
యోనా గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
17/07/2025
1 పేతురు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
24/07/2025ఎజ్రా గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

సారా ఐవిల్
ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథంతో కలిపి చూసినప్పుడు, ఇశ్రాయేలు చరిత్రలో దాదాపు వంద సంవత్సరాల చరిత్రను వివరిస్తుంది. ఈ కాలం క్రీ.పూ. 538లో పారసీక రాజు కోరెషు (సైరస్) యూదులను తమ స్వస్థలమైన యెరూషలేము మరియు యూదాకు తిరిగి వెళ్లడానికి అనుమతిస్తూ జారీ చేసిన శాసనంతో మొదలై, క్రీ.పూ. 433–432 ప్రాంతంలో నెహెమ్యా యెరూషలేముకు తిరిగి వచ్చిన ఘటనల వరకు కొనసాగుతుంది. ఈ వంద సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలు ప్రధానంగా రెండు ముఖ్యమైన కాలఖండాలలో కేంద్రీకృతమై ఉన్నాయి: క్రీ.పూ. 538–515 (ఎజ్రా 1–6 అధ్యాయాలు) మరియు క్రీ.పూ. 458–433 (ఎజ్రా 7వ అధ్యాయం నుండి నెహెమ్యా 13వ అధ్యాయం వరకు). మొదటి కాలఖండం మందిర పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తుంది. రెండవ కాలఖండం ఎజ్రా నాయకత్వంలో ధర్మశాస్త్రం ద్వారా ప్రజలను సంస్కరించడంపైనా, మరియు నెహెమ్యా నాయకత్వంలో యెరూషలేము గోడ పునర్నిర్మాణంపైనా కేంద్రీకృతమై ఉంది. ఈ కాలాలు నిబంధన చరిత్రను (లేదా ఒడంబడిక చరిత్రను) ముందుకు నడిపిస్తూ, వాగ్దానం చేయబడిన యేసు క్రీస్తు రాకడకు ప్రపంచాన్ని సిద్ధం చేశాయి.
మీరు ఎజ్రా గ్రంథం గురించి ఆలోచించినప్పుడు, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
- దేవుని ప్రజలకు విమోచన సంవత్సరాన్ని ప్రకటించిన కోరెషు రాజు కంటే గొప్పవాడు మరియు దయగల రాజు ఉన్నాడు.
ఎజ్రా ప్రారంభ అధ్యాయాలలో, దేవుని ప్రజలు తమ పాపాల కారణంగా డెబ్బై సంవత్సరాలుగా తమ దేశం నుండి స్థానభ్రంశం చెందిన సమయం గురించి మనం తెలుసుకుంటాము. అయితే, దేవుడు ఒక పారసీక రాజు హృదయాన్ని వారిని విడిపించేలా ప్రేరేపించాడు. అంతేకాకుండా, డెబ్బై సంవత్సరాల క్రితం అన్యజనుడైన రాజు నాశనం చేసిన దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించడానికి తన ప్రజల హృదయాలను తమ స్వదేశానికి తిరిగి వచ్చి నిర్మించమని ప్రేరేపించాడు.
ఈ కథ నిజంగా ఆశ్చర్యకరమైనది! ఎందుకంటే ఇది కేవలం విపత్తులతో కాదు, ఒడంబడిక వాగ్దానంతో నిండి ఉంది; వినాశనంతో పాటు విజయోత్సాహంతో కూడింది; భయంతో పాటు విశ్వాసం ప్రవహిస్తుంది; కఠిన పరిస్థితులతో పాటు ఆశ చిగురిస్తుంది; అడ్డంకులతో పాటు పరిశుద్ధ విమోచన కనిపిస్తుంది; బాధలతో పాటు రక్షణ లభిస్తుంది; కంపించే హృదయంతో పాటు దైవ విశ్వాసం దృఢపడుతుంది; ఆందోళనలతో పాటు దేవుని అద్భుత కార్యాలతో నిండిన కథ ఇది.
