
యోబు గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
01/07/2025
1, 2, 3 యోహాను పత్రికల గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
08/07/2025సామెతల గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

ఆంథోనీ సెల్వాగియో
- సామెతలు జ్ఞాన సందేశాల గ్రంథం, హామీల గ్రంథం కాదు.
మొదట సామెతల గ్రంథాన్ని చదివినప్పుడు, అది జీవితంలోని అన్ని సమస్యలకు సులభమైన, తక్షణంగా, సూత్రబద్ధమైన పరిష్కారాలను అందించే గ్రంథంగా అనిపించవచ్చు. ఈ గ్రంథాన్ని చదివితే ఇందులో ఉన్న సూత్రాలను తమ జీవితాల్లో ఆచరించేవారికి సంపదను మరియు విజయాన్ని ఖచ్చితంగా లభిస్తాయని హామీ ఇస్తున్నట్లు తోస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, సామెతలను పైపైన చదివినప్పుడు, మీరు “X” చేస్తే “Y” పొందుతారు అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ “X” అంటే జ్ఞానం, “Y” అంటే మానవ విజయం మరియు ఐశ్వర్యం. ఉదాహరణకు, సామెతలు 3:1-2లో, సామెతల బోధనలను గుర్తుంచుకుని, దాని ఆజ్ఞలను పాటించేవారు దీర్ఘాయువు, ఐశ్వర్యం పొందుతారని చెప్పబడింది. ఆ ఒక్క వాక్యాన్ని పరిశీలిస్తే, అది హామీ ఇవ్వబడిన ఫలితంలా అనిపించవచ్చు కదా? సామెతలను ఈ సరళమైన పద్ధతిలో చదవడం ఎంత ప్రలోభపెట్టేదో మీరు చూడగలరు, కానీ సామెతలను ఈ విధంగా చదవడం తప్పుదోవ పట్టించేది మరియు హానికరం కూడా.
సామెతలు ప్రతి పరిస్థితిలోనూ పనిచేసే సూత్రాలను ఎల్లప్పుడూ మనకు అందించవు, కానీ అవి మనం ఆలోచించి, వివేకంతో అన్వయించుకోవాల్సిన జ్ఞాన సూత్రాలను మనకు ఇస్తాయి. సామెతలను చదివేటప్పుడు, విధేయతకు ప్రతిఫలం ఎల్లప్పుడూ తక్షణమే లభించదనే బైబిలులోని సాధారణ సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మన విధేయతకు ఫలితాలు వెంటనే కనిపించవు; అవి ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు రాబోయే యుగం వరకు కూడా వాయిదా పడవచ్చు. జ్ఞానానికి ప్రతిరూపమై, దేవుని ఆజ్ఞలన్నిటికీ సంపూర్ణ విధేయతతో లోబడి జీవించిన యేసు కూడా కొంతకాలం పాటు తీవ్రంగా శ్రమపడ్డాడని గుర్తుంచుకోండి. యేసు తన విధేయత ద్వారా శ్రమను భరిస్తూ జీవించిన తర్వాతే ఆయన హెచ్చింపబడ్డాడు (ఫిలిప్పీయులు 2:5–11). సామెతలలో ఉన్న జ్ఞానాన్ని మనం అనుసరించాలి ఎందుకంటే అది కేవలం హామీ ఇవ్వబడిన ఫలితాలను ఇస్తుందని కాదు, కానీ అది మన జీవితాన్ని ఈ లోకంలో దేవుని దృష్టికి అనుగుణంగా నడిపించడానికి ఆయన ఇచ్చిన ఒక అమూల్యమైన బహుమతి.
- దేవుడు మన జీవితాల్లోని ప్రతి అంశం గురించి శ్రద్ధ వహిస్తాడని సామెతలు మనకు గుర్తు చేస్తాయి.
