
ఒక క్రైస్తవునిగా నేను పనిచేసే ప్రదేశంలో దేవునికి మహిమకరంగా ఎలా ఉండగలను?
20/01/2026మీ సంఘంలోని సంరక్షకులకు ఎలా మద్దతు ఇవ్వాలి
కొన్ని సంవత్సరాల క్రితం, ఉత్సాహం మరియు శక్తితో నిండిన కొందరు యువకులు మా సంఘములోనికి వచ్చారు. అయితే, అప్పటికి మాకు ఎటువంటి అధికారిక ‘పరిచర్య విభాగాలు’ లేకపోవడంతో, వారు ఏ విధంగా సేవ చేయాలో తెలియక కొంచెం తికమక పడ్డారు. దీనిని గమనించిన మా పాస్టర్ గారు ఆరాధన ఆరంభమునకు ముందే వారికి ఇలా బోధించారు: “ఎవరైనా పరిచర్య చేయాలని ఆశపడుతున్నట్లయితే, దానికి మీకు ఒక అధికారిక సమూహము లేదా ప్రత్యేకమైన హోదా అవసరము లేదు. మన సంఘములో లెక్కకు మించిన అవకాశాలు ఉన్నాయి. మీరు వృద్ధులను, ఇంటికే పరిమితమైన వారిని, లేదా శారీరక లేక మానసిక బలహీనతలతో బాధపడుతున్న వారిని పరామర్శించవచ్చు.”
కొన్ని రోజుల్లోనే, ఒక యువకుడు తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న నా కుమారుడిని పరామర్శించడానికి వచ్చాడు. కొన్నాళ్ళకు మరొక యువకుడు కూడా వచ్చి చేరాడు, ఆ ముగ్గురూ స్నేహితులుగా మారారు. ఇది నా ఆత్మకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. వాస్తవానికి, నా కుమారుడి యొక్క ఆ పరిస్థితి, భావోద్వేగాలను అణచివేయడానికి మరియు సామాజిక సంభాషణలకు అడ్డుకోవడానికి ఆటంకం కలిగించడానికి కారణమవుతుంది. సంభాషణలలో పాలుపంచుకోవడానికి వాడు చూపించే అయిష్టతను చూసి, తాను ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాడని చాలా మంది పొరపాటుగా అర్థం చేసుకున్నారు. కానీ, నిజం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది.
ఆ సమయానికి ముందు, నేను పడిన ఇబ్బందికరమైన పరిస్థితి నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. అప్పుడు నేను నా ఇరవై ఏళ్ల కుమారుడికి స్నేహితులను వెతికే అతిరక్షణ గల తల్లిలా మాట్లాడుతున్నట్లు అనిపించేది. అయితే, మా పాస్టర్ చేసిన ఆ బోధనాత్మకమైన ప్రకటన ఈ సమస్యకు ఒక స్పష్టమైన పరిష్కారాన్ని చూపింది.
తమ సంఘాలలో మద్దతు కోసం చూస్తున్న సంరక్షకుల కథలలో నాది కేవలం ఒకటి మాత్రమే. వారి పరిస్థితులు ఎంత భిన్నంగా ఉంటాయో, వారి అవసరాలు కూడా అంతే విభిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ, వారందరూ శాశ్వతమైన ప్రోత్సాహం మరియు నిజమైన అవగాహన చేసుకునే హృదయం కోసమై ప్రగాఢంగాఎదురు చూస్తున్నారు.
నిలిచే ప్రోత్సాహం
సాధారణంగా, అత్యవసరమైన అవసరాలకు త్వరగా స్పందించడంలో చాలా సంఘాలు చురుకుగా ఉంటాయి. ఆందోళన కలిగించే వ్యాధి నిర్ధారణ పొందిన వారికి, ఉద్యోగం లేదా నివాసాన్ని కోల్పోయిన వారికి, లేక ప్రియమైన వారిని సమాధి చేయవలసి వచ్చిన వారికి తగిన భౌతికపరమైన మరియు భావోద్వేగ మద్దతును అందించడానికి వారు సిద్ధంగా ఉంటారు. అయితే, సంరక్షణ సేవ అనేది తరచుగా దీర్ఘకాలికమైన పిలుపు. సంఘము ప్రారంభంలో ఉత్సాహముతో అందించిన సహాయం యొక్క వేడి చల్లారిన చాలా కాలం తరువాత కూడా, సంరక్షకులకు ఎదురయ్యే సవాళ్లు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి.
ఈ మద్దతు నిరంతరంగా కొనసాగేలా చేయడంలో పాస్టర్లు ముఖ్యమైన పాత్ర పోషించగలరు. వారు సంరక్షకులను మరియు వారి ప్రియమైన వారిని తమ వ్యక్తిగత ప్రార్థనలలోనూ మరియు సంఘపరమైన ప్రార్థనలలోనూ నిశ్చయముగా జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా, పరామర్శలు, ఉత్తరాలు, ఫోన్ కాల్స్ వంటి కమ్యూనికేషన్ ద్వారా, మరియు ప్రత్యక్ష సహాయ చర్యల ద్వారా వారి జీవితాలలో హాజరు కావడానికి సంఘాన్ని వారు నిరంతరంగా ప్రోత్సహించాలి.
