
ప్రేమకు గల ప్రేరణ
11/06/2026సోమరితనం మరియు శ్రద్ధ
పదహారవ శతాబ్దపు ప్రొటెస్టెంట్ సంస్కరణ (Reformation) అందించిన శాశ్వత వారసత్వం గురించి ఆలోచించినప్పుడు, అనేక ప్రాముఖ్యమైన సత్యాలు మనకు స్ఫురిస్తాయి. కేవలం విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడటం, రక్షణ కేవలం క్రీస్తు ద్వారానే లభించడం, దేవుని వాక్యమే పరమావధిగా జీవించడం మరియు ప్రతిదీ ఆయన మహిమ కొరకే చేయడం వంటివి మనకు వెంటనే గుర్తుకు వస్తాయి. అయితే, ఈ సంస్కరణలో తరచుగా విస్మరించబడే మరో కీలకమైన మైలురాయి ఉంది. అది “ప్రొటెస్టెంట్ పని నీతి” (Protestant Work Ethic) అనే ప్రసిద్ధ నినాదంలో ఇమిడి ఉంది. ఈ మాట వినగానే, “నిజాయితీతో కూడిన శ్రమకు తగిన ప్రతిఫలం” వంటి సామెతలు మనకు గుర్తుకు వస్తాయి. దీనిని “ప్రొటెస్టెంట్ పని నీతి” అని పిలవడానికి ఒక బలమైన కారణం ఉంది. కేవలం మతపరమైన విధులు లేదా సంఘ సేవ మాత్రమే కాకుండా, దేవుని చిత్తానుసారంగా చేసే ఏ చట్టబద్ధమైన పనైనా పవిత్రమైనదేనని సంస్కర్తలు స్పష్టంగా ప్రకటించి, ఆ సత్యాన్ని తిరిగి స్థాపించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, మానవ శ్రమకు ఉన్న గౌరవాన్ని మరియు విలువను చాటిచెప్పే బైబిల్ దృక్పథాన్ని సంస్కర్తలు తిరిగి వెలికితీశారు.
లేఖనాల్లో మానవ శ్రమకు ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే, సోమరితనాన్ని మరియు పని చేయకుండా కాలక్షేపం చేయడాన్ని దేవుని వాక్యం ఎంత కఠినంగా ఖండిస్తుందో గమనిస్తే సరిపోతుంది. ఈ క్రింది వచనాలను పరిశీలించండి:: “శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు; సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును” (సామెతలు 12:24). “విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు; కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును” (సామెతలు 20:4). “సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును” (సామెతలు 21:25). “ఎవడైనను పనిచేయనొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము” (2 థెస్సలొనీకయులకు 3:10-12). ఈ వచనాలు స్పష్టం చేస్తున్నట్లుగా, శారీరక సామర్థ్యం ఉండి కూడా పనిచేయకపోవడం అనేది సామాన్యమైన విషయం కాదు; అది దేవుని దృష్టిలో ఒక తీవ్రమైన పాపం. అపొస్తలుడైన పౌలు ఈ సత్యాన్ని 1 తిమోతి 5:8లో అత్యంత స్పష్టంగా పేర్కొన్నాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటి వారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును.”
ప్రొటెస్టెంట్ పని నీతి కేవలం నిజాయితీతో కూడిన శ్రమనే కాకుండా, ఆ పనిలో ఉండాల్సిన శ్రద్ధను మరియు క్రమశిక్షణను కూడా విశేషంగా నొక్కి చెబుతుంది. సామెతలు 18:9 ఈ సత్యాన్ని స్పష్టం చేస్తోంది: “పనిలో జాగుచేయువాడు, నష్టము చేయువానికి సోదరుడు.” సామెతల గ్రంథమంతటా మనం గమనిస్తే, కేవలం ఏదో ఒక పని చేసేవారినే కాకుండా, ఆ పనిని పూర్తి శ్రద్ధాసక్తులతో నిర్వహించేవారినే లేఖనాలు ప్రశంసిస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే, మనం చేసే ఏ పనైనా సరే, మన శాయశక్తులా అత్యుత్తమ ప్రయత్నంతో, మన పూర్తి సామర్థ్యంతో చేయాలి.
అయితే, మన పతనావస్థ కారణంగానే కొందరు పని చేయడానికి నిరాకరిస్తూ సోమరులుగా మారుతుండగా, మరికొందరు తాము చేసే పనిలో అత్యంత అశ్రద్ధగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. పాపం మనుషులలో స్వార్థాన్ని నింపుతుంది; అందుకే చాలామంది పనిని కేవలం ఆర్థిక లాభం పొందే మార్గంగా మాత్రమే చూస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే, తాము చేసే పని ద్వారా దేవునికి సేవ చేయవచ్చన్న స్పృహ గానీ, ఆ పని ద్వారా ఆయనకు మహిమ కలగాలన్న ఉద్దేశం గానీ వారికి ఉండదు. వారి దృష్టిలో పని అంటే కేవలం ధనార్జనకు, తద్వారా తమ భోగభాగ్యాల కోసం వస్తు సంపదలను సమకూర్చుకోవడానికి ఉన్న ఒక సాధనంగా మాత్రమే చూస్తారు.
