
మీకా గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
26/08/2025
ఎస్తేరు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
02/09/2025ప్రకటన గ్రంథం గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు
డెన్నిస్ జాన్సన్
ప్రకటన గ్రంథం గురించి మీకు గందరగోళంగా, వివాదాస్పదంగా, కలవరపెట్టేదిగా, లేదా భయానకంగా అనిపిస్తుంటే, మీరు ఒంటరివారు కాదు. అయినప్పటికీ, దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చిన ముఖ్య ఉద్దేశ్యం దాన్ని దాచడం కాదు, బయలుపరచడమే; మనల్ని నిరుత్సాహపరచడం కాదు, ప్రోత్సహించడమే. ప్రకటన గ్రంథం ఒక ఆశీర్వాద వాగ్దానంతో మొదలవుతుంది: “సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు” (ప్రకటన 1:3). ఈ గ్రంథం మొదటిసారిగా పంపబడిన మొదటి శతాబ్దపు సంఘాలను ఊహించండి: ఒక నాయకుడు గ్రంథపు చుట్టను నిలబడి బిగ్గరగా చదువుతుంటే, మిగిలిన వారంతా శ్రద్ధగా వింటున్నారు. వారు ఆ గ్రంథంలోని సందేశాన్ని కేవలం దానిని వినడం ద్వారానే అర్థం చేసుకోగలిగారు, మరియు దాని సత్యాలను హృదయపూర్వకంగా స్వీకరించడం ద్వారా అది వాగ్దానం చేసిన ఆశీర్వాదాన్ని పొందగలిగారు. మనం కూడా అలాగే చేయగలం. బైబిలులోని ఈ అత్యంత కీలకమైన గ్రంథం నుండి ఆశీర్వాదాన్ని పొందడానికి, దాని గురించి మీరు మూడు విషయాలు తెలుసుకోవాలి.
- ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, ప్రకటన గ్రంథం గొర్రెపిల్ల యొక్క అద్భుతమైన విజయాన్ని ఆవిష్కరిస్తుంది.
ప్రకటన గ్రంథంలోని మొదటి వచనమే ఈ పుస్తకానికి శీర్షిక: “యేసుక్రీస్తు ప్రత్యక్షత” (ప్రకటన 1:1). ఇక్కడ “ప్రకటన” అనే పదానికి గ్రీకు మూలపదం అపోకలిప్సిస్ (apocalypsis), దీని అర్థం “పరదా తీయడం” లేదా దాగివున్నదాన్ని బయలుపరచడం. మన అనుభవాలు, ప్రపంచ చరిత్రలో కనిపించే ఉపరితల సంఘటనలకు మించి మనం చూడాలంటే, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని గ్రహించాలంటే, ఈ “బహిర్గతం” (ఆవిష్కరణ) అత్యవసరం. అప్పుడే వాటి మూలం ఏమిటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యుద్ధాల దారుణాలు, పర్యావరణ విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు, కరువు, ఆకలి, వ్యాధులు, మరణం వంటి బయటికి కనిపించే లక్షణాలను మాత్రమే మనం చూస్తే, మన ప్రపంచం ఎందుకు దారి తప్పిందో ఎన్నటికీ గ్రహించలేము. ఈ గందరగోళాలు, రహస్యాలకు ఒక అర్థం రావాలంటే, మనం తెర వెనుకనున్న ఆత్మీయ లోకంలోకి ఒక చూపు వేయాలి. అక్కడే సర్వాధికారి అయిన దేవుడు “ఆ మహా ఘటసర్పముతో, అనగా ఆది సర్పము, అపవాదితో, సాతానుతో” (ప్రకటన 12:9; 20:2) పోరాడుతున్నాడు. ఈ ఆధ్యాత్మిక యుద్ధం యొక్క వాస్తవికతను గ్రహించినప్పుడే మన చుట్టూ ఉన్న దుస్థితులకు, అంతుచిక్కని విషయాలకు సరైన అవగాహన లభిస్తుంది.
