
పిల్లల కోసం నిబంధన దైవశాస్త్రం: ఒక ప్రారంభ మార్గదర్శిని
12/11/2026సవాలుతో కూడిన సమయాల్లో ఒక తండ్రి యొక్క మార్గాలు
తండ్రితత్వం సవాళ్లతో నిండి ఉంటుంది. క్రీస్తు-కేంద్రీకృతమైన ఇంట్లో పెరిగినప్పటికి, దారి తప్పిన కుమారుడు లేదా కుమార్తె విశ్వాసం నుండి దూరమైపోవడాన్ని చూడటం అన్నింటికన్నా కష్టమైనది. మనం ఎవరిని ఆశ్రయించాలి?
సామెతల గ్రంథం అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రోత్సాహాన్ని మరియు అంతర్దృష్టిని అందిస్తుంది. అది పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడింది,
జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును¸
యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.
జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును
వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. (సామెతలు 1:4-5)
తన బిడ్డ క్షేమం గురించిన ఒక తండ్రి కున్న ఆశ మొదట దైవిక ఉపదేశం ద్వారా తెలియజేయబడుతుంది. సామెతల గ్రంథంలోని మొదటి అధ్యాయాలు కుమారులను, కుమార్తెలను ఇలా ప్రోత్సహిస్తున్నాయి: “ఉపదేశము వినుము” (సామెతలు 1:8); “నా మాటలను అంగీకరించుము” (సామెతలు 2:1); “నా బోధలను మరువకుము” (సామెతలు 3:1); “కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుము” (సామెతలు 4:1); “నా జ్ఞానమునకు చెవి యొగ్గుము” (సామెతలు 5:1); “నా కుమారుడా, ఈలాగు చేసి నిన్ను నీవే రక్షించుకొనుము” (సామెతలు 6:3); మరియు “నా మాటలను గైకొని నా ఆజ్ఞలను భద్రపరచుకొనుము” (సామెతలు 7:1). వారి హృదయాలలో, మనస్సులలో బైబిలు సత్యాలను నాటడానికి మనం చేయగలిగినదంతా చేశామా?
తండ్రులు కూడా ‘తప్పిపోయిన’ వారి మార్గాలను జాగ్రత్తగా విశ్లేషించాలి. సామెతల గ్రంథం మూడు ప్రమాదకరమైన హృదయ స్థితులను వెల్లడిస్తుంది: దేవుణ్ణి మరచిపోయే అమాయకుడు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే అపహాసకుడు, మరియు దేవుణ్ణి తిరస్కరించే అవివేకి (సామెతలు 1:22). వీరిలో ప్రతి ఒక్కరూ క్రమంగా మరింత కఠిన హృదయులుగా, ఆధ్యాత్మిక సత్యానికి మరింత లొంగనివారిగా, మరియు మరింత తక్షణ ప్రమాదంలో ఉంటారు. వారు ఏ స్వరాలను అత్యంత శ్రద్ధగా వింటారో గ్రహించడమే కీలకం. వారు ఎవరితో నడుస్తారు, నిలబడతారు లేదా కూర్చుంటారు?
సామాన్యులు అమాయకులు, శోధనల స్వరాలను వింటారు మరియు చెడు సహవాసం వలన సులభంగా ప్రభావితమవుతారు. సామాన్యులు తమ ఎంపికల పర్యవసానాన్ని చూసి, ఆ అలవాట్లను లేదా స్నేహితులను విడిచిపెట్టాలని జ్ఞానం గట్టిగా చెబుతుంది (సామెతలు 7:6–27). అపహాసకుడు మరింత అహంకారి, పాపాన్ని ఎగతాళి చేస్తూ దైవిక సలహాలన్నింటిని నిర్లక్ష్యం చేస్తాడు. నాశనానికి, అవమానానికి, అపకీర్తికి గురికాకుండా ఉండేందుకు, తన తండ్రి గద్దింపును వినమని జ్ఞానం అతడిని సవాలు చేస్తుంది (సామెతలు 13:1). అవివేకి స్థిరంగా దేవుణ్ణి తిరస్కరించి, ఆయన వాక్యాన్ని తృణీకరిస్తాడు. అటువంటి వ్యక్తి చెవిటివాడిలా ఉండటం ద్వారా తన నాశనాన్ని తానే తెచ్చుకుంటాడని, అతని అంతం మరణ మార్గమేనని జ్ఞానం హెచ్చరిస్తుంది. ప్రేమతో సత్యాన్ని ఎలా (మరియు ఎంత తరచుగా) మాట్లాడాలో తెలుసుకోవడానికి జ్ఞానం కోసం ప్రార్థించండి.
