
ఎజ్రా గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
22/07/2025
మలాకీ గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు
29/07/20251 పేతురు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
డెరెక్ థామస్
పేతురు రాసిన మొదటి పత్రిక క్రైస్తవులు తప్పకుండా అధ్యయనం చేయాల్సిన ఒక ముఖ్యమైన గ్రంథం. 1 పేతురు గురించి మీరు తెలుసుకోవలసిన మూడు కీలక విషయాలు ఇక్కడ ఉన్నాయి:
- ఈ పత్రిక రచయిత పేతురు, యేసుచే ప్రత్యేకంగా ఎన్నుకోబడి “బండ” అని పిలువబడ్డాడు (మత్తయి 16:18). ఆతను తన పత్రికలో ఇదే విధమైన దృష్టాంతాలను, పోలికలను ఉపయోగించాడు.
ఈ వచనం గురించి యేసు ఉద్దేశం ఏమిటనే దాని గురించి కొంత చర్చ జరిగిందన్నది నిజమే. అయితే యేసు పేతురుతో మాట్లాడుతున్నాడని స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేతురు అంతకు ముందే “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని” యేసును గురించి అంగీకరించాడు(మత్తయి 16:16). ఆ తర్వాత పేతురుకు రాళ్ళు, శిలల పట్ల ఒక ప్రత్యేక ఆకర్షణ ఏర్పడి ఉండవచ్చని ఊహించుకోవచ్చు. ఆసక్తికరంగా, పేతురు తన మొదటి పత్రికలో (1 పేతురు 2:4–8) రాళ్ళు లేదా శిలలను చాలాసార్లు ప్రస్తావించడం ద్వారా వాటికి గొప్ప ప్రాముఖ్యతనిచ్చాడు. అతను యెషయా మరియు చివరి హల్లెల్ కీర్తనల నుండి (కీర్తనలు 113–118, పస్కా పండుగలో పఠించబడేవి) రాళ్ళు లేదా శిలలను ప్రత్యేకంగా పేర్కొనే మూడు భాగాలను ఉదహరించాడు.
ఒక ఉల్లేఖనం దేవుడు “సీయోనులో పునాదిగా వేసే” “మూలరాయి” గురించి చెబుతుంది ఇది యేసును సూచిస్తుంది, ఈ రాయిని ఇల్లు కట్టువారు నిషేధిస్తారు (యెషయా 28:16; కీర్తన 118:22). యేసును ఆయన కాలంలోని యూదులు ఎలా తిరస్కరించారో ఒక్కసారి ఆలోచించండి. చివరి ప్రస్తావన ఒక రాయి లేదా బండ గురించి చెబుతుంది, దానిపై మనుష్యులు తొట్రిల్లతారు (యెషయా 8:14–15). “మనుష్యులచేత విసర్జింపబడినను, దేవునిదృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును” అయిన ఈ రాయి, వాస్తవానికి, యేసు క్రీస్తే (1 పేతురు 2:4).”
క్రైస్తవులు “సజీవమైన రాళ్ళు” అని పేతురు తన పాఠకులు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. యేసు ఇప్పుడు నిర్మిస్తున్న సంఘంలో వారంతా జాగ్రత్తగా, సురక్షితంగా అమర్చబడ్డారు, మరియు క్రీస్తు ఆ సంఘానికి మూలరాయిగా ఉన్నాడు. ఈ కట్టడం (అంటే సంఘం) ఒక వాగ్ధానంపై ఆధారపడి నిలబడుతోంది: “పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు” (మత్తయి 16:18).
- మొదటి పేతురు పత్రిక ప్రధానంగా క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అనే విషయంపై దృష్టి సారిస్తుంది.
“తండ్రియైన దేవుని భవిష్యద్ జ్ఞానమునుబట్టి, ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును” క్రైస్తవులు ఎన్నుకోబడ్డారని పేతురు తన పత్రిక ప్రారంభంలోనే తెలియజేస్తాడు (1 పేతురు 1:2). పేతురు తన పత్రికలో సగానికి పైగా పవిత్రీకరణ (sanctification) ఎలా ఉంటుందో వివరిస్తూ, మొదటి అధ్యాయంలో లేవీయకాండము గ్రంథం నుండి “పరిశుద్ధతా నియమావళి” అని పిలువబడే వచనాన్ని అతను ఉదహరించాడు: “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి” (1 పేతురు 1:16; లేవీ. 11:44, 45; 19:2; 20:7). తరువాత, పేతురు తన పత్రికలో మిగిలిన భాగాన్ని, దైనందిన జీవితంలోని పోరాటాలలో పరిశుద్ధత ఆచరణాత్మకంగా ఎలా కనిపించాలో వివరించడానికి ఉపయోగిస్తాడు. ఇది పని ప్రదేశాలలో, సమాజంలో అధికారులకు లోబడి ఉండటంలో, వివాహంలో, మరియు సంఘ జీవితంలో ఎలా వర్తిస్తుందో ఆయన తెలియజేస్తాడు (1 పేతురు 2:13–25; 3:1–7; 5:1–11).