ఈ గ్రంథం “యేసుక్రీస్తు ప్రత్యక్షత” అని చెప్పబడటానికి రెండు ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. మొదటిది, యేసు ఈ ప్రకటనను బయలుపరిచే ఏజెంట్ (ప్రకటించేవాడు); రెండవది, ఆయనే ఈ ప్రకటన ద్వారా వెల్లడి చేయబడిన ప్రధాన సత్యం. ముందుగా, ఈ ప్రకటనను దేవుడు స్వయంగా యేసుక్రీస్తుకు ఇచ్చాడు “త్వరలో సంభవింపనైయున్న సంగతులను తన దాసులకు కనుపరచుటకు” (ప్రకటన 1:1). తండ్రి నుండి అవతారమెత్తిన కుమారునికి జరిగిన ఈ దైవిక సమాచార బదిలీని ప్రకటన 4 మరియు 5 అధ్యాయాలలో నాటకీయంగా చిత్రించబడింది. అక్కడ, సింహాసనంపై ఆసీనుడైన సర్వాధికారియైన దేవుని చేతిలో నుండి గొర్రెపిల్లయైన క్రీస్తు ఒక గ్రంథపు చుట్టను అందుకుంటాడు. ఆ తర్వాత, చరిత్రలో జరగబోయే సంఘటనలను ప్రారంభించి, నియంత్రించడానికి, దాని ముద్రలను ఒక్కొక్కటిగా విప్పుతాడు. దేవుని ప్రణాళికను వెల్లడించి, దాన్ని అమలుపరిచే అర్హత ఒక్క గొర్రెపిల్లకే ఉంది. ఎందుకంటే ఆయనే హింసాత్మక మరణాన్ని సహించి విజయం సాధించాడు. “ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవునికొరకు మనుష్యులను” విమోచించడానికి తన ప్రాణాన్ని ధారపోశాడు (ప్రకటన 5:5–10). అందుకే, ప్రకటన గ్రంథం ద్వారా మనం చూడబోయేది గొర్రెపిల్ల యొక్క మహిమ, ఆయన విజయగాథ, మరియు దేవుని తుది ప్రణాళిక నెరవేర్పు.
రెండవది, ప్రకటన గ్రంథం యేసుక్రీస్తును మనకు సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. ఆయన విమోచన బాధల ద్వారా విజయం సాధించిన గొర్రెపిల్ల మాత్రమే కాదు; ఆయనే భూమిపై తన సంఘాల మధ్య సంచరిస్తూ, వాటి ఆత్మీయ స్థితిని పరిశీలించి, విశ్వాసంలో స్థిరంగా నిలిచిన వారిని ఆశీర్వదించే “మనుష్య కుమారుని వంటివాడు” కూడా (ప్రకటన 1:10–20). అవసరమైనచోట ప్రేమతో సరిదిద్ది, ప్రోత్సహిస్తాడు (ప్రకటన 2–3). చరిత్ర ప్రారంభంలోనే వాగ్దానించబడిన స్త్రీ సంతానమైన యేసు, తన జననం సమయంలోనే ఆ పురాతన సర్పమైన సాతాను ద్వారా బెదిరించబడ్డాడు (ఆదికాండము 3:15). అయినప్పటికీ, ఆయన దేవుని సింహాసనానికి ఘనంగా ఆరోహణమై అధికారం పొందాడు (ప్రకటన 12:1–6). ఆయన చిందించిన రక్తమే మనపై నిందలు మోపే విరోధిని పరలోకం నుండి బహిష్కరించింది, మనపై ఉన్న అభియోగాలను శాశ్వతంగా నిశ్శబ్దం చేసింది (ప్రకటన 12:7–17). యేసు పరలోక సైన్యాలకు అధిపతి. ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఘటసర్పాన్ని, దాని భయంకరమైన దుష్ట శక్తులను, మరియు దాని అబద్ధాలను నమ్మిన వారందరినీ నాశనం చేస్తాడు (ప్రకటన 19:15–21). తండ్రి మరియు పరిశుద్ధాత్మతో కలిసి, యేసు దేవుని పరలోక పరిచారకులు, ఆయన దేవదూతల రాయబారులు, మరియు సృష్టిలోని సమస్త జీవుల ఆరాధనకు కేంద్రబిందువుగా ఉన్నాడు (ప్రకటన 5:9–14; 11:15–18; 14:2–5; 15:3–4; 19:1–8; 21:2–4, 22–24; 22:3–5).