క్రీస్తు ప్రేమ మనకు సౌకర్యవంతంగా ఉండే పరిధిని నుండి బయటకు అడుగు పెట్టమని పిలుస్తుందని మా పాస్టర్ గారు తరచుగా మాకు గుర్తు చేసేవారు. “మీరు తప్పకుండా కొంత అసౌకర్యాన్ని భరించవలసి ఉంటుంది” అని ఆయన బోధించేవారు. ఆయన జీవితమే ఆయన మాటలకు సాక్ష్యముగా నిలిచింది. ఎక్కడ అవసరం ఉంటే, ఆయన అక్కడే ఉండేవారు. అవసరంలో ఉన్నవారిని పరామర్శించడం ఆయన దినచర్యలో అత్యంత ప్రధానమైన భాగం అయినట్లుగా, ఆయన ఎప్పుడూ పైకి ఒత్తిడికి గురైనట్లు లేదా అలసట చెందినట్లు కనిపించేవారు కాదు.
లూకేమియా (రక్త క్యాన్సర్)తో తన తొమ్మిదేళ్ల కుమారుడు సాగిస్తున్న పోరాటాన్ని నెలల తరబడి నాతో పంచుకున్న తర్వాత, అమీ నాతో ఈ మాటలను చెప్పింది: “దీర్ఘకాలిక సంరక్షణ పరిస్థితిలో ఉన్న ఒక కుటుంబానికి, ఈ ప్రయాణపు ఆరంభంలో కేవలం ఉత్సాహాన్ని నింపేవారి కంటే మరెంతో మంది అవసరము.” ఇది ఒక అల్ట్రా-మారథాన్ పరుగుపందెం లాంటిది. దారి పొడవునా మాకు దాహాన్ని తీర్చేందుకు నీరు మరియు శక్తినిచ్చే పానీయాల కోసం విరామ స్థలములు అవసరము. అలాగే, మా వైపు నిలబడి, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మాకు అండగా ఉన్నామని గుర్తుచేస్తూ, దారిలో ఎక్కడెక్కడో గంటలను (cowbells) మోగించే వ్యక్తులు మాకు అవసరము. ఇది చాలా పొడవైన, ఆయాసకరమైన ప్రయాణం. దయచేసి మమ్మల్ని మరువవద్దు.”
ప్రతి ఒక్కరూ తమ తమ కార్యములలో నిమగ్నమై ఉండడం వలన, ఇతరులను మర్చిపోవడం చాలా సులభం. అంతేకాక, సంరక్షకులు ఇతరులకు శ్రమ కలిగించడం ఇష్టం లేక లేదా తమ ప్రియమైన వారి రోజువారీ సంరక్షణ వివరాలను బయటపెట్టి వారి మనసును నొప్పిస్తామేమోననే భయంతో తమ కష్టాలను తమలోనే ఉంచుకోవడానికి తరచుగా ఇష్టపడతారు. అందుకే, సంరక్షకులను మరియు వారి ప్రియమైన వారిని జ్ఞాపకం ఉంచుకోవలసిన బాధ్యత, సంఘములో వారిని సమీపించి, వారు హాజరు కానప్పుడు వారిని వెతుక్కుంటూ వెళ్లవలసిన బాధ్యత మన సంఘములలోని ప్రతి వ్యక్తికి ఉంది.
నిజమైన అవగాహన
మన సంఘములలోని సంరక్షకులకు సహాయం చేయడానికి మనం మన సౌకర్య పరిధిని దాటి బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ, మనలోని తొందరపాటు మరియు నిమగ్నమైన(busy) వైఖరులు తరచుగా వారి అసలైన అవసరాలను అర్థం చేసుకోకుండా మనల్ని అడ్డుకుంటాయి. డిమెన్షియా (మతిమరుపు) మరియు క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భర్తకు సంవత్సరాల తరబడి సేవ చేసిన ట్రినాకు, కొన్ని విచారకరమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె భర్తలో వేగంగా క్షీణించిపోతున్న మానసిక స్థితికి దేవుడు ఒక దయగల ముగింపుగా క్యాన్సర్‌ను అనుమతించాడని ఆమె, ఆమె భర్త ఇద్దరూ విశ్వసించారు. అయినప్పటికీ, ప్రజలు తమ ప్రార్థనలను కేవలం క్యాన్సర్ నయం చేయడానికే పరిమితం చేశారు. అంతకంటే బాధాకరమైన విషయం ఏమంటే, ఆమె అక్కడే ఉన్నప్పటికీ, ఆమె కోసం మరియు వారి పిల్లల కోసం ఎవరూ ప్రార్థించలేదు.