తన పరిపూర్ణ సమయంలో కోరెషును మరియు తిరిగి వచ్చినవారిని ప్రేరేపించిన అదే ప్రభువు, తన కుమారుడిని కూడా తన పరిపూర్ణ సమయంలో “నలిగినవారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును” పంపాడు(లూకా 4:18–19). నేడు కూడా, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆయనే పరిపాలకుడు. ఆయనే మిమ్మల్ని తగిన సమయంలో, తగిన స్థలంలో ఉండేలా నడిపిస్తున్నాడు. ఈ క్షణంలో కూడా, మీరు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన స్వయంగా ఉపయోగిస్తూ, మిమ్మల్ని తనవైపు ఆకర్షిస్తున్నాడని మరియు తన గొప్ప నామాన్ని మహిమపరుస్తున్నాడని తెలుసుకుంటూ, మీరు మీ భవిష్యత్తును ఆశతో ఎదురుచూడవచ్చు. క్రీస్తులో మనకు కలిగిన విమోచనకు ప్రతిస్పందనగా, మన హృదయాలు స్వచ్ఛందమైన సేవకూ, త్యాగపూరితమైన దాతృత్వానికి సిద్ధంగా ఉండాలి. దేవుడిని ఆరాధించడం ద్వారా మరియు ఆయన మహిమ కోసం శ్రమించడం ద్వారా ఆయన పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరుద్దాం.
- పునర్నిర్మించబడిన దేవాలయం, రాబోయే నిజమైన దేవాలయమైన యేసు క్రీస్తుకు కేవలం ఒక ఛాయా. దానిని పునర్నిర్మించే ప్రక్రియలో దేవుని ప్రజలు ఎదుర్కొన్న వ్యతిరేకత, క్రీస్తు తన జీవితం మరియు పరిచర్యలో ఎదుర్కొనే గొప్ప వ్యతిరేకతకు ముందస్తు సంకేతంగా నిలిచింది.
ఎజ్రా గ్రంథం, తన వాగ్దానాలను నెరవేర్చడంలో దేవుడు ఎంత నమ్మదగినవాడో గుర్తుచేయడం ద్వారా, దేవుని ప్రజలకు ఓదార్పును అందిస్తుంది. అదే సమయంలో, కష్ట సమయాల్లో కూడా దేవునికి విశ్వాసపాత్రులుగా నిలవాలనే సవాలును దేవుని ప్రజల ఎదుట ఉంచుతుంది. కన్నీళ్లు, నిరుత్సాహం నడుమ కూడా మన రక్షకుడైన యేసు క్రీస్తు వైపు మన దృష్టిని మళ్లిస్తూ జీవించాలి. మన కోసం బాధపడిన ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన మహిమతో తిరిగి రానున్న దినం కోసం ఎదురు చూస్తాం. నిరాశావాద లోయ ఒకరోజు శాశ్వతమైన ఆనంద పర్వతంగా మారుతుంది, అక్కడ రాబోయే ఆ నగరంలో మన ప్రభువు మరియు రక్షకుడైన యేసును మనం నిత్యం ఆరాధిస్తాం. దేవుని మహిమ కోసం శ్రమిస్తూ, నిరుత్సాహపరిచే సమయాలలో ఆయనపై ఆధారపడుతూ జీవించే విశ్వాసులు, బాధలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభువు కార్యంలో నిమగ్నమైన వారికి మనం సంతోషంగా మన వనరులను అందించాలి. క్రీస్తు నామంలో సేవ చేయడానికి దేవుని ప్రజలతో కలిసికట్టుగా ఉండాలి. హింస కారణంగా దేవుని రాజ్య పనిని కొనసాగించలేకపోతున్న విశ్వాసుల కోసం మనం ప్రార్థించాలి. అలాగే సువార్త పనిలో నిమగ్నమైన వారిని ప్రోత్సహించాలి.
- దేవుడు తన మహిమ, విమోచన ప్రయోజనాల కోసం అన్ని విషయాలను తానే నియమించి నడిపిస్తాడు.
తిరిగి వచ్చిన నిర్వాసితులు, నిరుత్సాహపరిచే పరిస్థితుల కారణంగా దేవాలయ నిర్మాణ పనిని నిలిపివేశారు. కానీ, దేవుని ప్రవక్తలు వారికి దేవుని వాక్యాన్ని గుర్తు చేశారు. నాలుగు సంవత్సరాలలోపే, దేవుడు తన ఆలయం పూర్తయ్యేలా, ఆరాధన తిరిగి స్థాపించబడేలా తన దైవిక ప్రణాళికను అమలుచేశాడు. ఇది అద్భుతమైన కృప, దైవ నియంత్రణ, మరియు ఆనందంతో నిండిన గొప్ప కథ.