ప్రకటన గ్రంథంలోని దర్శనాలు పాపం వల్ల కలిగే భయంకరమైన ప్రభావాలను స్పష్టంగా చిత్రీకరిస్తాయి. అల్లకల్లోలంగా మారిన ఈ లోకంలో పాపపు విషపూరిత ఫలితాలు ఎలా విస్తరిస్తున్నాయో అవి మన కళ్ళకు స్పష్టంగా చూపిస్తాయి. ఈ విధ్వంసకర దృశ్యాలు హైవేపై జరిగే రోడ్డు ప్రమాదాల వలె, మన దృష్టిని వెంటనే ఆకర్షించి, కలవరపెడతాయి.అయితే, మనం కేవలం “చెట్ల”పైనే అంటే మానవుల దుష్టత్వం, మరియు దాని పర్యవసానంగా వచ్చే దైవిక కోపానికి సంబంధించిన దృశ్యాలపైనే దృష్టి పెడితే, ప్రకటన గ్రంథం చూపించే “అరణ్యాన్ని” మనం కోల్పోతాము. ఆ “అరణ్యం” మరేదో కాదు: అది యేసుక్రీస్తు యొక్క మహిమ మరియు ఆయన అద్భుతమైన దయ. ప్రకటన గ్రంథం మనల్ని భయపెట్టడానికి ఉద్దేశించినది కాదు. బదులుగా, ప్రభువైన క్రీస్తులో కనిపించే రాజరికపు మహిమను, నిత్యమైన క్షమాపణను, మరియు దేవుని తుది విజయం యొక్క కథనాన్ని మన హృదయాలలో నాటడానికే ఈ గ్రంథం ఉంది.
- ప్రకటన గ్రంథం దాని సందేశాన్ని పాత నిబంధనలో వేళ్లూనుకున్న చిత్రమైన భాషలో అందిస్తుంది.
ఈ గ్రంథం తన సందేశాన్ని బిగ్గరగా చదవడానికి అత్యంత అనుకూలంగా తీర్చిదిద్దబడింది. ఇది పఠించేవారికి స్పష్టంగా అర్థమయ్యేలా, వినేవారికి మధురంగా, మనసులో చెరిగిపోని శక్తివంతమైన దృశ్యాల ద్వారా తన సందేశాన్ని అందిస్తుంది. ఇది శ్రవణార్థం ఉద్దేశించబడిన గ్రంథం కాబట్టి, దాని శైలి వినసొంపుగా రూపొందించబడింది. లేఖనమంతటా చూస్తే, దేవుడు (అత్యుత్తమ సంభాషణకర్త) తనను తాను విభిన్న రూపకాల ద్వారా ఆవిష్కరించుకున్నాడు: గొర్రెల కాపరి, బండ, కోట, అగ్ని, భర్త వంటివి. ఈ విధమైన ప్రతిమలు ఆయన స్వభావాన్ని మన హృదయాల్లో లోతుగా నాటుతాయి. యోసేపు, దానియేలు వంటివారికి దేవుడు చిత్రాలతో నిండిన కలల ద్వారా తన ప్రణాళికలను వెల్లడి చేశాడు (ఆదికాండము 37, 41; దానియేలు 2, 7). యెషయా, యెహెజ్కేలు, జెకర్యా వంటి ప్రవక్తలకు ప్రభువు తన పరలోక న్యాయస్థానంలోనికి తెర వెనుక నుండి ఒక సంగ్రహావలోకనం ఇచ్చాడు. దీనివల్ల వారు తమ ప్రజల కొరకు ఆయన సందేశాన్ని స్పష్టమైన చిహ్నాలలో చూడటమే కాక, మాటల్లో వినగలిగారు. ప్రకటన గ్రంథంలోని ప్రతీకవాదంలో కూడా, దేవుడు ఎల్లప్పుడూ చేసినదానినే ఇప్పుడు కూడా చేస్తున్నాడు. పరిమితమైన మానవ భాష కంటే గొప్పగా భావాలను వ్యక్తపరచడానికి చిత్రభాషను, బలమైన దృశ్యాలను, మరియు సంకేతాలను ఉపయోగిస్తూ ఆయన తన ప్రజలతో మాట్లాడుతున్నాడు.
