
యిర్మీయా గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
14/08/2025
జెకర్యా గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
21/08/2025యాకోబు గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు

గ్రెగరీ ఆర్. లానియర్
యాకోబు రాసిన పత్రిక బైబిల్‌లోని “కాథలిక్” లేదా “సాధారణ పత్రికలు” అని పిలవబడే ఉప-విభాగానికి చెందినది. వీటిని ఇలా పిలవడానికి కారణం, ఈ పత్రికలు ఏ ఒక్క నిర్దిష్ట సంఘానికో లేదా వ్యక్తికో ఉద్దేశించినవి కావు; బదులుగా, అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజలందరికీ, అంటే విశ్వాసుల సమగ్ర సమాజాన్ని ఉద్దేశించి వ్రాయబడ్డాయి. ఈ పత్రిక ‘అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి’ (యాకోబు 1:1) పంపబడింది. ఈ పత్రికలో, “చెదరిపోయిన పన్నెండు గోత్రాలు” అనే పదబంధం కేవలం పన్నెండు గోత్రాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న దేవుని ప్రజలందరినీ సూచించే ఒక శక్తివంతమైన, అర్థవంతమైన మరియు గుర్తుగా నిలిచే వ్యక్తీకరణ. ఈ వ్యాసంలో, యాకోబు పత్రిక గురించి మనం తప్పక తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం.
1. యేసు సహోదరుడైన యాకోబు దీనిని రాసి ఉండవచ్చు
యాకోబు పత్రికను రాసిన వ్యక్తి యేసుకు సోదరుడైన యాకోబు అయి ఉండవచ్చని చాలా మంది పండితులు విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, బైబిల్‌లో “యాకోబు” అనే పేరుతో కనిపించే నలుగురు వ్యక్తులను పరిశీలిద్దాం: యోహాను సోదరుడు యాకోబు (జెబెదయి కుమారులు, మత్తయి 4:21) చాలా తొందరగా మరణించాడు కాబట్టి ఈ పత్రికకు రచయిత అయ్యే అవకాశం లేదు (అపొస్తలుల కార్యములు 12:2). అల్ఫయి కుమారుడైన యాకోబు (మత్తయి 10:3) మరియు యూదా తండ్రైన యాకోబు (లూకా 6:16) ఆదిమ సంఘంలో అంతగా గుర్తింపు పొందిన వ్యక్తులు కాదు. ఈ కారణంగా, వారు తమను కేవలం “యాకోబు” అనే ఒక్క పేరుతో పత్రికను రాసేంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నవారు కాదు. ఈ వివరాలన్నిటిని బట్టి చూస్తే, యేసు సోదరుడైన యాకోబు (మత్తయి 13:55) అత్యంత ఆమోదయోగ్యమైన రచయితగా కనిపిస్తున్నాడు. ఈ యాకోబు మొదట్లో యేసును విశ్వసించలేదు (యోహాను 7:5). అయితే, పునరుత్థానమైన ప్రభువైన క్రీస్తుతో ఆయనకు కలిగిన అద్భుతమైన అనుభవం (1 కొరింథీయులకు 15:7) తర్వాత, అతను విశ్వాసంలో స్థిరమైన నాయకుడిగా మారాడు. ఆదిమ సంఘంలో ఒక ముఖ్య స్తంభంగా ఎదిగాడు, మరియు అపొస్తలుడిగా కూడా పరిగణించబడ్డాడు (గలతీయులకు 1:19; 2:9). రచయిత యొక్క గుర్తింపు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో ఇప్పుడు చూద్దాం.
