3-Things-About-Proverbs
సామెతల గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
03/07/2025
3-Things-About-Proverbs
సామెతల గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
03/07/2025

1, 2, 3 యోహాను పత్రికల గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

3-Things-about-1-2-3-John-02

ఇయాన్ హామిల్టన్ గారు

బైబిలు నిండా ఎన్నో అమూల్యమైన రత్నాలు దాగి ఉన్నాయి. అయితే, ఆ  దాగివున్న రత్నాలు చాలావరకు బైబిలులోని చిన్న పుస్తకాలలో కనిపిస్తాయి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివే క్రైస్తవులు ఆదికాండము, కీర్తనలు, యెషయా, యోహాను సువార్త, రోమా పత్రిక , ఎఫెసీయులు వంటి “పెద్ద పుస్తకాల”తో మంచి పరిచయం కలిగి ఉంటారు. నా అంచనా ప్రకారం చాలామందికి యోవేలు, హగ్గయి, జెఫన్యా మరియు యోహాను వ్రాసిన మూడు పత్రికల వంటి పుస్తకాలతో అంతగా పరిచయం లేదు.

ఈ చిన్న ధ్యానంలో, యోహాను రాసిన మూడు పత్రికల గురించి ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తెలుసుకోవలసిన మూడు ముఖ్య విషయాలను మనం పరిశీలించబోతున్నాం.

  1. ఈ పత్రికలు చిన్నవి అయినప్పటికీ, క్రైస్తవుల ఆత్మీయ ఎదుగుదలకు, పరిపక్వతకు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి.

దాదాపు నలభై సంవత్సరాలు పాస్టర్‌గా పరిచర్య అనుభవం తర్వాత, క్రైస్తవులు తమ బైబిళ్లను గత తరం మాదిరిగా బాగా తెలుసుకుంటున్నారని భావించకూడదని నేర్చుకున్నాను. బైబిలును చదవడం, అర్థం చేసుకోవడం, అలాగే బైబిలులోని ప్రతి వాక్య భాగాన్ని వివరించి చెప్పే బోధన ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. ఈ లోక ప్రభావం వల్ల, నమ్మకమైన నిజ విశ్వాసుల ఏకాగ్రత కూడా దెబ్బతింది, అందుకే దైవవాక్యంపై ఎక్కువసేపు నిలకడగా దృష్టి పెట్టడం వారికి కష్టంగా మారింది. సంస్కృతికి తగ్గట్లుగా పరిచర్య చేయాలనే మంచి ఉద్దేశం తరచుగా వివరణాత్మక  ప్రసంగాల కంటే, సందర్భానుసారమైన  ప్రసంగాలకు దారితీసింది. ఈ కారణాలన్నింటివల్లే, దేవుని వాక్యం గురించి సంపూర్ణంగా, లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తి, అవగాహన చాలా మంది విశ్వాసుల్లో తగ్గిపోయింది. దీనివల్ల వారికి లేఖనాల లోతైన, విస్తృతమైన జ్ఞానం అందకుండా పోయింది.

“దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని పౌలు తిమోతికి గుర్తుచేశాడు(2 తిమోతి 3:16–17).  పౌలు యవ్వన దైవజనుడైన తిమోతిని దేవుని లిఖితపూర్వక వాక్యాన్ని సంపూర్ణంగా అంగీకరించి దాని ప్రకారం తన జీవితాన్ని, పరిచర్యను తీర్చిదిద్దుకోవాలని ప్రోత్సహించాడు. తిమోతికి ఇది ఎంత వర్తిస్తుందో, ప్రతి క్రైస్తవునికి కూడా అంతే వర్తిస్తుంది. కాబట్టి, మనం నీతిలో శిక్షణ పొంది, సంపూర్ణ క్రైస్తవులమై, ప్రతి మంచి పనికి సిద్ధపడాలంటే 1, 2, 3 యోహాను పత్రికలను తెలుసుకోవాలి.

  1. యోహాను రాసిన పత్రికలు, సంఘం యొక్క పరిశుద్ధత, శాంతి, మరియు లక్ష్యాన్ని ప్రమాదంలో పడేసే దుర్బోధల చీకటి నేపథ్యానికి వ్యతిరేకంగా రాయబడ్డాయి.

దుర్బోధలు యోహాను కాలంలో కొత్తవి కావు. సాతాను క్రీస్తు సంఘాన్ని దారి తప్పించి, దాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుని, సువార్త విశ్వసనీయతను నాశనం చేయడానికి ఇలాంటి తప్పుడు బోధనలను క్రమం తప్పకుండా మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూనే ఉంటాడు.

యోహాను తన మొదటి పత్రికను ప్రారంభిస్తూ ఇలా వ్రాశాడు:

“మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా–దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడ సహవాసముగల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపములేని వారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు” (1 యోహాను 1:5–10). 