ట్రినా ఇంకా ఇలా చెప్పింది: “మాకు ఓర్పు అవసరం. నొప్పి నుండి ఉపశమనం, జీవితపు అంతిమ నిర్ణయాలు, మరియు అనేక ఇతర సమస్యల గురించి మాకు తీవ్రమైన ఆందోళనలు ఉండేవి.” “అయితే, ప్రజలు చేయవలసింది ఏమంటే, వారు ప్రార్థన అభ్యర్థనలను శ్రద్ధగా విని లేదా చదివి, ఖచ్చితంగా ఆ విషయాల కోసమే ప్రార్థించాలి. ముఖ్యంగా, రోగి మరియు సంరక్షకుని వినికిడిలో అలా చేయాలి.” “మద్దతు కోసం మనం ఎవరి వైపు చూస్తున్నామో, వారి ద్వారా మనం వినిపించుకున్నామనే భావన మనకు కలగాలి. అంతేకాక, వారి ప్రార్థనలు, కేవలం ప్రార్థన చేస్తున్న వ్యక్తి యొక్క కోరికలకు మద్దతు ఇవ్వకుండా, వాస్తవికతకు/దేవుని చిత్తానికి లోబడిన వాస్తవికతకు మద్దతునిచ్చేవిగా ఉండాలి.”
తీవ్రమైన మానసిక బలహీనతలతో బాధపడుతున్న వారి తల్లిదండ్రులు అనేకులు నాతో పంచుకున్నదేమిటంటే, తమకు ప్రధానంగా అంగీకారం, అవగాహన, నిరీక్షణ, మరియు ప్రేమ అవసరము. ఈ ప్రేమలో, సంరక్షణ అవసరమైన వ్యక్తి పట్ల నిజమైన మెప్పుదల చూపడం కూడా ఇమిడి ఉంది. “సంరక్షకులు కేవలం తమ ప్రియమైన వారి శారీరక సంరక్షణకే బాధ్యత వహించరు, కానీ తమ జీవితంలో ఒక నిరంతర ఉద్దేశాన్ని చూడడానికి వారికి సహాయం చేయడంలో కూడా బాధ్యత కలిగి ఉంటారు,” అని ట్రినా నాతో చెప్పింది. “ఆయన ఇంకా తన కుటుంబాన్ని దీవించగలిగే ఒక దేవుని స్వరూపి అని నేను నా భర్తకు పదేపదే గుర్తు చేయవలసి వచ్చింది. మన ప్రియమైనవారు మనకు ఎలా దీవెనగా ఉన్నారో మరియు మనకంటే ముందు ఎలా నడుస్తున్నారో అని వారికి ధన్యవాదాలు చెప్పడం చాలా ముఖ్యం. నా భర్త పడిన బాధ యొక్క మాదిరి నాకు మరియు దానిని దగ్గరగా చూసిన వారికి ఎంత గొప్ప అర్థాన్ని ఇస్తుందో నేను ఎక్కువగా గ్రహిస్తున్నాను.” దేవుని దృష్టిలో విలువైన ఈ మెప్పుదలను వ్యక్తం చేసే పనిలో సంఘం గొప్పగా సహాయం చేయగలదు.
ప్రేమ, అవగాహన, మరియు మెప్పుదల అనేవి తక్షణ పరిష్కారాలకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఈ వ్యవహారిక (pragmatic) సమాజంలో అరుదుగా కనిపించే సమయ నిబద్ధతను కోరుకుంటాయి. అవసరంలో ఉన్న ఒక వ్యక్తిని మనం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని, లేక కనీసం కొన్ని ఉపయోగకరమైన సలహాలనైనా ఇవ్వాలని మనం తరచుగా ఒత్తిడికి లోనవుతాము. అయినప్పటికీ, ఇది మనం చేయగలిగే అత్యంత పెద్ద పొరపాటు కావచ్చు. ఎందుకంటే, తమ పరిస్థితి యొక్క సంక్లిష్టతను వారు ఇప్పటికే దైవిక జ్ఞానముతో మరియు నిపుణుల సలహాలపట్ల శ్రద్ధతో జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఆ సంక్లిష్టతలో పయనించడానికి ప్రయత్నిస్తున్నారు.
మనం చేయగలిగే అత్యుత్తమమైన పని ఏమిటంటే, విశ్వసనీయ స్నేహితులుగా వారి మధ్య నిలబడి ఉండడానికి, వారి మాటలను వినడానికి, మరియు వారి అనుభవాల నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటమే. సంరక్షకుల మరియు వారి ప్రియమైన వారి జీవితాలలో పాలుపంచుకోవడం ఒక త్యాగం వలె అనిపించవచ్చు, కానీ అందులో భాగమైన ప్రతి ఒక్కరికీ అది అత్యంత విలువైనది. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, “శరీరము ఒకే అవయవముగా ఉండక అనేక అవయవములుగా ఉన్నది” (1 కొరింథీయులకు 12:14) అని, మరియు సంఘ నిర్మాణమునకు ప్రతి అవయవము అవసరమని మనం గట్టిగా విశ్వసిస్తే, మనం ఒకరినొకరం అలాగే చూసుకుంటాము. ఈ ఆత్మీయ ప్రక్రియలో – మనం పరిణితిలో, ప్రేమలో, మరియు దైవిక జ్ఞానంలో నిరంతరంగా ఎదుగుతాము.
ఈ వ్యాసం క్రైస్తవ శిష్యత్వం యొక్క ప్రాథమిక అంశాలు అనే సేకరణలో భాగం.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