మొదటిది, యాకోబు సువార్త శక్తిచేత అద్భుతంగా రూపాంతరం చెందాడు. అయితే, అతను యేసుతో తన రక్త (శరీర) సంబంధాన్ని ఆధారం చేసుకొని ఎలాంటి ప్రత్యేక గౌరవాన్ని లేదా అధికారాన్ని కోరలేదు. బదులుగా, అతను తనను తాను కేవలం “ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడిని” అని మాత్రమే చెప్పుకున్నాడు (యాకోబు 1:1). రెండవది, యాకోబు యెరూషలేము మహాసభలో ఒక కీలకమైన నేతగా నిలిచి, నిర్ణయాత్మకమైన ప్రసంగం చేశాడు. ఆ సందర్భంలో అతను ఆమోసు 9:11–12 వచనాలను ప్రస్తావిస్తూ, క్రీస్తు మరణం మరియు పునరుత్థానం వల్ల యూదులు, అన్యజనులు అనే వర్గాల మధ్య ఉన్న భేదాలు ఎలా తొలగిపోతాయో, వారందరూ విశ్వాసమే ఆధారంగా ఉన్న ఒకే సంఘంగా ఎలా ఏకమవుతారో స్పష్టంగా వివరించాడు. జాతి ఆధారిత గుర్తింపులు గానీ, ధర్మశాస్త్ర క్రియలు గానీ కాదు, కేవలం క్రీస్తుపై విశ్వాసమే దేవుని ప్రజలను ఏకం చేస్తుందని అతను నొక్కి చెప్పాడు (అపొస్తలుల కార్యములు 15:13–21). యాకోబు స్వయంగా సువార్త శక్తిని అనుభవించి, అదే సత్యాన్ని గొప్ప ధైర్యంతో ప్రకటించాడు. మూడవది, యేసు బోధనలు యాకోబు పత్రికపై చాలా ప్రభావం చూపాయి. యాకోబు తన పత్రికలో తన సోదరుడైన యేసు నేర్పిన బోధనలను నేరుగా పొందుపరిచాడు. ఈ విధంగా, యేసు ప్రకటించిన సువార్తే ఇప్పుడు యాకోబుకు కూడా తన స్వంత సువార్తగా మారింది. “బీదలే పరలోక రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారు” అనే సూత్రం (యాకోబు 2:5; మత్తయి 5:3–5). దుఃఖం మరియు నవ్వు గురించిన బోధన (యాకోబు 4:9; లూకా 6:25). “వినయము గలవారిని దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు” అనే వాక్యం (యాకోబు 4:10; మత్తయి 23:12). అవునంటే ‘అవును’ లేదా కాదంటే ‘కాదు’ అని నిజాయితీగా మాట్లాడటం అనే స్పష్టమైన మాటల పద్ధతి (యాకోబు 5:12; మత్తయి 5:34–37).
2. యాకోబు క్రైస్తవ జీవితానికి మార్గనిర్దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు
ఈ పత్రికను రాసిన యాకోబు స్వయంగా సువార్త శక్తి ద్వారా రూపాంతరం చెందడమే కాకుండా, పత్రికలోని అతని లక్ష్యాలు కూడా దానిచేత ప్రభావితమయ్యాయి. ఆదిమ సంఘ పితరుల నుండి ఆధునిక వ్యాఖ్యాతల వరకు, ఈ పత్రిక యొక్క ఖచ్చితమైన నిర్మాణం మరియు ఉద్దేశ్యాల గురించి దీర్ఘకాలంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇది రోమా పత్రిక వంటి గ్రంథాలలో మనం చూసేంత బిగువైన తార్కిక నిర్మాణాన్ని అనుసరించదు.
అయితే, దానికి అసలు నిర్మాణం లేదని కాదు. ఇది కొంతవరకు స్వేచ్ఛగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఇప్పటికే క్రైస్తవులైన సహోదర సహోదరీలకు నైతిక ఉపదేశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది (యాకోబు 1:9, 16, 19; 5:19). సువార్త క్రైస్తవుల జీవితాన్ని ఎలా రూపాంతరం చేయాలో చూపిస్తూ, యాకోబు ఒక ఆత్మీయ తండ్రి వలె తన పాఠకులకు పాప మార్గాన్ని కాకుండా దైవభక్తి మార్గాన్ని ఎంచుకోవాలని సలహా ఇస్తున్నాడు. ఈ క్రింది ఉదాహరణలను పరిశీలించండి:
- విధేయత: వాక్యాన్ని ఆచరణలో పెట్టండి; కేవలం వినేవారిగా ఉండకండి (యాకోబు 1:2–27).
- సహవాసం: ఇతరులను పక్షపాతం లేకుండా ప్రేమించండి; పక్షపాతం చూపకండి (యాకోబు 2:1–13).
