క్రైస్తవ శిష్యత్వపు ప్రాథమిక అంశాలు
18/11/2025
యువతకు వేదాంతశాస్త్రం నేర్పించడానికి 3 మార్గాలు
25/11/2025ప్రార్థన ఎందుకు కృపా సాధనం?
బారీ యార్క్
ప్రార్థన ఎందుకు కృపా సాధనం అవుతుంది? ఇది ఆలోచింపదగిన, ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే వెస్ట్‌మిన్‌స్టర్ షార్టర్ కేటకిజం (Westminster Shorter Catechism) ప్రార్థన ఒక కృపా సాధనమని చాలా స్పష్టంగా, సరళంగా చెబుతుంది: “రక్షణ కొరకు ఎన్నుకోబడిన వారికి దేవుడు క్రీస్తు ద్వారా లభించిన విమోచన ప్రయోజనాలను అందించడానికి, ఆయన నియమించిన బయటి, సాధారణ సాధనాలు ఉన్నాయి. అవి ప్రత్యేకంగా వాక్యం, సంస్కారాలు (sacraments) మరియు ప్రార్థన. ఇవన్నీ రక్షణ కొరకు దేవునిచే ఎన్నుకోబడిన వారికి సమర్థవంతంగా పనిచేస్తాయి” (ప్రశ్న-జవాబు 88). అయితే, ఇది ఎందుకు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం కావాలంటే, మనం మొదట “కృపా సాధనం” అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి.
వేదాంతవేత్తలు (theologians) ‘మీడియా గ్రాటియా’ (media gratia) లేదా కృపా సాధనాలును, దేవుని కృపను మన హృదయాలలోకి ప్రసరింపజేసే మార్గాలుగా నిర్వచిస్తారు. స్థానిక జలాశయం నుండి మన ఇంటి పంపులకు నీటిని అందించే పైపుల మాదిరిగానే, దేవుడు కూడా కేటకిజం (catechism)లో చెప్పబడిన “బయటి, సాధారణ సాధనాలను” ఉపయోగించి మనకు రక్షణకు సంబంధించిన ఆశీర్వాదాలను దయచేస్తాడు. బహుశా, దేవుడు ఈ సాధనాలను ఎలా ఉపయోగిస్తాడో మనం మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, కేటకిజంలో పేర్కొన్న మొదటి రెండు సాధనాలైన దేవుని వాక్యం మరియు సంస్కారాలను (sacraments) పరిశీలించడం ద్వారా మన ప్రశ్నకు సరైన సమాధానం పొందవచ్చు.
ప్రభువు తన ఆత్మ ద్వారా పాపులకు వాక్యాన్ని విని నమ్మే విశ్వాసాన్ని ప్రసాదించినప్పుడు, వాక్య బోధన ద్వారా వారికి రక్షణను కలుగజేస్తాడు (రోమా. 10:17). ఆ తర్వాత, దేవుడు తన ప్రజలను పరిశుద్ధపరచడానికి కూడా అదే వాక్యాన్ని ఉపయోగిస్తాడు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘ పెద్దలకు చెప్పిన మాటలు ఈ సత్యాన్ని రుజువు చేస్తున్నాయి: “ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్య మనుగ్రహించుటకును శక్తి మంతుడు” (అపొ. కార్యములు 20:32).
అదేవిధంగా, బాప్తిస్మం మరియు ప్రభువు బల్ల వంటి సంస్కారాలు కూడా ప్రభువు తన ప్రజలకు రక్షణ ప్రయోజనాలను సంపూర్ణంగా అందించడానికి ఉపయోగించే సాధనాలు. రోమన్ కాథలిక్ చర్చి బోధించినట్లుగా, ఈ సంస్కారాల్లో పాల్గొనడం ద్వారానే రక్షణ లభిస్తుందని ఇక్కడ చెప్పడం లేదు. దానికి బదులుగా, దేవుడు మనకు ఇప్పటికే దయచేసిన విశ్వాసం, మరియు మనం ఇప్పటికే పొందుకున్న నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా, ప్రభువు తన రక్షణ యొక్క సంపూర్ణ ప్రయోజనాలను ఈ సంస్కారాలలో మనకు అందిస్తాడు. మన బాప్తిస్మం మన పాప క్షమాపణకు ఒక సూచన మరియు ముద్రగా ఉంది (అపొస్తలుల కార్యములు 2:38). ప్రభువు బల్ల అనేది ఒక “ఆశీర్వాదపు గిన్నె,” అది “క్రీస్తు రక్తంలో పాలుపొందడాన్ని” మనకు అందిస్తుంది. అలాగే, మనం విరిచే రొట్టె “క్రీస్తు శరీరంలో పాలుపొందడం” (1 కొరింథీయులు 10:16). ఈ విధంగా, సంస్కారాల ద్వారా మనం పరిశుద్ధపరిచే మరియు బలపరిచే కృపను అనుభవిస్తాము.