పరిశుద్ధత జీవితంలోని ప్రతి విషయంలో చాలా ఆచరణాత్మక మార్గాల్లో కనిపిస్తుంది. పేతురు చెప్పిన వాటిలో కొన్నింటిని ఆచరించడం చాలా కష్టంగా అనిపించవచ్చు. అయితే, ఆతన తన పాఠకులకు ఇలా గుర్తు చేస్తున్నాడు: “క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను”(1 పేతురు 2:21). యేసు తన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు అని తెలుసుకోవడం, ఆయన కోసం మనం ఎదుర్కొనే అత్యంత కష్టమైన పరిస్థితులలో కూడా సిలువను మోసుకుంటూ ముందుకు సాగేందుకు మనకు బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.
- మొదటి పేతురు పత్రిక ఎంతో నిజాయితీగా ఉంటుంది, అది వాస్తవాలను దాచదు.
పేతురు తన సందేశానికి తేనె పూసి చెప్పడు కానీ క్రైస్తవ జీవితం ఒక “పోరాటం” అని తన తోటి విశ్వాసులకు గుర్తుచేస్తాడు, ఈ యుద్ధంలో క్రైస్తవులు ” పరదేశులును యాత్రికులు” అని అతను స్పష్టం చేస్తున్నాడు (1 పేతురు 2:11). క్రైస్తవులు చెడుగా ప్రవర్తించినందుకు బాధపడవచ్చు, కానీ కొన్నిసార్లు వారు “నీతి కొరకు” బాధపడతారు (1 పేతురు 3:13–14, 17). యేసును రక్షకునిగా, ప్రభువుగా ఎరుగని వారికి “మంచి” పని చేయడం కొన్నిసార్లు అపరాధంగా కనిపించవచ్చు. అలాంటి పరిస్థితులలో మనం “ నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి” అని పేతురు సెలవిచ్చాడు(1 పేతురు 3:15). మనం క్రీస్తును మన యజమానిగా సేవిస్తున్నామని గుర్తుంచుకోవడం వలన మనం పోరాట రంగంలో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు సరైన మాటలు పలకడానికి సహాయపడుతుంది. 1 పేతురు 4:12–19 వచనాల్లో, క్రైస్తవులు ఎదుర్కొనే పరీక్షలపై పేతురు దృష్టి సారిస్తూ, తన పాఠకులను “ప్రియులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చే అగ్నిలాంటి విపత్తును గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు” అని ప్రోత్సహిస్తున్నాడు(1 పేతురు 4:12).
రోమా పత్రిక 5వ అధ్యాయ ప్రారంభంలో పౌలు చెప్పినట్లుగానే, పేతురు కూడా క్రైస్తవులను శ్రమలలో “ఆనందించండి” అని ప్రోత్సహిస్తున్నాడు (1 పేతురు 4:13; రోమా 5:3). పేతురు ఉద్దేశిస్తున్న శ్రమలు చాలాసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, అవి అనవసరంగా, అన్యాయంగా, లేదా తెలియనివిగా అనిపించవచ్చు.
మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కొన్నిసార్లు బాధపడవచ్చు, కానీ పేతురు ఇక్కడ ప్రస్తావిస్తున్నది మరో రకమైన శ్రమ గురించి, అదేంటంటే క్రైస్తవులు పవిత్ర జీవితాలను గడుపుతూ, యేసు గురించి గౌరవంతో, భక్తితో మాట్లాడినప్పుడు వారు అనుభవించే బాధల గురించి. “ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసి వస్తే సిగ్గు పడకూడదు. ఆ పేరును బట్టి అతడు దేవుణ్ణి మహిమ పరచాలి” (1 పేతురు 4:16). ఈ శ్రమల గురించి పేతురు ఒక గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు: “కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడే వారు మేలు చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి” (1 పేతురు 4:19).
క్రైస్తవులు పూల పాన్పు వంటి సౌకర్యవంతమైన జీవితం కోసం కాకుండా “విధేయత”తో కూడిన జీవితానికి పిలువబడ్డారు (1 పేతురు 1:2). అయితే విధేయత చాలాసార్లు బాధాకరమైనదిగా మరియు మూల్యం చెల్లించేదిగా ఉండవచ్చు. ఈ శోధనలు మిమ్మల్ని పరీక్షించడానికి ఉద్దేశించినవి, తద్వారా “నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును” (1 పేతురు 1:7).
ఈ వ్యాసం “బైబిల్‌లోని ప్రతి గ్రంథం గురించి తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు” అనే శ్రేణిలో భాగంగా ఉంది.
డాక్టర్ డెరెక్ డబ్ల్యూ.ఎచ్. థామస్ ఒక లిగోనియర్ మినిస్ట్రీస్ బోధన సహచరుడు మరియు రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరీలో సిస్టమాటిక్ మరియు పాస్టోరల్ థియాలజీ యొక్క ఛాన్సలర్ ప్రొఫెసర్. అతను లిగోనియర్ బోధనా సిరీస్ రోమన్లు 8 కి ప్రత్యేక ఉపాధ్యాయుడు మరియు హెవెన్ ఆన్ ఎర్త్, స్ట్రెంత్ ఫర్ ది వేరీ మరియు లెట్ అస్ వర్షిప్ గాడ్ వంటి అనేక పుస్తకాల రచయిత.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