ప్రకటన గ్రంథంలోని సంకేతాల నిజమైన అర్థాన్ని గ్రహించాలంటే, ఆ దృశ్యభాషకు అర్థం చెప్పే ఒక “నిఘంటువు” అవసరం. ఆ నిఘంటువు ఎక్కడ ఉంది? అది దేవుడు శతాబ్దాలుగా రాసిన పాత నిబంధన గ్రంథాలే. పాత నిబంధన చరిత్రలోని ముఖ్య వ్యక్తులు, సంఘటనలు (సృష్టి, సర్పం, నిర్గమనం, మోషే, ఏలీయా మొదలైనవి) అన్నీ ప్రకటన గ్రంథంలో వచ్చే సంకేతాలను తాళం తీయగల కీలకం వంటివి. అలాగే ఇశ్రాయేలు ప్రవక్తలకు చూపబడిన దర్శనాలు కూడా ప్రకటనలోని భాషను అర్థం చేసుకోవడానికి మార్గదర్శకంగా ఉంటాయి. క్రీస్తు మొదటి శతాబ్దపు సంఘాలకు మాత్రమే కాదు, ఇరవై ఒకటవ శతాబ్దపు సంఘాలతో మాట్లాడుతున్నాడు. అందువల్ల ఆయన ఎన్నడూ మారని ఒక దృశ్యభాషను ఉపయోగిస్తాడు ఆది నుండి అన్ని తరాల దేవుని ప్రజలకు అందుబాటులో ఉన్న భాష. అదే పాత నిబంధన రక్షణా చరిత్ర, ప్రవక్తల సంకేత భాష. దీనిని బట్టి చూస్తే, ప్రకటన గ్రంథం అపరిచితమైన, గందరగోళమైన భాషలో రాయబడినది కాదు. ఇది దేవుని మహిమగల మాటల ప్రతిధ్వని. మన రక్షణ గాథకు పాత నిబంధన అందించిన చిత్రాలను ఆధారంగా చేసుకుని, ప్రతి తరానికి మేలు కలిగేలా చెప్పిన అత్యంత శక్తివంతమైన సందేశం.
- ప్రకటన గ్రంథాన్ని యేసుక్రీస్తు ఒకే ఒక్క, ముఖ్యమైన ఉద్దేశంతో ఇచ్చాడు: సాతాను నుండి వచ్చే విమర్శ, అణచివేత, మోసాలు, మరియు అలసటతో కూడిన లోకప్రాపంచికత వంటి దాడులకు గురవుతున్న క్రైస్తవులను బలపరచడమే ఆ ఉద్దేశం.
చరిత్రలో ఈ గ్రంథం అనేక వివాదాలకు కేంద్రంగా నిలిచింది. దేవుని రహస్య ప్రణాళికలను తెలుసుకోవాలని, తేదీలు నిర్ణయించడం వంటివి మన పరిధిని మించినవని (మార్కు 13:32–35; అపొస్తలుల కార్యములు 1:7) యేసు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, కొంతమంది క్రైస్తవులు ఇప్పటికీ ప్రకటన గ్రంథంలోని దృశ్యాలు తమ కాలంలోని సంఘటనలతో ఎలా “సరిపోతాయో” అని వాదనలు చేస్తూ వర్గాలుగా విడిపోయారు. అయితే, యేసు ఈ గ్రంథాన్ని అంత్యదినాలపై వాదనలు జరిపించేందుకు ఇవ్వలేదు. ఆయన ఉద్దేశం మరింత అత్యవసరమైనది, మరింత ఆచరణాత్మకమైనది. ఈ గ్రంథం ద్వారా ఆయన తన సంఘాన్ని శత్రువుల దాడుల మధ్య నిలబడేలా సిద్ధం చేస్తున్నారు. నిజానికి, క్రీస్తు తన సంఘానికి ఆయుధాలు అందిస్తున్నాడు. ఈ యుద్ధం ఏదో కల్పితమైన భవిష్యత్తు గురించి కాదు, అది ఇప్పుడే జరుగుతోంది. సాతాను మరియు అతని దుష్ట శక్తుల నుండి తీవ్రమైన దాడులకు గురవుతున్న సంఘం, దృఢంగా నిలబడి ఉండే సంఘంగా మారేందుకు ఈ గ్రంథం రాయబడింది. హింస, బహిష్కరణ, మోసం మరియు సంతృప్తికరమైన లోకప్రాపంచికత ద్వారా విశ్వాసంపై జరుగుతున్న సాతాను దాడిని ఎదుర్కోవడానికి క్రైస్తవులను బలపరచడమే ప్రకటన గ్రంథాన్ని క్రీస్తు ఇచ్చిన ముఖ్య ఉద్దేశం. ఈ గ్రంథం ద్వారా దేవుడు తన ప్రజలను సాతాను మరియు అతని దుష్ట శక్తుల నుండి రక్షించి, యుద్ధంలో నిలబడే సంఘంగా మారుస్తున్నాడు.