ఇప్పుడు ప్రార్థన గురించి చూద్దాం. మన పరలోక తండ్రి మనల్ని ఆశీర్వదించే ఒక మార్గంగా ప్రార్థన పనిచేస్తుందని లేఖనాల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు:
“యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము” (కీర్తనలు 86:6).
ఈ సాధారణమైన ఇంకా లోతైన హృదయ రోదన, కేటకిజం చెప్పినట్లుగానే, ప్రార్థన అనేది కృపను వెదకడానికి ఒక మార్గమని కీర్తనకారుడు భావిస్తున్నాడని చూపిస్తుంది. అయితే, మన అసలు ప్రశ్నకు తిరిగి వద్దాం: ప్రార్థన ఎందుకు కృపా సాధనం? క్రైస్తవులుగా, మన సానుభూతి గల ప్రధాన యాజకుడైన క్రీస్తు కూర్చున్న కృపా సింహాసనం దగ్గరకు మనం ధైర్యంగా వెళ్ళాలి. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు, అవసరమైన సమయంలో ఆయన మనకు ఖచ్చితంగా కృపను అనుగ్రహిస్తాడని మనకు తెలుసు (హెబ్రీయులు 4:15-16). పౌలు ఎఫెసీయుల సంఘం దేవుని అపారమైన ప్రేమను తెలుసుకోవడానికి బలపడాలని ప్రార్థించాడు (ఎఫెసీయులు 3:14-19). అలాగే, ప్రార్థన పరిశుద్ధులను ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆధ్యాత్మిక సహవాసంలో ఎదగడానికి సహాయపడుతుంది (అపొ. కార్యములు 2:42). మనం విశ్వాసులు కాని వారి కొరకు ప్రార్థనలు చేసినప్పుడు, క్రీస్తు వారికి రక్షణ కృపను అనుగ్రహిస్తాడు (రోమా. 10:1).
ప్రార్థన కూడా దేవుని వాక్యంపై ఆధారపడి ఉంటుంది. మనం దేవుని వాక్యం బోధించడాన్ని వినడం ద్వారా లేదా దాని అద్భుతమైన సత్యాలను చదవడం ద్వారా దానిని “పీల్చుకున్నప్పుడు,” మనం దేవుని ఆత్మతో నింపబడతాము. ఆ తర్వాత, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ఆత్మ యొక్క మాటలను, దేవుని చిత్తాన్ని తిరిగి ప్రభువుకు “వెలిబుచ్చుతాము.” ఈ విధంగా, ప్రార్థన ద్వారా కృపను అనుభవించడం ఎంత అద్భుతమైన మార్గం!
ఈ వ్యాసం ‘ది బేసిక్స్ ఆఫ్ క్రిస్టియన్ డిసిపుల్‌షిప్’ (The Basics of Christian Discipleship) అనే సేకరణలోని ఒక భాగం.
డా. బారీ జె. యార్క్ పిట్స్‌బర్గ్‌లోని రిఫార్మ్‌డ్ ప్రెస్బిటేరియన్ థియోలాజికల్ సెమినరీలో అధ్యక్షుడిగా, పాస్టోరల్ థియాలజీ, మరియు హోమిలెటిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ‘హిట్టింగ్ ది మార్క్స్’ (Hitting the Marks) అనే పుస్తకాన్ని రచించారు.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