సామెతల గ్రంథం యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి, అది విస్తృతంగా అనేక జీవన అంశాలను స్పృశించటం. సామెతలు గ్రంథం చాలా ప్రయోజనకరమైన, ఆచరణాత్మకమైన రీతిలో మానవ జీవితంలోని అనేక పార్శ్వాలను గురించి వివరిస్తుంది. మీరు సామెతలలోని అంశాలను విశ్లేషిస్తే, అది సంపద (సామెతలు 3:9, 13–14; 11:4; 13:7, 11, 22; 14:31; 21:5; 28:6, 20; 30:8–9), మాటలు (సామెతలు 10:19; 12:19; 15:23, 28; 17:27–28; 25:11; 26:20), పని (సామెతలు 6:6–11; 12:11; 19:15; 20:4, 13; 26:13–16), స్నేహం (17:17; 18:24; 27:6, 9), వివాహం (సామెతలు 12:4; 18:22; 19:14; 27:15; 31:30), తల్లిదండ్రుల బాధ్యతలు (సామెతలు 13:24; 17:6; 19:18; 22:6; 23:13–14; 29:17), మరియు మానవ లైంగికత (సామెతలు 5:3; 8–9, 15–19; 6:27–29) వంటి అనేక జీవన సంబంధ సమస్యలకు పరిష్కారాలను అందిస్తుందని మీరు గమనించగలుగుతారు. దేవుడు మన జీవితంలోని ప్రతి అంశం పట్ల శ్రద్ధ వహిస్తాడని, ప్రతి రంగంలోనూ ఆయన వాక్యాన్ని మరియు ఆయన జ్ఞానాన్ని అన్వయించాలని కోరుకుంటున్నాడని ఇది మనకు గుర్తు చేస్తుంది.
కొన్నిసార్లు క్రైస్తవులు తమ జీవితాలను విభజించేసి, తమ విశ్వాసాన్ని ఆదివారం ఉదయం ఆరాధన సమావేశాలకు లేదా వ్యక్తిగత వాక్య ధ్యానాలు, ప్రార్థన, సువార్త ప్రచారం వంటి “ఆత్మీయ” విషయాలకు మాత్రమే పరిమితం చేస్తారు. ఆత్మీయ క్రమశిక్షణలలో నమ్మకత్వం దేవునికి, మన శ్రేయస్సుకు ముఖ్యమైనదే అయినప్పటికీ, మనం మన సంపదను ఎలా నిర్వహిస్తున్నామో, మన మాటలను ఎలా ఉపయోగిస్తున్నామో, మన పనిని/ఉద్యోగాలను ఎలా చేస్తున్నామో, మన స్నేహితులను, జీవిత భాగస్వాములను ఎలా ఎంచుకుంటాన్నామో అనేవి కూడా అంతే ముఖ్యం. మన జీవితంలోని ప్రతి విభాగంలో దేవుని జ్ఞానాన్ని అన్వయించాలన్న పిలుపుతో, సామెతలు మన విశ్వాసాన్ని విడదీసే ప్రవర్తనను సవాలు చేస్తాయి.
అంతేకాదు, మన జీవితంలోని ప్రతీ అంశంపైన దేవుడు తండ్రిగా చూపించే శ్రద్ధ, మన అనుభవాలన్నింటినీ గాఢమైన అర్థంతో, ప్రాముఖ్యతతో నింపుతుంది. సామెతలు మనకు జీవితం, లోకాన్ని చూడటానికి ఒక ఆత్మీయ దృష్టికోణాన్ని అందిస్తూ, మనం చేసే ప్రతీ కార్యాన్ని దేవుని మహిమ కోసం చేయమని ప్రోత్సహిస్తాయి(1 కొరింథీయులకు 10:31). మనం చేసే ప్రతిదీ దేవునికి ముఖ్యమని, దేవుడు మనకు ఉత్తమమైనది ఇవ్వాలని కోరుకుంటాడని సామెతలు మనకు గుర్తు చేస్తాయి. చివరికి, సామెతలలో ఉన్న సమగ్ర జ్ఞానసంపద మన జీవితాలలో అభివృద్ధి చెందడానికీ, విజయవంతంగా జీవించడానికీ సహాయపడటానికి దేవుడు మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతి.
