్లో, డాక్టర్ డి.ఎ. కార్సన్ ఒక విషయాన్ని తరచుగా చెబుతుండేవారు: తాను బోధించిన ప్రతి విషయాన్ని తన విద్యార్థులు గుర్తుంచుకోకపోయినప్పటికీ, ఆయన ఎంతో ఉత్సాహంగా బోధించిన విషయాలను మాత్రం వారు ఎప్పటికీ మర్చిపోలేదని ఆయన గమనించారట. యువతతో కలిసి పనిచేసే పాస్టర్లు మరియు సంఘ నాయకులకు నాదొక సలహా: మీ విద్యార్థులు వేదాంతం పట్ల ప్రేమను పెంచుకోవాలంటే, మీరు ముందుగా దేవుడు, ఆయన వాక్యం మరియు క్రైస్తవ సిద్ధాంతాల అందం పట్ల మీకున్న ఉత్సాహాన్ని వారికి చూపించాలి. ఆ ఉత్సాహం మీ నుండి వారికి వ్యాపించాలి.
కళాశాల, హైస్కూల్ విద్యార్థులు వేదాంతం యొక్క లోతు, సువార్త యొక్క అందం మరియు బైబిల్ లేఖనాల్లోని సంపద పట్ల మనకున్న ఉత్సాహాన్ని చూడగలగాలి. బహుశా, ఆ సంపదలన్నింటినీ వారు పూర్తిగా అర్థం చేసుకోవడం ప్రారంభించకముందే ఇది జరగాలి. మన యువతతో మనం మాట్లాడేటప్పుడు, ఈ విశ్వంలోని అత్యంత గొప్ప మరియు మహిమాన్వితమైన విషయాలను పంచుకుంటున్నట్లు వారికి అర్థమవుతుందా?
-
వేదాంతం ఆరాధనతో కూడినది అని వారికి గుర్తు చేయండి
ఎఫెసీయులకు 1:15–21లో, పౌలు ఎఫెసు విశ్వాసుల కోసం చేసిన అద్భుతమైన ప్రార్థన వారి “వేదాంత జ్ఞానం” వృద్ధి చెందాలని కోరేదే. అయితే, ఈ జ్ఞానంలో వృద్ధి కేవలం ఒక సమాచారంగా కాకుండా, అది దేవుని వైపునకు బలమైన ఆరాధనగా మళ్లుతుందని పౌలు ఆశించాడు. ఈ విశ్వాసులు తమ మహిమాన్వితమైన రక్షకుడిలో మరింత ఆరాధనాపూర్వకంగా ఆనందించడం కోసమే పౌలు వారిని లోతైన వేదాంత అవగాహనలో ఎదగమని ప్రోత్సహించాడు. “వారి మనస్సులు వెలిగించబడాలి, తద్వారా వారు ఆయన పిలుపులో ఉన్న నిరీక్షణను, పరిశుద్ధులలో ఆయనకు ఉన్న మహిమగల స్వాస్థ్యం యొక్క ఐశ్వర్యాన్ని, మరియు మన పట్ల ఆయన శక్తి యొక్క అపరిమితమైన గొప్పతనాన్ని తెలుసుకోగలరు” అని పౌలు కోరుకుంటున్నాడు (ఎఫెసీయులు 1:18–19). పౌలు వేదాంత జ్ఞానాన్ని దాని కోసమే పొందాలని కోరుకోలేదు. పౌలు దృష్టిలో, వేదాంతపరమైన అవగాహనలో వృద్ధి అంటే దేవుని వైపుకు మన హృదయాలను మరింత ఎక్కువగా ఆరాధనలో పెంచుకోవడం, మరియు మన జీవితాల్లో ఆయన మహిమగల రక్షణ కార్యం కోసం ఆయనను స్తోత్రించడం.
తన వాక్యం ద్వారా మనకు తనను తాను వెల్లడి చేసుకున్న మహిమాన్వితమైన దేవునితో ఉన్న సంబంధం నుండి వేదాంత బోధన, అధ్యయనం ఎప్పటికీ వేరుగా ఉండకూడదు. మనం ఆయనను ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే, మనం ఆయనను అంత ఎక్కువగా ఆరాధించి, ఆనందించాలి.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