పాపం మరికొందరిని తమ పనిలో ఎంతగా మునిగిపోయేలా చేస్తుందంటే, వారు తమ కుటుంబాలను, చివరికి తమ ఆత్మీయ క్షేమాన్ని సైతం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. నేటి కాలంలో అనేకులలో కనిపిస్తున్న ఈ ‘పని రాక్షసత్వం’ లేదా విరామం లేని శ్రమ, పైకి చూడటానికి లేఖనాలు కోరుతున్న ‘శ్రద్ధ’ లాగే అనిపించవచ్చు. కానీ ఇది కేవలం ఆత్మవంచన మాత్రమే. మనం శ్రద్ధగా పనిచేయడం అంటే దేవునికి లేదా కుటుంబానికి కేటాయించాల్సిన సమయాన్ని దొంగిలించి పనికి వెచ్చించడం కాదు. మన శ్రమ దేవునితో లేదా కుటుంబ బాధ్యతలతో పోటీ పడేదిగా ఉండకూడదు.
పాపం మనుషులలో అహంకారాన్ని నింపుతుంది. తాము చేసే పని స్వభావాన్ని బట్టి తాము ఇతరులకంటే అధికులమని భావించేలా, తోటివారిని తక్కువ చేసి చూసేలా అది మనల్ని ప్రేరేపిస్తుంది. నేటి సమాజంలో అధిక హోదాను, ఆడంబరాన్ని ఇచ్చే ఆకర్షణీయమైన ఉద్యోగాలెన్నో ఉన్నాయి; ఇటువంటి పదవుల్లో ఉన్నప్పుడు, మనం సహజంగానే ఇతరులకంటే గొప్పవారమనే భ్రమలో పడిపోయే ప్రమాదం ఉంది. ఈ అహంకారమే సమాజం దృష్టిలో “సాధారణమైనవి”గా కనిపించే పనులు చేసేవారి పట్ల చిన్నచూపు చూసేలా చేస్తుంది. వారి పనికి విలువ లేదని, వారి వ్యక్తిత్వం లేదా గౌరవం తక్కువని తప్పుడు తీర్పులు ఇవ్వడానికి ఇది కారణమవుతుంది.
క్రైస్తవులు పని గురించిన ఇటువంటి వక్రీకృత భావనల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి; మనలో అటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాయని వెల్లడైనప్పుడు వెంటనే పశ్చాత్తాపపడాలి. ఈ కారణంగానే, క్రైస్తవ దృక్పథంతో పని గురించి చర్చించేటప్పుడు ‘విశ్రాంతి దినం’ గురించి ప్రస్తావించడం అనివార్యం. ఆదికాండము 2:3 ఇలా సెలవిస్తోంది: “దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.” మనం చేసే శ్రమ ద్వారా సృష్టికర్తను ఏ విధంగా మహిమపరుస్తామో, విశ్రాంతి దినాన్ని పాటించడం ద్వారా కూడా ఆయనను అదే రీతిలో ధ్యానిస్తూ ఘనపరచాలి. అప్పుడే మన శ్రమకు ఒక సరైన అర్థం, దిశానిర్దేశం లభిస్తాయి. క్రీస్తే మనకు పరిపూర్ణమైన అంతిమ విశ్రాంతి మరియు విశ్రాంతి దినమని హెబ్రీ పత్రికా రచయిత స్పష్టం చేస్తున్నాడు (హెబ్రీ 3:7-4:10). మన పనుల నుండి విరామం తీసుకుని, మన రక్షణ కోసం క్రీస్తు చేసిన కార్యాలను ధ్యానించినప్పుడు, మనలో కృతజ్ఞతాభావం మళ్ళీ చిగురిస్తుంది. అప్పుడు జీవితం పట్ల, పని పట్ల మనకున్న దృక్పథం క్రీస్తు-కేంద్రీకృతంగా మారుతుంది.
అయితే, ఈ ‘ప్రొటెస్టెంట్ పని నీతి’ మనకు నేర్పే పాఠాలేమిటి? సోమరితనం, ఏ పనీ చేయకుండా కాలక్షేపం చేయడం మరియు బద్ధకం ఇవి కేవలం అలవాట్లు మాత్రమే కాదు; ఇవి మన సృష్టికర్తపై మానవుడు చేసే తిరుగుబాటుకు నిదర్శనాలు. అంతేకాదు, ఇవి ఆయన మహిమకు అవమానం కలిగించే పనులు.
పని పట్ల మన ఆలోచనలు లోకపు పోకడల ప్రకారం ఉంటే, మనకు తెలియకుండానే మన వృత్తిని ఒక ‘విగ్రహం’లా మార్చుకునే ప్రమాదం ఉంది. కేవలం ఏదో ఒక పని చేస్తున్నామని అనిపించుకోవడం మాత్రమే సరిపోదు; మనం సోమరితనానికి తావివ్వకూడదు, అదే సమయంలో కేవలం మనుషుల మెప్పు కోసమే పనిచేసేవారిగా మారిపోకూడదు. దేవుని మహిమను ఆశించి, మనం శ్రద్ధాసక్తులతో పనిచేయాలి.
సోమరితనం మరియు బద్ధకం గురించి లేఖనాలు ఉపయోగిస్తున్న కఠినమైన హెచ్చరికలను మనం హృదయపూర్వకముగా స్వీకరించి, గంభీరంగా పరిగణించాలి. మన శ్రమలోనూ, మన జీవితంలోని సమస్త రంగాలలోనూ ప్రతి అడుగు దేవుని మహిమార్థమే ఉండాలి.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్లో ప్రచురించబడింది.