- సామెతలు జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, మనలను యేసు వైపుకు నడిపిస్తాయి
సామెతల గ్రంథం యేసుక్రీస్తు చేసిన కార్యాలకు సంబంధించిన పోలిక లేదా పూర్వసూచనలు (foreshadowing) చూపించే గ్రంథంగా మనం చూసే ధోరణి తరచుగా విస్మరించబడినప్పటికీ, ఈ గ్రంథం యేసు గురించి శక్తివంతమైన రీతిలో మాట్లాడుతుంది. మొదటగా, సువార్తలు యేసుక్రీస్తు గొప్ప జ్ఞానమును కలిగి ఉన్నాడని మనకు తెలియజేస్తున్నాయి. యేసు బాలుడిగా ఉన్నప్పుడే, దేవాలయ ప్రాంగణంలో వృద్ధులకు బోధిస్తున్నప్పుడు, తనలో ఉన్న జ్ఞానాన్ని స్పష్టంగా వెల్లడించాడు, మరియు ఆయన జ్ఞానంలో వృద్ధి చెందాడని మనకు చెప్పబడింది (లూకా 2:47–52). ఇంకా, యేసు తన పరిచర్యను ప్రజల మధ్య ప్రారంభించినప్పుడు, ఆయన బోధించడానికి ఎక్కువగా ఉపమానాలను (parables) ఉపయోగించేవాడు, అవి జ్ఞానబోధను కలిగించే ప్రత్యేకమైన పద్ధతులు. సామెతల గ్రంథంలోని జ్ఞాని వలె, యేసును సువార్తలు ఒక జ్ఞాన బోధకునిగా చూపిస్తున్నాయి.
యేసు మరియు సామెతల మధ్య రెండవ సంబంధం ఏమిటంటే సామెతల గ్రంథం మనకు జ్ఞానాన్ని అమూల్యమైనదని చూపిస్తుంది. జ్ఞానాన్ని వెండి కంటే బంగారం కంటే ఎక్కువ విలువైనదిగా చూడమని సామెతలు మనల్ని ప్రోత్సహిస్తాయి (సామెతలు 3:14–35). జ్ఞానానికి ఉన్న అమూల్యమైన స్వభావం కారణంగా సామెతలు దాని కోసం వెదకమని, దాన్ని పొందాలని పాఠకులను హెచ్చరిస్తాయి. కొత్త నిబంధన యేసు క్రీస్తే “దేవుని జ్ఞానం” అని మనకు తెలియజేస్తుంది (1 కొరింథీయులకు 1:30), అలాగే, “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు” ఆయనలోనే దాగి ఉన్నాయని మనకు చెబుతుంది(కొలస్సయులకు 2:3). అందుచేత, సామెతల గ్రంథం జ్ఞానాన్ని అన్నింటికంటే ముఖ్యంగా వెదకమని ఇచ్చే హెచ్చరిక, అంతిమంగా జ్ఞాన స్వరూపియైన యేసును వెదకమని మనకు పిలుపునిస్తుంది. యేసు కేవలం జ్ఞానాన్ని కలిగి ఉండడమే కాదు, జ్ఞానాన్ని బోధించడమే కాదు; ఆయనే జ్ఞానం. ఆయనను వెదకడంలో విఫలమవటం అనేది మానవులు చేయగలిగే అత్యంత మూర్ఖమైన పని.
ఈ వ్యాసం “బైబిల్‌లోని ప్రతి గ్రంథం గురించి తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు” అనే శ్రేణిలో భాగంగా ఉంది.
రెవ. ఆంథోనీ టి. సెల్వాగియో అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో రోచెస్టర్‌లో ఉన్న రోచెస్టర్ క్రిస్టియన్ రిఫార్మ్డ్ సంఘానికి సీనియర్ పాస్టర్. అతను అనేక క్రైస్తవ పుస్తకాలకు రచయిత మరియు సంపాదకుడు, వాటిలో “బంధిత్వం నుండి స్వేచ్ఛకు: మోషే ప్రకారం సువార్త”, “సామెతల నడిపింపుతో కూడిన జీవితం” మరియు “యోబును పరిశీలించడం” వంటివి ఉన్నాయి.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.