తండ్రులు పాటించవలసిన ఇతర ఆచరణాత్మక చర్యలు ఏమిటి?
ప్రార్థన
ఒక తండ్రికి మొట్టమొదటి మరియు అత్యున్నతమైన వనరు, తన బిడ్డను పట్టుదలతో కృపా సింహాసనం వద్దకు తీసుకురావడమే. అనేకమంది పిల్లలు, మనవళ్లు ఉన్న, అనుభవజ్ఞుడైన పాస్టర్ మరియు తండ్రి అయిన జాన్ యేట్స్, తన అనుభవం నుండి ఇలా వ్రాశారు: “చాలా త్వరగా, పిల్లలు ఒక మనిషికి తన పరిమితుల గురించి, తన వద్ద అన్ని సమాధానాలు లేవని, మరియు అతను భర్తగా, తండ్రిగా తరచుగా విఫలమవుతాడని నేర్పడం ప్రారంభిస్తారు. . . . ప్రార్థన అనే ఒక సరికొత్త జీవన విధానానికి ఇది మొదలు.”1 ప్రతి కుటుంబ సభ్యుని నిర్దిష్ట అవసరాలను మరియు సమాధానాలను నమోదు చేయడానికి, ప్రార్థనల నోట్బుక్ అనే చాలా సహాయకరమైన వనరును యేట్స్ సూచిస్తున్నారు. ఒక తండ్రి యొక్క పట్టుదలగల ప్రార్థనలు ఎంతో ఫలిస్తాయి.
పశ్చాత్తాపం
ఆధ్యాత్మికంగా దారి తప్పిన లేదా విశ్వాసం నుండి వైదొలగిన పిల్లల నడకలో ఏర్పడిన లోపానికి తండ్రిదే తప్పు కావచ్చు. మనం వారిని ఎంతగా ప్రేమిస్తున్నామో ఈ మధ్య వారికి చెప్పామా? ఒక తండ్రిగా మన పాపాలను వారి ముందు వినయంగా ఒప్పుకున్నామా? కోపంతో లేదా బాధపెట్టే మాటలకు గాని, లేదా అజాగ్రత్తగా, స్థిరంగా లేని, లేదా అతి కఠినంగా ఉన్న క్రమశిక్షణకు గాని మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. నిజమైన మగవాళ్ళు క్షమాపణ కోరడానికి మొదటి అడుగు వేస్తారు.
ఎన్నడూ వదులుకోవద్దు. తప్పిపోయిన కుమారుడు అనుమతించినంత మేరకు, వివేకవంతుడైన తండ్రి ఒక నిజమైన సంబంధాన్ని దృఢంగా కొనసాగిస్తాడు.
ఏదైనా ఒప్పుకోలును ముఖాముఖిగా చెప్పడమే ఉత్తమం, అయినప్పటికి (తగ్గుతున్న క్రమంలో) వర్చువల్ సంభాషణ, ఫోన్ కాల్ లేదా వ్రాతపూర్వకమైన లేఖ అవసరం కావచ్చు. ఆ లేఖ చేతితో వ్రాసి ఉండాలి, ఎందుకంటే ఈమెయిల్ లేదా టెక్స్ట్ సందేశం కంటే మీ చేతితో వ్రాసిన వ్యక్తిగత లేఖలకు ఎక్కువ బరువు ఉంటుంది.