- విధేయత: మీ విశ్వాసాన్ని ఆచరణలో చూపండి; మృతమైన విశ్వాసం కలిగి ఉండకండి (యాకోబు 2:14–26).
- సహవాసం: ఇతరులను ఆశీర్వదించడానికి మీ నోటిని ఉపయోగించండి; కీడు చేయడానికి కాదు (యాకోబు 3:1–18).
- విధేయత: పవిత్రతను ఆచరించండి; లోకంలా ఉండకండి (యాకోబు 4:1–17).
- సహవాసం: పేదలను ప్రేమించండి; దైవభక్తి లేని సంపదను వెంబడించకండి (యాకోబు 5:1–6).
- విధేయత: కష్టకాలంలో సహనాన్ని ఆచరించండి; బాధలో సణుగుకోకండి (యాకోబు 5:7–20).
యాకోబు పత్రికలో రచయిత కేవలం సిద్ధాంతపరమైన ప్రకటనల మీద కాకుండా, ఆత్మీయ జీవితంలో ఆచరణాత్మక అన్వయింపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకోసం ఆయన విధేయత (ఆచరణ) మరియు సహవాసం (సాంగత్యం) అనే రెండు ప్రధాన ఇతివృత్తాలను వివిధ కోణాల నుండి మళ్ళీ మళ్ళీ ప్రస్తావిస్తారు. సువార్త మన హృదయాల్లో నిజంగా వేళ్ళూనుకుంటే, అది మన జీవితంలో ఎలాంటి మంచి ఫలాలను ఇవ్వాలో (లేదా ఎలాంటి చెడు విషయాలకు దూరంగా ఉండాలో) ఈ పత్రిక స్పష్టంగా తెలియజేస్తుంది.
3. యాకోబు పౌలు లేఖలను ఖండించడు, కానీ వాటిని పూర్తి చేస్తాడు
యాకోబు పత్రిక పౌలు రచనలకు వ్యతిరేకం కాదని, నిజానికి వాటికి అనుబంధంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఈ అంశంపై, మార్టిన్ లూథర్ ఒకప్పుడు చేసిన విమర్శను (యాకోబు పత్రికలో పౌలు గ్రంథాల్లో కనిపించే ధర్మశాస్త్రం-సువార్త స్పష్టత లేదని) ఇప్పుడు మనం మళ్ళీ పరిశీలించవచ్చు. ఈసమస్యకు ప్రధాన కారణమైన వాక్యం యాకోబు 2:24: “మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి”. పైకి చూసినప్పుడు, ఇది “ధర్మశాస్త్రసంబంధమైన క్రియలులేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము” (రోమీయులకు 3:28) అనే పౌలు వాదనకు స్పష్టమైన విరుద్ధంలా అనిపించవచ్చు.
అయితే, తొందరపడొద్దు. పౌలు రోమా పత్రికలో (మరియు గలతీ పత్రికలో కూడా) వాదించే విధానాన్ని చూస్తే, యాకోబు పత్రికతో ఉన్న తేడాను మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. పౌలు తన వాదనను ఒక నిర్దిష్టమైన క్రమంలో అందిస్తారు: మొదట, ధర్మశాస్త్ర ఆజ్ఞలను పాటించడంలో మనిషి ఎలా విఫలమవుతాడో వివరించి, అవిశ్వాస స్థితిని తెలియజేస్తాడు (రోమా 1:18–3:20). ఆ తర్వాత, క్రియలు కాకుండా, విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని ముందు నీతిమంతులుగా ప్రకటించబడతారని బోధిస్తాడు (రోమా 3:21–4:23). చివరిగా, ఈ నీతిమంతులుగా తీర్చబడటం నుండి దత్తత మరియు పరిశుద్ధత వంటివి ఎలా వస్తాయో వివరిస్తాడు (రోమా 5–8). అంటే, ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడో అనే తన వాదనలో భాగంగా పౌలు “క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు” అనే అంశాన్ని ప్రస్తావిస్తాడు.