ఈ కథ మనకు ఓ ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది: మనము నిరుత్సాహపడినప్పుడు, లేదా దేవుడు మనలను పిలిచిన పనిని ఆపవలసి వస్తుందా అని శోధనకు లోనై ఉన్నప్పుడు, మనం దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి, దానిలోనుండి సత్యాన్ని పొందాలి. యేసు క్రీస్తులో విశ్రాంతి పొందుతూ, ఆయన మార్గాల్లో నడుచుకుంటూ, సంపూర్ణ ఆనందాన్ని అనుభవించాలి. మన మంచికోసం, ఆయన మహిమ కోసమే దేవుడు అన్నింటినీ తన దైవిక ప్రణాళికలో నడిపిస్తాడని నమ్మాలి. మన సంపూర్ణ ఆనందం యేసు క్రీస్తుతో మన ఐక్యతలో నుండే వస్తుంది, మరియు ఆయన వాక్యానికి మన విధేయత ద్వారా మన హృదయాలు తృప్తిగా, ఆనందంగా ఉండగలవు. ఈ సత్యాన్ని దృష్టిలో ఉంచుకొని, మనం ఇలా చేయాలి: దేవుని వాక్యం మరియు ప్రార్థనతో దేవుని రాజ్య పనిలో ఉన్న ఇతరులను ధైర్యపరచాలి. దేవుడు మనలను పిలిచిన ప్రదేశాలలో శ్రద్ధగా పని చేయాలి. క్రీస్తునందు నిలిచిన జీవితం ఆనందాన్ని కలిగిస్తుందనే విషయాన్ని ఇతరులకు బోధించాలి. ప్రతి వారం సంఘారాధనలో నిబద్ధతతో పాల్గొంటూ, దేవునికి సమూహిక ఆరాధన అర్పించాలి.
ఎజ్రా యాజకుడు యెరూషలేముకు తిరిగి ప్రయాణం చేసిన అనేక శతాబ్దాల తరువాత, మరొక యాజకుడు కూడా యెరూషలేముకు ఒక మహిమాన్వితమైన ప్రయాణం చేశాడు. అయితే, ఈ యాజకుడు తనను తాను బలిగా అర్పించుకోవడం ద్వారా దేవుని ప్రజలకు విమోచనను సిద్ధపరచడానికి పరలోకం నుండి భూమిపైకి వచ్చాడు. ఆయన సిలువపై చేసిన బలి పరిపూర్ణమైనది, అంతిమమైనది కాబట్టి, మీరు, నేను నమ్మకంతో, ధైర్యంగా కృపా సింహాసనాన్ని సమీపించవచ్చు. ఆయన చేసిన త్యాగం సిలువపై సంపూర్ణమైనదిగా, చివరిదిగా నెరవేరినందున, మీరు మరియు నేను ధైర్యంగా కృపా సింహాసనాన్ని సమీపించవచ్చు. మనలను రక్షించమని, మనకు కావలసిన వాటిని అందించమని, మరియు మన కోసం తన ఉద్దేశాలను నెరవేర్చమని ధైర్యంగా మన దేవుడిని వేడుకోవచ్చు. ఎజ్రా గ్రంథం మన యాజకుడు మరియు రాజైన యేసు క్రీస్తు మనలను పిలిచిన మంచి పనిలో అవిశ్రాంతంగా కొనసాగమని ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో, ఆయన నియమించిన పరిచర్యలో, ఆయన యొక్క దైవ పరిపాలన, రక్షణ, మరియు ఏర్పాటుపై పూర్తిగా ఆధారపడమని మనలను ఆహ్వానిస్తుంది.
ఈ వ్యాసం “బైబిల్‌లోని ప్రతి గ్రంథం గురించి తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు” అనే శ్రేణిలో భాగంగా ఉంది.
సారా ఐవిల్ (ThM, డల్లాస్ థియోలాజికల్ సెమినరీ) బైబిల్ బోధకురాలు, సమావేశాలలో వక్త, ఆమె తన భర్త నలుగురు పిల్లలతో నార్త్ కరోలినాలోని మాథ్యూస్‌లో నివసిస్తూ, క్రైస్ట్ కోవెనెంట్ చర్చి (PCA)లో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ది గాడ్ హూ హియర్స్ అండ్ లూక్: దట్ యు మే హావ్ సర్టెనిటీ కన్సర్నింగ్ ది ఫెయిత్ వంటి అనేక పుస్తకాలు, బైబిల్ అధ్యయనాలను రచించారు. మరింత తెలుసుకోవడానికి, దయచేసి www.sarahivill.com ని సందర్శించండి.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.