సహనం
1876లో ఒక పాస్టర్ క్రైస్తవ కుటుంబం గురించి ఒక అంతర్దృష్టి కలిగిన పుస్తకాన్ని రాశారు. అందులో, తండ్రులు తమ మందను సహనంతో నడిపించాలని ఆయన ప్రోత్సహించారు: “ఉద్దేశ్యం సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయడం కాదు, దానికి శిక్షణ ఇవ్వడమే; దాని స్వేచ్ఛను బాహ్యశక్తితో బంధించడం కాదు, అది తనను తాను నియంత్రించుకునేలా నేర్పించడమే.”2 పిల్లల హృదయాన్ని దాడితో కాకుండా, సున్నితమైన ముట్టడితో వశపరచుకుంటూ, అదుపులేని దానిని నిగ్రహించడానికి, తరచుగా నెమ్మదిగా జరిగే దైవకృపకు సమయం ఇవ్వండి.
ఆహ్లాదకరమైన
ఈలోగా, సతాయింపు మనిషిగా లేదా రాక్షసుడిలా ఉండకండి. సత్యాన్ని స్పష్టంగా మాట్లాడండి, కాని మీరు మాట్లాడిన ప్రతిసారీ కాదు. కోపాన్ని కాకుండా ప్రేమను; నిరాశను కాకుండా సహనాన్ని వ్యక్తపరిచే (ముందుగా ప్రణాళిక వేసుకున్న) మాటలను ఉపయోగించండి. “తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించకండి, ప్రభువు నేర్పిన శిక్షణ మరియు ఉపదేశముతో వారిని పెంచండి” (ఎఫెసీ. 6:4). వీలైనప్పుడు కలిసి సరదా కార్యకలాపాలు చేయడం ద్వారా సంబంధాన్ని బలంగా ఉంచుకోండి. పంచుకున్న అనుభవాలలో ఆనందాన్ని కనుగొంటూ, ఇతరులను ఆదరించే స్వభావాన్ని, కొత్త బంధాలను ఏర్పరచుకోవడానికి సృజనాత్మక మార్గాలను ప్రసాదించమని ప్రభువును అడగండి.
పట్టుదల
ఎన్నడూ వదులుకోవద్దు. జ్ఞానవంతుడైన తండ్రి, తప్పిపోయిన కుమారుడు ఎంతవరకు అనుమతిస్తాడో అంతవరకు అతనితో నిజమైన సంబంధాన్ని స్థిరంగా కొనసాగిస్తాడు. షరతులు లేని ప్రేమ, “నువ్వు ఏమి చేసినా సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెబుతుంది. దీనికి ఉత్తమమైన ఉదాహరణ క్రీస్తు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానంలో కనిపిస్తుంది. తిరస్కరించబడిన ఆ తండ్రి, తప్పిపోయిన తన కుమారుని కోసం నిరంతరం కనిపెట్టుకొని, అతను తిరిగి వస్తాడేమోనని ప్రతిరోజూ దిగంతం వైపు చూస్తూ ఉండేవాడు. ఆ బాలుడు కుంటుతూ ఇంటికి రావడం చూసి, అతనికి జాలి కలిగి, పరుగెత్తుకెళ్లి అతన్ని కౌగిలించుకున్నాడు. అతను ఆ యువకుడి వృధా ఖర్చును క్షమించి, తిరిగి కుటుంబంలోకి స్వాగతించాడు, “మరియు వారు ఉత్సవము చేయనారంభించిరి” (లూకా 15:24). మీరు ఎల్లప్పుడూ వారి జీవితంలో ఒక దీపాన్ని వెలిగిస్తూ ఉంటారని వారికి తెలియజేయండి.
తండ్రులారా, చివరికి మిమ్మల్ని మరియు మీ బిడ్డను ప్రభువు చేతులకు అప్పగించండి. విమోచన అనేది అంతిమంగా ఆయన ఒక్కరి కార్యమే, మరియు రక్షించడానికి ఆయన హస్తం ఎన్నడూ తక్కువ కాదు.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్లో ప్రచురించబడింది.