1 యోహాను 1:6, 8, 10 వచనాలలో కనిపించే “మనము …చెప్పుకొనినయెడల” అనే వచనాన్ని గమనించండి. యోహాను ఎందుకు ఈ విధంగా వ్రాయవలసిన అవసరం ఉందని భావించాడు? ఎందుకంటే సంఘంలో కొంతమంది తాము దేవునితో సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తున్నారు. తర్వాత 1 యోహాను 2:19లో యోహాను ఇలా వ్రాశాడు “వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు”. ఒక నమ్మకమైన పాస్టర్‌గా, యోహాను తన “ప్రియమైన పిల్లలను” (అతను వారిని అలానే పిలిచాడు) తప్పుడు బోధల పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు: “దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు” (1 యోహాను 1:5; 1 యోహాను 2:22; 4:1–3 కూడా చూడండి).

2 మరియు 3 యోహాను పత్రికలలో, అపొస్తలుడైన యోహాను తన ప్రియమైన పిల్లలను తప్పుడు బోధల నుండి కాపరిగా కాపాడటానికి ఎంతగా శ్రద్ధ వహించాడో మనం స్పష్టంగా చూస్తాము. 2 యోహాను 7లో మనం ఇలా చదువుతాము: “యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు. అలాంటి వాడే మోసగాడు మరియు క్రీస్తు విరోధి.”  3 యోహాను 9లో యోహాను తన ప్రియమైన పిల్లలను “తానే అందరిలో ప్రథముడుగా ఉండగోరుచున్న” “దియోత్రెఫే” అనే ఒక ప్రత్యేక వ్యక్తి గురించి హెచ్చరిస్తున్నాడు.  దేవుని ప్రజల జీవితాన్ని పాడు చేయడంలో చెడు సిద్ధాంతం ఎంత ప్రాణాంతకమో, చెడు ప్రవర్తన కూడా అంతే ప్రాణాంతకమని యోహానుకు బాగా తెలుసు.

  1. యోహాను రాసిన మూడు పత్రికలు ప్రతి సువార్త సేవకుడిలో, నిజానికి ప్రతి క్రైస్తవుడిలో ఉండవలసిన ప్రేమ, కరుణ, మరియు ధైర్యాన్ని ప్రతిబింబిస్తాయి.

దేవుడిని మహిమపరిచే సంఘ విశ్వాసులను పోషించే పరిచర్య కేవలం ఖచ్చితమైన, సంప్రదాయబద్ధమైన బైబిలుపరమైన బోధనతో మాత్రమే కాకుండా, కరుణ, ధైర్యం, మరియు ఆప్యాయతతో కూడినదిగా ఉంటుంది. యోహాను తన పాఠకులను తన “చిన్న పిల్లలారా” అని ఎంత తరచుగా సంబోధించాడో గమనించడం ఆశ్చర్యకరంగా ఉంటుంది (1 యోహాను 2:1, 12, 28; 3:18; 4:4; 5:21). అతని బోధ వారి పట్ల అతనికున్న లోతైన ప్రేమ నుండి పుట్టింది. తమ పాస్టర్లు తమను హృదయాల్లో పెట్టుకొని, తమ క్షేమాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారని ప్రజలు తెలుసుకుంటే, లేక కనీసం అనుభూతి చెందితే, మన సంఘాలలో ఎంత మార్పు వస్తుందో కదా!

యోహాను రాసిన మూడు పత్రికలు సువార్త రత్నాలు. వాటిని చదవండి, వాటిని ధ్యానించండి, వీలైతే వాటిని కంఠస్థం చేయడానికి కూడా ప్రయత్నించండి, తద్వారా మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపలో నిరంతరం ఎదుగుతూ ఉంటారు.

ఈ వ్యాసం “బైబిల్‌లోని ప్రతి గ్రంథం గురించి తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు” అనే శ్రేణిలో భాగంగా ఉంది.

డా. ఇయాన్ హామిల్టన్ గారు ఇంగ్లాండ్‌లోని న్యూకాజిల్‌లో ఉన్న వెస్ట్‌మిన్‌స్టర్ ప్రెస్బిటేరియన్ థియోలాజికల్ సెమినరీకి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే, సౌత్ కరోలినాలోని గ్రీన్‌విల్‌లో ఉన్న గ్రీన్‌విల్ ప్రెస్బిటేరియన్ థియోలాజికల్ సెమినరీలో అనుబంధ ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆయన అనేక పుస్తకాలు రాశారు, వాటిలో ‘వర్డ్స్ ఫ్రమ్ ది క్రాస్’ (శిలువ నుండి వెలువడిన మాటలు), ‘అవర్ హెవెన్లీ షెపర్డ్’ (మన పరలోకపు కాపరి), మరియు ‘ది లెక్టియో కంటిన్యూ ఎక్స్‌పోజిటరీ కామెంటరీ ఆన్ ది న్యూ టెస్టమెంట్ సిరీస్‌లో ఎఫెసీయులపై రాసిన వ్యాఖ్యానం వంటి అనేక పుస్తకాలను రచించారు.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

      1.