యాకోబు పౌలుకు భిన్నంగా, విశ్వాసం గురించి మరో ముఖ్యమైన అంశాన్ని బలంగా నొక్కి చెబుతున్నాడు. అతను మాట్లాడుతున్నవారు “తాము విశ్వాసమున్నవారమని” చెప్పుకుంటారు (యాకోబు 2:14). అయితే, ఆ విశ్వాసానికి తగ్గ క్రైస్తవ ప్రేమ, సేవ లేదా దయ వారి జీవితాల్లో కనిపించవు (యాకోబు 2:16). యాకోబు ప్రకారం, ఇలాంటి “విశ్వాసం” దానికి తగిన క్రియలు లేకపోతే, అది నిజమైన విశ్వాసం కాదు (యాకోబు 2:17). అలాంటి విశ్వాసం శూన్యమైనది లేదా మృతమైనది. దేవుడు ఉన్నాడని “తెలుసు” అని దయ్యాలు సైతం మేధోపరంగా అంగీకరిస్తాయి (యాకోబు 2:19). నిజమైన మార్పు లేని ఈ అంగీకారం, క్రియలు లేని విశ్వాసం లాంటిదే తప్ప అంతకు మించి ఏమీ కాదని యాకోబు స్పష్టం చేస్తున్నాడు.
క్లుప్తంగా చెప్పాలంటే, యాకోబు పౌలుకు భిన్నమైన ఒక ప్రశ్నకు సమాధానమిస్తున్నాడు: రక్షింపబడిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేస్తాడు? నా విశ్వాసం నిజమైనదని నేను ఎలా నిరూపించగలను? యాకోబు ఈ ప్రశ్నకు “క్రియల” ద్వారా అని స్పష్టంగా సమాధానం ఇస్తున్నాడు. అయితే, ఆయన చెప్పే ఈ అంతర్గత బోధన పౌలు ఇతర సందర్భాలలో చెప్పినదానికి (ఫిలిప్పీయులకు 2:12 చూడండి) విరుద్ధం కాదు. వాస్తవానికి, పౌలు “నీతిమంతులుగా తీర్చబడటం”(రక్షణ) గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఇంకా “రక్షణ తర్వాత జీవితం ఎలా ఉండాలి?” అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం మొదలు పెట్టలేదు. అందుకే, యాకోబు రక్షణ పొందిన తర్వాత విశ్వాసం జీవితంలో ఎలా ఫలించాలి అనే దానిపై దృష్టి పెట్టి, అది చర్యల ద్వారా వ్యక్తమవ్వాలని బోధిస్తున్నాడు.
ఈ కోణంలో మనం విషయాలను చూసినప్పుడు, యాకోబు పత్రిక పౌలు రచనలకు విరుద్ధంగా లేదు, బదులుగా వాటిని పూర్తి చేస్తుంది. పౌలు సువార్తను రక్షణకు మార్గంగా చూపిస్తే, యాకోబు అదే సువార్తను జీవితాన్ని రూపాంతరం చేయగల శక్తిగా ప్రదర్శిస్తున్నాడు. అందుకే యాకోబు పత్రికను ‘గడ్డి పరక’గా విలువలేనిదిగా తక్కువ అంచనా వేయడం సరికాదు. ఎందుకంటే, పౌలు రచనల వలె ఇది కూడా క్రైస్తవ జీవనానికి ఒక బలమైన, అందమైన ఆత్మీయ వనరుగా నిలుస్తుంది.
ఈ వ్యాసం “బైబిల్‌లోని ప్రతి గ్రంథం గురించి తెలుసుకోవలసిన మూడు విషయాలు” అనే శ్రేణిలో భాగంగా ఉంది.
డాక్టర్ గ్రెగొరీ ఆర్. లానియర్ ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరీలో కొత్త నిబంధన అసోసియేట్ ప్రొఫెసర్‌గా మరియు లేక్ మేరీ, ఫ్లోరిడాలోని రివర్ ఓక్స్ చర్చిలో అసోసియేట్ పాస్టర్‌గా సేవలందిస్తున్నారు. అతను రచించిన పుస్తకాలలో “ఓల్డ్ మేడ్ న్యూ” (Old Made New), “ది సెప్టువాజింట్: వాట్ ఇట్ ఈజ్ అండ్ వై ఇట్ మేటర్స్” (The Septuagint: What It Is and Why It Matters), అలాగే త్వరలో ప్రచురితం కానున్న లూకా సువార్తపై వ్యాఖ్యానం ఉన్నాయి.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.