ప్రకటన గ్రంథం సాతాను వ్యూహాల గురించి మనల్ని హెచ్చరించి, శత్రువు దాడులను ఎదుర్కొనడానికి మనల్ని బలపరుస్తుంది. దేవుని ప్రజలను క్రీస్తు పట్ల తమ విశ్వాసాన్ని త్యజించమని ప్రలోభపెట్టడానికి భయంకరమైన హింస, సమాజం నుండి తిరస్కరణ వంటివి ఉపయోగపడతాయి. అంతేకాదు, సంఘం తప్పుడు బోధకులచే మోసగించబడి, ప్రాపంచిక సంపద, సుఖాల ద్వారా అలసత్వానికి, రాజీకి లోనయ్యే ప్రమాదం ఉంది (ప్రకటన 2–3). యోహాను చూసిన దర్శనాలలో, ఈ శత్రువు యొక్క దాడి చేసే ఆయుధాలు మృగం, అబద్ధ ప్రవక్త, మరియు వ్యభిచారిణి రూపంలో మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి (ప్రకటన 13, 17). ఇవి కేవలం సంకేతాలు కావు, శత్రువు ఉపయోగించే వ్యూహాలకు అవి ప్రతీకలు: బలాత్కారానికి మృగం, మోసానికి అబద్ధ ప్రవక్త, మరియు లోకసంబంధమైన సంపద, అలసత్వం/రాజీ పడటానికి వ్యభిచారిణి ప్రాతినిధ్యం వహిస్తాయి.
ఆసియాలోని ఏడు సంఘాలు కేవలం చరిత్రపరంగా ఉన్న సంఘాలే కావు, అవి అన్ని తరాల సంఘాలకు చిన్న ప్రతిరూపం. సమస్త యుగాలలోను సంఘం ఎదుర్కొనే పరిస్థితులను అవి ప్రతినిధిస్తాయి. సాతాను దుష్ట శక్తులు కాలానుగుణంగా వివిధ రూపాల్లో కనిపిస్తాయి; ఒక్కో యుగంలో ఒక్కో వేషాన్ని ధరించి సంఘాన్ని మోసగించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే, శత్రువు ఏ రూపంలో వచ్చినా, వారి ఓటమి ఇప్పటికే నిర్ణయించబడింది (ప్రకటన 12:7–13; 20:1–3). విజయోత్సాహమైన గొర్రెపిల్ల (గొర్రెవంటి దైవ కుమారుడు) ఇప్పటికే గెలిచాడు! ఆయనే మనకు ప్రకటన గ్రంథాన్ని ఇచ్చినవాడు నిగూఢమైన సంఘటనల వెనుక ఉన్న సత్యాన్ని గ్రహించే వివేకాన్ని, భయపెట్టే పరిస్థితుల మధ్య నిలబడే ధైర్యాన్ని, మరియు ఆయన వాక్యానికి నమ్మకంగా ఉండే విధేయతను మనలో నాటడానికి. ఈ విజయం సాధించిన గొర్రెపిల్ల రాకడ కోసం మనం ఆశగా ఎదురుచూస్తున్నాం; తన ప్రజలతో ఉండేందుకు ఆయన తిరిగి రాబోతున్నాడు. కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఆయన సన్నిధిని అనుభవించబోతున్న ఆశీర్వాదం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ, ఆయన మాటను గట్టిగా పట్టుకుని నిలబడడమే మన పిలుపు (ప్రకటన 1:3; 22:7, 14).
ఈ వ్యాసం “బైబిల్‌లోని ప్రతి గ్రంథం గురించి తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు” అనే శ్రేణిలో భాగంగా ఉంది.
డా. డెన్నిస్ ఈ. జాన్సన్ కాలిఫోర్నియాలోని వెస్ట్‌మిన్‌స్టర్ సెమినరీలో ప్రాక్టికల్ థియాలజీ ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా సేవలందిస్తున్నారు. అంతేకాకుండా, టెన్నస్సీలోని డేటన్ నగరంలో ఉన్న వెస్ట్‌మిన్‌స్టర్ ప్రెస్బిటేరియన్ చర్చికి అసిస్టెంట్ పాస్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన రచించిన ముఖ్యమైన పుస్తకాలలో వాకింగ్ విత్ జీసస్ త్రూ హిస్ వర్డ్, ట్రైయంఫ్ అఫ్ ద లాంబ్, మరియు లెట్స్ స్టడీ ఆక్ట్స ఉన్నాయి.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


